
ఆమెను నేనే వద్దన్నాను
రెమో చిత్రంలో కథానాయకిగా నటి కీర్తీసురేశ్‌ను తానే వద్దన్నానని ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ చెప్పారు. రజనీమురుగన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం రెమో. 24ఏఎం.స్టూడియోస్ పతాకంపై డి.రాజా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా దర్శకుడు అట్లీ శిష్యుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక నుంగమ్‌బాక్కమ్ రోడ్డులో గల నక్షత్ర హోటల్‌లో జరిగింది.
కార్యక్రమానికి స్టార్ దర్శకుడు శంకర్ విచ్చేసి చిత్ర టైటిల్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రజనీమురుగన్ చిత్రం చూసి నటుడు శివకార్తికేయన్ నటనను అభినందించలేకుండా ఉండలేకపోయానన్నారు.
ఆయన్ని చూస్తే నాకే అసూయ కలిగింది
చిత్ర కథానాయకి కీర్తీసురేశ్ మాట్లాడుతూ దర్శకుడు తనకు కథ వినిపించినప్పుడు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ, అందులో మొదటి హీరోయిన్ శివకార్తికేయనేనీ అనడంతో తాను షాక్‌కు గురయానన్నారు. శివకార్తికేయన్ ఆడ వేషం వేస్తున్నట్లు ఆ తరువాత వివరించారన్నారు. ఈ వేషంలో చూసినప్పుడు తనకే అసూయ కలిగిందనీ కీర్తీసురేశ్ పేర్కొన్నారు.
ఆ హీరోయిన్లందరికీ థ్యాంక్స్
చివరిగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ తనకీ కథ గురించి మొదట దర్శకుడు అట్లీ చెప్పారన్నారు. కథ విన్నాక ఆడవేషంలో మెప్పించగలమా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశానని అన్నారు.కొన్ని రోజుల తరువాత దర్శకుడితో మరోసారి కథ వినిపించగలరా? అని అడగ్గా మళ్లీ కథ చెప్పారన్నారు. అలా 8 సార్లు కథ విన్నానని తెలిపారు. దర్శకుడేమో ఈ కథలో మీరే నటించాలని పట్టుపట్టాడన్నారు.
అలా తన కోసం 10 నెలలు వేచి దర్శకుడి కోసం తాను ఏడాది పాటు కాల్‌షీట్స్ కేటాయించానని తెలిపారు. రెమో చిత్రంలో ఆడ వేషం చాలా చేస్తుందన్నారు. ఈ పాత్ర చిత్రీకరణనే 42 రోజులు చేసినట్లు వెల్లడించారు. ఇక ఇందులో హీరోయిన్‌గా నటి కీర్తీసురేశ్ బాగుంటారని దర్శకుడు, కెమెరామెన్ పీసీ.శ్రీరామ్ అన్నారన్నారు. అయితే తాను మాత్రం ఆమెను వద్దని అన్నానని, అందుకు కారణం ఇప్పటికే రజనీమురుగన్ చిత్రంలో తామిద్దరం కలిసి నటించామన్నారు. వరుసగా కలిసి నటిస్తే గాసిప్స్ ప్రచారం అవుతాయనే కీర్తీసురేశ్‌ను వద్దన్నానని వివరించారు. అయితే చాలా మంది ప్రముఖ హీరోయిన్లను సంప్రదించగా ఎవరూ తనకు జంటగా నటించడానికి అంగీకరించలేదన్నారు. వారందరికీ ఇప్పుడు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.ఎందుకంటే కీర్తీసురేశ్ చాలా బాగా నటించారని శివకార్తీకేయన్ పేర్కొన్నారు. ఏవీఎం.శరవణన్, ఎడిటర్ మోహన్, మోహన్‌రాజా, పీసీ.శ్రీరామ్,అనిరుద్, రసూల్ కుట్టి, విఘ్నేశ్‌శివ పాల్గొన్నారు.