
ఏ పండగైనా మాకు పండగే అన్నట్లు కొందరు సినిమా స్టార్స్ క్రిస్మస్ పండగ చేసుకున్నారు. ఆ ఆనందాన్ని కెమెరాలో క్లిక్‌మనిపించి, ఆ ఫొటోలను షేర్ చేశారు. క్రిస్మస్ తాత గుబురు గడ్డాన్ని సరదాగా నిమురుతున్న మహేశ్‌బాబు ఫొటోను ఆయన సతీమణి నమ్రత షేర్ చేశారు. భార్యాపిల్లలు విరానికా, అరియానా, వివియానా, అవ్రామ్ భక్త మంచులతో విష్ణు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. సమంత, నాగచైతన్య పండగ వేళ ఒక ఫొటోను బయటపెట్టారు. ఇక శ్రుతీహాసన్ అయితే తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో పండగ సెలబ్రేట్ చేసుకున్నారు.
‘మహానటి’ కీర్తి సురేశ్‌ని చూశారా.. క్రిస్మస్ ట్రీ పక్కన కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. పండగ సందర్భంగా సుశాంత్ కూడా ఓ ఫొటో పంచుకున్నారు. అమలా పాల్‌ని చూశారుగా.. పండగ సందడి తనలో బాగా కనిపిస్తోంది కదూ. అలాగే నాగార్జున, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, ఈషా రెబ్బా, కాజల్ అగర్వాల్, త్రిష వంటి తారలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అటు ఉత్తరాదిన అమితాబ్, షారుక్ ఖాన్, అర్జున్ కపూర్, ఆలియా భట్ తదితరులు కూడా ‘హ్యాపీ క్రిస్మస్’ అన్నారు. పెళ్లయ్యాక ప్రియాంకా చోప్రా చేసుకున్న తొలి పండగ క్రిస్మస్. భర్త నిక్ జోనస్‌తో కలసి క్రిస్మస్ కోసం భారీగానే షాపింగ్ చేశారామె.
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నెక్ట్స్ షెడ్యూల్ జనవరిలో ప్రారంభం కానుంది. పొల్లొచ్చిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.
చిరంజీవి కుటుంబానికి ఈ క్రిస్మస్ పండగ ఎప్పటికీ స్పెషల్‌గా ఉండిపోతుంది. ఎందుకంటే, ఆయన చిన్న కుమార్తె శ్రీజ మంగళవారం ఓ పాపకు జన్మనిచ్చారు. శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. పాప పుట్టిన విషయాన్ని కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment