నేను నేనే | special stort to sridevi | Sakshi
Sakshi News home page

నేను నేనే

Published Thu, Mar 1 2018 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

special stort to sridevi - Sakshi

శ్రీదేవి తరచూ మీడియాతో మాట్లాడేవారు కాదు.. కానీ మాట్లాడినప్పుడల్లా పదే పదే మాట్లాడించాలనిపిస్తుంది. చదివేవాళ్లకూ పదే పదే చదవాలనిపిస్తుంది. అలాంటి కొన్ని ‘సిరిమల్లె పువ్వులు’ మీకోసం...

► ‘రియల్‌ శ్రీదేవి’ ఎలా ఉంటారు?
నేను అందరిలానే సాధారణ మనిషిని. నేనంత ఇంట్రస్టింగ్‌ కూడా కాదు. ఇంకో తల్లిదండ్రుల బిడ్డను. ‘రియల్‌ శ్రీదేవి’ అంటే ఏంటో తెలియాలంటే నా ఇంటికి వచ్చి నన్ను చూడాలి. నాకు చాలా సిగ్గు. అంత త్వరగా ఎవరితోనూ కలవలేను. మాట్లాడలేను. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నాకు అన్‌ ఈజీగా ఉంటుంది. సినిమాల్లో మాట్లాడేలా గలగలా మాట్లాడలేను. తక్కువగా మాట్లాడతా.

► ‘స్టార్‌డమ్‌’కి చేరుకున్నాక మీ ఫీలింగ్‌?
చిన్నప్పటి నుంచి నాకేదైనా ఇష్టం అంటే అది నా దగ్గరకు వచ్చేసేది. ఫర్‌ ఎగ్జాంపుల్‌ నాకేదైనా చీర నచ్చితే దానికోసం నేను షాప్‌కి వెళ్లక్కర్లేదు. అదే నా దగ్గరకు వచ్చేది. కోరుకున్నది మన దగ్గరికే వచ్చినప్పుడు జీవితం గురించి తెలుసుకునే చాన్స్‌ ఉండదు. ఆ విధంగా ‘స్టార్‌డమ్‌’ నాకు జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు.

► నటిగా మీకు నచ్చని విషయం ఏంటి?
మీరు ఫలానా సినిమాలో అందంగా ఉన్నారని అభినందిస్తే నాకు నచ్చదు. ఆ కాంప్లిమెంట్‌కి రియాక్ట్‌ అవ్వను. అదే ‘మీరు ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్‌ చేశారు’ అంటే అప్పుడు చాలా ఆనందపడతా. ప్రౌడ్‌గా ఫీల్‌ అవుతాను.

► మీలా అందంగా, స్లిమ్‌గా కనిపించాలంటే ఏం చేయాలి?
అందంగా ఉండటమంటే డైట్‌ ఫాలో అవ్వడం, జిమ్‌కు వెళ్లడం కాదు. మానసికంగా సంతోషంగా ఉండటం. మన స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ ఎలా ఉందనేది మన లుక్స్‌ నిర్దేశిస్తాయి. లోపల సంతోషంగా లేనప్పుడు డైట్‌ ఫాలో అయ్యి, ఎంత జిమ్‌ చేసినా ఉపయోగం ఉండదు.

► వేరే హీరోయిన్స్‌తో పోటీ?
పోటీ అనేది సమఉజ్జీల మధ్య ఉంటుంది. ప్రస్తుతానికి నా సమఉజ్జీ శ్రీదేవీయే. నాకు నేనే పోటీ.

► మీ సినిమాల గురించి జాన్వీ, ఖుషీలు ఏమంటారు?
నేను నటించిన పాత సినిమాలను జాన్వీ, ఖుషీ అంతగా చూడలేదు. కానీ ఎప్పుడైనా టీవీల్లో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూస్తారు. ఆ సినిమాల్లో నేను వేసుకున్న డ్రెస్‌లను అబ్జర్వ్‌ చేస్తారు. నేను కొన్ని సినిమాలకు ట్రెండీ డ్రెస్‌లను వాడాను. అవి బాగున్నాయంటారు. బాగా యాక్ట్‌ చేశావని కాంప్లిమెంట్స్‌ ఇస్తారు.

► సినిమాలంటే మీకు చాలా ఇష్టమా?
నాలుగేళ్ల వయసు నుంచే నటించడం స్టార్ట్‌ చేశాను. అందరి అమ్మాయిల్లా నేను పెరగలేదు. నా చిన్నతనంలో స్టూడియోస్‌లోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేదాన్ని. ఒకవేళ స్టూడియో వాతావరణాన్ని ఇష్టపడకపోయి ఉంటే ఎప్పుడో సినిమాలు వదిలేసేదాన్నేమో. ఒక సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎంత కష్టాన్నయినా ఇష్టంగా భావిస్తాను.

► మీ భర్త బోనీకపూర్‌ మిమ్మల్ని ఆటపట్టిస్తారా?
నేను క్రమశిక్షణగా ఉంటాను. బోనీజీ ‘నువ్వేమైనా సాధువులా జీవిస్తున్నావా?’ అని ఆటపట్టిస్తారు. కానీ నా ఇష్టాలను ఆయన ఎప్పుడూ కాదనలేదు.

► యంగర్‌ జనరేషన్‌కి మీరిచ్చే సలహా?
సక్సెస్‌నే కాదు ఫెయిల్యూర్‌నూ తట్టుకోగల మైండ్‌సెట్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవాలి. లైఫ్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కృతజ్ఞతాభావం, మానవత్వం ఉండాలి.

మాట్లాడమని బోనీజీ బతిమాలేవారు
మీరు స్వతహాగా మితభాషి కదా. ఇంట్లో కూడా అంతేనా?
నేను తక్కువగానే మాట్లాడతాను. కానీ నాకు క్లోజ్‌గా ఉన్నవారితో బాగానే మాట్లాడతా. వర్క్‌ చేసే దగ్గర వర్క్‌ గురించే మాట్లాడటం ముఖ్యమని భావిస్తా. చెబితే నమ్మరు కానీ కాస్త ఎక్కువగా మాట్లాడమని బోనీజీ మొదట్లో బతిమాలేవారు. ఆ తర్వాత మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. మేం ఇద్దరం ఉన్నప్పుడు నేనే ఎక్కువగా మాట్లాడతా.

                                      భర్తతో...
పిల్లలు నన్ను వదిలి ఉండలేరు
► మీ పిల్లలు, మీరు అమ్మాకూతుళ్లలా కాకుండా అక్కచెల్లెళ్లలా ఉంటారు...
మేం సిస్టర్స్‌లానే బిహేవ్‌ చేస్తాం. నేనెక్కడికైనా వెళితే చాలు జాన్వీ పదే పదే ఫోన్లు చేస్తుంటుంది. ఖుషీ కూడా అంతే. నన్ను వదిలి ఉండలేరు. వాళ్లు నాతో అలా క్లోజ్‌గా ఉండటం, నా మీద ఆధారపడటం, చిన్న చిన్న విషయాల్లో నన్ను డిస్ట్రబ్‌ చేయడం నాకెంతో ఫన్నీగా, హ్యాపీగా ఉంటుంది.

                                          పిల్లలతో...
► జాన్వీ సినిమాలో నటిస్తోంది కదా.. తనకు మీరిచ్చిన సలహా?
మైండ్‌తో కాదు... హార్ట్‌తో వర్క్‌ చేయమని జాన్వీకి చెప్పాను.
‘నో పెయిన్‌ నో గెయిన్‌’ అని కూడా చెప్పాను.

అమ్మా... నీ విజయాలకు నేనే సాక్ష్యం
డియర్‌ మామ్‌.. నీ కీర్తి ప్రతిష్టలు, అంకితభావం, నిజాయితీ, స్ఫూర్తి గురించి వింటూ పెరుగుతున్నాను. నువ్వు సాధించిన విజయాలకు నేనే సాక్ష్యంగా ఉండటం నాకు ఆనందంగా ఉంది. జీవితంలో అన్నీ సాధించావు. నువ్వు సాధించిన ఈ ఘనత నన్ను ఈ ప్రపంచంలోనే గర్వపడే కూతుర్ని చేసింది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను...
– నీ కూతురు జాన్వీ    
 ఓ సందర్భంలో శ్రీదేవికి ఓపెన్‌ లెటర్‌ రాయమని ఓ పత్రిక ఆమె పెద్ద కుమార్తె జాన్వీని కోరగా ఆమె పై విధంగా రాశారట. తల్లంటే జాన్వీకి ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో అర్థమవుతోంది కదూ.

మరణం తర్వాత...
మీరు బాధపడే విషయం               :    మరణం తర్వాత జీవితం ఉండదని
మీ విలువైన ఆస్తి                        :    నా ఫ్యామిలీ
మీకు బోర్‌ కొట్టించేది                    :    షూటింగ్‌లో ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్‌కు పరిగెత్తడం
మీ సెక్స్‌ అపీల్‌                           :     నా జీన్స్‌ (జన్యువులు)
మీ బలం                                   :    ఏది జరిగితే దాన్ని ఆమోదించడం
మీకు నచ్చే మీ ఫేవరెట్‌ క్వాలిటీ      :    నా ఎమోషన్స్‌
మిమ్మల్ని చిరాకు పెట్టించేది          :    రీ–మేక్‌ మూవీస్‌లో రీ–టేక్స్‌ తీసుకోవడం
బర్త్‌డే అంటే                               :     ఎడ్జ్‌కు ఇంకొంచెం దగ్గరకి వచ్చేశాం అని గుర్తు చేసే రోజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement