
‘‘శర్వానంద్ నటించిన సినిమాకి బాగా డబ్బులు, శర్వానంద్ బాగా చేశాడనే పేరు... రెండూ రావాలి. నేనప్పుడు హ్యాపీగా ఉంటాను’’ అన్నారు శర్వానంద్. ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన సినిమా ‘మహానుభావుడు’. విజయదశమి కానుకగా గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి శర్వానంద్ చెప్పిన సంగతులు...
సంక్రాంతికి ‘శతమానం భవతి’, దసరాకు ‘మహానుభావుడు’... ప్రతి పండక్కీ ఓ హిట్ కొడుతున్నారు!
బెస్ట్ సంక్రాంతి అండ్ బెస్ట్ దసరా! రిలీజ్ డే మార్నింగ్ షో ఆడియన్స్‌తో కలసి చూశా. వాళ్లంతా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీస్‌తో థియేటర్లకు వస్తున్నారు. మంచి సినిమా చేశామనే ఫీలింగ్ ఉంది. థియేటర్లు కూడా పెరిగాయి.
పెద్ద సినిమాలు కూడా పండక్కి విడుదలయ్యాయి. టెన్షన్ పడ్డారా?
లేదు. పండక్కి నాలుగు రోజులు సెలవులు ఉన్నప్పుడు ప్రేక్షకులు నాలుగు సినిమాలకు వెళ్లే ఆప్షన్ ఉంది. ఒక్కో రోజు ఒక్కో సినిమాకు వెళతారు. ప్రతి సిన్మాది డిఫరెంట్ జోనర్. ఒకటి మాస్ అయితే... ఇంకొకటి థ్రిల్లర్ ఫిల్మ్. మాది ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. మూడూ మూడు జోనర్లు కాబట్టి పెద్ద టెన్షన్ పడలేదు.
సినిమాలో చేసిన ఓసీడీ (అతిశుభ్రత) క్యారెక్టర్ ఆనంద్‌కి, మీకు ఏవైనా పోలికలు ఉన్నాయా?
అస్సలు లేవు. నేను టోటల్లీ డిఫరెంట్. అంత నీట్‌నెస్ ఉంటే చంపేస్తారంతా! మీరు కూడా తట్టుకోలేరు.
సినిమాలో హీరోయిన్‌కి ఇచ్చినట్లు ఎవరికైనా శానిటైజర్స్ గిఫ్టులుగా ఇస్తున్నారా? సినిమా తర్వాత మీకేమైనా ఓసీడీ పట్టుకుందా?
అంత లేదు! నాలో ఓసీడీ లక్షణాలు లేవు. ఇక, శానిటైజర్స్ గిఫ్టులంటారా? నాకు ప్రభాస్ అన్న ఇవ్వడమే (ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో స్టేజిపై ప్రభాస్ ఇచ్చిన గిఫ్టును గుర్తుచేస్తూ!). నేనెవరికీ ఇవ్వడం లేదు. ప్రభాస్ అన్న ఇంకా సినిమా చూడలేదు. ‘సాహో’ షూటింగ్‌లో ఉన్నారు. త్వరలో చూస్తారు.
ఓసీడీ అనేది చిన్న పాయింట్! దాన్ని సినిమాగా తీయొచ్చని ఎలా అనిపించింది?
అంత చిన్న పాయింట్‌లో ఇంత హ్యూమర్ ఉంటుందనీ, ప్రేక్షకుల్ని నవ్వించొచ్చనీ మారుతి మాత్రమే ఆలోచించగలరు. ఆయనే ఇలాంటి కథ రాయగలరు. కథ చెప్తున్నప్పుడే ఎంజాయ్ చేశా. నా కెరీర్‌లో... కారెక్టర్, క్యారెక్టరైజేషన్ బేస్డ్ చిత్రమిది. సిన్మాలో ఆనంద్ క్యారెక్టర్ లేకపోతే ఇంకొకటి లేదు.
ఓసీడీ ఉన్నోళ్లను ఎవరినైనా కలిశారా? అసలు, ఇటువంటి వ్యక్తులు ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా?
ఎందుకు? మన ఇళ్లల్లో అమ్మో... నాన్నో... ‘క్లీన్‌గా ఉండు, ఈ వస్తువు అక్కడే పెట్టు’ అని చెబుతారు కదా! సో, ఆ సీన్లకు ఎక్కడో చోట కనెక్ట్ అవుతాం. ఓసీడీ అనేది రోగం కాదు, తెలుగులో చెప్పా లంటే చాదస్తం. నా ఫ్రెండ్స్‌లో ఓసీడీ ఉన్నోళ్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ, వాళ్లను అబ్జర్వ్ చేయడం వంటివేం చేయలేదు.
‘ఏదైనా పాత్ర ఇస్తే శర్వానంద్ పరకాయ ప్రవేశం చేస్తారు. మిగతా వాళ్లు పాత్రను తమలో కనిపించేలా చేస్తారు’ అని మారుతి చెప్పారు. మీరేమంటారు?
నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు కదా! మారుతి గ్రేట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేనెప్పుడూ దర్శకుడు ఏం చెబితే.. దాన్ని ఫాలో అవుతా. ‘నా స్టైల్ ఇది. శర్వాకి ఓ స్టైల్ ఉండాలి’ అనుకోను. దర్శకులు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నిస్తా. కథ రాసుకునేటప్పుడు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఉండాలనేది దర్శకులు ఊహించి రాసుకుంటారు. అందువల్ల, వాళ్లను నేనెంత వరకు శాటిస్‌ఫై చేయగలననేది చూస్తా. ‘నా స్టైల్‌ని బట్టి కథ రాయండి. డైలాగులు మార్చండి’ అని చెప్పను. ఈ సిన్మాకు మారుతి చెప్పిందాన్ని ఫాలో అయ్యా. అతనిలో నచ్చేది ఏంటంటే... షూటింగ్‌లో ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజులను బట్టి డైలాగులు రాస్తారు. సీన్ బెటర్‌మెంట్ చేస్తారు. ఇందులో అలా చేసిన సీన్లు చాలా ఉన్నాయి. అందుకే, నేను క్రెడిట్ అంతా మారుతీకే ఇస్తా.
ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ సిన్మాలు చేయడం మీకు ఈజీ కదా..
మీరలా అనుకుంటున్నారా? నాకు ‘ప్రస్థానం’ వంటివే ఈజీ. కామెడీ చేయడం, టైమింగ్ కుదరడం బాగా కష్టం. కామెడీ సీన్లలో యాక్షన్, డైరెక్షన్ వర్కౌట్ కావాలి. కామెడీయే మోస్ట్ టఫెస్ట్ జాబ్!
‘కాబోయే సూపర్‌స్టార్ మీరే’ అని ప్రభాస్ చెప్పారు. కాంప్లిమెంట్స్‌గా తీసుకుంటున్నారా? లేదా...
(మధ్యలోనే అందుకుంటూ...) బ్లెస్సింగ్స్ అంతే! వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. తలకు ఎక్కించు కోకూడదు. ఇండస్ట్రీలో నా ప్లేస్ ఏంటని ఎప్పుడూ ఆలోచించలేదు. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే... పెద్ద స్టార్, యాక్టర్ అవ్వాలని ఉండదు. ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా. ప్రేక్షకుల రెస్పాన్స్‌ని బట్టి ముందుకెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్... లాస్ట్ టైమ్ ఫార్ములా ఫిల్మ్ ‘రాధ’ వచ్చింది. ‘శర్వాకు ఈ సినిమా అవసరమా?’ అన్నారు ప్రేక్షకులు. అదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. అప్పుడు ‘మనం కొత్త సిన్మాలే చేయాలి’ అనుకున్నా. పాజిటివ్‌గా ఆలోచిస్తా.
తర్వాతి సిన్మా సుధీర్‌వర్మ దర్శకత్వంలోనేనా?
సుధీర్‌వర్మతో ఓ సిన్మా, ప్రకాశ్ కోవెలమూడి తో మరో సిన్మా తప్పకుండా చేస్తా. ఎవరి సినిమా ఎప్పుడు ఉంటుంది? అనేది త్వరలో ప్రకటిస్తాం.
‘అర్జున్‌రెడ్డి’ మిస్ అయ్యానని ఫీలవుతున్నారా?
‘అర్జున్‌రెడ్డి’ కథ నా దగ్గరికొచ్చినప్పుడు... ముగ్గురు నలుగురు నిర్మాతలకు పంపించా. ఎవరికి వాళ్లు ఇంత కంటే పెద్ద బడ్జెట్‌తో చేద్దా మన్నారు. కానీ, ఈ సినిమా చేయమన్నారు. కొంచెం భయపడ్డారు. వాళ్లంతా, ఇప్పుడు ఫోనులు చేసి ‘అర్రే... మిస్ అయ్యాం శర్వా’ అన్నారు. మళ్లీ మళ్లీ అలాంటి కథలు రావు. మంచి కథ మిస్సయినందుకు... ఐ ఫీల్ బ్యాడ్. బట్, ‘అర్జున్‌రెడ్డి’ చూశాక... ‘ఆ సిన్మాకి విజయ్ దేవరకొండే కరెక్ట్’ అనిపించింది. ‘ఇంకొకడు వచ్చాడ్రా... కొట్టాడ్రా’ అనేలా నటించాడు. విజయ్‌కి ఫోన్ చేసి ఆ మాటే చెప్పాను కూడా! కొత్త దర్శకులు మంచి మంచి కథలతో వస్తున్నారు. వాళ్లను పట్టుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్.