Jayalalithaas death
-
ఎత్తుగడేనా ?
► జయ మరణ విచారణ కమిషన్ ఏర్పాటుపై సర్వత్రా సందేహాలు ► శశికళ అండ్ కో అణచివేత కోసమేనని వ్యాఖ్యలు ► పోయెస్ గార్డెన్ ఇల్లు ఇక ప్రభుత్వపరం ► సీఎం ఎడపాడి సంచలన ప్రకటన ► విపక్షాల్లో మిశ్రమ స్పందన ఇటీవలి కాలంలో రాజకీయ కలకలాలు సృష్టించడంలో దేశానికే రాజధానిగా మారిన తమిళనాడులో తాజాగా మరో సంచలనం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. మద్రాసు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. జయ నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయలలిత స్మారక మందిరంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గపోరును తట్టుకునేందుకు సీఎం పళని స్వామి కొత్త ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జయ మరణం ఇక మిస్టరీగానే మిగిలిపోనుందని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా సీఎం ఎడపాడి తెరపైకి తెచ్చారు. గురువారం ఉదయం తన మంత్రివర్గ సహచరులతో సీఎం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీఎం సీరియస్‌గా నిర్వహిస్తున్న సమావేశంలోని అంతరార్థం ఏమిటనే ఉత్కంఠ మొదలైనా ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదు. సాయంత్రం సీఎం ఎడపాడే స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అమ్మ మరణంలో అందరికీ అనేక సందేహాలున్నాయి, వాటిని నివృత్తి చేయడం కోసం విచారణ కమిషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటుచేసి విచారణ జరపనున్నట్లు తెలిపారు. అలాగే పోయెస్ గార్డెన్‌లోని జయలలిత ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చి ప్రజల సందర్శనకు ఉంచుతామని తెలియజేయడం చర్చకు దారితీసింది. ఇంత కాలం తర్వాత.. అంతా నేనేగా వ్యవహరించిన జయలలిత అకస్మాత్తుగా కన్ను మూయడం ఆ పార్టీని కకావికలం చేసింది. అమ్మ లేని అనాథగా మారిన అన్నాడీఎంకేని చిన్నమ్మ (శశికళ) చేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణించి నెల తిరక్క ముందే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారారు. మరో నెల గడిచేలోగా సీఎం సీటుపై కన్నేసి అడ్డుగా ఉన్న పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించారు. అప్పటివరకు చిన్నమ్మ చాటు చిన్నబిడ్డలా ప్రశాతంగా ఉండిన పన్నీర్ సెల్వం హఠాత్తుగా ఆమెపై తిరుగుబాటు చేశారు. జయలలిత మరణం అనుమానాస్పదం, ఇన్చార్జ్ సీఎంగా ఉండిన తనను సైతం జయను చూసేందుకు శశికళ అనుమతించలేదని విమర్శించారు. అమ్మ మరణం వెనుక చిన్నమ్మ హస్తం ఉందని ఆరోపించారు. దీంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జయ చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం, చికిత్స చేసిన లండన్ డాక్టర్ సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మెరీనా బీచ్‌లోని సమాధి నుంచి జయ మృతదేహాన్ని వెలికితీసి ఎందుకు రీపోస్టుమార్టం నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ మద్రాసు హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు. పార్టీలో విలీనం కావాలంటే జయ మరణంపై విచారణకు ఆదేశించాలని సుమారు మూడునెలల క్రితం మాజీ సీఎం పన్నీర్‌సెల్వం రాష్ట్ర ప్రభుత్వానికి షరతు కూడా విధించారు. జయ మరణంపై ఇంత రాద్దాంతం జరుగుతున్నా శశికళ ఆశీస్సులతో సీఎంగా మారిన ఎడపాడి ఇంతకాలం నోరుమెదపలేదు. నేతల మిశ్రమ స్పందన జయలలిత మరణంపై విచారణ కమిషన్ నియామకంపై నేతల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రిటైర్డు జడ్జితో విచారణ కేవలం కంటి తుడుపు చర్య అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ వ్యాఖ్యానించారు. సీఎం ఎడపాడి, మంత్రులు తమ పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ కమిషన్, స్మారక మందిరం నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తెలిపారు. ఇంతకాలం మౌనం వహించి ఈరోజు విచారణకు ఆదేశించడం శశికళ కుటుంబాన్ని తొక్కిపెట్టేందుకేనని డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, అన్నాడీఎంకే నేత, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ తంబిదురై స్వాగతించారు. మాజీ సీఎం పన్నీరువర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి విమర్శించారు. విలీనంపై తాము పెట్టిన షరతుల్లో నేరవేరినట్లుగా తాము అంగీకరించబోమని, సీబీఐ విచారణ డిమాండ్‌కే తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. జయకు 74 రోజులపాటూ చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎడపాడి ఎత్తుగడ అన్నాడీఎంకేలోని ప్రధాన వైరివర్గాలైన ఎడపాడి, పన్నీర్‌సెల్వం విలీనం కావాలని బీజేపీ అధిష్టానం, ప్రధాని మోదీ నుంచి ఒత్తిడి పెరిగింది. అంతేగాక శశికళ కుటుంబంలేని అన్నాడీఎంకేని ఆశిస్తున్నట్లు కూడా బీజేపీ షరతు విధించింది. జయ అనుమానాస్పద మృతిపై అందరి అనుమానాలు శశికళపైనే ఉన్నాయి. విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా శశికళను, ఆమె నియమించిన టీటీవీ దినకరన్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చనే ఆలోచనతోనే సీఎం ఎడపాడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భావిస్తున్నారు. అంతేగాక విలీనంపై పన్నీర్‌సెల్వం విధించిన ప్రధాన రెండు షరతులు నెరవేర్చినట్లు అవుతుంది. తద్వారా విలీనానికి మార్గం సుగమం అవుతుందని సీఎం ఎడపాడి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చివేస్తానంటూ దినకరన్ చేస్తున్న ప్రకటనలతో కేంద్రం నుంచి ఆదరణ పొందడం కూడా విచారణ కమిషన్‌లోని ఎత్తుగడగా వ్యాఖ్యానిస్తున్నారు. దీప నిరాకరణ జయలలిత ఇంటిపై తమకు వారసత్వపు హక్కులు ఉన్నాయని ఆమె మేనకోడలు దీప అన్నారు. గురువారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోయెస్ గార్డెన్ ఇల్లు, అమ్మకం, కొనుగోలు హక్కు ఎవరికీ లేదని, ఆ ఇంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని ఆమె అన్నారు. విచారణ కమిషన్ వేయడం వెనుక శశికళ కుటుంబ కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. జయ కన్నుమూసిన నాటి నుంచి తాను విచారణకు డిమాండ్ చేస్తున్నా, ఇన్నాళ్లూ మిన్నకుండి నేడు ప్రకటన చేయడం తమ పదవులను కాపాడుకునే కపట నాటకమని ఆమె విమర్శించారు. -
మిస్టరీ ముడి విప్పండి!
♦ మళ్లీ తెరపైకి ‘అమ్మ’ మరణం ♦ మిస్టరీ ఛేదించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ♦ శశికళ, పన్నీర్ సహా 186 మందిపై ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్త కలకలానికి కారణమైన అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మళ్లీ తెరపైకి వచ్చింది. అమ్మ మరణం మిస్టరీగా మారడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ప్రధాన కార్యదర్శి శశికళ సహా 186 మందిపై కేసులు పెట్టాలని కోరుతూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జ్వరం, డీహైడ్రేషన్ అస్వస్థతతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇక ప్రాణంతో తిరిగిరాలేదు. గత ఏడాది సెప్టంబర్ 22 నుంచి డిసెంబర్ 5వ తేదీన ఆమె మరణించిందని ప్రకటించే వరకు అంతా గోప్యంగా ఉంచారు. ప్రజలు, పార్టీ నేతలు కోరినా చికిత్స పొందుతున్న జయ ఫొటోను విడుదల చేయలేదు. అమ్మ కోలుకుంటున్నారు, నేడో రేపో డిశ్చార్జ్ అని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు చివరి వరకు ప్రకటిస్తూనే ఉన్నారు. జయ మరణం తరువాత అదే పార్టీకి చెందిన న్యాయవాది పుహళేంది అన్నాడీఎంకే కార్యకర్తల యువజన విభాగాన్ని స్థాపించాడు. ఈ విభాగంలోని కడలూరుకు చెందిన అన్నాడీఎంకే న్యాయవాది సెల్వవినాయగం అమ్మ మరణం వెనుక శశికళ, పన్నీర్‌సెల్వం హస్తం ఉందంటూ గత నెల తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో న్యాయవాది పుహళేంది చెన్నై సైదాపేట 18వ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశాడు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె బాగా కోలుకుంటున్నట్లుగా అపోలో యాజమాన్యం విడుదల చేసిన బులిటెన్లలో పేర్కొందని, అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా 2016, డిసెంబర్ 5వ తేదీన రాత్రి 11.30 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె ప్రాణాలు తీశారని, ఈ నేరంలో శశికళ, పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే నిర్వాహకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అపోలో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం 186 మంది పాత్ర ఉందని పిటిషన్లో చేర్చాడు. ఈ 186 మందిపై కేసులు నమోదు చేయాల్సిందిగా తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోనందున తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోర్టును కోరాడు. జయ మరణంపై కేసులు పెట్టేవరకు తమ పోరాటం ఆగదని న్యాయవాది పుహళేంది మీడియాకు తెలిపారు. -
పన్నీర్ దీక్ష
► కుట్రపూరిత కుటుంబం నుంచి రక్షిద్దాం ► మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రతిజ్ఞ ► జయ మరణంపై న్యాయ విచారణ కోరుతూ రాష్ట్రవ్యాప్త దీక్షలు అమ్మకు ద్రోహం చేసి, బహిష్కరణకు గురైన వారి చేతిలో నేడు అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం చిక్కుకున్నాయని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఆశయాలకు విరుద్ధమైన వ్యక్తుల నుంచి అన్నాడీఎంకేను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పన్నీర్‌సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. పన్నీర్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి పన్నీర్ ప్రసంగిస్తూ ఎంజీఆర్ అన్నాడీఎంకేను ఒక మక్కల్ ఇయక్కం(ప్రజల సంస్థ)గా స్థాపించారన్నారు. ఆయన బాటలో జయలలిత సైతం ‘ప్రజల కోసం నేను... ప్రజల వల్ల నేను’ అనే నినాదంతో పాలన అందించారని తెలిపారు. జయ స్థానంలో సీఎంగా తాను సైతం అలాంటి పాలనకే పాటుపడ్డానని చెప్పారు. అయితే రాష్ట్రంలో నేడు అలాంటి పరిస్థితులు లేవని, అమ్మ ఆశయాలు తల్లకిందులయ్యాయని అన్నారు. అమ్మ చేతిలో బహిష్కరణకు గురైన వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలుగా మారిపోయారని చెప్పారు. ‘అక్కా... నీకు ద్రోహం చేసినవారితో ఇక నా సంబంధాలు తెంచుకుంటాను, రాజకీయాలు, పార్టీ, పదవులకు దూరంగా ఉంటాను’ అని లిఖిత పూర్వకంగా జయ వద్ద క్షమాపణలు కోరిన శశికళ వ్యవహారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమ్మ బహిష్కరించిన వారి చేతిలో నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని పన్నీర్ సెల్వం వివరించారు. అమ్మను చూసేందుకు అడ్డుకున్నారు అపోలో ఆసుపత్రిలో జయకు 74 రోజుల పాటూ చికిత్స అందిస్తే ఒక్కరోజు కూడా తాను చూసేందుకు అవకాశం కలగలేదని, ఎన్నోసార్లు ప్రయత్నించినా శశికళ, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ మనుషులు అడ్డుకున్నారని తెలిపారు. అపోలోకు వచ్చేపోయే వారి జాబితాను సిద్ధం చేసేందుకే ఆరుగురిని నియమించారని చెప్పారు. చిన్నపాటి వ్యాధులతో అడ్మిటైన అమ్మకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏమిటి, సంక్లిష్టమైన వ్యాధులపై చికిత్సకు విదేశాలకు తరలించాలని తాను సూచించినా శశికళ పట్టించుకోలేదని చెప్పారు. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చానని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ చేసిన ప్రకటన సత్యదూరమని పన్నీర్‌సెల్వం అన్నారు. ఆయన ఆ ప్రకటనను ఉపసంహరించుకోకుంటే కోర్టులో కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. జయ మరణంలోని మర్మంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. దీక్షలకు భారీ స్పందన సీఎంగా రాజీనామా చేసిన నాటి నుంచి అమ్మ మరణం అనుమానాస్పదమేనని చెబుతూ వస్తున్న పన్నీర్‌సెల్వం ఏకంగా నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకోవడం అధికార అన్నాడీఎంకే వర్గాన్ని కలవరపెట్టింది. గత నెల 27వ తేదీనే దీక్షకు దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల క్రితం మరోసారి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. చెన్నై చేపాక్ స్టేడియం వద్ద తలపెట్టిన దీక్షను ఎగ్మూరులోని రాజారత్తినం స్టేడియంకు మార్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు దీక్షలు ప్రారంభించాల్సి ఉండగా 9 గంటలకే పన్నీర్‌సెల్వం ఆయన మద్దతుదారులతో కలసి చేరుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో జనసందోహం ఏర్పడింది. సరిగ్గా 10 గంటలకు పన్నీర్‌సెల్వం దీక్షలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షా శిబిరం నుంచి చేసిన ప్రసంగాల్లో అమ్మ పాలనను వివరిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టారు. పన్నీర్‌సెల్వం వైపు ధర్మం ఉందని నటుడు మనోబాల తనను కలిసిన మీడియా వారితో అన్నారు. చెన్నై శివార్లు ఆవడి, సేలం, నామక్కల్, కోయంబత్తూరు, నాగర్‌కోవిల్, తిరుచ్చిరాపల్లి, అరియలూరు తిరునెల్వేలి, తూత్తుకూడి, తంజావూరు, తిరువారూరు, ఈరోడ్, మధురై, వేలూరు, కడలూరు, విళుపురం తదితర మొత్తం 32 జిల్లాల్లో సైతం పన్నీర్‌సెల్వం అనుచరులు నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రతిచోట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు పెట్టారు. చికిత్స పత్రాలను వెల్లడించాలి: దీప జయకు అపోలో ఆసుపత్రిలో అందించిన పలురకాల చికిత్సలకు ముందు అనుమతి పత్రాలపై సంతకాలు పెట్టినవారి పేర్లు బయటపెట్టాలని ఆమె మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధినేత్రి దీప బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే జయ మరణ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేందుకు సంతకం చేసిన కుటుంబ సభ్యులెవరో తేలాల్సి ఉందని ఆమె అన్నారు. ఆసుపత్రిలో రోగికి చికిత్స ప్రారంభించే ముందు బంధువులతో సంతకం తీసుకోవడం ఆనవాయితీ, దీని ప్రకారం వీటన్నింటిపై సంతకం చేసిన వారు ఎవరో తేలేందుకు, మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ విచారణ అవసరమని ఆమె అన్నారు. -
అంతకు ముందు వరకూ నేను బిచ్చగాణ్ణే!
‘‘ప్రస్తుత తమిళనాట రాజకీయాలకూ, ఈ చిత్రానికీ ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు జీవశంకర్ ఐదేళ్ల క్రితమే ఈ కథ రాశారు. తమిళనాడు మాత్రమే కాదు... దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకూ కథ, సినిమా నచ్చుతాయి. ప్రాంతాలను బట్టి రాజకీయ నాయకులు మారతారు కానీ, రాజకీయాలు ఎక్కడైనా ఒక్కటే. రాజకీయ నాయకుల ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది’’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా నటించిన ‘యమన్’ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న విడుదలవుతున్న ఈ సినిమా గురించి విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు.... రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు? ఎలా పనిచేస్తారు? అసలేం చేస్తారు? అనేవి తెలుసు. కానీ, ప్రతి ఒక్కరూ రాజకీయాలు చేయలేరు. చాలా కష్టమైన పని. మేం దాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించాం. రాజకీయ నేపథ్యంలో వస్తున్న వినూత్న కథా చిత్రమిది. ఓ సామన్య వ్యక్తి మంత్రి ఎలా అయ్యాడనేది చిత్రకథ. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. ►‘యమన్’... అంటే ధర్మాన్ని కాపాడే వాడు, యమధర్మరాజు అని అర్థం. మహాశివుని అవతారాల్లో ఒకటి. ఈ సినిమాలో నేను తప్పుడు రాజకీయ నాయకుల పట్ల యముణ్ణి అన్నమాట. నా తొలి సినిమా ‘నకిలీ’ తరహాలో పూర్తి ఊహాజనితమైన కథతో తెరకెక్కింది. ఇందులో మియా జార్జ్ నా భార్యగా నటించారు. సినిమాలోనూ ఆమె నటిగానే కనిపిస్తారు. ►ఈ కథను విజయ్ సేతుపతి కోసం రాశారు. వచ్చే మూడేళ్ల వరకూ అతని కాల్షీట్స్ ఖాళీగా లేవు. అప్పుడు నా దగ్గరకు వచ్చింది. నా దృష్టిలో ఏ సినిమాలోనైనా ఎవరైనా నటించవచ్చు. ఈ కథలో ఎవరు నటించినా హిట్టవుతుంది. మంచి సినిమా తీయాలని నిజాయితీగా ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఓ సినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే.. కాస్త ఇమేజ్ అవసరమే. నాకు కొంచెం ఇమేజ్ ఉంది కదా! సో, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. తెలుగులో ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి విడుదల చేస్తున్నారు. ఆయనతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ►తమిళంలో నా సినిమాలను నేనే నిర్మిస్తా. సంగీత దర్శకుడి నుంచి హీరో కావాలనుకున్నప్పుడు నాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. దాంతో నిర్మాణంలోకి అడుగుపెట్టా. ‘బిచ్చగాడు’ ముందువరకూ నేను బిచ్చగాణ్ణే. చాలా స్ట్రగుల్ అయ్యా. ‘బిచ్చగాడు’ రిలీజైన తర్వాత, ఆ సిన్మా క్లైమాక్స్‌లో చూపించినట్టు మిలీనియర్ అయ్యా. ప్రొడక్షన్, రిలీజ్, పబ్లిసిటీ.. సినిమా తీయడం చాలా కష్టం. ప్రతి హీరో కనీసం రెండు మూడు సినిమాలు నిర్మిస్తే... నిర్మాతల బాధలు అర్థమవుతాయి. నాకు డబ్బు ముఖ్యం కాదు. ఎన్ని డబ్బులున్నా రోజులో మూడుసార్లు కంటే ఎక్కువ తినలేం కదా. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఛారిటీ చేస్తాను. ► నా తర్వాతి చిత్రాన్ని తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తీస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణ చేయడం కుదరకపోతే.. తెలుగు టెక్నీషియన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నా. హీరోగా మాత్రమే నటిస్తా. అతిథి పాత్రలు, విలన్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు. ► జయలలిత మరణం తమిళనాడుకి తీరని లోటు. సింహంలా బతికారు. అంత త్వరగా మరణిస్తారని ఎవరూ అనుకోలేదు. పెద్ద రాజకీయ నాయకురాలు మరణించినప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడడం కామన్. లాస్ట్ టైమ్, తెలుగు రాష్ట్రంలో సీయంని (స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి) కోల్పోయినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నటువంటి సమస్యలే ఎదురయ్యాయి. -
జయ మరణం మిస్టరీనే!
ఆస్పత్రిలో చేరడానికి ముందే ఘటనలు జయకు విషప్రయోగం చేసేందుకు కుట్ర అన్నాడీఎంకే సీనియర్ నేతలు వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనుమానాస్పదమేనని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్కాక ముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ ఆరోపించారు. ఆ కుటుంబం నన్ను చంపేందుకు కుట్రపన్నుతోందని జయలలిత తనతో చెప్పుకుని బాధపడినట్లుగా వారు తెలిపారు. గుండెపోటు వల్లనే జయ మరణించారు, అమ్మ మరణంలో అనుమానాలకు తావులేదని అపోలో వైద్యులు, లండన్ డాక్టర్ రిచర్డ్ సోమవారం ప్రకటించడాన్ని వారు ఖండించారు. చెన్నైలో మంగళవారం మీడియా సమావేశంలో పీహెచ్ పాండియన్ మాట్లాడుతూ జయలలిత మరణం అన్నాడీఎంకేలో పూడ్చలేని శూన్యానికి దారితీసిందని అన్నారు. అమ్మ మృతి చెందిన నాటి నుంచి తీవ్ర మనోవేదనతో మౌనంగా కాలంగడుపుతున్నానని, అయితే మూడు రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు తీవ్రంగా కలతచెంది మౌనాన్ని వీడానని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత తన ఇంటిలో స్పృహ కోల్పోయిన స్థితిలో, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, డీహైడ్రేషన్‌కు గురై అపోలోలో అడ్మిట్ అయ్యారని తనకు తెలిసిందని అన్నారు. 22వ తేదీ అర్ధరాత్రి ఎవరితోనే వాగ్వివాదం, బాహాబాహీ సంఘటనల తరువాత జయలలితను కిందికి తోసివేసినట్లు తెలిసిందని చెప్పారు. నన్నుపైకి లేపండి అంటూ జయలలిత కేకలు వేసినా ఎవ్వరూ ఆమెను ఆదుకోకపోవడంతో స్పృహతప్పిపోయారని అన్నారు. ఈ తరుణంలో ఇంటి వద్ద ఏదైనా జరిగితే తమపైకి వస్తుందన్న భయంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. ఆసుపత్రిలో జయను చూసేందుకు వెళ్లగా రెండు రకాల దుస్తుల్లో బందోబస్తులో ఉన్న వారు తనను అడ్డుకున్నారని, జయ క్షేమంగా ఉన్నారు, రెండురోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కూడా తెలిపారని అన్నారు. ఎన్ని రోజులైనా అదే సమాధానం చెప్పుతూ వాస్తవాలను కప్పిపుచ్చారని ఆయన తెలిపారు. జయకు గుండెపోటు వచ్చిన సంగతి తెలుసుకుని డిసెంబరు 5వ తేదీన తాను ఆసుపత్రికి వెళ్లినపుడు ప్రత్యేకంగా సిద్ధం చేసిన సాధారణ వార్డులో జయ ఉన్నారని అన్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డి వచ్చి ‘ సారీ ఏంచేస్తాం, భగవంతుని ప్రార్థిద్దాం’ అని వ్యాఖ్యానించినట్లుగా ఆయన తెలిపారు. అదే సమయంలో శశికళ జేమ్స్ బాండ్లు వేసుకునే కోటును ధరించి ఐసీయూ నుంచి బయటకు రాగా, వెనుకనే ఆమె బంధువులు వచ్చారని తెలిపారు. వారి ముఖంలో జయ చనిపోయిన ఆవేదన లేదు, కన్నీళ్లు పెట్టలేదని చెప్పారు. జయ మరణించలేదు, మెదడు పనిచేస్తోందని నమ్మించి, మరికొద్ది సేపట్లో జయ మరణించినట్లుగా ప్రకటించారని అన్నారు. 75 రోజులుగా జయను చూడలేదు, అనుమతించాల్సిందిగా కోరినా నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజాజీ హాల్లో జయ భౌతికకాయం చుట్టూ ఉన్న శశికళ బంధువర్గాన్ని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కుట్రపన్నుతున్నారనే ఆరోపణలపై పోయెస్‌గార్డెన్ నుంచి 2012లో గెంటివేయబడిన వారంతా జయ పార్థివదేహం చుట్టూ ఉండడం కలచి వేసిందని తెలిపారు. తనకు పార్టీలో ఎలాంటి పదవి వద్దని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తరువాతనే శశికళకు జయ సభ్యత్వం ఇచ్చి దగ్గరపెట్టుకున్నారని ఆయన తెలిపారు. అయితే జయ చనిపోయిన 20 రోజులకే ప్రధాన కార్యదర్శి పదవిని పొంది నేడు సీఎం పదవి కోసం సిద్ధమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఆమె ఏమాత్రం అర్హురాలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి పోయెస్‌గార్డెన్‌లో ఏమి జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు, ఎంత మంది ఉన్నారో విచారణ జరపాలని, అలాగే ఆరోజు చోటు చేసుకున్న సంఘటనలపై కూడా విచారణ జరిపితే జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ బైటపడుతుందని ఆయన చెప్పారు. శశికళ కుటుంబంపై జయకు సందేహం: మనోజ్ పాండియన్ శశికళ, ఆమె కుటుంబీకులు తనకు విషం ఇచ్చి చంపుతారేమోనని జయలలిత తరచూ అనుమానం వ్యక్తం చేసేవారని అన్నాడీఎంకే మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ తెలిపారు. ఈ అనుమానాన్ని స్వయంగా జయలలితే తన వద్ద వ్యక్తం చేశారని అన్నారు. అంతేగాక ఎటువంటి పరిస్థితుల్లో శశికళను రాజకీయాల్లోకి రానీయనని కూడా జయలలిత తనతో అన్నారని చెప్పారు. 2011 డిసెంబర్ 19వ తేదీన జయలలిత తనను సచివాలయానికి పిలిపించుకుని 45 నిమిషాలు తనలోని బాధను పంచుకున్నారని తెలిపారు. పోయెస్‌గార్డెన్‌లో తన చుట్టూ ఉన్న వారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి తనను తప్పించేందుకు కుట్రపన్నుతున్నారు, వారిని త్వరలో గార్డెన్ నుంచి బైటకు పంపేయబోతున్నానని జయ చెప్పారని ఆయన అన్నారు. ఈ సంభాషణ జరిగిన కొద్దిరోజుల్లోనే శశికళ సహా అందరూ గెంటివేయబడ్డారని గుర్తు చేశారు. 2012 మార్చి 30వ తేదీన శశికళ మరలా గార్డెన్‌కు వచ్చి క్షమాపణ ఉత్తరాన్ని ఇచ్చి జయ పంచన చేరిపోయారని తెలిపారు. తనకు ఒక తోడు అవసరం అందుకే శశికళను చేరదీశాను, అంతకు మించి ఆమెకు ఏ పదవి ఇవ్వడం లేదని జయ తనతో అన్నారని ఆయన చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చట్ట విరుద్ధంగా జరిగిందని పార్టీ లీగల్‌సెల్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన హోదాలో తాను ఈ విషయం చెబుతున్నానని మనోజ్ పాండియన్ తెలిపారు. జయతో శశికళకు 32 ఏళ్ల సాన్నిహిత్యం ఉంటే, జయలలితకు 13 ఏళ్ల వయస్సు నుంచి కంటికి రెప్పలా చూసుకునే రాజం అనే మహిళ 50 ఏళ్లుగా ఉన్నారని తెలిపారు. ఈ లెక్కన రాజం అనే మహిళనే సీఎం చేయాలికదాని ఆయన ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే నేతలను, కార్యాకర్తలను శశికళ వంచించి వారి అభీష్టానికి విరుద్ధంగా పదవుల్లోకి ఎగబాకుతున్నారని దుయ్యబట్టారు.