
చండాలంగా కళారంగం
- జాతులు, కులాలు, వర్గాల ఆధిపత్యపోరు పెరిగింది
- భాషపై అంకిత భావం లేనివారు తెలుగువారే: ఎస్పీ బాలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రస్తుతం కళారంగం (సినిమా) జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందని ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఫ్యాన్స్ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరిం చాలని కోరారు. తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యానికి ఆదివారం విజయవాడలో జీవిత సాఫల్య పురస్కా రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు.
అలాంటి వాటిని విమర్శించే ధైర్యం తనకు లేదన్నారు. ఒకపాట విజయవంతం కావాలంటే గాయకుడితో పాటు రచయిత, సంగీత దర్శకుడు, నటుల కృషి ఉంటుందని చెప్పారు. శంకరాభర ణంలో పాట పాడేందుకు తాను అర్హుడిని కాదని భావించి చాలాకాలం తప్పుకొని తిరిగానని, వచ్చిన అవకాశాన్ని వదులుకో కూడదని భావించి పాడానని గుర్తుచేసుకు న్నారు. మనకు అక్షరశిల్పులు చాలామంది ఉన్నారని, మల్లాది, సముద్రాల, ఆరుద్ర, జాలాది వంటి వారు గొప్పపాటలు అందిం చారని చెప్పారు. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్పరచయితలు మనకు ఉన్నారన్నారు. మహ్మద్ రఫీ మంచి గాయకుడని, ఆయన ప్రభావం తనపై ఉందని చెప్పారు.