పెళ్లికూతురైన శ్రేయా ఘోషల్
ముంబయి : ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పెళ్లికూతురు అయ్యింది. బెంగాలీ సంప్రదాయంలో ఫిబ్రవరి 5న ఆమె తన బాల్య స్నేహితుడు శైలాదిత్యని వివాహం చేసుకున్నది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో శ్రేయా, శైలాదిత్య ఓ ఇంటివారయ్యారు. తన వివాహ విషయాన్ని శ్రేయా ఘోషల్ శుక్రవారం ఉదయం తన ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. అలాగే వివాహ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా శ్రేయా 'నా జీవితంలో నేను ప్రేమిస్తున్న వ్యక్తిని వివాహం చేసుకున్నా. మీ ఆశీస్సులు మా ఇద్దరికి కావాలంటూ' కోరింది. హిప్కాస్ అనే సంస్థకు శైలాదిత్య కో-ఫౌండర్.
కాగా శ్రేయా ఘోషల్ 'ఒక్కడు' చిత్రం ద్వారా 'నువ్వేం మాయ చేశావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని' అంటూ గాయనిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. హిందీ, తెలుగు, తమిళ్తో పాటు పలు భాషల్లో తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోంది. శ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఆమె హిందీలో 2002లో వచ్చిన దేవదాస్ చిత్రం ద్వారా గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది. ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డుతో పాటు పలు అవార్డులను శ్రేయ తన సొంతం చేసుకుంది.