
అందరూ అలా అనుకుంటే కథ చచ్చిపోతుంది!
‘‘నిన్ను కోరి’ మంచి లవ్‌స్టోరీ. ఏడాదికి మూడు సినిమాలు చేస్తుండటంతో వరుసగా ప్రేమకథలే చేస్తున్నాననిపించే అవకాశం ఉంటుంది. అసలు లవ్‌స్టోరీ లేని తెలుగు సినిమా ఏదో చెప్పండి? ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట ప్రేమకథ ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్పామన్నది ముఖ్యం’’ అని హీరో నాని అన్నారు. నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా శివ నిర్వాణను దర్శకునిగా పరిచయం చేస్తూ దానయ్య డీవీవీ నిర్మించిన ‘నిన్ను కోరి’ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు.
►శివ నిర్వాణ కథ చెప్పినప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలనే తాపత్రయం కనిపించలేదు. కథ విన్నంత సేపూ నా మనసుకి దగ్గరైన ట్లు అనిపించింది. ఇంకో పది నిమిషాల్లో కథ అయిపోతుందనగానే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. చెప్పిన కథను యథావిధిగా స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు.
►‘లైఫ్‌లో సమస్యలు కామన్. అంత మాత్రాన నా లైఫ్ మొత్తం అయిపోయిందని నిరుత్సాహపడకూడదు. పాజిటివ్‌గా ఆలోచిస్తే లైఫ్ చాలా బాగుంటుందని చెప్పాం. లైఫ్ మనకి బోలెడు ఛాన్సులిచ్చింది. మనం ఆ లైఫ్‌కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం’ అన్నదే కథాంశం.
►గతంలో ప్రేక్షకులు సినిమా, కథ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. అది చూస్తే బాధ అనిపిస్తోంది. కలెక్షన్ల గురించి మాట్లాడితే అందరూ కమర్షియల్ సినిమాలే తీస్తారు. అప్పుడు కథ చచ్చిపోతుంది. ‘నిన్నుకోరి’ చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు, కళ్లలో నీళ్లు ఉంటాయి.
►దానయ్యగారు, సహ నిర్మాత కోన వెంకట్‌గారు ఈ చిత్రానికి వెన్నెముక. నా సినిమాతో నిర్మాత, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉంటేనే నిజమైన సక్సెస్. వారిలో పదిశాతం మంది అసంతృప్తిగా ఉన్నా అది నిజమైన సక్సెస్ కాదు. నాకు ప్రొడక్షన్ అంటే ఇష్టమే. కానీ, మంచి ఆలోచన వచ్చినప్పుడు వేరే హీరోని పెట్టి నేను ప్రొడ్యూస్ చేస్తా.
►నా ఫ్యాన్స్ వేరే హీరోపై సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్లు పెడతామంటే ఒప్పుకోను. అది తప్పని వారికి చెప్పినప్పుడు హర్ట్ అయినా ఫర్వాలేదు. మేమే కరెక్ట్ అనుకునే ఆ తరహా ఫ్యాన్స్ నాకు అవసరం లేదు. అందరు హీరోలూ వారి అభిమానులకు ఇలాగే చెప్పాలి. ∙వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఎమ్.సీ.ఏ.’ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఆ చిత్రం తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేసే సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుంది.
►నేనిప్పటి వరకూ చేయని కొత్త జానర్‌లో ఈ సినిమా ఉంటుంది. ∙ప్రస్తుతం సినిమా, ఫ్యామిలీ ఇవే నా లోకం. మా అబ్బాయికి ఇప్పుడు మూడు నెలలు. షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? ఎప్పుడు ఇంటికెళ్లిపోతామా? అనిపిస్తోంది. మాటలు చెబుతుంటే.. అలా వింటుంటాడు. ఈ వయసులో వాళ్లకు ఏం తెలుస్తుంది? నాకైతే మా బాబుని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది.