మా అబ్బాయే..
నటుడు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మా అబ్బాయి’. ఈ చిత్రంతో కుమార్ వట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్‌రావు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, దర్శకుడు పరశురామ్ దగ్గర పనిచేశా. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా విడుదల తర్వాత శ్రీవిష్ణును అందరూ ‘మా అబ్బాయి’ అనేలా ఉంటుంది’’ అని చెప్పారు.
‘‘పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సినీ రంగానికి వచ్చి, ‘మా అబ్బాయి’ చిత్రం తీశా. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. శ్రీవిష్ణు నటన ఇందులో హైలెట్. త్వరలో పాటలు, డిసెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ- ‘‘ఇలాంటి చిత్రం తీయాలంటే ధైర్యం ఉండాలి. పెద్ద హీరోతో చేయాల్సిన కథతో నాతో సినిమా తీసిన దర్శక-నిర్మాతలు చాలా ధైర్యవంతులు. ప్రేక్షకులను అలరించేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: థమశ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వండాన రామకృష్ణ, సంగీతం: సురేష్ బొబ్బిలి.