జయ మరణం మిస్టరీనే!
ఆస్పత్రిలో చేరడానికి ముందే ఘటనలు
జయకు విషప్రయోగం చేసేందుకు కుట్ర
అన్నాడీఎంకే సీనియర్ నేతలు వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనుమానాస్పదమేనని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్‌కాక ముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ ఆరోపించారు. ఆ కుటుంబం నన్ను చంపేందుకు కుట్రపన్నుతోందని జయలలిత తనతో చెప్పుకుని బాధపడినట్లుగా వారు తెలిపారు. గుండెపోటు వల్లనే జయ మరణించారు, అమ్మ మరణంలో అనుమానాలకు తావులేదని అపోలో వైద్యులు, లండన్ డాక్టర్ రిచర్డ్ సోమవారం ప్రకటించడాన్ని వారు ఖండించారు. చెన్నైలో మంగళవారం మీడియా సమావేశంలో పీహెచ్ పాండియన్ మాట్లాడుతూ జయలలిత మరణం అన్నాడీఎంకేలో పూడ్చలేని శూన్యానికి దారితీసిందని అన్నారు.
అమ్మ మృతి చెందిన నాటి నుంచి తీవ్ర మనోవేదనతో మౌనంగా కాలంగడుపుతున్నానని, అయితే మూడు రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు తీవ్రంగా కలతచెంది మౌనాన్ని వీడానని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత తన ఇంటిలో స్పృహ కోల్పోయిన స్థితిలో, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, డీహైడ్రేషన్‌కు గురై అపోలోలో అడ్మిట్ అయ్యారని తనకు తెలిసిందని అన్నారు. 22వ తేదీ అర్ధరాత్రి ఎవరితోనే వాగ్వివాదం, బాహాబాహీ సంఘటనల తరువాత జయలలితను కిందికి తోసివేసినట్లు తెలిసిందని చెప్పారు. నన్నుపైకి లేపండి అంటూ జయలలిత కేకలు వేసినా ఎవ్వరూ ఆమెను ఆదుకోకపోవడంతో స్పృహతప్పిపోయారని అన్నారు. ఈ తరుణంలో ఇంటి వద్ద ఏదైనా జరిగితే తమపైకి వస్తుందన్న భయంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు.
ఆసుపత్రిలో జయను చూసేందుకు వెళ్లగా రెండు రకాల దుస్తుల్లో బందోబస్తులో ఉన్న వారు తనను అడ్డుకున్నారని, జయ క్షేమంగా ఉన్నారు, రెండురోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కూడా తెలిపారని అన్నారు. ఎన్ని రోజులైనా అదే సమాధానం చెప్పుతూ వాస్తవాలను కప్పిపుచ్చారని ఆయన తెలిపారు. జయకు గుండెపోటు వచ్చిన సంగతి తెలుసుకుని డిసెంబరు 5వ తేదీన తాను ఆసుపత్రికి వెళ్లినపుడు ప్రత్యేకంగా సిద్ధం చేసిన సాధారణ వార్డులో జయ ఉన్నారని అన్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డి వచ్చి ‘ సారీ ఏంచేస్తాం, భగవంతుని ప్రార్థిద్దాం’ అని వ్యాఖ్యానించినట్లుగా ఆయన తెలిపారు.
అదే సమయంలో శశికళ జేమ్స్ బాండ్‌లు వేసుకునే కోటును ధరించి ఐసీయూ నుంచి బయటకు రాగా, వెనుకనే ఆమె బంధువులు వచ్చారని తెలిపారు. వారి ముఖంలో జయ చనిపోయిన ఆవేదన లేదు, కన్నీళ్లు పెట్టలేదని చెప్పారు. జయ మరణించలేదు, మెదడు పనిచేస్తోందని నమ్మించి, మరికొద్ది సేపట్లో జయ మరణించినట్లుగా ప్రకటించారని అన్నారు. 75 రోజులుగా జయను చూడలేదు, అనుమతించాల్సిందిగా కోరినా నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజాజీ హాల్‌లో జయ భౌతికకాయం చుట్టూ ఉన్న శశికళ బంధువర్గాన్ని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కుట్రపన్నుతున్నారనే ఆరోపణలపై పోయెస్‌గార్డెన్ నుంచి 2012లో గెంటివేయబడిన వారంతా జయ పార్థివదేహం చుట్టూ ఉండడం కలచి వేసిందని తెలిపారు.
తనకు పార్టీలో ఎలాంటి పదవి వద్దని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తరువాతనే శశికళకు జయ సభ్యత్వం ఇచ్చి దగ్గరపెట్టుకున్నారని ఆయన తెలిపారు. అయితే జయ చనిపోయిన 20 రోజులకే ప్రధాన కార్యదర్శి పదవిని పొంది నేడు సీఎం పదవి కోసం సిద్ధమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఆమె ఏమాత్రం అర్హురాలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి పోయెస్‌గార్డెన్‌లో ఏమి జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు, ఎంత మంది ఉన్నారో విచారణ జరపాలని, అలాగే ఆరోజు చోటు చేసుకున్న సంఘటనలపై కూడా విచారణ జరిపితే జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ బైటపడుతుందని ఆయన చెప్పారు.
శశికళ కుటుంబంపై జయకు సందేహం: మనోజ్ పాండియన్
శశికళ, ఆమె కుటుంబీకులు తనకు విషం ఇచ్చి చంపుతారేమోనని జయలలిత తరచూ అనుమానం వ్యక్తం చేసేవారని అన్నాడీఎంకే మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ తెలిపారు. ఈ అనుమానాన్ని స్వయంగా జయలలితే తన వద్ద వ్యక్తం చేశారని అన్నారు. అంతేగాక ఎటువంటి పరిస్థితుల్లో శశికళను రాజకీయాల్లోకి రానీయనని కూడా జయలలిత తనతో అన్నారని చెప్పారు. 2011 డిసెంబర్ 19వ తేదీన జయలలిత తనను సచివాలయానికి పిలిపించుకుని 45 నిమిషాలు తనలోని బాధను పంచుకున్నారని తెలిపారు. పోయెస్‌గార్డెన్‌లో తన చుట్టూ ఉన్న వారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి తనను తప్పించేందుకు కుట్రపన్నుతున్నారు, వారిని త్వరలో గార్డెన్ నుంచి బైటకు పంపేయబోతున్నానని జయ చెప్పారని ఆయన అన్నారు. ఈ సంభాషణ జరిగిన కొద్దిరోజుల్లోనే శశికళ సహా అందరూ గెంటివేయబడ్డారని గుర్తు చేశారు. 2012 మార్చి 30వ తేదీన శశికళ మరలా గార్డెన్‌కు వచ్చి క్షమాపణ ఉత్తరాన్ని ఇచ్చి జయ పంచన చేరిపోయారని తెలిపారు.
తనకు ఒక తోడు అవసరం అందుకే శశికళను చేరదీశాను, అంతకు మించి ఆమెకు ఏ పదవి ఇవ్వడం లేదని జయ తనతో అన్నారని ఆయన చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చట్ట విరుద్ధంగా జరిగిందని పార్టీ లీగల్‌సెల్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన హోదాలో తాను ఈ విషయం చెబుతున్నానని మనోజ్ పాండియన్ తెలిపారు. జయతో శశికళకు 32 ఏళ్ల సాన్నిహిత్యం ఉంటే, జయలలితకు 13 ఏళ్ల వయస్సు నుంచి కంటికి రెప్పలా చూసుకునే రాజం అనే మహిళ 50 ఏళ్లుగా ఉన్నారని తెలిపారు. ఈ లెక్కన రాజం అనే మహిళనే సీఎం చేయాలికదాని ఆయన ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే నేతలను, కార్యాకర్తలను శశికళ వంచించి వారి అభీష్టానికి విరుద్ధంగా పదవుల్లోకి ఎగబాకుతున్నారని దుయ్యబట్టారు.