బావతో కథ చర్చిస్తున్నా!
బావ ధనుష్‌తో కథా చర్చలు జరుపుతున్నట్లు దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ వెల్లడించారు.సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలుగా చిత్ర రంగప్రవేశం చేసిన ఈమె తొలి ప్రయత్నంలోనే తన తండ్రి కథానాయకుడిగా కోచ్చడైయాన్ చిత్రానికి దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలోనే మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో చిత్రం చేసిన దర్శకురాలిగా పేరుగాంచారు. ఆ చిత్రం తరువాత తండ్రి రజనీకాంత్ సలహా మేరకు సంసార జీవితంపై దృష్టి సారించారు.
ఒక బిడ్డకు తల్లి అయిన సౌందర్య రజనీకాంత్ అశ్విన్ సుమారు రెండేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. అయితే అది ఏ తరహా చిత్రం,చిత్ర నిర్మాణం ఏ స్టేజ్‌లో ఉంది, హీరో ఎవరన్న వివరాల గురించి సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌తో చిట్ చాట్..
ప్రశ్న: రజనీకాంత్ తన చిత్రాల ద్వారా జీవితాన్ని ఎలా గడపాలన్న విషయంలో అభిమానులకు పలు విధాలుగా హిత బోధనలు చేస్తుంటారు. మరి ఒక తండ్రిగా మీకు ఏమైనా హిత వాఖ్యలు చేస్తుంటారా?
జవాబు: నాన్న చాలా సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి. అయినా తన ప్రారంభ కాల జీవితాన్ని మరచిపోరు. నాన్న నాకు చేసే హితబోధనల్లో ముఖ్యమైన విషయం యదార్థంగా, నిజాయితీ ఉండడం అన్నది. ఈ విషయాన్ని నేనెప్పుడూ పాఠిస్తాను.
ప్రశ్న: ఎప్పుడైనా?ఏ విషయంలోనైనా మీ నాన్నగారు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశారా?
జవాబు: వత్తిడి కాదు కానీ ఇంతకు ముందు నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని కాదు. రెండేళ్లుగా వివిధ రకాల పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నాను.అందుకు కారణం నాన్నే. మంచి మంచి పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. ఆయన కన్నడ రచయిత ఎస్‌ఎల్.బైరప్పకు పెద్ద అభిమాని.ఆయన రాసిన పుస్తకాలను చదవమని చెబుతుంటారు.
ప్రశ్న: కోచ్చడైయాన్ చిత్రం తరువాత మళ్లీ చిత్రం చేయలేదే?
జవాబు: నా తదుపరి చిత్ర ఆరంభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇది యానిమేషన్ చిత్రం కాదు.వినోదం మేళవించిన విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుంది. ఈ కథా చర్చలను మా బావ ధనుష్‌తో కలిసి చర్చలు జరుపుతున్నాను. నా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి చెందిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను.