బాలీవుడ్‌లో ‘జన్నత్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది సోనాల్ చౌహాన్ ‘రెయిన్ బో’ ‘పండగ చేస్కో’ ‘షేర్’ ‘లెజెండ్’ ‘డిక్టేటర్’ (ఇందు)... తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘పాట’లో కూడా తన ప్రతిభ చాటుకుంటున్న సోనాల్ గురించి కొన్ని ముచ్చట్లు... తన మాటల్లోనే..
రెస్టారెంట్‌లో...
ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో తెలియనట్లే... ఏ రెస్టారెంట్‌లో ఏ అవకాశం ఉందో కూడా తెలియదు. సినిమాల్లోకి రావడానికి ముందు నేను మోడలింగ్ చేసేదాన్ని. 2005లో ‘మిస్ వరల్డ్ టూరిజం’ టైటిల్ గెలుచుకున్నాను. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో ఒకరోజు ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లాను. కునాల్ దేశ్‌ముఖ్ నన్ను చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయనే ‘జన్నత్’ సినిమా డైరెక్టర్. ఆ సినిమాలో నేను చేసిన ‘జోయా మాథుర్’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
పాడుతా తీయగా!
సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం. పాడుతున్నప్పుడు ఏదో శక్తి కొత్తగా చేరినట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని జయించడానికి సంగీతానికి మించిన ఆయుధం లేదు. ‘త్రీజీ’ సినిమా సెట్స్‌లో ఏదో డమ్మీ పాట పాడుతున్నప్పుడు డైరెక్టర్ విన్నారు. ఆయన నా గురించి మ్యూజిక్ డైరెక్టర్ మిథున్‌కు చెప్పారు.
‘‘నువ్వు ఎలా పాడినా సరే ఒకే’’ అని ఆయన ఆఫర్ ఇచ్చారు.
అలా ‘త్రీజీ’ సినిమా కోసం ‘కైసే బతాహూ’ పాట పాడాను.
నా అభిమాన గాయకుడు కేకేతో కలిసి పాట పాడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు సంగీతాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాను. సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంటున్నాను.
అక్కడ నేను సోనాల్ కాదు...
కెమెరా ముందు నేను ఏ పాత్ర అయితే పోషిస్తున్నానో అది మాత్రమే... సోనాల్ మాత్రం కాదు. పాత్రలో ఎలా పరకాయప్రవేశం చేయాలి అనేదాని గురించి రకరకాలుగా ఆలోచిస్తాను. పాత్ర డిమాండ్ మేరకు బికినీ కూడా ధరిస్తాను. పేరెంట్స్ బాధ పడనంత వరకు నేను గాసిప్స్‌ను పెద్దగా పట్టించుకోను. గ్లామర్‌ఫీల్డ్‌లో ఇవి సహజమే! అయితే ఈ ఫీల్డ్ గురించి వాళ్లకు అంతగా అవగాహన లేదు కాబట్టి ఫీలయ్యే అవకాశం ఉంది.
నా ఇష్టం
తీరిక దొరికితే చాలు సినిమా చూస్తుంటాను. ‘బిఫోర్ సన్‌రైజ్’, ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ సినిమాలు మళ్లీ మళ్లీ చూశాను. తెలుపు రంగు దుస్తులు నాకు బాగా నప్పుతాయి. తెలుపు దుస్తులు ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతాను. మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో చురుకుగా ఉండగలుగుతాం. అందుకు ఫిట్‌నెస్ కూడా కావాలి. నా దృష్టిలో ఫిట్‌నెస్ మంత్ర అంటే...‘ఈట్ ఇట్ ఆల్ బట్ బర్న్ ఇట్ ఆల్’.
పరఫెక్ట్ డే అంటే.. ఈట్. స్లీప్. నెట్‌ఫ్లిక్స్ అండ్ రిపీట్!
Comments
Please login to add a commentAdd a comment