నాగచైతన్య
‘‘పెళ్లి తర్వాత లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ వచ్చింది. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను తట్టుకోగలననే నమ్మకం ఏర్పడింది. హ్యూమన్ బీయింగ్‌గా ఇంకా బెటర్ అయ్యాననిపిస్తోంది’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘సవ్యసాచి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు...
‘ప్రేమమ్’ రిలీజ్ తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ‘సవ్యసాచి’ కథ చెప్పాడు చందు. కథ నచ్చింది. ‘ట్విన్ వ్యానిషింగ్ సిండ్రోమ్’ అనే కొత్త పాయింట్‌తో సినిమా కదా అని స్టార్టింగ్‌లో కాస్త భయపడ్డాను. రెండు మూడు షెడ్యూల్స్ తర్వాత ఆ భయం పోయింది. ‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కూడా ఆలోచించుకోమని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ వర్కౌట్ చేశాం. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో చందూపై ఉన్న నమ్మకం పెరిగింది. యాక్టర్‌గా నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆయన ఒక కారణం. చందూ కొత్తగా ఆలోచిస్తాడు. అన్నీ కుదిరితే చందుతో మరో సినిమా చేస్తాను.
►మాధవన్‌గారు సూపర్‌గా చేశారు. ‘సఖి’ సినిమాతో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘విక్రమ్ వేదా, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోనూ అదే చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భూమికగారు బాగా చేశారు. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మూమెంట్స్‌ను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్. నిధి అగర్వాల్ ఆల్‌రౌండర్. మంచి డ్యాన్సర్. ‘హాలోబ్రదర్’ సినిమాలోని నాన్నగారి(నాగార్జున) క్యారెక్టర్స్‌తో ఈ సినిమాకు సంబంధం లేదు. అక్కడ ట్విన్స్ ఉంటారు. ఇక్కడ ఒకే శరీరంలో ట్విన్స్ ఉంటారు. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది.
►ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి ఫ్యాన్‌ని నేను. మా సినిమాకు బాగా వర్క్ చేశారు. నా సినిమానే కాదు ‘అంతరిక్షం’ సినిమా సెట్స్‌ను కూడా చూశాను. ఒక తెలుగు టెక్నీషియన్ ఆ రేంజ్‌లో చేస్తున్నారంటే అది మంచి పరిణామం.
►నిర్మాణ విలువల పరంగా ఇప్పటివరకు నా కెరీర్లో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే వాళ్లు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. నిజాయతీగా చెప్పాలంటే నాకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టారు. మార్కెట్ ఏంటీ? ఎంత లాభం అనే విషయాలను ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు.
►అసరమైతే రీషూట్ చేయాలన్న నాన్నగారి ఫార్ములాను నేను నమ్ముతాను. కచ్చితంగా రీషూట్స్ చేయాలనే ఫార్ములా లేదు. డౌట్స్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. సినిమా రిలీజైన తర్వాత ఆ సీన్ రీపేర్ చేసి ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు ఆడియన్స్ చెబుతున్న ఆ మార్పు అప్పుడే మనకు అనిపించింది కదా. అప్పుడే చేసి ఉంటే బాగుండు అని అంతా అయిపోయాక ఆలోచించడంకన్నా సెట్స్‌లో ఉన్నప్పుడే రీషూట్స్ చేయడం మంచిదే అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న టాప్ యాక్టర్స్, హీరోలు రీషూట్స్ చేస్తారు. రీషూట్స్ అంటే అది బెటర్‌మెంట్ అని నా అభిప్రాయం.
►‘శైలజారెడ్డి అల్లుడు’ రిజల్ట్ విషయంలో ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా హ్యాపీగానే ఉన్నాను. ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇన్‌వాల్వ్ అవుతాను. కానీ ఒక లైన్ దాటి వెళ్లకూడదు. అది దర్శకుడికి మనం ఇచ్చే గౌరవంగా నేను ఫీలవుతాను. మారుతిగారు కథ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ రిజల్ట్స్‌ను ఊహించలేం కదా. ఇక ఒకే రోజు రిలీజైన ‘శైలజారెడ్డి అల్లుడు, యు–టర్న్’ సినిమాల పోటీ అనేది ఓ డిఫరెంట్ సిట్యువేషన్. రివ్యూస్ పరంగా ‘యు–టర్న్’ గెలిచింది (నవ్వుతూ).
►శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నేను, సమంత దంపతులుగానే నటిస్తున్నాం. స్క్రిప్ట్ పరంగా కథలో నాకు, సమంతకు గొడవలు ఎక్కువ. నటించడానికి అది కొంచెం కష్టంగా ఉంది. రియల్‌ౖ లెఫ్‌లో లేవు కదా (నవ్వుతూ). శివ మంచి డైరెక్టర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నాం. ‘మజిలీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ‘వెంకీమామ’ సినిమాను డిసెంబర్‌లో స్టార్ట్ చేస్తా. పౌరాణికం సినిమాలను టచ్ చేయాలని ఉంది. కానీ ముందు ఓ మూడు నాలుగు హిట్స్ సాధించాలి. ప్రస్తుతానికి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేయలేదు.
►నా కెరీర్ స్టార్టింగ్‌లో నాన్నగారు కథలు విన్నారు కానీ ఇప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాన్నగారు ‘సవ్యసాచి’ సినిమా చూశారు. కొన్ని సలహాలు చెప్పారు. నాన్నగారు చూస్తున్నప్పుడే ఎడిట్ రూమ్‌లో సమంత చూసింది.
►నాన్నగారి ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త కంగారు పడ్డాను. కానీ అవుట్‌పుట్ చూసి హ్యాపీ ఫీలయ్యా. కీరవాణిగారు మంచి సంగీతం ఇచ్చారు. సెకండాఫ్‌కు ఈ సాంగ్ ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment