దుబాయ్ : ఆకస్మికంగా మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించే విషయంలో మంగళవారం ఎట్టకేలకు ముందడుగు పడింది. దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయాన్ని తమ అధీనంలోంచి విడుదల చేసేందుకు అనుమతిస్తూ.. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఆమె భర్త బోనీ కపూర్‌కు లేఖలు అందించారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేసి.. తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
శ్రీదేవి భౌతికకాయం తరలింపు విషయంలో మంగళవారం కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె పార్థీవదేహాన్ని తరలించేందుకు ఉదయం నుంచి చాలాసేపు ఎదురుచూశారు. ఈ ప్రక్రియ ఆలస్యంగా అవుతుండటంతో తండ్రితో ఉండటానికి బాలీవుడ్ నటుడు అర్జున్‌కపూర్ దుబాయ్ బయలుదేరిన సంగతి తెలిసిందే. దుబాయ్ పోలీసులు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీదేవి పార్థీవదేహం ముంబైకి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందని దుబాయ్ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం తేల్చి న సంగతి తెలిసిందే. సోమవారమే ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేశారు.అయితే, మంగళవారం పూర్తి ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకు వేచిచూసి.. ఆతర్వాతే శ్రీదేవి భౌతికకాయాన్ని విడుదల చేసినట్టు తెలుస్తోంది.
54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా ఆమె భౌతికకాయం దుబాయ్ పోలీసుల అధీనంలోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం విచారణ జరిపాయి. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment