
తమిళసినిమా: సియాన్ విక్రమ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి స్కెచ్. ఇందులో ఆయన మిల్కీబ్యూటీ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారు. నటుడు సూరి, ఆర్‌కే.సురేశ్, అరుళ్‌దాస్, మలయాళం నటుడు హరీష్, శ్రీమాన్, విశ్వంత్, బాబురాజ్, వినోద్, వేల్ రామమూర్తి, సారిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒక కీలక పాత్రలో ప్రియాంక నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్.తమన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కలైపులి ఎస్.«థాను వి.క్రియేషన్స్ సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను విజయ్‌చందర్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో బ్రహ్మండమైన పాటను చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇందుకోసం భారీ ఎత్తున సెట్‌ను వేసినట్లు చెప్పారు.
ఇందులో విక్రమ్‌తో పాటు 150 మంది నృత్యకళాకారులు, .1,500 మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని తెలిపారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నామని, అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం వెల్లడించారు. ఈ స్కెచ్ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పవచ్చు.