రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ స్క్రీన్ మీదికి వస్తున్నారు అభిషేక్‌బచ్చన్!ఈ నెలలో ‘మన్‌మర్జియా’ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా.. అభిషేక్‌ని పలకరించింది సాక్షి. ఐశ్వర్యతో కలిసినటిస్తున్నాననీ..‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించాలని ఉందనీ..ఆడియన్స్ వద్దనే వరకు నటిస్తాననీ..నాన్న స్టార్‌డమ్‌ను ఎప్పటికీ అందుకోలేనని చాలా విషయాలు చెప్పారు అభిషేక్!
మీ లాస్ట్ సినిమా (‘హౌస్‌ఫుల్ 3’) 2016లో రిలీజైంది. రెండేళ్లకు ‘మన్‌మర్జియా’తో వస్తున్నారు. ఎందుకీ గ్యాప్?
అభిషేక్: గ్యాప్ కాదు.. బ్రేక్. నేనే కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. నేను ఓన్ చేసుకున్న నా ఫుట్‌బాల్ టీమ్‌కి సంబంధించిన మ్యాచ్‌లు, కబడ్డీ టీమ్ పనులతో కొంచెం బిజీ అయ్యాను. ఈ రెండు సంవత్సరాలు సినిమాల్లో కనిపించలేదు కానీ ఖాళీగా అయితే లేను (నవ్వుతూ). అయితే సినిమాని మిస్సయిన ఫీలింగ్ కలిగింది. ఎవరైనా మంచి కథతో వస్తే సినిమా చేయాలనుకున్నాను. ఆనంద్ ఓ కథ తీసుకువచ్చాడు. నచ్చింది.
ఆనంద్‌గారు చెప్పిన కథలో అంతగా నచ్చిన పాయింట్ ఏంటి?
ఈ ఏడాది జనవరిలో ఆనంద్ ఎల్. రాయ్ ఈ స్టోరీ వినిపించారు. వింటున్నంతసేపూ చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇప్పటి వరకూ చూడని కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా అని చెప్పను కానీ లవ్‌స్టోరీలో ఓ కొత్త టేక్‌తో సాగుతుంది. కొత్తగా చెప్పడానికి ట్రై చేశాం.
ఈ చిత్రదర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్?
‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘బాంబే టాకీస్’ వంటి చిత్రాలు తీసిన అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఫస్ట్ లవ్‌స్టోరీ ఇది. అసలాయన ఎప్పుడూ గన్స్, గ్యాంగ్‌స్టర్ అంటారు మరి లవ్ బేస్డ్ మూవీ ఎందుకు తీయాలనిపించిందో? లవ్‌స్టోరీ అంటే కచ్చితంగా కామన్ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్ పాయింటే. అది కొత్తగా ఉంటే బాగా చూస్తారు. ఈ సినిమా కోసం విక్కీ కౌశల్, తాప్సీలతో కలసి పని చేయడం లవ్లీ ఎక్స్‌పీరియన్స్.
యాక్టర్‌గా మీరెలాంటి సినిమాలు ఇష్టపడతారు? లవ్‌స్టోరీలా? యాక్షన్ సినిమాలా?
బేసిక్‌గా నేను యాక్షన్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. నేను చేసిన సినిమాల లిస్ట్ తీస్తే ఎక్కువగా యాక్షన్ మూవీసే ఉంటాయి.
ఒక యాక్షన్ సినిమాల లవర్‌గా మీరు చేసిన యాక్షన్ మూవీస్ మీరు అనుకున్న స్థాయిలో సంతృప్తినిచ్చాయా?
ఒక యాక్టర్‌కి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదని నా పర్సనల్ ఫీలింగ్. షాట్ ఫినిష్ అవ్వగానే డైరెక్టర్ ఓకే అన్నా కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా బాగా చేయాలి అనే తపన లోపల ఉంటుంది. అది లేకపోతే కచ్చితంగా యాక్టర్‌గా మనం ఇంకా పైకి ఎదగలేం అని నా అభిప్రాయం.
మీ నాన్నగారికి (అమితాబ్ బచ్చన్) 75 ఏళ్లు. ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్. ఎలా అనిపిస్తోంది?
నాన్నని చూస్తే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. పైగా సినిమా సినిమాకీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా తనను తాను ‘రీ–ఇన్వెంట్’ చేసు కుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.
మీ నాన్నతో మీరెలా ఉంటారు? ఇద్దరూ సినిమాల గురించి మాట్లాడుకుంటారా?
నాన్న నాకు మంచి ఫ్రెండ్. ఫాదర్ అండ్ సన్‌లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటాం. మేం చేసే సినిమాల గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఇంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఒకవేళ నేను ఆయన సలహా తీసుకున్నాననుకోండి అదెలా వర్కవుట్ అవుతుంది? కెమెరా ముందు నేనే యాక్ట్ చేయాలి కదా. అందుకే అవసరమైతే తప్ప టిప్స్ తీసుకోను.
అమ్మ (జయా బచ్చన్)తో అనుబంధం గురించి?
మేం ఫ్రెండ్స్‌లా ఉండం. తల్లీ కొడుకుల్లానే ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొడుకు ఏమీ చెప్పకపోయినా తల్లి అర్థం చేసుకుంటుంది. తల్లి ఏమీ చెప్పకపోయినా కొడుకు అర్థం చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిదే.
తెలుగు చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో అమితాబ్‌గారు నటిస్తున్నారు. వేరే భాష సినిమా కాబట్టి మీతో ఏమైనా డిస్కస్ చేశారా?
అస్సలు లేదు. నాన్నకి నచ్చిన సినిమాలు ఆయన చేసేస్తారు. నాకు నచ్చినవి నేను చేస్తాను. అయితే మాటల సందర్భంలో షూటింగ్ ఎలా జరుగుతోంది? అనే విషయాలు మాట్లాడుకుంటుంటాం.
మీరు తెలుగు సినిమాలు చూస్తారా?
ఇంతకుముందు బాగా చూసేవాణ్ని. ఇప్పుడు షూటింగ్స్‌తో బిజీ. షెడ్యూల్స్ కుదరక కొంచెం తగ్గించాను. కానీ ఎప్పటికప్పుడు ఏ భాషలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూస్తుంటాను.
మీరు చూసిన తెలుగు సినిమాల్లో ఏ సినిమా హిందీ రీమేక్‌కి అవకాశం వస్తే చేయాలనుకుంటున్నారు?
‘ఛత్రపతి’ సినిమా. అందులో యాక్షన్‌కి యాక్షన్, సాంగ్స్, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు కరెక్ట్ మోతాదులో ఉంటాయి. పర్ఫెక్ట్ రీమేక్ మెటీరియల్.
నెక్ట్స్ మీ సతీమణి ఐశ్వర్యా రాయ్‌తో ‘గులాబ్ జామున్’లో కలిసి యాక్ట్ చేయనున్నారు. దాని గురించి..
టైటిల్‌లాగే సినిమా కూడా చాలా స్వీట్‌గా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం. ఐష్ రీ ఎంట్రీ తర్వాత మేం ఇద్దరం కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కరెక్ట్ స్టోరీ ఇదే అనిపించింది. అందుకే ఒప్పుకున్నాం.
మీ పాప ఆరాధ్య గురించి?
బావుంది. చక్కగా ఆడుకుంటుంది.
స్టార్ కిడ్ కాబట్టి మీడియా అటెన్షన్ తన మీద ఉండటం మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా?
అది తప్పదు. అయితే ఆరాధ్య ఓ మామూలు అమ్మాయిలా పెరగాలని మాకు ఉంటుంది. ఇప్పటినుంచే ‘ఎక్స్‌ట్రా అటెన్షన్’ అంటే స్వేచ్ఛ పోతుంది. తల్లిదండ్రులుగా ఆ విషయం మాకు ఇబ్బందిగానే ఉంటుంది.
మీరు కూడా స్టార్ కిడ్ కదా. మీ చైల్డ్ హుడ్ ఎలా ఉండేది?
నా చిన్నప్పుడు ఇంత మీడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చేసింది. స్టార్ కిడ్స్ ప్రతి మూమెంట్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేçస్తూనే ఉన్నారు. పిల్లలకి ఇవేమీ అర్థం కావు. కానీ వాళ్లను కూడా మామూలు పిల్లలలాగే వదిలేస్తే బావుంటుంది కదా అని నా ఉద్దేశం.
స్కూల్‌లో మీకు ఎలా ఉండేది. సూపర్ స్టార్ అమితాబ్ అబ్బాయి అని ట్రీట్ చేసేవారా?
నా స్కూలింగ్ ఎక్కువ శాతం బోర్డింగ్ స్కూల్‌లో జరిగింది. అక్కడ ఇవేమీ ఉండవు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. స్టార్ కిడ్స్, కామన్ కిడ్స్ అని స్పెషల్ ట్రీట్‌మెంట్ ఏమీ ఉండదు. అందరిలా టైమ్ ప్రకారం నిద్ర లేవడం, పనులు చేసుకోవడం, స్కూల్‌కి వెళ్లడం. అంతే.
బోర్డింగ్ స్కూల్‌లో ఉండే పిల్లలు స్ట్రాంగ్‌గా తయారవుతారనుకుంటున్నారా?
స్ట్రాంగ్.. వీక్ అని కాదు. మనల్ని మనం చూసుకోగలం. ప్రతి చిన్న విషయంకూడా అమ్మా నాన్న అని పరిగెత్తాల్సిన పని లేదు. పిల్లలు తమ పనులు తాము సొంతంగా చేసుకునేలా పెంచడం కరెక్ట్ అని నా ఫీలింగ్. బోర్డింగ్ స్కూల్‌కి వెళితే ఎలానూ అలవాటు అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మానాన్నలు గారం చేస్తారు కాబట్టి వాళ్ల మీద ఆధారపడతాం. డిపెండ్ అవ్వడం తప్పనడం లేదు.. మనల్ని మనం మ్యానేజ్ చేసుకునే స్కిల్ అయితే ఉండాలి. మే బీ ఇలా అనుకునే నన్ను అమ్మానాన్న బోర్డింగ్ స్కూల్‌కి పంపించారేమో.
అది సరే.. సోలో హీరోగా సినిమాలు తగ్గించేశారు? కారణం?
సోలో హీరోగా సినిమాలు చేయాలి, మల్టీస్టారర్ మూవీస్ చేయాలి అని పర్టిక్యులర్‌గా ఏమీ పెట్టుకోను. ఏ స్క్రిప్ట్ నన్ను ఎగై్జట్ చేస్తే అందులో యాక్ట్ చేయడమే. నెక్ట్స్ నా వైఫ్ ఐశ్వర్యతో చేస్తుంది సోలో హీరోగానే.
మల్టీస్టారర్ మూవీస్ మీకు కంఫర్ట్‌గా అనిపిస్తాయా?
నాకు ఏ సమస్యా లేదు. అందరితో కలిసిపోతాను. వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయితే మంచి ఫ్రెండ్స్‌గా మారిపోతాం. లేకపోతే మా పని మేం చేసుకుంటాం. మల్టీస్టారర్స్ కొన్నిసార్లు ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ‘మన్‌మర్జియా’లో నేను, విక్కీ కౌశల్ సినిమాలో గొడవపడ్డా కూడా బయట మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విక్కీ వాళ్ల డాడీ (స్ట్టంట్ కో–ఆర్డినేటర్ శ్యామ్ కౌశల్), మా డాడీ కలిసి సినిమాలకు పని చేశారు. ఇప్పుడు నేను, విక్కీ కలిసి చేస్తుంటే ఆ ఫ్రెండ్‌షిప్ నెక్ట్స్ జనరేషన్‌కు తీసుకు వెళ్తున్నట్టుంది.
ఫైనల్లీ.. మీ నాన్నగారి స్టార్ స్టేటస్ గురించి తెలియనిది కాదు. ఒక కొడుకుగా ఆ స్థాయిని అందుకోవాలనుకుంటారా?
అస్సలు ఆ ఆలోచన లేదు. మా నాన్నగారి సూపర్ స్టార్‌డమ్‌ని అందుకోవాలనే ఆరాటం లేదు. నాకు తెలిసి ఎవరూ ఆలోచించరు కూడా. ఎందుకంటే ఆ స్టార్‌డమ్ ఎవరూ సాధించలేనిది. అమితాబ్ లాంటివాళ్లు ఒక్కరే ఉంటారు. అది యాక్సెప్ట్ చేసి, మనం ముందుకు వెళ్లడమే.
ఇప్పటికి మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్లు. భవిష్యత్తులోనూ ఇంతే బిజీగా ఉంటారనే గ్యారంటీ లేదు. ఏ ఆర్టిస్ట్‌కైనా అది బాధగానే ఉంటుంది కదా?
మిగతా వాళ్ల గురించి నేను చెప్పలేను కానీ నా వరకు నేను పాజిటివ్ పర్సన్. ఓ 18 ఏళ్లు కంటిన్యూస్‌గా పని చేయగలిగాం అని చెప్పుకునే పొజిషన్‌లో ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి దిగులు ఎందుకు? నేను ఎవరి కొడుకు? అనేది ఎవరికీ.. ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యం కాదు. నేనిక్కడ ఎన్నేళ్లు ఉండాలన్నది వాళ్లు డిసైడ్ చేస్తారు. ఆడియన్స్ ఇష్టపడినంత కాలం నేను సినిమాలు చేస్తాను. లేదంటే హ్యాపీగా తప్పుకుంటాను. లైఫ్‌లో ఏది వస్తే అది తీసుకోవడం అలవాటు చేసుకుంటే ‘నెగటివ్’ అనేది ఉండదు. అంతా పాజిటివే. అయితే ఒక్క విషయం. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే ఫీల్డ్‌లో ఉన్నందుకు ఆనందపడుతున్నా.
– డి.జి.భవాని
Comments
Please login to add a commentAdd a comment