Suresh Keerthi
-
నేనంటే శివకు బోర్ కొట్టింది
చెన్నై: నాతో నటించి నటుడు శివకార్తికేయన్‌కు బోర్ కొట్టిందని నవ్వుల విరిబోణి కీర్తీసురేశ్ అంటున్నారు. లక్కీ హీరోయిన్లలో మొదటి స్థానంలో నిలిచిన నటి ఈ కేరళాకుట్టి అని చెప్పవచ్చు. నాల్గవ చిత్రంతోనే ఇళయదళపతితో యుగళగీతాలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ధనుష్ సరసన నటించిన తొడరి చిత్రంలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో రెండేసి చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీసురేశ్.. విజయ్‌తో నటించిన భైరవా చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిరునవ్వుల చిన్నదానితో చిన్న భేటీ. ప్ర: ఈ పొంగల్ మీకు చాలా స్పెషల్ అనుకుంటా? జ: కచ్చితంగా స్పెషలే. ఈ పండగను భైరవా పొంగల్ అనే అనవచ్చు. ఏడాది ఆరంభంలోనే నా భారీ చిత్రం తెరపైకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్ర: విజయ్‌తో నటిస్తున్నప్పుడు ఆయనలో గమనించిన అంశాలు? జ: నటకు ముందు వరకూ చాలా కూల్‌గా ఉండే విజయ్ కెమెరా ముందుకు వెళ్లగానే పూర్తిగా మారిపోతారు. అదే విధంగా పాటల సన్నివేశాలకు ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా చాలా ప్రశాంతంగా నృత్యరీతులను గమనించి షాట్లో దుమ్మురేపుతారు. ప్ర: విజయ్‌తో నటించడానికి భయపడిన సందర్భం ఏమైనా ఉందా? జ: ఆయనతో డ్యాన్స్ చేయడానికే చాలా భయపడ్డాను. ప్ర: భైరవా చిత్రంలో మీ పాత్ర గురించి? జ: భైరవా చిత్రంలో నా పాత్ర పేరు మలర్విళి. తిరునెల్వెలి అమ్మాయిగా లంగాఓణి, చుడీదార్ దుస్తుల్లో గ్రామీణ యువతిగా కనిపిస్తాను. ప్ర: మీరు చాలా చలాకీగా ఉంటారు. విజయ్ మౌన మునిలా ప్రవర్తిస్తారు. చిత్ర షూటింగ్లో ఎలా గడిచింది? జ: ఇతరులతో ఎలా జాలీగా మాట్లాడతానో విజయ్‌తో కూడా అలానే సరదాగా ఉండేదాన్ని. ప్ర: ఏ నటుడితో నటించాలని ఆశిస్తున్నారు? జ: నిజం చెప్పాలంటే నాకు చిన్నతనం నుంచే సూపర్‌స్టార్‌తో నటించాలని కోరిక ఉంది. ప్ర: మీ అభిమాన నటి? జ: నేను నటి నయనతారకు వీరాభిమానిని. ప్ర: నటుడు శివకార్తికేయన్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు? జ: శివకార్తికేయన్‌కు నాతో నటించి బోర్ కొట్టిందని అనుకుంటున్నాను. రెమో చిత్రం తరువాత మా ఇద్దరికీ చిన్న గ్యాప్ అవసరం. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తాం. ప్ర: పొంగల్ వేడుక ఎలా జరుపుకోనున్నారు? జ: చాలా జాలీగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నాను. కొత్త డ్రస్‌లు చాలా కొనుక్కున్నాను. భైరవా చిత్రం విడుదలైంది. పొంగల్ పండగను చెన్నైలోని ఇంట్లోనే జరుపుకోనున్నాను. నాకు పొంగల్ చేయడం రాదు. అయితే భలే తింటాను. ఇక చెరకు ముక్కలు నోరు పగిలే వరకూ తింటాను. -
రెమోకు సూపర్‌స్టార్ ప్రశంసలు
రెమో చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు లభించాయి. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. నవ నిర్మాత ఆర్డీ.రాజా నిర్మించిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలై విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన తెరి చిత్రాల తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెమో రికార్డు సాధించింది. ఈ చిత్రం తమిళనాడులోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరుతుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. కాగా రెమో చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ తనను, నటుడు శివకార్తికేయన్‌ను ప్రశంసించారని నిర్మాత ఆర్డీ.రాజా ట్విట్టర్లో పేర్కొన్నారు. రజనీకాంత్ వీరాభిమానినైన తనకు ఆయన ప్రశంసలు దక్కడం జీవితంలో పడిన కష్టాలను మరిపించాయని నిర్మాత పేర్కొన్నారు. కాగా ఆర్డీ.రాజా తాజాగా శివకార్తీకేయన్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నవంబర్ 11న ప్రారంభం కానుంది. -
తొడరి విడుదలకు సన్నాహాలు
మామ చిత్రం హంగామా తగ్గుముఖం పట్టిన తరువాత అల్లుడి చిత్రం హడావుడి మొదలవనుంది. అర్థం అయిందాని అడగాల్సిన అవసరం లేదనుకుంటా ‘రజనీకాంత్ చిత్రం కబాలి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వసూళ్ల పరంగా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. తదుపరి ఆయన అల్లుడు ధనుష్ నటించిన తొడరి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తంగమగన్ చిత్రం తరువాత ధనుష్ నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. అయితే ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో తొడరి, కొడి చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వీటిలో ధనుష్ మొదట నటించింది తొడరి చిత్రంలో. అయితే గ్రాఫిక్స్, సీజీ కార్యక్రమాలు కారణంగా తొడరి చిత్ర నిర్మాణం కాస్త ఆలస్యమైందని సమాచారం. అయినా ముందు నటించడానికి అంగీకరించిన తొడరి చిత్రాన్నే ముందుగా విడుదల చేయాలని ధనుష్ వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. ప్రభుసాల్మన్ దర్శకుడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. అయితే రజనీకాంత్ చిత్రం కబాలి విడుదల తరువాత తొడరి చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. కబాలి ఇటీవల తెరపైకి వచ్చింది కాబట్టి తొడరి చిత్రాన్ని స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 12న విడుదలకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది రైలులో జరిగే ప్రేమకథా చిత్రం అన్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్ క్యాంటీన్బాయ్గా నటించారు. ఆ రైల్లో ప్రయాణిస్తున్న కీర్తీసురేశ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమ ఏ తీరం చేరిందన్నదే తొడరి చిత్ర ఇతివృత్తం. ఇది ధనుష్, ప్రభుసాల్మన్ల చిత్రం కనుక మంచి అంచనాలే నెలకొంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. -
కండిషన్స్ అప్లై అంటున్న మడోనా
ఆదిలో నటి రేవతిలా కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తాననీ స్టేట్మెంట్స్ ఇచ్చిన చాలా మంది నటీమణులు ఆ తరువాత సిల్క్‌స్మిత రేంజ్లో అందాలారబోతకు తయారయ్యారు. కాగా ఈ తరం నాయికలు లక్ష్మీమీనన్, నిత్యామీనన్, కీర్తీసురేశ్, మడోనా సెబాస్టియన్ లాంటి వారు తమకంటూ కొన్ని హద్దులను విధించుకుని నటిస్తున్నారు. అయితే వారిలో నటి లక్ష్మీమీనన్ ఇప్పటికే నాన్శివప్పుమనిదన్ చిత్రంలో విశాల్‌తో డెరైక్ట్‌గా లిప్ లాక్ సన్నివేశంలో నటించి నిబంధనలను సడలించుకున్నారు. ఇటీవల గ్లామర్‌కు తానూ సై అని గేటులెత్తేశారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న రెక్క చిత్రంలో అమ్మడి అందాలారబోతను చూడొచ్చంటున్నారు. అలాంటిది అదే విజయ్‌సేతుపతికి జంటగా కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ కుట్టి మడోనా సెబాస్టియన్ ఆరంభ దశలోనే షరతులు విధిస్తున్నార ట. అవి మరీ విడ్డూరంగా ఉన్నాయి. అవేమిటంటే... శారీరక గ్లామర్‌ను ప్రదర్శించే దుస్తులు ధరించను. హీరోలను కౌగిలించుకునే సన్నివేశాలలో నటించను. వారితో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించను. ఒకవేళ ఆ హీరో నాకు స్నేహితుడైతే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి అంగీకరిస్తానేమో అంటున్న మడోనా సెబాస్టియన్ కోలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మడోనా సెబాస్టియన్ రెండోసారి విజయ్‌సేతుపతికి జంటగా కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనుంది. -
విజయ్ తో చేయాలని ఉంది
వర్ధమాన నాయికలు ప్రముఖ కథానాయకుల సరసన నటించే అవకాశం రావాలని ఆశపడడం సాధారణ విషయమే. నటి కీర్తీసురేష్ అలా కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒకప్పుడు కోలీవుడ్‌లో హీరోయిన్ల కొరత చాలా ఉండేది. నయనతార, త్రిష, కాజల్‌అగర్వాల్, తమన్న, అనుష్క లాంటి వారే ప్రముఖ కథానాయకులతో నటించేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. హన్సిక, కీర్తీసురేష్, శ్రీదివ్య, క్యాథరిన్ ట్రెసా వంటి వర్ధమాన హీరోయిన్లు పోటీగా తయారయ్యారు. దీంతో హీరోయిన్లకు కొరత లేకుండాపోయింది. అంతేకాదు దర్శక నిర్మాతలకు పారితోషికాల విషయంలో బేరసారాలాడి నాయికల్ని ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతోంది. అదే విధంగా ఇప్పుడు చిత్రానికో కొత్త నాయకి పరిచయం అవడంతో పలాన ప్రముఖ నాయకిలా ఉన్నావంటూ వారికి ప్రాచుర్యం తెచ్చిపెట్టడంతో ఆయా ప్రముఖ నాయికలు తమ అవకాశాలను తన్నుకు పోతారనే భయంతో తమ పారితోషకాలను దగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. విషయం ఏమిటంటే విజయ్ తాజాగా నటిస్తున్న తెరి చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది తనకు 60వ చిత్రం అన్నది గమనార్హం. విజయాప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఆమె ఇందులో నటించడానికి రెండున్నర కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా వర్ధమాన నటి నటి మియాజార్జ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె ఆ ప్రచారాన్ని కొట్టివేయడంతో ఇప్పుడు మరో యువ నటి కీర్తీసురేష్ పేరు వార్తలో తేలుతోంది. దీని గురించి ఆ అమ్మడిని అడగ్గా విజయ్‌తో నటించాలని తనకూ చాలా ఆశగా ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను అనిబదులిచ్చింది. అన్నట్టు ఈ బ్యూటీ నటించిన రజనీమురుగన్ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వీరవిహారం చేస్తోంది. దీంతో కీర్తీసురేష్ ఆనందానికి అవధుల్లేకుండాపోతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మకు ఇళయదళపతితో నటించే అవకాశం అంత త్వరగా వస్తుందా? చూద్దాం ఈ భామ అదృష్టం ఎలాగుందో.