అంతకు ముందు వరకూ నేను బిచ్చగాణ్ణే!
‘‘ప్రస్తుత తమిళనాట రాజకీయాలకూ, ఈ చిత్రానికీ ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు జీవశంకర్ ఐదేళ్ల క్రితమే ఈ కథ రాశారు. తమిళనాడు మాత్రమే కాదు... దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకూ కథ, సినిమా నచ్చుతాయి. ప్రాంతాలను బట్టి రాజకీయ నాయకులు మారతారు కానీ, రాజకీయాలు ఎక్కడైనా ఒక్కటే. రాజకీయ నాయకుల ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది’’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా నటించిన ‘యమన్’ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న విడుదలవుతున్న ఈ సినిమా గురించి విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు....
రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు? ఎలా పనిచేస్తారు? అసలేం చేస్తారు? అనేవి తెలుసు. కానీ, ప్రతి ఒక్కరూ రాజకీయాలు చేయలేరు. చాలా కష్టమైన పని. మేం దాన్ని డిఫరెంట్ యాంగిల్‌లో చూపించాం. రాజకీయ నేపథ్యంలో వస్తున్న వినూత్న కథా చిత్రమిది. ఓ సామన్య వ్యక్తి మంత్రి ఎలా అయ్యాడనేది చిత్రకథ. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా.
►‘యమన్’... అంటే ధర్మాన్ని కాపాడే వాడు, యమధర్మరాజు అని అర్థం. మహాశివుని అవతారాల్లో ఒకటి. ఈ సినిమాలో నేను తప్పుడు రాజకీయ నాయకుల పట్ల యముణ్ణి అన్నమాట. నా తొలి సినిమా ‘నకిలీ’ తరహాలో పూర్తి ఊహాజనితమైన కథతో తెరకెక్కింది. ఇందులో మియా జార్జ్ నా భార్యగా నటించారు. సినిమాలోనూ ఆమె నటిగానే కనిపిస్తారు.
►ఈ కథను విజయ్ సేతుపతి కోసం రాశారు. వచ్చే మూడేళ్ల వరకూ అతని కాల్‌షీట్స్ ఖాళీగా లేవు. అప్పుడు నా దగ్గరకు వచ్చింది. నా దృష్టిలో ఏ సినిమాలోనైనా ఎవరైనా నటించవచ్చు. ఈ కథలో ఎవరు నటించినా హిట్టవుతుంది. మంచి సినిమా తీయాలని నిజాయితీగా ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఓ సినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే.. కాస్త ఇమేజ్ అవసరమే. నాకు కొంచెం ఇమేజ్ ఉంది కదా! సో, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. తెలుగులో ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి విడుదల చేస్తున్నారు. ఆయనతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు.
►తమిళంలో నా సినిమాలను నేనే నిర్మిస్తా. సంగీత దర్శకుడి నుంచి హీరో కావాలనుకున్నప్పుడు నాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. దాంతో నిర్మాణంలోకి అడుగుపెట్టా. ‘బిచ్చగాడు’ ముందువరకూ నేను బిచ్చగాణ్ణే. చాలా స్ట్రగుల్ అయ్యా. ‘బిచ్చగాడు’ రిలీజైన తర్వాత, ఆ సిన్మా క్లైమాక్స్‌లో చూపించినట్టు మిలీనియర్ అయ్యా. ప్రొడక్షన్, రిలీజ్, పబ్లిసిటీ.. సినిమా తీయడం చాలా కష్టం. ప్రతి హీరో కనీసం రెండు మూడు సినిమాలు నిర్మిస్తే... నిర్మాతల బాధలు అర్థమవుతాయి. నాకు డబ్బు ముఖ్యం కాదు. ఎన్ని డబ్బులున్నా రోజులో మూడుసార్లు కంటే ఎక్కువ తినలేం కదా. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఛారిటీ చేస్తాను.
► నా తర్వాతి చిత్రాన్ని తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తీస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణ చేయడం కుదరకపోతే.. తెలుగు టెక్నీషియన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నా. హీరోగా మాత్రమే నటిస్తా. అతిథి పాత్రలు, విలన్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు.
► జయలలిత మరణం తమిళనాడుకి తీరని లోటు. సింహంలా బతికారు. అంత త్వరగా మరణిస్తారని ఎవరూ అనుకోలేదు. పెద్ద రాజకీయ నాయకురాలు మరణించినప్పుడు కన్‌ఫ్యూజన్ ఏర్పడడం కామన్. లాస్ట్ టైమ్, తెలుగు రాష్ట్రంలో సీయంని (స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి) కోల్పోయినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నటువంటి సమస్యలే ఎదురయ్యాయి.