భలే కొట్టావోయ్‌! | SS Thaman interview | Sakshi
Sakshi News home page

భలే కొట్టావోయ్‌!

Published Sun, Sep 30 2018 12:47 AM | Last Updated on Sun, Sep 30 2018 11:51 AM

SS Thaman interview - Sakshi

ముందు బెంచీలో కూర్చున్నవాడి ట్యూన్‌ చూసి మనం కొడితే.. కొట్టి.. పరీక్ష పాస్‌ అయితే.. దాన్ని కాపీ అంటారు. ముందు బెంచీ కాదు, పక్క బెంచీ కాదు.. మన పేపర్‌లోది మనమే తిప్పి రాసి పరీక్షలో ఫస్ట్‌గా పాస్‌ అయితే.. దాన్ని హిట్‌ ట్యూన్‌ అంటారు. నీ ట్యూను.. నీ ఇష్టం! ఇది.. నీ మ్యూజిక్కు.. నీ మ్యాజిక్కు! భలే కొట్టావోయ్‌.. తమన్‌.

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో మ్యూజిక్‌.. కాపీ మ్యూజిక్‌ అని  కూనిరాగాలు తీస్తున్న రూమర్లకు ఎస్‌.ఎస్‌. తమన్‌ బాదిన డ్రమ్స్‌ ఈ ఇంటర్వ్యూలో చదవండి.

‘అరవింద సమేత వీర రాఘవ’ సాంగ్స్‌కి రెస్పాన్స్‌ బాగుంది. దాంతో పాటు వేరే సినిమాలకు మీరిచ్చిన ట్యూన్‌నే వాడుకున్నారనీ... కాపీ అని..
తమన్‌: అవన్నీ నేను పట్టించుకోను. నా పాట నేనే మళ్లీ వాడుకుంటే దాన్ని కాపీ అని ఎలా అంటారు? ఎవరో రచయిత ప్రేమ అని రాస్తారు. అదే పదాన్ని మళ్లీ వేరే పాటకు వాడితే కాపీనా? ఐ డోంట్‌ కేర్‌. జీవితం పట్ల వాళ్లకు ఏదో నిరాశ ఉండి ఉంటుంది. చిరాకులు తగ్గించుకోవడానికి సోషల్‌ మీడియాలో ఏవేవో కామెంట్‌ చేస్తుంటారు. వాటికి ప్రాధాన్యం ఇస్తే నా పని నేను చేసుకోలేను.

‘నా పాటను నేను వాడుకుంటే’ అన్నారు.. అంటే మీ ట్యూన్‌ని మళ్లీ వాడుకున్నారా?
రాగాలన్నీ ఒకేలా ఉంటాయి. కాపీ అనడమే తప్పు. నా కంపోజిషన్‌ అలానే ఉంటుంది. అది నా స్టైల్‌. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది.

ఇటీవల ఏఆర్‌ రెహమాన్‌తో మీ ట్యూన్స్‌ దాదాపు ఒకేలా ఉంటాయి అన్నప్పుడు ‘నా స్టైల్‌’ అని మీరన్నట్లే అన్నారు.
అంతే కదా. మీరు ఏ సంగీత దర్శకుడిని తీసుకున్నా.. వాళ్లకో స్టైల్‌ ఉంటుంది. మణిశర్మగారివి ఒకలా ఉంటాయి. కోటిగారు, ఎస్‌ఏ రాజ్‌కుమార్‌గారు, దేవిశ్రీ.. ఇలా ఒక్కొక్కరివి ఒకలా ఉంటాయి. నేను మాట్లాడలేను కదా అని నన్ను పదే పదే విమర్శిస్తే నేనేం చేయగలను. నన్ను నేను కాపాడుకోవడానికి ఏదోటి మాట్లాడాలనుకోను. ఇలా కామెంట్‌ చేయడం ఒకరి బతుకు తెరువు.. దాంతో బతుకుతున్నారంటే బతకనివ్వండి. ‘నువ్వు (కామెంట్‌ చేసేవాళ్లు) హ్యాపీగా ఉన్నావా? సరే చేస్కో’. నాకేం నష్టం లేదు. నా దర్శక–నిర్మాతలు, హీరోలు నన్ను నమ్ముతున్నారు. విమర్శల వల్ల నాకు పోయేదేం లేదు. అలాగని పొగడమని అనడంలేదు. పొగిడినా నాకు పెరిగేదేం లేదు. నా టీమ్‌ నన్ను నమ్మడం నాకు ముఖ్యం.. అంతే.

అప్పుడు ‘బిజినెస్‌మేన్‌’, ఇప్పుడు ‘అరవింద...’ మధ్యలో వేరే సినిమాలకు విమర్శలు. ఎందుకు మిమ్మల్నే టార్గెట్‌ చేస్తుంటారు?
‘బిజినెస్‌మేన్‌’ అప్పుడు పూరీగారే నేను పెట్టమంటేనే తమన్‌ ఆ పాట (‘పిల్లా చావ్‌...’) కొట్టాడు అని చెప్పారు. ‘బిజినెస్‌మేన్‌’ తర్వాత నేను చాలా సినిమాలు చేసేశా. విమర్శల వల్ల జరిగిన నష్టం ఏమీ లేదు.

ఇంతకు ముందు ఆల్బమ్‌ అంతా ఒకేసారి విడుదలయ్యేది. ఇప్పుడు ఒక్కో పాట విడుదల అవ్వడం వల్ల పోలికలు పెట్టడానికి చాలా టైమ్‌ ఉంది కదా?
ప్రస్తుతం ఒక్కో పాట రిలీజ్‌ చేయడం ట్రెండ్‌. ఒక్కో పాట రిలీజ్‌ చేయడం వల్ల అని కూడా కాదు. వెక్కిరించడం వాళ్ల పని. జీవితాంతం వెక్కిరిస్తూనే ఉంటారు. నా కష్టాన్ని కామెంట్‌ చేసేంత ఖాళీగా ఉన్నారంటే వాళ్లు పని చేయడం లేదనేగా. ఖాళీగా కూర్చొని వాళ్లు చేసే పని గురించి మాట్లాడటం వేస్ట్‌.

మీరన్నట్లు ‘బిజినెస్‌మేన్‌’ అప్పుడు ‘తమన్‌ కాపీ క్యాట్‌’ అనే విమర్శలు వచ్చినా మీకు సినిమాలేవీ తగ్గలేదు. ఇండస్ట్రీ మిమ్మల్ని నమ్ముతున్నట్లే..
అవును. నా బలం అదే. ‘బిజినెస్‌మేన్‌’ నా 18వ సినిమా. లెక్కలేసుకోను కాబట్టి కరెక్ట్‌ నంబర్‌ చెప్పలేకపోతున్నా. ఇప్పుడు 80వ సినిమా చేస్తున్నట్టున్నా. నన్నెవరైనా ఆపగలిగారా? నా లిరిక్‌ రైటర్స్, హీరోలు బాగా మాట్లాడతారు నా గురించి. నా డైరెక్టర్లు నాతో బాగుంటారు. మ్యూజిక్‌లో నేను ఇన్వెస్ట్‌ చేసేంత తెలుగులో ఏ మ్యూజిక్‌ డైరెక్టరూ పెట్టడు. ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తున్నాను.

దానివల్ల మీరు ఇన్‌కమ్‌ తక్కువ చూస్తారేమో?
ఫర్వాలేదండీ. బడ్జెట్‌ పెరిగితే ఇంకా బెస్ట్‌ మ్యూజిక్‌ టీమ్‌తో పని చేయాలనుకుంటాను. మంచి బడ్జెట్‌ ఇచ్చినప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు. నా నిర్మాతలు ‘ఎందుకయ్యా.. నీకిచ్చిన బడ్జెట్‌కి తగ్గట్టు చేయొచ్చు కదా. కొంచెం దాచుకో’ అని అంటారు. నా హీరోలంటే నాకు ప్రేమ. వాళ్ల ఫ్యాన్‌గా మారకపోతే హిట్‌ మ్యూజిక్‌ ఇవ్వలేను. నేను వరుణ్‌ తేజ్‌కి పెద్ద ఫ్యాన్‌ అని ఫీల్‌ అవ్వకపోతే ‘తొలిప్రేమ’లాంటి అవుట్‌పుట్‌ రాదు. అనుష్కను ప్రేమించకపోతే ‘భాగమతి’లో ‘మందారా..’ లాంటి మెలోడి ఇవ్వలేం. ఎన్టీఆర్‌ని ప్రేమించకపోతే ‘అరవింద..’కి ఇంత మంచి పాటలు ఇవ్వలేను. మనం కొట్టిన సాంగ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండాలి. ఫ్యాన్‌లా ఉంటే తప్ప అలా చేయలేం.  

సాధారణంగా క్వాంటిటీ ఎక్కువయ్యే కొద్దీ క్వాలిటీ తగ్గే ఆస్కారం ఉంది. మరి.. సినిమాలు తగ్గించుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా?
నాకు మ్యూజిక్‌ తప్ప వేరే డైవర్షన్‌ లేదు. పబ్‌కి వెళ్లను. గొడవలు అవేం లేవు. నాకు తెలిసింది మ్యూజిక్‌ చేయడం, ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుకోవడం. కొత్త మ్యూజిక్‌ వస్తువులు కొనుక్కోవడం... అంతే. క్వాలిటీ విషయంలో రాజీపడను. హీరోలకు అభిమానులు ఉన్నంత కాలం మన  దర్శక–నిర్మాతలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కారు. అందరూ భయంతో  పని చేస్తుంటాం. ఆఖరి నిమిషం వరకూ మెరుగులు దిద్దుతూనే ఉంటాం. సినిమా చేయడం అంటే పెళ్లి చేయడమే. ఇతర భాషల్లో కూడా పని చేసిన అనుభవంతో చెబుతున్నాను.. క్వాలిటీ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్‌ నిలబడుతుంది.

నిజానికి గతంలో కూడా పోలిక ఉన్న ట్యూన్స్‌ వచ్చి ఉంటా యేమో.. అప్పుడు సోషల్‌ మీడియా లేదు కాబట్టే ‘కాపీ క్యాట్‌’ లాంటివి రాలేదేమో..
నిజమే. డైరెక్ట్‌గా దింపేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో సోషల్‌ మీడియా లేదు కాబట్టి ఇది అక్కడిదీ.. అది ఇక్కడిదీ అని ఆలోచించకుండా పాటలను ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు ఎంజాయ్‌ చేయడానికి బదులు ఎలా విమర్శించాలా? అని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ‘ఈ ట్యూన్‌ ఫలానా ట్యూన్‌లా ఉంది’ అని వీళ్లు చూపించేవరకూ నాకే తెలియదు. అప్పుడు అర్థం అయింది... ఇది నా స్టైల్‌ అని. అయినా అన్నీ కాపీ ట్యూన్లే చేస్తే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఒప్పుకుంటారా? చాన్సులు ఇస్తారా?

సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచాయి. ఆల్రెడీ మీవి ఏడు సినిమాలు రిలీజ య్యాయి. బిజీ బిజీగా ఉంటున్నారన్న మాట..
తమన్‌: (నవ్వుతూ) ఎన్ని సినిమాలు చేస్తున్నాం అని ఎప్పుడూ లెక్కపెట్టుకోను. ఫీలింగ్‌ గుడ్‌. పైగా ఈ ఏడాది మంచి ఆల్బమ్స్‌ పడ్డాయి. భాగమతి, తొలిప్రేమ, ఛల్‌ మోహన రంగా... చిత్రాలకు మ్యూజికల్‌గా మంచి ఆదరణ లభించింది. ‘భాగమతి’కి అయితే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కి కూడా. ఆ సినిమాల వల్లే ‘అరవింద సమేత వీర రాఘవ’కు చాన్స్‌ వచ్చిందనుకుంటున్నాను. మణిశర్మగారి దగ్గర చేసినప్పుడు ‘అతడు’ సినిమాకి పని చేసే చాన్స్‌ దక్కింది.

అప్పటినుంచి త్రివిక్రమ్‌గారితో వర్క్‌ చేయాలన్నది డ్రీమ్‌. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తితో పని చేస్తే లైఫ్‌ ఇంకా బావుంటుంది, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నా స్థాయిలో ఇంకా మంచి మార్పు వస్తుందని నా ఫీలింగ్‌. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి కూడా గ్రేడ్స్‌ ఉంటాయి. ఇలాంటి దర్శకులతో వర్క్‌ చేస్తే ఆలోచనా విధానం పెరగడంతో పాటు గ్రేడ్‌ మారుతుంది. త్రివిక్రమ్‌గారిలాంటి కొందరు దర్శకులతో పని చేస్తుంటే మెల్లిగా మనం మారుతుంటాం. ‘అరవింద సమేత వీర రాఘవ’ విషయంలో అది జరిగింది.

సాధారణంగా కొందరు దర్శకులు ఇలాంటి ట్యూన్‌ కావాలి అని ఏదో ఒక ట్యూన్‌ని రిఫర్‌ చేస్తారు. త్రివిక్రమ్‌ అలా అడిగారా?
లేదు. ఆయన చాలా ఓపెన్‌ మైండ్‌తో వస్తారు. ఫ్రెష్‌గా కూర్చుంటారు. అక్కడ జరిగే సంభాషణలే పాట రూపంలో వస్తాయి. ఈ సినిమా కమిట్‌ అయిన 2 నెలలకు పనే చేయలేదు. అందరూ ఇంకా ట్యూన్‌ రాలేదేంటి? అనడిగితే,  ‘త్రివిక్రమ్‌గారిని చదువుతున్నాను’ అని చెప్పా. ఈయన సినిమాలు అంత స్పెషల్‌ ఏంటి? మిగతావాటికన్నా ఇవి ఎందుకు వేరేగా ఉంటున్నాయి అని స్టడీ చేశా. నేనెలాంటి ట్యూన్‌ ఇవ్వాలి. ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని స్టడీ చేశా.

పెళ్లికి ముందు వైఫ్‌ని రెండు మూడు సార్లు కలిసినపుడు అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తామో అలాగ (నవ్వుతూ). ‘అరవింద సమేత..’కు చేసిన 8 నెలల జర్నీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇంతకు ముందు పూరీ, శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి, సురేందర్‌ రెడ్డి, హరీశ్, గోపీచంద్‌.... ఇలా అందర్నీ అర్థం చేసుకునే పని చేశాను. దర్శకులను అర్థం చేసుకుంటే పని చేయడం ఈజీ అవుతుంది.

మీకు చిన్నప్పుడే మ్యూజిక్‌ అంటే ఇష్టమట కదా?
మా నాన్న (ఘంటసాల శివకుమార్‌) డ్రమ్మర్‌. స్వతహాగా నాలో కూడా మ్యూజిక్‌ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఎనిమిదేళ్ల వయసులోనే డ్రమ్స్‌ వాయించడం మొదలుపెట్టా. నా చిన్నప్పుడు మేం చెన్నైలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. అందులో దాదాపు 60 ఫ్లాట్లు ఉండేవి. ఎంత లేదన్నా వారానికో బర్త్‌డే పార్టీ అయినా ఉండేది. నేనోసారి సరదాగా ఓ పార్టీలో డ్రమ్స్‌ వాయిస్తే, అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి అన్ని పార్టీల్లో వాయించడం మొదలుపెట్టాను. అందరితో పాటు కేక్, స్నాక్స్‌ ఇచ్చేవాళ్లు. డ్రమ్స్‌ వాయించినందుకు 30 రూపాయలిచ్చేవాళ్లు. మ్యూజిక్‌ మీద నాకు ఇంట్రస్ట్‌ ఉందని గ్రహించి, నాన్నగారు డ్రమ్స్‌ అవీ కొనిచ్చేవారు.

‘అరవింద..’ పాటలు విని ఎన్టీఆర్‌ ఏమన్నారు?
నాకు పెద్ద ఆఫర్‌ ఇచ్చింది ఎన్టీఆరే. ‘కిక్‌’ కంటే ముందే ‘బృందావనం’ ఓకే అయింది. నాకు ఎన్టీఆర్‌ అంటే అందుకే అంత ప్రేమ. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని. ‘బృందావనం’ అప్పుడు నేనింతకన్నా లావుగా ఉన్నా.. పాటలు విని అమాంతం ఎత్తేసుకున్నారు. బీభత్సమైన ఫ్యాన్‌లానే పని చేశాను.

మళ్లీ ఈ సినిమాకు అలానే ఎంజాయ్‌ చేశాను. ‘అరవింద...’ పాటలు విని, భలే ఉన్నాయి అని ఎన్టీఆర్‌ ఫోన్‌లో చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ కాల్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసుకుని, దాచుకున్నాను. తారక్‌ బాడీ మొత్తం మ్యూజిక్‌ ఉంటుంది. ఫేక్‌గా ఎప్పుడూ మాట్లాడరు. సెన్సిటివ్‌. నచ్చితే వేరే లెవల్‌లో ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమ వల్ల ఇంకా జాగ్రత్తగా పని చేయాలనిపిస్తుంది.

‘అరవింద..’కు మీరెన్ని ట్యూన్స్‌ ఇచ్చారు. అందులో ఎన్ని తీసుకున్నారు?
ఐదే ట్యూన్స్‌ ఇచ్చాను. ఎక్కువ అవుతుందని చెప్పి ఒకటి వాడలేదు. స్క్రిప్ట్‌ అంత స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల అందరం కూర్చుని అనవసరంగా పాట పెట్టినట్టు ఉంటుందని దాన్ని తీసేశాం.

అలా పక్కన పెట్టిన పాటను వేరే సినిమా కోసం వాడుకునే హక్కు మీకు ఉంటుందా?
అది డైరెక్టర్, నిర్మాత,  హీరోకే ఉంటుంది. వాళ్ల అనుమతి తీసుకోకుండా మేం వాడలేం. ఇప్పుడు వాళ్లు వాడుకోమని చెప్పినా ఆ పాట అయితే ఎవ్వరికీ ఇవ్వదలచుకోలేదు. ఈ సినిమా కోసం ఫస్ట్‌ కంపోజ్‌ చేసిన పాట అదే. త్రివిక్రమ్‌గారితో పని చేసినందుకు గుర్తుగా ఆ పాటను దాచుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆయనతోనే మళ్లీ పని చేస్తే ఆ సాంగ్‌ని వాడతాను.

పెద్ద హీరోలకు పాటలు చేయడం కష్టమా?
హీరోలు, వాళ్ల ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాంగ్స్‌ చేయడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఈరోజు నేనెక్కడికెళ్లినా నాకు అంత గుర్తింపు ఉందంటే  కారణం ఫ్యాన్సే. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో ఫ్యాన్స్‌ ఉంటేనే కదా హంగామా ఉంటుంది. ఫ్యాన్స్‌ ఉంటేనే కదా రియాక్షన్‌ కనిపించేది. సాంగ్స్‌ అనేవి ఫ్యాన్స్‌కు బ్లడ్‌లాంటివి.

‘బిజినెస్‌మేన్‌’ నా ఇరవయ్యో.. ఇరవైఐదో సినిమానో అనుకుంటా. ఇప్పటికి డెబ్బై, ఎనభై సినిమాలు చేసేశాను. టాలెంట్‌ లేకపోతే అన్ని సినిమాలు ఎలా చేస్తాం చెప్పండి? సక్సెస్‌ అన్నది లేకుంటే ఫిల్మ్‌నగర్‌లో తిరగలేం.. ఇటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేం. సక్సెస్‌ అన్నది మోస్ట్‌ ఇంపార్టెంట్‌. అది లేకపోతే గౌరవమే లేదు.

కొంతమంది డైరెక్టర్లు ఏదో ఒక ట్యూన్‌ చెప్పి, దాన్ని యాజిటీజ్‌గా కాపీ చేయమంటే మీకు మైనస్‌ అవుతుంది కదా?
ఏం చేయలేం. ఎందుకు కాపీ చేయాలండి? అని అడిగిన సందర్భాలున్నాయి. సపోజ్‌ సినిమాకి ఆరు పాటలు ఉంటే, ఐదు ట్యూన్లు చేసినవాడికి ఆరో ట్యూన్‌ చేయడం కష్టం కాదు కదా. కానీ, ౖడైరెక్టర్‌ చేయమంటే తప్పదు. ఎగ్జాంపుల్‌.. హిందీలో హిట్టయిన ఓ పాటను తెలుగులో కాపీ కొట్టమంటారు.

‘చేస్తాను కానీ, పరిణామాలకు మీదే బాధ్యత’ అని ముందే చెప్పేస్తాను. ఓకే అంటారు. బట్‌.. లాస్ట్‌ మినిట్‌లో వాళ్లు ఎస్కేప్‌ అవుతుంటారు.  ఆ టైమ్‌లో డైరెక్టరే చేయమన్నాడు.. అందుకే చేశా అని పబ్లిక్‌గా చెప్పలేం కదా. నిందలపాలు కావాల్సి వస్తుంది. తప్పదు. ‘దూకుడు’ తర్వాత నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా బిహేవ్‌ చేయాలో నేర్చుకుంటున్నా. సక్సెస్‌ వచ్చింది. దాన్ని ఎలా కాపాడుకోవాలి. ఎలా రియాక్ట్‌ అవ్వాలి అని తెలుసుకుంటున్నా.

‘తొలిప్రేమ’ ఆల్బమ్‌ బాగా కుదిరింది. మళ్లీ వెంకీ అట్లూరితో ‘మిస్టర్‌ మజ్ను’ సినిమా చేస్తున్నారు.
ఒక డైరెక్టర్‌తో ఒక బ్లాక్‌బస్టర్‌ ఆల్బమ్‌ ఇచ్చాక మళ్లీ కలసి పనిచేసేప్పుడు కొంచెం చనువు, లిబర్టీ ఉంటాయి. నమ్మకం కూడా పెరుగుతుంది. వెంకీ నాకు చాలా స్పెషల్‌. వెంకీ నాకు మణిరత్నం. మ్యూజిక్‌ని బాగా డీల్‌ చేస్తాడు. నన్ను చాలా నమ్ముతాడు. ఆ నమ్మకమే నన్ను భయపెడుతుంది. అయ్యో.. మనల్ని ఇంతలా నమ్మేస్తున్నాడే ఇంకా బాగా చూసుకోవాలి, మంచి ట్యూన్స్‌ ఇవ్వాలి అనిపిస్తుంది. అతనితో ఎప్పుడు పని చేసినా బెస్టే వస్తుంది. అదే యూనిట్టే మళ్లీ కలసి పని చేస్తున్నాం. బాధ్యత ఇంకా పెరిగింది. ఆ మాటకొస్తే ఏ సినిమాకి చేసినా భయం భయంగానే చేస్తాను.

70 సినిమాలు చేశాక కూడా భయం ఉంటుందా?
అది లేకపోతే పని చేయలేం. ఫ్రీగా పని చేయలేం. సుడి, లక్‌ అంటారు. దాన్ని ఎప్పుడూ నమ్ముతూ కూర్చోలేం. కష్టమే విజయాన్ని తీసుకు వస్తుంది. లక్‌ వర్షంలాగా. ఎప్పుడో ఓసారి వర్షం వచ్చి పోతుంది. కష్టమే ఎప్పుడూ ఉండేది. సో.. కష్టపడుతూనే ఉండాలి.

తమిళంలో ఏదైనా సినిమా చేస్తున్నారా?
సిద్ధార్థ్‌తో ‘జగజ్యోతి’ చేస్తున్నాను.  తమిళంలో అది ఒక్కటే. ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌ ‘సింబా’ చేస్తున్నా. ‘టెంపర్‌’ని ఇక్కడ మిస్సయ్యాను. రీమేక్‌కి చేసే చాన్స్‌ వచ్చినందుకు హ్యాపీ.

హిందీలో దర్శకుడు రోహిత్‌ శెట్టితో వరుసగా రెండోసారి చేస్తున్నారు..
నాకు అతను బాగా ఇష్టం. సౌత్‌ దర్శకుల్లాగే ఆలోచిస్తాడు. సింక్‌ అయ్యాడు. ‘రేసుగుర్రం, సరైనోడు’ లాంటి కమర్షియల్‌ సౌండ్‌ కావాలి అంటాడు. మేం పుట్టిందే దానికి, 100 పర్సెంట్‌ ఇస్తాను అంటాను. ఆయనతో ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ చేశాను.  200 కోట్లు చేసిందా సినిమా. ఇండస్ట్రీలో సక్సెస్‌ చాలా ముఖ్యం. ఏ భాషలో అయినా సక్సెస్‌ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అసలు ఫిల్మ్‌నగర్‌లోకి ఎంట్రీ ఉండదు. ఫిల్మ్‌నగర్‌ రైటే తీసుకోం. స్ట్రయిట్‌గా వెళ్ళిపోవడమే.

కొన్నిసార్లు మాములుగా చేసినా కూడా ఎక్కువ క్రెడిట్స్‌ వస్తాయి. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
‘బిజినెస్‌మేన్‌’లో ‘సారొస్తారా...’ పాటకు అలా జరిగింది. సరదాగా ఓ పాట పెడదాం అని చేశాం. అది పెద్ద హిట్‌ అయింది. మహేశ్‌కి మెలోడీ చేయాలనుకుని కేవలం పది నిమిషాల్లో చేసిన పాట అది.  ఆడియో కంపెనీకి చాలా లాభం తెచ్చిన పాట అది.

కొందరు ట్యూన్స్‌ రెడీ చేయడానికి గోవా అనో విదేశాలో వెళతారు. మీరు?
నేనెక్కడిక్లీ వెళ్లను. ఫ్లైట్‌ టికెట్స్‌ వేసి, ఉండటానికి రూములు బుక్‌ చేసి, నిర్మాత ఇంత ఖర్చు చేసి, మంచి ట్యూన్‌ రాకపోతే? అందుకే నాకు భయం. నా స్టూడియోలో పని చేస్తాను. ప్రశాంతంగా ట్యూన్స్‌ చేస్తా. ఒకవేళ అటూ ఇటూ అయిందనుకోండి... మనవాళ్లు ఎంత పొగుడుతారో అంత దించేస్తారు.

బీచ్‌ వ్యూ చూస్తేనే నాకు ట్యూన్‌ వస్తుంది అంటారు కొందరు సంగీత దర్శకులు?
అలా ఏం ఉండదు. సిచ్యువేషన్‌ బుర్రలోకి కరెక్ట్‌గా ఎక్కిస్తే ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ‘తొలిప్రేమ’ ఆల్బమ్‌ సూపర్‌ హిట్‌. స్టూడియోలోనే కూర్చున్నాం. రెండు రోజుల్లో 6 పాటలు వచ్చేశాయి. ఇప్పుడు అఖిల్‌ ‘మజ్ను’ సినిమాకు ఫస్ట్‌ నాలుగు రోజులు ట్యూన్‌ రాలేదు. ఆ తర్వాత లోకల్‌లోనే లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లాం. ఆ తర్వాత మూడు రోజుల్లో ఫినిష్‌.

ఫైనల్లీ... వేరే సంగీతదర్శకుడి మీద ఉన్న కోపం మీకు ప్లస్‌ అయ్యిందని, ఎక్కువ చాన్సులు రావడానికి అదే కారణమని కొందరి అభిప్రాయం..
ఇండస్ట్రీ మొత్తం ఈగో మీద నడుస్తుంది. గుడ్‌ ఈగో ఉన్నంతవరకూ ఫర్వాలేదు. బ్యాడ్‌ ఈగో అయితే కష్టం. నేను రెండో రకాన్ని నా దగ్గరకు రానివ్వను. అందుకే నన్ను ఇష్టపడతారేమో. మనమంటే గిట్టనివాళ్లు ఆ పాటను  కాపీ కొట్టాడు అని ప్రచారం చేస్తుంటారు. అటువంటి వారిని మనం ఏమీ చేయలేం. కానీ, ఇండస్ట్రీకి తెలుసు నేనేంటో. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నాకొక లైఫ్‌ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. నా మీద వచ్చే విమర్శలను మనసుకి తీసుకోను.. ప్రశంసలను తలకి ఎక్కించుకోను.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement