హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ బాలీవుడ్‌లో తొలిచిత్రం ‘మున్నా మైఖేల్’తో మంచి మార్కులు కొట్టేసింది. నెక్ట్స్ జెన్ స్టార్ అనిపించుకుంది. ‘సవ్యసాచి’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్న నిధి అగర్వాల్ గురించి కొన్నిముచ్చట్లు...
అంత ఈజీ కాదు!
నిధి కుటుంబం, చుట్టాలలో అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు నటులు ఎవరూ లేరు. అయినప్పటికీ ‘నటి’ కావాలనేది ఆమె లక్ష్యం. ఇదే విషయాన్ని ఇంట్లోనో, బంధువుల దగ్గరో చెప్పినప్పుడు నవ్వులు వినిపించేవి. ఆ నవ్వుల అర్థం ‘నటి కావాలనుకోవడం అంతా ఈజీ అనుకుంటున్నావా!’ అని కూడా కావచ్చు.
బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసిన నిధికి బ్యాలె, కథక్, బెల్లీ నృత్యాలలో ప్రవేశం ఉంది.
అందాల పోటీల్లో విజేతలుగా నిలిచి, ఆ తరువాత సినిమాల్లో రాణించిన ఐశ్వర్యారాయ్, ప్రియాంకాచోప్రా, సుస్మితాసేన్... తనకు స్ఫూర్తి అంటోంది నిధి అగర్వాల్.
చలో ముంబై
నటి కావాలనే పట్టుదలతో ముంబై విమానం ఎక్కేసింది నిధి. నటి కావడానికి ముందు మోడలింగ్‌లో స్టార్ అనిపించుకుంటే అవకాశాలు వాటికవే నడిచొచ్చి డోర్‌బెల్ నొక్కుతాయని సన్నిహితులు చెప్పిన మాటలు నిజమయ్యాయి. మోడలింగ్‌లో రాణిస్తున్నప్పుడే డైరెక్టర్ షబ్బీర్‌ఖాన్ దృష్టిలో పడింది. అలా ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ‘డాలీ’ పాత్ర చేసింది. డాలీలాగే నిజజీవితంలోనూ తనకు డ్యాన్స్ అంటే ప్రాణం.
అభిమాని తలచే...
తక్కువ కాలంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న కథానాయికల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఒక అభిమాని అయితే ఒక గోడ మీద గ్రాఫిటీ ఆర్ట్‌లో నిధి చిత్రం వేసి సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశాడు. ఇలాంటి అభిమానులకు తన ఫ్యాన్ పేజీలో తప్పనిసరిగా ‘థ్యాంక్స్’ చెప్పేస్తుంది నిధి.
ఇదే తొలిమెట్టు
నాగచైతన్య ‘సవ్యసాచి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న నిధి అఖిల్‌తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ‘కల కనడం ఒక ఎత్తు. ఆ కలను నెరవేర్చుకోవడం ఒక ఎత్తు. నెరవేరిన కలను నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ‘తక్షణ తీర్పు’ ‘తక్షణ విమర్శ’ ఎదురయ్యే ప్రస్తుత కాలంలో ప్రతికూల ఆలోచనను దగ్గరకు రానివ్వక పోవడం విజయానికి తొలిమెట్టు అంటుంది అందాల నిధి అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment