సిమ్రాన్‌కు ఏమైంది?
తమిళసినిమా: నటి సిమ్రాన్, ఈ మూడక్షరాల పేరు 2009 వరకూ దక్షిణాది సినిమాలో మారు మోగిందనే చెప్పాలి. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ ముంబయి బ్యూటీ మొదట్లో బాలీవుడ్లో ఒకటి రెండు చిత్రాలు చేసి ఆ తరువాత దక్షిణాదికి దిగుమతి అయ్యారు. ఇక్కడ తొలి రోజుల్లో ఈత దుస్తులు సహా అందాలారబోత మోత మోగించిన సిమ్రాన్ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకున్నారు. అలా దాదాపు దశాబ్దంన్నర పాటు తమిళం, తెలుగు భాషల్లో టాప్ కథానాయకిగా రాణించారు.
అలా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. అయితే చాలా మంది హీరోయిన్ల తరహాలోనే రీఎంట్రీకి సై అన్న సిమ్రాన్ మంచి వెయిట్ ఉన్న పాత్రల్లో ఈ భామను చూడబోతున్నామని అభిమానులు సహా సినీ వర్గాలు భావించారు. అయితే అలా జరగలేదు. నిజం చెప్పాలంటే రీఎంట్రీ అయిన హీరోయిన్లలో చాలా తక్కువ మందే మళ్లీ హీరోయిన్గా నటించడం సాధ్యమైంది. ఎక్కువ మంది అక్క గానో, వదిన గానో, మరే బలమైన పాత్రల్లోనో నటిస్తున్నారు.
అలాంటిది నటి సిమ్రాన్‌కు ఈ రెండు రకాలుగానూ అవకాశాలు రాకపోవడం చర్చనీయాంశం. అసలు నటి సిమ్రాన్‌కు ఏమైందో అన్న సందేహం కలిగేలా ఆమె పాత్రలను అంగీకరిస్తున్నారు. చిత్రాల్లో ఏమాత్రం ప్రాధాన్యత కాదు కథా, గుర్తింపు లేని పాత్రలను అంగీకరించి నటించేస్తున్నారు. ఆ మధ్య పార్థిబన్ నటించి దర్శకత్వం వహించిన కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రంలో కేవలం రెండు మూడు సీన్స్‌లో కనిపించి మాయమయ్యారు. తాజాగా విశాల్ హీరోగా నటించిన తుప్పరివాలన్ చిత్రంలో అయితే ఒక సహాయ నటి తరహాలో రెండే రెండు సన్నివేశాల్లో అదీ ఏ మాత్రం నటనకు అవకాశం లేని పాత్రలో కనిపించారు.
అసలు అలాంటి పాత్రల్లో నటించడానికి సిమ్రాన్ ఎందుకు అంగీకరిస్తున్నారు? అలాంటి పాత్రల్లో ఆమెను దర్శక నిర్మాతలు ఎందుకు ఎంపిక చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ మధ్య కొన్ని సీరియళ్లలో నటించి బుల్లి తెరపైనా మెరిసిన సిమ్రాన్ వాటిపైనే దృష్టి సారించినా బాగుంటుందంటున్నారు సినీ వర్గాలు. సిమ్రాన్ కంటే ముందు కథానాయికలుగా రాణించిన రాధిక, కుష్బూ, భానుప్రియ వంటి వారు చిత్రాల్లో తమ పాత్రలకు ప్రాధాన్యత ఉంటేనే అంగీకరించి నటిస్తున్నారన్నది గమనార్హం.