అందుకే బ్రేక్ తీసుకున్నా!
ఐశ్వర్యా రాయ్‌కి సిస్టర్ ఏమో అన్నట్లుగా స్నేహా ఉల్లాల్ ఉంటారు. అయితే ఐష్‌కీ, తనకూ ఎలాంటి రిలేషన్ లేదని ఈ తేనెకళ్ల సుందరి తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చేసినప్పుుడే క్లారిఫై చేశారనుకోండి. ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన స్నేహా మూడేళ్లుగా కనిపించడంలేదు. ఎలాగూ హిందీ అమ్మాయి కాబట్టి, అక్కడ సినిమాలు చేస్తున్నారేమోనని చాలామంది అనుకున్నారు.
కానీ, స్నేహా ఉల్లాల్ కెమెరా జోలికి వెళ్లలేదు. విషయం ఏంటంటే... అనారోగ్యం బారిన పడ్డారట. దీని గురించి స్వయంగా స్నేహా ఉల్లాలే చెప్పారు. ‘‘ఒంట్లో బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి, చెక్ చేయించుకున్నా. టెస్టులన్నీ చేశాక నేను ‘ఆటోఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడుతున్నానని డాక్టర్లు చెప్పారు. నా రోగ నిరోధక శక్తే నాకు ప్రతికూలంగా మారేలా చేసే రుగ్మత అన్నమాట. ఇది రక్తానికి సంబంధించిన జబ్బు’’ అని స్నేహా ఉల్లాల్ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రుగ్మత వల్ల నేను బలహీనమైపోయా. కంటిన్యూస్‌గా అరగంట నిలబడలేని పరిస్థితి. అయినా సినిమాలు చేశా. దాంతో ఇంకా వీక్ అయిపోయాను.
ఒకానొక దశలో పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం... ఇవన్నీ చేయలేకపోయా. దాంతో బ్రేక్ తీసుకుని, మందులు వాడుతూ, తగినంత విశ్రాంతి తీసుకున్నా. ఫైనల్‌గా నా ఆరోగ్య సమస్య సాల్వ్ అయింది. ఇక సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ‘కమ్‌బ్యాక్’ అంటే ఇష్టపడను. ఎందుకంటే, కావాలని సినిమాలను వదిలేసి, మళ్లీ వస్తే అది ‘కమ్‌బ్యాక్’ అవుతుంది. నేను జస్ట్ బ్రేక్ తీసుకున్నా’’ అన్నారు.