ఆవకాయ్‌... అందరికీ కావాలోయ్‌ | special story to remake movies | Sakshi
Sakshi News home page

ఆవకాయ్‌... అందరికీ కావాలోయ్‌

Published Wed, Mar 28 2018 12:52 AM | Last Updated on Wed, Mar 28 2018 12:52 AM

special story to remake movies - Sakshi

కావాలోయ్‌.. కావాలోయ్‌... మాకూ ఆవకాయ్‌ కావాలోయ్‌...
అంటున్నారు మన పక్క భాషలవాళ్లు... తెలుగోడి ఆవకాయ్‌కి అంత క్రేజ్‌ మరి.
తెలుగు సినిమాలకూ అంతే క్రేజ్‌ ఉంది.
అదిరేటి మన ఆవకాయ్‌లాంటి సినిమాలను రీమేక్‌ చేస్తున్నారు.
రైట్స్‌ కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సీన్‌ రివర్స్‌.
మనం పక్క సినిమాలను ఎక్కువ రీమేక్‌ చేసేవాళ్లం.
ఇప్పుడు మన సినిమాలు అక్కడికెళుతున్నాయి.
ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా ఇతర భాషల్లో రీమేక్‌ అవుతున్నాయ్‌.

బాహుబలి.. వీర్‌ యోధ మహాబలి 
‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్తు భారతదేశాన్ని ఏడాదిన్నరకు పైగా వెంటాడింది. 2015 జూలై 15న ‘బాహుబలి’ విడుదలైన తొలి ఆట నుంచి సినిమా చూసిన అందరిలోనూ ఇదే ప్రశ్న. ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’ అంటూ గూగుల్‌లోనూ రికార్డు స్థాయిలో వెతికారంటే ఎంత ఆసక్తి నెలకొందో తెలిసిందే. 2017 ఏప్రిల్‌ 28న ‘బాహుబలి 2’ తొలి షో పడగానే ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ‘తెలుగు సినిమా స్టామినా ఇది’ అని ప్రపంచానికి చాటి చెప్పింది ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్‌ తమ నటన విశ్వరూపాన్ని చూపారు. దర్శకుడిగా రాజమౌళి ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయారు. కావాలంటే ఈ సినిమాని డబ్, చేసి విడుదల చేసుకోవచ్చు కానీ రీమేక్‌ చేయడం సాహసమే అని మన దేశంలో ఇతర భాషలవాళ్లు అనుకున్నారు. అయితే  భోజ్‌పురిలో ‘వీరయోధ మహాబలి’ పేరుతో తెరకెక్కుతోన్న ఓ సినిమా ‘బాహుబలి’కి రీమేక్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. దినేష్‌లాల్‌ యాదవ్, ఆమ్రపాలి దుబే, అయాజ్‌ ఖాన్, సుశీల్‌ సింగ్, దీపక్‌ భాటియా ముఖ్య తారలుగా ఇక్భాల్‌ బి„Š  దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్‌ సమర్పణలో ఎమ్‌. రమేష్‌ వ్యాస్‌ నిర్మిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న ‘వీరయోధ మహాబలి’ ఫొటోలు, వీడియోలు ‘బాహుబలి’ని పోలి ఉండటం విశేషం. సో.. ఇది ‘ఫ్రీమేక్‌’ అనుకోవచ్చేమో.

ఒకేసారి రెండు భాషల్లో టెంపర్‌
‘నా పేరు దయ.. నాకు లేనిదే అది.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌’.. ‘చేతనైతే చెయ్యి.. లేకపోతే అన్నీ మూసుకుని కూర్చో. ఊరికే అరవకు’.. వంటి డైలాగ్స్‌తో ఆకట్టుకుంది పూరి జగన్నాథ్‌ ‘టెంపర్‌’. ఎన్టీఆర్‌లోని మరో కోణాన్ని చూపించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ‘సింబా’ పేరుతో హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్, కాజల్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ కనిపించనున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 28న  విడుదల కానుంది. మరోవైపు తమిళంలోనూ ‘టెంపర్‌’ రీమేక్‌ అవుతోంది. విశాల్‌ హీరోగా వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా  నటిస్తున్నారు. మన ‘టెంపర్‌’ ఒకేసారి రెండు భాషల్లో రీమేక్‌ అవ్వడం విశేషం.

ఇక్కడ లవ్‌.. అక్కడ కాదల్‌
‘చూశారా నా బ్యాడ్‌లక్‌ ఎలా ఉందో. నాకు నచ్చినంత అందంగా.. నీరసం వచ్చేంత  ఉత్సాహంగా.. కోపం వచ్చేంత క్యూట్‌గా.. నా బ్యాడ్‌లక్‌ని రిసీవ్‌ చేసుకోవటానికి స్వయంగా మా నాన్నే స్టేషన్‌కి వెళ్లారు’ అంటూ తన మరదలు మహా లక్ష్మిని (తమన్నా) పరిచయం చేస్తాడు బాలు (నాగచైతన్య). బావామరదళ్లుగా ౖచైతూ, తమన్నా అలక, ప్రేమ, కుటుంబ పెద్దల జోక్యంతో ‘100% లవ్‌’ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘100% కాదల్‌’ పేరుతో చంద్రమౌళి దర్శకత్వంలో తమిళంలో రీమేక్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్‌ నిర్మిస్తుండటం విశేషం. ‘కుమారి 21ఎఫ్‌’, ‘దర్శకుడు’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు సుక్కు. నాగచైతన్య పాత్రలో జి.వి.ప్రకాష్, తమన్నా క్యారెక్టర్‌లో ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ షాలినీ పాండే నటిస్తున్నారు. ఈ వేసవిలో ఈ కాదల్‌ (ప్రేమ) తెరమీదకు రానుంది.

