మేమిద్దరం హీరో హీరోయిన్లుగా చేస్తున్నాం!
శ్రావణ భార్గవిని కేవలం సింగర్ అనే చెప్పలేం. ఆమె పాటలు రాస్తుంది. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. గాత్రదానం చేస్తుంది. భర్త హేమచంద్రతో కలిసి అనేక టీవీ షోస్ చేస్తోంది. త్వరలో నటిగా కూడా నిరూపించుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రావణ భార్గవి ‘సాక్షి’కి చెప్పిన ముచ్చట్లు.
ఓ వైపు పాటలు, మరో వైపు టీవీ షోలు... మీ భార్యాభర్తల కెరీర్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నట్లుంది?
అవునండీ... ఇద్దరం ఒకే వృత్తిలో ఉండటం వల్ల వచ్చే సౌలభ్యం ఇదే. మొన్నటిదాకా ‘బోల్ బేబీ బోల్’కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం. ఇప్పుడు అదే కార్యక్రమానికి మేం న్యాయనిర్ణేతలం. ఇంకో వైపు స్టేజ్ షోలు. ఇక సినిమా పాటలు ఎలానో ఉన్నాయి. అడపా దడపా డబ్బింగులు కూడా చెబుతున్నా. ‘గబ్బర్‌సింగ్’, ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రాల్లో శ్రుతీహాసన్‌కి డబ్బింగ్ చెప్పాను. ‘ఈగ’ సినిమా ‘హిందీ’లో ‘మక్కీ’ పేరుతో అనువాదమైతే, అందులో సమంతకు డబ్బింగ్ చెప్పాను. వీటితో పాటు ఈ ఏడాది మరో కొత్త నిర్ణయం తీసుకున్నాం. అదే యాక్టింగ్. హైదరాబాద్ ‘గీతం’ కళాశాల విద్యార్థులు ఓ లఘు చిత్రం ప్రతిపాదన మా ముందుకు తెచ్చారు. పేరు ‘లక్కీ లవ్’. ఈ లఘు చిత్రంలో నన్ను, నా భర్త హేమచంద్రను హీరోహీరోయిన్లుగా నటించమని అడిగారు. కాన్సెప్ట్ నచ్చడంతో ‘ఓకే’ చేశాం. షూటింగ్ అయిపోవచ్చింది. త్వరలో ఆ షార్ట్‌ఫిలింకి సంబంధించి మేం పాడిన పాటను అధికారికంగా విడుదల చేయబోతున్నాం.
నటించమని ఇంతకు ముందేమైనా అవకాశాలొచ్చాయా?
మా ఇద్దరికీ చాలా అవకాశాలొచ్చాయండీ. పెద్ద పెద్ద డెరైక్టర్లే కొన్ని పాత్రల కోసం మమ్మల్ని అడిగారు. కానీ... పాత్రలు నచ్చకపోవడం వల్ల చేయలేదు. సరైన అవకాశం వస్తే సినిమాల్లో కూడా నటించాలని ఉంది. అసలు మేం నటించగలమా? లేదా? అనేది ఈ లఘు చిత్రం చెప్పేస్తుంది.
పాటలు కూడా రాసినట్టున్నారు?
అవును. ‘బద్రినాథ్’ సినిమా కోసం ‘ఇన్ ది నైట్’ అనే ఇంగ్లిష్ పాట రాశాను. ఆ పాట పాడిందీ నేనే. తర్వాత ‘ఈగ’ హిందీ వెర్షన్ ‘మక్కీ’ కోసం ఓ హిందీ పాట రాశాను.
మరి తెలుగు పాట ఎప్పుడు రాస్తారు?
రాయాలనుంది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా.
సాహిత్యం మీద పట్టుందా?
అలాంటిదేం లేదు. చిన్నప్పటి నుంచీ చదువుకున్న తెలుగే నాతో పాట రాయిస్తుందని నమ్మకం.
అసలు కళలపై మమకారం ఎలా మొదలైంది మీకు?
మా అమ్మానాన్న నాలో ఏం గమనించారో నాకు తెలీదు కానీ, నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడే నాకు ఇష్టం లేకపోయినా... బలవంతం చేసి మరీ క్లాసికల్ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేశారు. చేరి నాలుగేళ్లు గడవగానే... నాకు తెలీకుండానే సంగీతంపై మమకారం మొదలైంది. అయిదేళ్ల పాటు కర్ణాటక సంగీతం అభ్యసించాను. ‘సప్తస్వరాలు’ టీవీ కార్యక్రమంలో ఫస్ట్ రన్నర్ నేనే. ఆర్పీ పట్నాయక్‌గారు జడ్జ్. ఆయనకు నా పాట నచ్చడంతో నన్ను రమణగోగుల గారికి పరిచయం చేశారు. ఆయన నిర్మించిన ‘బోణీ’ చిత్రంతో ప్లేబ్యాక్ సింగర్‌గా నా కెరీర్ మొదలైంది.
మీకు పేరు తెచ్చిన పాటలు?
చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ‘సింహా’లోని ‘సింహమంటీ చిన్నోడే... వేటకొచ్చాడే’ పాటైతే నాకు చాలామంచి పేరు తెచ్చింది. అలాగే ‘రాజన్న’ చిత్రంలోని ‘లచ్చమ్మా...’ పాట కూడా. కీరవాణిగారు నాతో పాడించిన ప్రతి పాటా నాకు మంచి గుర్తింపునిచ్చింది.
గొంతు మార్చి భలే గమ్మత్తుగా పాడతారే. ఎక్కడ నేర్చుకున్నారీ విద్య?
వాయిస్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అనుభవంతో వస్తాయి. నాకు పేరు రావడానికి అదీ కారణమే.
అసలు మీ స్వస్థలం ఎక్కడ?
నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే ఇంజినీరింగ్ చదివాను.
హేమచంద్రతో మీ ప్రేమ ఎలా మొదలైంది?
‘రైడ్’ సినిమాకు అతనే సంగీత దర్శకుడు. ఆ సినిమాకు ట్రాక్ పాడటానికి వెళ్లినప్పుడు తొలిసారి తనను కలిశాను. అప్పట్నుంచీ దూరంగా ఉన్నా... ఎస్సెమ్మెస్‌లతో టచ్‌లో ఉన్నాం. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నట్లు మాకు తెలుస్తోంది కానీ, వ్యక్తపరచడానికి మాత్రం ఇద్దరికీ ధైర్యం చాలలేదు. చివరకు తనే ప్రపోజ్ చేశాడు. మా ఇద్దరి పేరెంట్స్ మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా.. తర్వాత ‘ఓకే’ అనేశారు. ఇప్పుడు మా లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉంది. పైగా మా అత్తయ్య శశికళాస్వామిగారు కూడా కళాకారిణే. అత్తగారింటి నుంచి కూడా నాకు మంచి ప్రోత్సాహం. అసలు నాకు పుట్టింట్లో ఉన్నట్టే ఉంది.
ఇద్దరూ సంపాదనపరులే. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉన్నారు. మీ మధ్య అభిప్రాయభేదాలు రాలేదా?
నాకు కొండంత నైతిక మద్దతు నా భర్త. ఆయన ఏదైనా కష్టమైన పనికి పూనుకుంటే నేను భార్యగా ఆయనకు అండగా ఉంటా. ఒకరినొకరు అర్థం చేసు కుంటే, ఇక అభిప్రాయభేదాలకు తావెక్కడ ఉంటుంది.
హేమచంద్ర పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట?
‘బాణం’ సినిమాలో పాడిన ‘నాలో నేనేనా’ పాట గురించే అందరూ చెబుతుంటారు. నాకైతే మాత్రం... ‘శక్తి’ సినిమాలోని ‘ప్రేమదేశం యువరాణీ...’ పాటంటే పిచ్చి. ఎందుకంటే... ఆ పాట వింటుంటే... తను నన్నే దృష్టిలో పెట్టుకొని పాడేడా అనిపిస్తుంది.
బుర్రా నరసింహ