నేనంటే శివకు బోర్ కొట్టింది
చెన్నై: నాతో నటించి నటుడు శివకార్తికేయన్‌కు బోర్ కొట్టిందని నవ్వుల విరిబోణి కీర్తీసురేశ్ అంటున్నారు. లక్కీ హీరోయిన్లలో మొదటి స్థానంలో నిలిచిన నటి ఈ కేరళాకుట్టి అని చెప్పవచ్చు. నాల్గవ చిత్రంతోనే ఇళయదళపతితో యుగళగీతాలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ధనుష్ సరసన నటించిన తొడరి చిత్రంలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో రెండేసి చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీసురేశ్.. విజయ్‌తో నటించిన భైరవా చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిరునవ్వుల చిన్నదానితో చిన్న భేటీ.
ప్ర: ఈ పొంగల్ మీకు చాలా స్పెషల్ అనుకుంటా?
జ: కచ్చితంగా స్పెషలే. ఈ పండగను భైరవా పొంగల్ అనే అనవచ్చు. ఏడాది ఆరంభంలోనే నా భారీ చిత్రం తెరపైకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
ప్ర: విజయ్‌తో నటిస్తున్నప్పుడు ఆయనలో గమనించిన అంశాలు?
జ: నటకు ముందు వరకూ చాలా కూల్‌గా ఉండే విజయ్ కెమెరా ముందుకు వెళ్లగానే పూర్తిగా మారిపోతారు. అదే విధంగా పాటల సన్నివేశాలకు ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా చాలా ప్రశాంతంగా నృత్యరీతులను గమనించి షాట్‌లో దుమ్మురేపుతారు.
ప్ర: విజయ్‌తో నటించడానికి భయపడిన సందర్భం ఏమైనా ఉందా?
జ: ఆయనతో డ్యాన్స్ చేయడానికే చాలా భయపడ్డాను.
ప్ర: భైరవా చిత్రంలో మీ పాత్ర గురించి?
జ: భైరవా చిత్రంలో నా పాత్ర పేరు మలర్‌విళి. తిరునెల్వెలి అమ్మాయిగా లంగాఓణి, చుడీదార్ దుస్తుల్లో గ్రామీణ యువతిగా కనిపిస్తాను.
ప్ర: మీరు చాలా చలాకీగా ఉంటారు. విజయ్ మౌన మునిలా ప్రవర్తిస్తారు. చిత్ర షూటింగ్‌లో ఎలా గడిచింది?
జ: ఇతరులతో ఎలా జాలీగా మాట్లాడతానో విజయ్‌తో కూడా అలానే సరదాగా ఉండేదాన్ని.
ప్ర: ఏ నటుడితో నటించాలని ఆశిస్తున్నారు?
జ: నిజం చెప్పాలంటే నాకు చిన్నతనం నుంచే సూపర్‌స్టార్‌తో నటించాలని కోరిక ఉంది.
ప్ర: మీ అభిమాన నటి?
జ: నేను నటి నయనతారకు వీరాభిమానిని.
ప్ర: నటుడు శివకార్తికేయన్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?
జ: శివకార్తికేయన్‌కు నాతో నటించి బోర్ కొట్టిందని అనుకుంటున్నాను. రెమో చిత్రం తరువాత మా ఇద్దరికీ చిన్న గ్యాప్ అవసరం. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తాం.
ప్ర: పొంగల్ వేడుక ఎలా జరుపుకోనున్నారు?
జ: చాలా జాలీగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నాను. కొత్త డ్రస్‌లు చాలా కొనుక్కున్నాను. భైరవా చిత్రం విడుదలైంది. పొంగల్ పండగను చెన్నైలోని ఇంట్లోనే జరుపుకోనున్నాను. నాకు పొంగల్ చేయడం రాదు. అయితే భలే తింటాను. ఇక చెరకు ముక్కలు నోరు పగిలే వరకూ తింటాను.