అర్జున్‌ రెడ్డి.. వర్మ అయ్యాడు
‘మొదటి సంవత్సరంలో ఒకమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకిష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతావాళ్లంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి. తరగతులు పెరిగేకొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి. మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రానివాళ్లకి, మిగతా తరగతుల వాళ్లకు చెప్పండి. ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అంటూ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో జూనియర్స్‌కి వార్నింగ్‌ ఇస్తాడు అర్జున్‌రెడ్డి (విజయ్‌ దేవరకొండ). ‘పెళ్ళిచూపులు’ వంటి ఫ్యామిలీ మూవీలో నటించిన విజయ్‌ ‘అర్జున్‌రెడ్డి’ వంటి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా యూత్‌కి తెగ నచ్చేయడంతో సూపర్‌హిట్‌గా నిలిచింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో విజయ్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయారు. కథానాయిక షాలినీ పాండేకీ అదే స్థాయిలో పేరొచ్చింది. ఈ సినిమాని తమిళ్‌లో ‘వర్మ’ పేరుతో విలక్షణ దర్శకుడు బాలా రీమేక్‌ చేస్తున్నారు. నటుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమా రీమేక్‌ కానుంది. తొలుత రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వరుణ్‌ ధావన్‌ పేరు.. ఇప్పుడేమో అర్జున్‌ కపూర్‌ పేరు వినిపిస్తోంది. అర్జున్‌ కపూర్‌ హీరోగా మురద్‌ ఖేతానీ ఈ సినిమా తెరకెక్కించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. 

క్షణం.. బాఘీ 2 
రిషి (అడివి శేష్‌) ఎన్‌ఆర్‌ఐ. మెడిసిన్‌ చదివేందుకు ఇండియా వెళ్లినప్పుడు సహ విద్యార్థి శ్వేతతో (అదా శర్మ) ప్రేమలో పడతాడు. తండ్రి కోసం శ్వేత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. శ్వేత నుంచి ఫోన్‌ రావడంతో ఇండియాకి వచ్చిన రిషికి శ్వేత కుమార్తె రియా కిడ్నాప్‌ అయిన విషయం తెలుస్తుంది. కిడ్నాప్‌ చేసిందెవరు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనే అంశాలతో.. చక్కటి స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని ‘బాఘీ–2’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. టైగర్‌ ష్రాఫ్, దిశాపాట్నీ జంటగా అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఈనెల 30న విడుదల చేస్తున్నారు.  

సీతారామ కల్యాణ చూద్దాం
శివ (నాగచైతన్య), భ్రమరాంబ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) ఓ పెళ్లిలో కలుసుకుంటారు. వారిమధ్య పరిచయం ఏర్పడుతుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. ప్రేమ విషయం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందోనని భయపడుతుంటాడు శివ. తన కోసం రాజకుమారుడు వస్తాడనే భ్రమల్లో ఉన్న భ్రమరాంబ.. శివ ప్రేమను అర్థం చేసుకోదు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న శివ, భ్రమరాంబ తండ్రులు తర్వాత విడిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరి ప్రేమకథ ఏ మలుపు తీసుకుంది? వారి తండ్రులు కలిశారా? లేదా? అనే చక్కటి కుటుంబ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రారండోయ్‌ వేడుకచూద్దాం’. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ హిట్‌ సినిమాని కన్నడంలో ‘సీతారామ కల్యాణ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ‘జాగ్వార్‌’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నిఖిల్‌ హీరోగా, రచిత రామ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్‌ కానుంది. 

భలే భలే గజినీకాంత్‌ 
లక్కీ (నాని)కి చిన్నప్పటి నుంచి మతిమరుపు వ్యాధి ఉంటుంది. కానీ, ఆ విషయం ఎదుటి వాళ్లకు తెలియనివ్వకుండా మేనేజ్‌ చేస్తుంటాడు. ఇలాంటి టైమ్‌లో నందనతో (లావణ్య త్రిపాఠి) పరిచయం ఏర్పడుతుంది లక్కీకి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన మతిమరుపు గురించి నందనకు తెలియకుండా లక్కీ జాగ్రత్త పడుతుంటాడు. అయితే లక్కీకి మతిమరుపు ఉన్న విషయం నందన తండ్రి రంగారావుకు (మురళీ శర్మ) తెలుస్తుంది. రంగారావు పెట్టిన పరీక్షను లక్కీ ఎలా ఎదుర్కొన్నాడన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’. మనిషిలోని లోపాన్ని కూడా కథాంశంగా తీసుకుని సూపర్‌ హిట్‌ సాధించొచ్చని నిరూపించారు దర్శకుడు మారుతి. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఆర్య హీరోగా తమిళంలో ‘గజినీకాంత్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. సంతోష్‌ పి.జయకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అఖిల్‌’ బ్యూటీ సాయేషా ఇందులో కథానాయిక. ఇటు సూర్య హిట్‌ మూవీ ‘గజనీ’, అటు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గుర్తొచ్చేలా ‘గజినీకాంత్‌’ టైటిల్‌ పెట్టడం విశేషం. ఈ సినిమా ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. 
- డేరంగుల జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement