
భర్త బ్యాటింగ్‌కు బౌలింగ్ చేసిన స్నేహ
భర్త ప్రసన్న బ్యాటింగ్ చేస్తే ఆయన భార్య నటి స్నేహ బౌలింగ్ చేశారు. ఈ క్రీడ చూపరులకు మహదానందాన్నిచ్చిందని వేరే చెప్పాలా? భార్యాభర్తలు ప్రసన్న, స్నేహ క్రికెట్ ఆడడమేమిటనేగా మీ కుతూహలం. స్టూడియో 9 సంస్థ అధినేత ఆర్‌కే.సురేశ్‌తో కలిసి 18 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన నాజర్ అలీ తాజాగా నారోమీడియా పేరుతో నూతన సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ సీఈఓ అయిన ఆయన సీఓఓ అయిన రోఫినా సుభాష్ కలిసి హెచ్‌ఐవీ బాధితుల సహాయార్థం వారిని సంరక్షిస్తున్న స్వచ్ఛంద సంస్థల కోసం నిధిని సేకరించే కార్యక్రమంలో భాగంగా జస్ట్ క్రికెట్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. నవంబర్ నుంచి డిసెంబర్ నాలుగు వరకూ జరిగిన ఈ పోటీల్లో చెన్నైకి చెందిన 32 జట్లు పాల్గొననున్నాయి. కాగా ఈ క్రికెట్ క్రీడ ఫైనల్ పోటీ ఈ నెల 11వ తేదీన స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో జరిగింది.
ఈ పోటీల ద్వారా వచ్చి నిధిని హెచ్‌ఐవీ బాధిత పిల్లల సంరక్షణ స్వచ్ఛంద సంస్థలకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల కార్యక్రమాలకు ప్రసన్న, స్నేహలతో పాటు దర్శకుడు వెంకట్ ప్రభు, చెన్నై–28 చిత్రం నటుడు శ్యామ్, భరత్, నరేన్, బోస్‌వెంకట్ తదితర పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్ని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నటుడు ప్రసన్న బ్యాటింగ్ చేయగా నటి స్నేహ బౌలింగ్‌తో అదరగొట్టారు. అదే విధంగా స్నేహ బ్యాట్ పట్టగా ప్రసన్న బౌలింగ్ చేశారు. ఈ దృశ్యం చూపరులకు కనువిందు చేసింది.