
మళ్ళీ.. పెళ్ళికొడుకాయెనే..!
ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్’ శివమణి ఇప్పుడు మళ్ళీ పెళ్ళికొడుకు అవుతున్నారు. ప్రముఖ గజల్ గాయని రూనా రిజ్వీని ఆయన వివాహం చేసుకోనున్నారు. ముంబయ్‌లో వచ్చేవారం ఈ వివాహ వేడుక జరగనుంది. ‘‘ఇది నా జీవితాన్ని మారుస్తున్న సంఘటన. రునాను చాలాకాలంగా ప్రేమిస్తున్నాను. ఈ నవంబర్ 10న కొంతమంది ఆంతరంగికుల మధ్య, పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా మా పెళ్ళి జరగనుంది’’ అని శివమణి వెల్లడించారు. ‘‘వివాహానికి సంబంధించిన ఇతర వివరాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శివమణి, ‘‘రునాను తన ‘సంగీతం’గా అభివర్ణిస్తున్నారు.
‘‘నా సొంత సంగీతాన్ని పెళ్ళాడబోతున్నందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రూనా రిజ్వీ పేరున్న హిందీ చలనచిత్ర గాయని. దక్షిణాదిలో కూడా కొన్ని సినిమాలకు పాటలు పాడారు. గతంలో ఏ.ఆర్. రెహమాన్, జాకీర్ హుస్సేన్, కున్నక్కుడి వైద్యనాథన్ తదితరులతో కలసి ప్రయోగాత్మక కర్ణాటక సంగీత ఆల్బమ్‌కు రూపకల్పన చేయడం ద్వారా శివమణి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పైన ‘డ్రమ్స్’ వాద్యకళాకారుడిగా దేశవిదేశాలు తిరిగి, ప్రపంచ ప్రసిద్ధ సంగీతజ్ఞులతో కలసి కార్యక్రమాలు చేశారు. రూనా, శివమణి కొన్నేళ్ళుగా కలసి పనిచేస్తున్నారు. సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ఇప్పుడు పెళ్ళిగా పరిణమిస్తోంది.
‘‘వాళ్ళిద్దరికీ సంగీతమంటే ప్రేమ. అదే వారిని ఒక్కటి చేసింది’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి, శివమణికి గతంలో పెళ్ళయింది. మొదటి భార్య క్రషానీ ద్వారా ఆయనకు ఇద్దరు సంతానం. ఇటీవలే తమిళ చిత్రం ‘అరిమా నంబీ’ ద్వారా ఆయన సంగీత దర్శకుడిగా తొలి అడుగు వేశారు. రానున్న తమిళ చిత్రాలు ‘కనిదన్’, ‘అమాలీ తుమాలీ’ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. మొన్న సంగీత దర్శకత్వం, ఇప్పుడు కొత్తగా పెళ్ళితో మొత్తం మీద ఈ ఏడాది శివమణి జీవితంలో మరపురానిదనే చెప్పుకోవచ్చు.