పట్టు వదలని విక్రమార్కుడు రోజూలాగే శ్మశానినికి వచ్చాడు.
ఏదో ఆలోచిస్తూ..రోబోలా...బేతాళుడు వేలాడుతోన్న చెట్టుదగ్గరకు వెళ్లి..బేతాళుని కిందకు దించి భుజాలకెత్తుకున్నాడు.
విక్రమార్కుడి మౌనాన్ని గమనించిన బేతాళుడు ‘ ఏం విక్రమార్కా...ఎలక్షన్లలో ఏ పార్టీ తరపునా టికెట్ రాని వాడిలా ఏమిటోయ్ అంత నిరుత్సాహంగా ఉన్నావీవేళ‘ అన్నాడు.
బేతాళా...అసలే చికాగ్గా ఉంది..నువ్వు కానీ నా మీద సెటైర్లు వేశావనుకో ఇదే కత్తి తీసుకుని నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను‘ అని కోప్పడ్డాడు విక్రమార్కుడు.
బేతాళుడి పైశాచికంగా నవ్వి... దెయ్యాలనేం నరుకుతావు కానీ..ఇప్పుడో కథ చెబుతాను..విని నేనడిగిన ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పు.సమాధానం తెలిసుండీ కూడా సమాధానం చెప్పలేదనుకో ఏం జరుగుతుందో తెలుసు కదా‘ అని వెటకారంగా చూశాడు బేతాళుడు.
విక్రమార్కుడికి మండుకొచ్చింది. సోది లేకుండా సూటిగా కథ చెప్పకపోయావో..నీ ఆత్మే వెయ్యి వక్కలవుతుందని ఎదురు దాడి చేశాడు.
బేతాళుడు తమాయించుకుని విక్రమార్కా కథ చెప్పడానికి ముందు నాదో చిన్న డౌటు..బయోపిక్ అంటే ఏంటి? అని అడిగాడు.
విక్రమార్కుడు బేతాళుడికేసి చూసి అది కూడా తెలీదా..జీవిత కథ. అంటే నువ్వు పుట్టిందగ్గర నుంచి నువ్వు బాల్చీ తన్నేసే వరకు నీగురించి చెప్పేదంతా నీ బయోపిక్ అన్నమాట.అలాగే ఎవరి బయోపిక్కులైనా ..అని ఆగాడు.
బేతాళుడు అర్ధమైనట్లు చూసి.. అయితే ఇపుడు నందమూరి బాలకృష్ణ తన నాన్నగారు నందమూరి తారకరామారావు జీవితాన్ని రెండు భాగాలుగా తీస్తానన్నారు కదా. అందులో మొదటి భాగం కథానాయకుడు ఆ మధ్యన విడుదలైంది.ఇపుడు రెండో భాగం మహానాయకుడు విడుదలైంది. అయితే ఇందులో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకమైన చివరి ఘట్టం ఎందుకు లేదు? ఎన్టీఆర్ రెండో పెళ్లి గురించి కానీ..ఆ తర్వాత ఆయన మళ్లీ సిఎం అయిన సంగతి కానీ..ఆ తర్వాత ఆయన పదవి పోగొట్టుకుని కొంతకాలానికి చనిపోవడం గురించి కానీ బయోపిక్ లో ఎందుకు చూపించలేదు? ఎన్టీఆర్ జీవితాన్ని కొంతభాగమే చూపించి బయోపిక్ అని ఎలా అన్నారు? అని బేతాళుడు నిలదీశాడు.
విక్రమార్కుడు సాలోచనగా చూసి..బేతాళా నువ్వన్నట్లు ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆయన చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలన్నీ చూపించాల్సిందే. అయితే అలా చూపిస్తే బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు కొంపలంటుకుంటాయి. ఎందుకంటే.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని మహానాయకుడులో చూపించారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ ని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లు అవమానించారు. దాంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టనని ఎన్టీఆర్ శపథం చేశారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా..స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయకపోవడానికి నిరసనగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి దూరంగా ఉన్నట్లే..నాడు ఎన్టీఆర్ కూడా అసెంబ్లీకి రానని భీష్మించుకుని కూర్చున్నారు.
ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంచుమించు ఇంటికే పరిమితమయ్యారు.ఆ సమయంలోనే ఆయన జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతి ..ఎన్టీఆర్ కు సన్నిహతమయ్యారు. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్లు 1993లో మేజర్ చంద్రకాంత్ వందరోజుల ఫంక్షన్ లో ఎన్టీఆర్ ప్రకటించారు. లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ పెళ్లిని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు..ఈ వయసులో ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటే ఇక పార్టీ కార్యాలయానికి తాళాలు వేసుకోవలసిందేనని పార్టీ నేతలతో అన్నారు కూడా. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే తన మాట తానే వినని ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడమే కాదు..సతీ సమేతంగా 1994 ఎన్నికల ప్రచారానికి ఉరికారు. కొత్త దంపతులను చంద్రబాబు అండ్ కో ఆమోదించకపోవచ్చుకానీ..కోట్లాది మంది ఆంధ్రులు ఆశీర్వదించారు. తెలుగుదేశం అనూహ్య విజయం సాధించడమే కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.
ఈ పరిణామంతో కంగారు పడ్డ చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ..ఏకంగా ఎన్టీఆర్ కుర్చీపైనే కన్నేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే చాపకింద నీరులా చంద్రబాబు నాయుడు కొద్ది పాటి ఎమ్మెల్యేలను కూడగట్టి వెన్నుపోటుకు వ్యూహరచన చేశారు. ఆ ఎమ్మెల్యేలను తీసుకుని వైస్రాయ్ హోటల్ లో క్యాంప్ పెట్టారు. నిజానికి చంద్రబాబుతో పది పదిహేను మంది ఎమ్మెల్యేలే ఉన్నా..చంద్రబాబు అనుకూల మీడియా అంతా కలిసి చంద్రబాబు వద్ద వందమందికి పైనే ఎమ్మెల్యేలు ఉన్నారని అసత్యాలు ప్రచారం చేసింది. రోజు రోజుకీ చంద్రబాబు శిబిరంలో వచ్చి చేరే వారి సంఖ్య పెరుగుతోందని ఊదరగొట్టారు.ఇది నిజమేననుకున్న తటస్థ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు శిబిరంలో చేరారు. చాలా మంది చేరకుండా ఎన్టీఆర్ కి మద్దతుగానే ఉండిపోయారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు తన వైపు తిప్పుకుని వెన్నుపోటు డ్రామాకి వ్యూహరచన చేశారు.
ఈ సమయంలోనే వైస్రాయ్ హోటల్ వచ్చిన ఎన్టీఆర్ పై ..చంద్రబాబు నేతృత్వంలో..ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సాక్షిగా ఎన్టీఆర్ పై చెప్పులు వేశారు. ఆ అవమానంతో..తాను ఆక్షణానే చనిపోయానని చెప్పుకున్న ఎన్టీఆర్..ఆ తర్వాత మానసికంగా తీవ్రంగా కృంగిపోయారు. ఆ మనస్తాపంలోనే అనారోగ్యం పాలయ్యారు. ఎన్టీఆర్ కుర్చీని చెరబట్టిన చంద్రబాబు నాయుడు..ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనీ..ఆ పార్టీ గుర్తునూ..చివరకు పార్టీ బ్యాంకు ఖాతాలోని డబ్బులనూ సొంతం చేసుకున్నారు.ఈ అవమానాలే అభిమానధనుడైన ఎన్టీఆర్ ప్రాణాలు తీశాయి. ఒక వేళ ఎన్టీఆర్ చనిపోయేవరకు మహానాయకుడిలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించవలసి వస్తే.. చంద్రబాబు చేసిన దుర్మార్గాలు..వెన్నుపోటు ప్రహసనం..ఆ కుట్రలో ఎన్టీఆర్ తనయుడు..మహానాయకుడు హీరో నందమూరి బాలకృష్ణ చేసిన సాయం అన్నీ చూపించాల్సి వస్తుంది. నిజానికి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ..కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో సాగింది.
కానీ చంద్రబాబు వెన్నుపోటు మాత్రం..అన్నీ తానే అయి చంద్రబాబు కుట్రనుఅమలు చేశారు.దానికి ఒక వర్గం మీడియా అంతా కొమ్ముకాసింది. అసత్య కథనాలతో..అవమానాలతో అంతా కలిసి ఎన్టీఆర్ ను పరోక్షంగా చంపేశారు.ఈ కఠిన వాస్తవాలు చూపిస్తే..రాజకీయంగా చంద్రబాబుకీ.. నటుడు..రాజకీయ నాయకుడిగా బాలయ్యకూ కూడా ఇబ్బందే. అందుకే ఎన్టీఆర్ జీవితాన్ని చంద్రబాబుకు నచ్చిన మేరకే..బాలయ్య చూపించారు. ఆ తర్వాతి జీవితం ఎలా ఉందో చెప్పలేదు. కాకపోతే ఈ జీవితాన్ని ఇపుడు రామ్ గోపాల్ వర్మ తాను చూపిస్తానంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో... బాలయ్య ఎన్టీఆర్ జీవితం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలవుతుందని రామ్ గోపాల్ వర్మ అనడంలోనే..ఇపుడు నేను చెప్పిన కుట్రలన్నింటినీ తెరపైకి ఎక్కిస్తారని అర్ధం చేసుకోవాలి.‘అని విక్రమార్కుడు ముగించారు.
మా బేతాళ లోకం లో కూడా ఇంతటి పైశాచిక క్రీడలు ఉండవయ్యా బాబూ అని బేతాళుడు వణుకుతూ అనేసి..విక్రమార్కుడి సమాధానానికి సంతృప్తి చెంది విక్రమార్కుడి భుజాలపై మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.
Comments
Please login to add a commentAdd a comment