Aravinda Sametha Veera Raghava
-
నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది మోసపోతుంటారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ అనుభవాన్నే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా బయటపెట్టింది. ఎన్టీఆర్ 'అరవింద సమేత' విషయంలో తనని ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈషా చెప్పుకొచ్చింది.'త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో మీరు ఒకరు అని అన్నారు. అయితే నేను మెయిన్ లీడ్‌గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని, తొలుత నో చెప్పేశాను. కానీ త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పి లీడ్స్‌లో ఓ క్యారెక్టర్ అని అన్నారు. సరే చూద్దాములే అని ఓకే చెప్పేశా. షూటింగ్‌కి వెళ్లే ఒక్క రోజు ముందు ఓకే చెప్పాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా. దాంతో అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ జరిగినన్నీ రోజులు హ్యాపీగానే ఉంది.'(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. జీవితంలోకి స్పెషల్ పర్సన్)'అలానే సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్‌గా అనౌన్స్ చేస్తానని అన్నారు. కానీ అలా చేయలేదు. ఒకవేళ చేసుంటే నాకు హెల్ప్ అయ్యేది. అయితే ఈ విషయం మా మేనేజర్ని కూడా అడిగా. కనుక్కోమన్నాను. షూట్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. కానీ నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తీసేశారు. ఎన్టీఆర్‌తో సాంగ్ అన్నారు. అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే తారక్, త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం' అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈ ఇంటర్వ్యూలో ఎవరి గురించి నెగిటివ్‌గా చెప్పలేదు గానీ హీరోయిన్ ఛాన్స్ అని తనని మోసం చేసిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది. చాలా సినిమాల విషయంలో ఎలాంటివి జరుగుతున్నాయో బయటపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం'లో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు. బహుశా ఈమెకి కూడా ఈషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది.(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ) -
'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు'
పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి' 2018 జనవరిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు లేక కొన్నిచోట్ల మొదటి రెండురోజుల్లోనే ఈ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అలా ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయి. కొన్ని చోట్ల తమన ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డెక్కారు. ఆ సినిమా తర్వాత పవన్ కూడా సుమారు 3 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు. మళ్లీ 2021లో 'వకీల్‌సాబ్'గా కనిపించాడు. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. అజ్ఞాతవాసి పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేసిందని ఆయన చెప్పాడు. భారీ అంచనాలతో జనవరిలో రిలీజైన ఈ సినిమా ఫలితం చూశాక తప్పెక్కడ జరిగిందో ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి అయింది. అలా ఒకరకమైన డిప్రెషన్లో ఉండగా తమకు జూ. ఎన్టీఆర్ ధైర్యం ఇలా ఇచ్చారని నాగవంశీ చెప్పాడు. 'వెంటనే ఆ మూడ్‌లో నుంచి బయటికి వచ్చేయమని, ఇదే సంవత్సరం మనం హిట్టు కొడుతున్నామని చెప్పి 'అరవింద సమేత వీర రాఘవ'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా త్రివిక్రమ్- తారక్ కాంబోలో తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాం. దీంతో హారిక & హాసినీ ఇండస్ట్రీలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.' అని ఒక జాతీయ వెబ్ వీడియో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ పంచుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' 2018 అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తమకు ఇలాంటి సంఘటనలో ఎన్నో ఎదరయ్యాయని అన్నీ బహిరంగంగా చెప్పుకోలేమని ఆయన చెప్పాడు. నాగవంశీ సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్’ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దీనిని తెరకెక్కించారు. -
ఫ్యూచర్ లో రిపీట్ కాబోతున్న అరవింద సమేత కాంబో...?
-
షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ రోజు ఫోన్ చేసి తిట్టేవాడు : జగపతి బాబు
ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబు.. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జగపతి బాబు క్రేజ్ అమాంతం పెరిగింది. వరుసగా విలన్ ఆఫర్లు క్యూ కట్టాయి. హీరోగా మెప్పించిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు రాణిస్తున్నారు. తనకు హీరో అనేది ట్యాగ్‌లైన్ మాత్రమేనని, ఒక నటుడిగా ఉండటమే ఇష్టమని చెబుతున్నాడు జగపతిబాబు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురించి, అందులో చేసిన బసి రెడ్డి పాత్ర గురించి, హీరో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’స్క్రిప్ట్ బాగా కుదిరింది. అందులో నాది ఎగ్రసివ్ క్యారెక్టర్ అయితే.. తారక్‌ది చాలా కూల్ క్యారెక్టర్. దాంతో బసిరెడ్డి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అంత పెద్ద హీరో నా పాత్రను ఒప్పకోవడమే కష్టం. తారక్ యాటిట్యూడ్ బాగా నచ్చింది. అయితే బసిరెడ్డి పాత్రను ఒప్పుకున్న తారక్.. తర్వాత నాకు కావాల్సినంత పనిష్మెంట్ కూడా ఇచ్చేశాడు. షూటింగ్ సమయంలో రోజూ ఫోన్ చేసి వాయించేవాడు. నీ పాత్ర ఇంత బావుంది. అంత బావుందనేవాడు. రక రకాలుగా తిట్టేవాడు.. అది కూడా ప్రేమతోనే. సినిమా విడుదల తర్వాత జరిగిన ఫంక్షన్లో కూడా నా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బసిరెడ్డి గుర్తుంటాడు. తర్వాతే నేను గుర్తుంటాను అన్నాడు. తను అలా అనడం చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ తర్వాత నన్ను దూరం పెడుతున్నానని చెప్పారు. ‘బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్‌తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించకండి’అని తారక్ అన్నారు. దానికి నేను ఓకే తారక్ అన్నాను. అయిపోయింది’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
నేను అదృష్టవంతురాలినే!
మన జీవితాన్ని విధి నిర్ణయించేస్తుందని నటి పూజాహెగ్డే అంటోంది. ముఖముడి చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది బ్యూటీ ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. బహుశా ఆ చిత్రం విజయం సాధిస్తే ఏమన్నా అవకాశాలు వచ్చేవేమో.. కానీ అలా జరగలేదు. అయితే టాలీవుడ్ మాత్రం ఈ అమ్మడిని బాగానే రిసీవ్ చేసుకుంది. ముకుంద, దువ్వాడ జగన్నాథమ్ వంటి చిత్రాలు పూజాహెగ్డేకు మంచి పేరే తెచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం కూడా హిట్ అనిపించుకోవడంతో అమ్మడిది లక్కీహ్యాండేనని టాక్ ఉంది. అలాగే చాలా మంది స్టార్ హీరోయిన్ల మాదిరిగానే రంగస్థలం చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడేసింది. అదీ బాగానే వర్కౌట్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్లో పూజాహెగ్డే వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. మహేశ్‌బాబుతో మహర్షి చిత్రంలో నటిస్తోంది. సాధారణంగా టాలీవుడ్లో సక్సెస్ అయితే కోలీవుడ్ నుంచి కాలింగ్ రావాలి. కానీ పూజాహెగ్డే విషయంలో ఇంకా అలా జరగలేదు. అంతే కాదు ఈ అమ్మడు నటిగా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లవుతున్నా, ఇప్పుటికి 8 చిత్రాలే చేసింది. ప్రస్తుతం హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. గ్లామర్ విషయంలో హద్దులుగానీ, షరతులు గానీ విధించని పూజాహెగ్డే కెరీర్ ఇంకా జోరు అందుకోవలసి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందో ఏమో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమ్మడు కాస్త విరక్తితో కూడిన వేదాంత ధోరణిలో తనేంటో తనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడింది. విధి గురించో, ఇతర విషయాల గురించో నాకు పెద్దగా తెలియదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేను. ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించినప్పుడు అందులో పాత్ర కోసం ఏమేం చేయాలన్నదంతా దర్శకుడు ముందుగానే డిజైన్ చేసి ఉంటారు. దాన్ని నమ్మశక్యంగా నటించాలంతే. ఈ లోకంలో జన్మించిన నేను ఏం చేయాలన్నది కూడా విధి నిర్ణయించేసి ఉంటుంది. దాన్ని చేస్తున్నాను. పెద్ద విజయమో, చిన్న విజయమో, లేక అపజయమో మనలో చాలా మార్పు తీసుకొస్తుంది. చాలా అనుభవాలను అందిస్తుంది. అందులోంచి పాఠం నేర్చుకుని మనం ఏంటో అర్థం చేసుకోగలం. అయితే ఏదేమైన నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి అని పూజాహెగ్డే పేర్కొంది. -
బుల్లితెరపై నిరాశపరిచిన ‘అరవింద సమేత’
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా అరవింద సమేత. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈసినిమా బుల్లితెర మీద మాత్రం ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఇటీవల టీవీలో ప్రసారమైన అరవింద సమేత సినిమా కేవలం 13.7 టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే సాధించింది. గతంలో ఎన్టీఆర్ టెంపర్ 25 టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డ్ సృష్టించింది. కానీ అరవింద సమేత మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాగా 22.7 రేటింగ్‌తో బాహుబలి 2 టాప్ ప్లేస్‌లో నిలిచింది. తరువాత స్థానాల్లో మగధీర (22), బాహుబలి (21.8), డీజే (21.7), శ్రీమంతుడు (21.2), గీత గోవిందం (20.8) సినిమాలు ఉన్నాయి. -
జాబిల్లి చెల్లాయివే!
‘అంతకుముందు ఆ తరువాత’ ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఇషా రెబ్బా పదహారణాల తెలుగు అమ్మాయి. తొలి సినిమా ‘అంతకు ముందు ఆ తరువాత’లో అనన్యలాగే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తేనెచూపులమ్మాయి ఇషా గురించి కొన్ని ముచ్చట్లు... నెమలీక ఆ భాష ఈ భాష మాసు క్లాసు అని తేడా లేకుండా సినిమాలు చూడటం అంటే ఇషాకు బోలెడు ఇష్టం. కానీ సినిమాల్లోకి రావాలని మాత్రం అనుకోలేదు. అయితే ఎంబీయే చదువుకునే రోజుల్లో మాత్రం మోడలింగ్ చేసింది. ఆ రోజుల్లోనే ఒకరోజు... ‘‘నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను’’ అని ఇంట్లో చెప్పేసింది. వాళ్లేమీ నో చెప్పలేదు కానీ చదువు తరువాత అని చెప్పారు. అలా ఎంబీయే పూర్తి చేసిన ఇషా, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఆ తరువాత ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో నటించేటప్పుడు ‘యాక్షన్’ అనే మాట వినబడగానే ‘అయ్య బాబోయ్’ అనుకునేదట. కడుపు నొప్పి వచ్చేదట. ఇలాంటి సమయాల్లోనే సహనటులు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం అంటోంది ఇషా. ఈ సపోర్ట్ లభించడం వల్లే అంతకుముందు ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం దూసుకెళ్లగలిగింది. సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఇషా తొలి సినిమాతోనే భేష్ అనిపించుకుంది. ‘బందిపోటు’ తరువాత ఒక తమిళ సినిమాలో కూడా నటించింది. ఇషా చేతిపై నెమలీక టాటూ కనిపిస్తుంది. ఈ నెమలీక సంకల్పబలానికి ప్రతీకట! తీరిక వేళల్లో ‘ఇప్పుడు ఇది చేశాం. నిరూపించుకున్నాం’ ‘ ఆ తరువాత నెక్స్›్టలీగ్కు వెళ్లిపోవాలి’ ఇలాంటి స్ట్రాటజీలేవి తనకు లేవు అంటుంది ఇషా. ‘మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే చాలు. మంచి క్యారెక్టర్ చేస్తే చాలు’ అంటున్న ఇషా తీరిక వేళల్లో సంగీతాన్ని వినడానికి ఇష్టపడుతుంది. ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్‌లు ఆమె అభిమాన సంగీత దర్శకులు. కొంచెం డిఫరెంట్‌గా! పరిశీలన అనేది వృథా పోదు అని నమ్ముతుంది. వివిధ సందర్భాల్లో వ్యక్తుల పరిశీలన తన నటనకు ఉపకరిస్తుంది అంటున్న ఇషా ఇప్పుడు ఉన్న అందరూ హీరోలతో కలిసి నటించాలనుకుంటోంది. ఒక సినిమాలో పోషించిన పాత్రకు మరో సినిమాలో పోషించిన పాత్రకు వైవిధ్యం కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్ట్రెస్‌బస్టర్ అబ్బాయిలెవరికీ ఎదురుకాని ప్రశ్న, అమ్మాయిలకే ఎదురయ్యే ప్రశ్న: ‘వంట వచ్చా?’ఈ ప్రశ్న గురించి ఖండనమండనల మాట ఎలా ఉన్న ఇషా రెబ్బాకు మాత్రం వంట భేషుగ్గా వచ్చట. అది తన స్ట్రెస్‌బస్టర్ అని కూడా చెబుతుంది. -
ఆక్ పాక్ కరివేపాక్
-
‘అరవింద’ సక్సెస్ మీట్: బాలయ్య రాక వెనుక ఆంతర్యమిదే!
ఎవరినైనా సరే...అవసరానికి వాడుకోవడంలో టీడీపీ పెద్దలకు ఎవరూ సాటిరారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక కూరలో కరివేపాకులా ఏరి పారేయడంలో వారికి వారే సాటి. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ను శుభ్రంగా వాడేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత జూనియర్ ఎవరో కూడా తెలినయట్లుగా పక్కన పెట్టేశారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో రేపన్న రోజున జూనియర్ ను మళ్లీ వాడుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. అబ్బాయి సినిమా సక్సెస్ మీట్ కి బాబాయ్‌ని చంద్రబాబే పంపించారని అమరావతి కోళ్లు డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో అదే పనిగా కూస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా నచ్చిన ఫిలాసఫీ ఒకటుంది. అదే..యూజ్ అండ్ త్రో. అవసరానికి వాడుకో..అవసరం తీరిన వెంటనే అవతలికి విసిరేయ్. ఈ పాలసీని చంద్రబాబు నాయుడు తన రాజకీయ కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అమలు చేస్తూనే ఉన్నారని ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు అంటూ ఉంటారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి ఎదురీత తప్పదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా చంద్రబాబు నిర్వహించుకున్న సర్వేలతోపాటు.. ప్రైవేటు సంస్థల సర్వేల్లోనూ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని తేలడంతో చంద్రబాబు నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలన్న ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఈ క్రమంలో భాగంగా..పదేళ్ల క్రితం తాము వాడుకుని పక్కన పారేసిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ బుట్టలో వేసుకోవాలన్న వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఉన్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే కావచ్చు... జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా అరవింద సమేత వీరరాఘవ సక్సెస్ మీట్ సభకు బాబాయ్ బాలకృష్ణ వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎందుకంటే 2009 ఎన్నికల తర్వాత...జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కార్యక్రమంలోనూ బాలకృష్ణ కనిపించలేదు. ఇపుడు అమాంతం జూనియర్ సినిమా సక్సెస్ మీట్ కి రావడం...జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ టిడిపి ప్రచారం కోసం ఆకట్టుకోవడానికేనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. అంతకన్నా కొసమెరుపు ఏంటంటే.. ఇంచుమించు రెండేళ్ల క్రితం బాలకృష్ణ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జూనియర్ ఎన్టీఆర్ తో తమకి సంబంధాలే లేవన్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. అంతగా సంబంధాలు లేని జూనియర్ సినిమా కార్యక్రమానికి ఇపుడు బాలయ్య అమాంతం ఎందుకొచ్చినట్లు? వచ్చారు సరే... అరవింద సమేత వీరరాఘవ సినిమాలో హీరోయిన్ తో పాటు ప్రతీ ఒక్కరినీ పొగిడిన బాలయ్య... జూనియర్ ఎన్టీఆర్ గురించి నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు. అందరినీ పొగిడిన బాలయ్య అసలు ఈ సినిమా చూడనే లేదట. సినిమా చూడకుండానే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడేశారు. అసలు సినిమా కూడా చూడకుండా.. మొక్కుబడిగా బాలయ్య ఈ మీట్ కి ఎందుకొచ్చారంటే జూనియర్ ఎన్టీఆర్‌ను ట్రాప్ చేయడానికే అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబే వ్యూహం ప్రకారం తన బావమరిది అయిన బాలయ్యను జూనియర్ ను మంచి చేసుకునే పనిలో ఉండమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్‌ను మంచి చేసుకోవలసిన అవసరం ఏముంది? బాబాయ్ గా రమ్మని పిలిస్తే జూనియర్ వస్తాడు కదా అంటారా? ఆ సీన్ లేదిపుడు. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్‌ని, ఆయనలోని అనితర సాధ్యమైన వక్తృత్వపు ప్రతిభను వీలైనంతగా వాడేసుకుని ఎన్నికల్లో లాభపడాలన్న వ్యూహంతో 2009లో చంద్రబాబు నాయుడే దగ్గరుండి జూనియర్‌ను పార్టీ వేదికలపైకి ఆహ్వానించారు. అప్పట్లో చంద్రం మావయ్య చూపించేది ఆప్యాయతే కాబోలు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన రమ్మనమనడమే ఆలస్యం అన్నట్లు.. ఎన్నికల ప్రచారం బరిలోకి దూకేశారు. తన అద్భుత ప్రసంగ పాటవాలతో ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. ఎంతగా ప్రచారం చేశారంటే.. ప్రాణాలకు సైతం తెగించి తెలుగుదేశానికి అంకితమై రాత్రింబవళ్లూ శ్రమించారు జూనియర్ ఎన్టీఆర్. ఆ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురై తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కూడా. తీవ్ర గాయాలపాలై కట్లుకట్టుకుని ఆసుపత్రి మంచంపై ఉండి కూడా టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు జూనియర్. సరే... 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని యుక్తులు పన్నిన్నా.. అందరితో కలిసి మహాకూటమి పెట్టినా.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మా ముందు కూటమి తేలిపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్నికలు అయిపోగానే... నెమ్మది నెమ్మదిగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. తన తనయుడు లోకేష్‌ను పార్టీలో తన వారసుడిగా నిలబెట్టేందుకు.. పార్టీలో అసలు జూనియర్ ఎన్టీఆర్ నీడ కూడా లేకుండా జాగ్రత్తలు పడ్డారు చంద్రబాబు. జూనియర్‌ను పక్కన పెట్టడమే కాదు.. జూనియర్ తండ్రి హరికష్ణకూ, ఆయనకు అత్యంత విధేయులైన పార్టీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. ఆ కారణంగానే హరికృష్ణకు నమ్మకస్తుడైన పార్టీ సీనియర్ నేత కొడాలి నాని టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హరికృష్ణనీ, ఆయన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ నీ, హరికష్ణ అనుచరులైన పార్టీ నేతలను పార్టీలో డమ్మీలుగా మార్చేశారు చంద్రబాబు. జూనియర్ సినిమా దమ్ము విడుదలైన సందర్భంలో అయితే ఆ సినిమాని ఎవరూ చూడవద్దని టీడీపీ నేతలే ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి థియేటర్లు దొరక్కుండా టీడీపీ పెద్దలే అడ్డుకున్నారన్న ఆరోపణలు వినపడ్డాయి. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, నరేంద్ర మోదీ ప్రభంజనాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాలుగున్నరేళ్లు గడిచే సరికి చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకుని.. పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు. మరోవైపు బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎవరో ఒకరి అండ.. జనాకర్షణ గల నేతల ప్రచారం లేనిదే ఎన్నికల ఏరు దాటలేని చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ వేదికలపైకి రప్పించి పార్టీ తరపున ప్రచారం చేయించుకుంటే బాగుంటుందని చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రిత జూనియర్ ఎన్టీఆర్‌పై కక్షగట్టేసినట్లు ఆయన సినిమాలకు థియేటర్లు దొరక్కుండా, ఆయన సినిమాలు ఎవరూ చూడకూడదంటూ ప్రచారం చేసిన వారే ఇపుడు మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జూనియర్‌ను మంచి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఒకసారి వాడుకుని పక్కన పెట్టేసిన జూనియర్ ఎన్టీఆర్ అంత ఈజీగా టీడీపీ వైపు రారేమోనన్న అనుమానంతోనే.. బాబాయ్ బాలయ్యను ఎన్టీఆర్ సినిమా సక్సెస్ మీట్ కి పంపారు. తద్వారా.. జూనియర్‌ను టీడీపీ వైపు రప్పించుకోడానికి చంద్రబాబు పథక రచన చేశారని అంటున్నారు. చంద్రబాబు వైఖరి, విధానాలు నచ్చకనే నందమూరి హరికృష్ణ కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల హరికష్ణ దుర్మరణం చెందిన సందర్భంలో ఆయన పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద కాసేపు ఉంచుదామని చంద్రబాబు అనుకున్నారు. అయితే హరికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం దానికి నో అనేశారని సమాచారం. పార్టీ తనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని హరికృష్ణ తన కుటుంబ సభ్యులతోనూ, అనుచరులతోనూ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ నేపథ్యంలోనే కుటుంబసభ్యులతోపాటు అనుచరులు కూడా టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు హరికృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయలేదంటారు. ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో జూనియర్‌ను ఎలాగైనా మచ్చిక చేసుకుని ఆయన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట. జూనియర్ అభిమానులైతే.. టీడీపీ ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వెళ్లరాదని సోషల్ మీడియాలో ఇప్పుడే డిమాండ్ చేస్తున్నారు. జూనియర్‌ను మరోసారి వాడుకుని వదిలేస్తారని కూడా ట్వీట్లు పెట్టారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది చూడాలి. - సీఎన్ఎస్ యాజులు -
మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంటారా?
సాక్షి, హైదరాబాద్ : ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరైన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ రాకపై సోషల్ మీడియా వేదికగా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగాంగానే బాలకృష్ణ ఈ సక్సెస్ మీట్‌కు హాజరయ్యారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అభినందన సభలో బాలయ్య చేసిన వ్యాఖ్యల చుట్టూనే తీవ్ర చర్చ జరుగుతోంది. వేదికపై అందరి గురించి మాట్లాడిన బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటతోనే సరిపెట్టడం జూనియర్ అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు బాలయ్యకు సయోద్య లేదని కొందరంటే.. మళ్లీ జూనియర్ వాడుకోవాలనే యోచనలో టీడీపీ ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నాడు హరికృష్ణను అవసరార్థం వాడుకున్నట్లు ఇప్పుడు జూనియర్‌ను వాడుకుంటారని, 2009 ఎన్నికల సీన్‌ను మరోసారి రిపీట్ చేస్తారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఇక 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా రోడ్డు ప్రమాదం జరిగినా.. బెడ్‌పై నుంచే జూనియర్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికలనంతరం జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలను చంద్రబాబు పార్టీకి దూరం చేసిన విషయం తెలిసిందే. హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున మరోసారి ప్రచారం చేయనున్నారా? అనే చర్చ నందమూరి అభిమానుల మధ్య జరుగుతోంది. wt a Co-inside Dialogue #AravindhaSametha Movie, #Trivikram Mass#Sr_NTR#BalaKrishna Controlled By #ChandraBabu & Now #Pappu#Jr_NTR pic.twitter.com/kQh9AV1Fp6 — AKSHAY SENA (@sena_akshay) October 21, 2018 What I am wondering is in span of time 18 minutes speech lo not even balayya was not able to speak at least 3seconds about Jr ntr but ur saying awesome speech — Venkat reddy (@ysr5000) October 22, 2018 Nduku boss bavunna vadni chedagodatharu elanti guest la ni piliche okka mata kuda Anna kosam matladaledu chee maku chala bada anipinchinde Anna Manaki Bali voddu @tarak9999 manam ela ne bavunnam alanti pagati veshagallu manaki voddu jayho NTR ✊✊✊ — ganesh varma (@ganeshvarma09) October 21, 2018 Election huge going. After election nothing — Mahender C (@Mahesh96985753) October 21, 2018 😂😂😂 2019 Ki karrepaku ni ready cheskuntuna CBN — PK_Cm (@arunreddy69) October 21, 2018 -
మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంటారా?
-
పూజపై బాలకృష్ణ కవితలు.. నెటిజన్ల సెటైర్లు
ఎంత పెద్ద డైలాగ్‌నైనా అలవోకగా చెప్పేయడం నందమూరి బాలకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు అప్పుడప్పుడు తన తెలుగు భాషా ‘ప్రావీణ్యం’తో అభిమానులను ఆనందపరుస్తుంటారు ఆయన. ఒక్కసారి డైలాగ్ చెప్పడం మొదలు పెట్టారంటే ఆయనను ఆపడం ఎవరితరం కాదు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం కాస్త తడబడుతూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. ఆదివారం జరిగిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా సక్సెస్ మీట్లో కూడా బాలకృష్ణ ఇదే తరహాలో అభిమానులను ఆకట్టుకున్నారు. అందులో భాగంగా హీరోయిన్ పూజా హెగ్డేను పొగుడుతూ కవితల జల్లు కురిపించారు. అయితే.. ‘ఈ కవితల అంతరార్థం కూడా అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది కదా’ అంటూ బాలయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నాకు జమఝ్ అయ్యేలా బోలండి! ‘లగ్తాహై ఆస్మాన్ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్ హోజాతీ హై.. అంటూ బాలకృష్ణ చెప్పిన కవిత తమకు అర్థం కాలేదంటున్నారు కొంతమంది నెటిజన్లు. ‘అయ్యా ఈ భాషాకో తెల్గూమే బోలే మేధావుల్ హైతే.. నాకు జమఝ్ అయ్యేలా బోలండి ప్లీజ్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొంత మంది మాత్రం... ‘అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య దగ్గర ట్యూషన్‌కు వెళ్లాల్సిందేనంటూ’ తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు.. ఫ్లర్టింగ్ అనేది ఒక యూనివర్సిటీ అయితే బాబు దానికి ఎండీ’ అంటూ ఇంకొంత మంది కామెంట్ చేస్తున్నారు. పూజాను పొగుడుతున్న వీడియోను షేర్ చేసి... ‘బాలయ్య చెప్పిన పాఠం ఫాలో అవ్వండి.. అమ్మాయిని పడేయండి’ అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా గతంలో సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళల గురించి బాలకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు కోరారు కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. -
కొత్త వెలుగు తెచ్చినందుకు థ్యాంక్స్ సామీ
‘‘అరవింద సమేత వీర రాఘవ’.. ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదం అందించి, ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించిన అభిమాన సోదరులందరికీ నా వందనాలు. ఓ కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా కుటుంబ సభ్యుడైన త్రివిక్రమ్‌గారిపైన ప్రేక్షక దేవుళ్లందరూ వారి నమ్మకాన్ని ఇంకోసారి ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ఆయనకు రెట్టింపు ఉత్సాహం కల్పించిన ప్రేక్షక దేవుళ్లకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఈ విజయ దశమికి నల్లమబ్బు కమ్మినటువంటి ఒక విషాదఛాయలో ఉన్న మా కుటుంబంలోకి ‘అరవింద సమేత వీర రాఘవ’ తో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ సామీ(త్రివిక్రమ్). జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాన్ని అందించినందుకు థ్యాంక్స్. ఈరోజు ఒకే ఒక్క లోటు.. నాన్న(హరికృష్ణ) ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ, ఆయన ఇక్కడే ఎక్కడో తిష్ట వేసి ఈ రోజు జరిగే ఈ ఘట్టాన్ని చూస్తుంటారు. నాన్నగారు లేకున్నా ఆయన హోదాలో ఇక్కడికొచ్చి, ఆశీస్సులు అందించిన బాబాయ్‌కి(బాలకృష్ణ) హృదయపూర్వక పాదాభివందనం’’ అన్నారు. ముఖ్య అతిథి బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవుడు సినిమాలను వినోదంతో కూడిన సాధనంగా ఎంచుకున్నాడు. మంచి చిత్రాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సినిమాలు ఎలా ఉండాలనేది ఇండస్ట్రీలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు ఆలోచించాల్సిన విషయం. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ షూటింగ్లో బిజీగా ఉండి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చూడలేకపోయా. కానీ, సినిమా ఇతివృత్తం చెప్పారు. త్రివిక్రమ్‌గారి కథ, సంభాషణల్లో ఎంతో చురుకుదనం, పదును ఉంటుంది. ముత్యాల్లాంటి సినిమాని ప్రేక్షకులకు చూపించడం.. నటీనటుల చేత మంచి హావభావాలను రాబట్టుకోగల సత్తా ఉన్న, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు త్రివిక్రమ్‌గారు. అభిమానం వేరు.. ఆత్మాభిమానం వేరు. పోటీ అన్నది ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరుల్ని మనం కించపరిచేలా ఉండకూడదు. ప్రతి వాళ్లూ కష్టపడబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అందరికీ నా అభినందనలు. రాధాకృష్ణ, ప్రసాద్‌గార్లు మంచి సందేశం, ఆలోచనతో కూడిన సినిమా అందించారు. కేవలం వినోదమే కాదు.. ఆలోచనతో కూడిన సినిమాలు అవసరం. ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకి, అభిమానులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు. హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్లో మా నాన్నగారు(హరికృష్ణ) ఉంటే బాగుండు అనే వెలితి నాకు, తమ్ముడికి. కానీ, మన బాలయ్య... బాబాయ్ ఆ లోటును తీర్చేశారు. రాయలసీమ యాసను తమ్ముడు చాలా బాగా పలికాడు. త్రివిక్రమ్‌గారు ఫస్ట్ టైమ్ మంచి ఎమోషనల్ సినిమా చూపించారు. నేను ఇళయరాజాగారి ఫ్యాన్‌ని. ఆయన స్థాయిలో ఫస్ట్ టైమ్ తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనిపించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయాన్ని మాకు దసరా కానుకగా ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు నా కృతజ్ఞతలు. మాటల్లో చెప్పలేని ఆనం దాన్ని పంచారు మీరు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు త్రివిక్రమ్. ‘‘ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే త్రివిక్రమ్ కథని సృష్టించాడు. ఆ కథలో ఎన్టీఆర్, జగపతిబాబు చాలా బాగా నటించారు. వారి ముగ్గురి వల్లే ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అయ్యింది’’ అన్నారు పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. నిర్మాతలు రాధాకృష్ణ, పీడీవీ ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు పూజాహెగ్డే, ఈషారెబ్బా, జగపతిబాబు, నరేశ్, సునీల్, బ్రహ్మాజీ, నవీన్‌చంద్ర, శత్రు, ఈశ్వరీరావు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఇంకేం కావాలి?
‘‘నేను హీరోగా చేస్తున్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తున్నంత సక్సెస్‌ని అప్పుడు చూడలేదు. ఇన్ని భాషల్లోనూ, ఇంత మంది ఆర్టిస్టులతో, దర్శకులతో అప్పుడు చేయలేదు. ఇంకేం కావాలి’’ అన్నారు జగపతిబాబు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్.రాధాకృష్ణ నిర్మాత. ఇందులో జగపతిబాబు విలన్‌గా కనిపించారు. తాను చేసిన బసిరెడ్డి పాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు చెప్పిన విశేషాలు. ♦ ఈ సినిమాలో నా పాత్ర సృష్టించింది త్రివిక్రమ్ అయితే నన్ను ప్రోత్సహించింది ఎన్టీఆరే. సినిమాలో నా పాత్ర బావుంటుంది అని అనుకున్నాను కానీ ఇంత బావుంటుంది అనుకోలేదు. ఒక టాప్ హీరో అయ్యుండి నన్నే పొగుడుతూ ఉన్నారు ఎన్టీఆర్. చాలా బాగా చేశారు.. ఇంకా బాగా చేయాలి అని ఎంకరేజింగ్‌గా మాట్లాడేవారు. ♦ ఈ సినిమాలో నటన కంటే డబ్బింగ్‌కే ఎక్కువ కష్టపడ్డాను. కొన్నిసార్లు డబ్బింగ్ చెబుతూ పడిపోయే పరిస్థితులు వచ్చాయి. డబ్బింగ్ క్రెడిట్ పెంచల్ దాస్‌గారు, అసోసియేట్ దర్శకుడు ఆనంద్, ఇంజనీర్ పప్పుకి ఇవ్వాలి. ♦ ఈ సినిమా కథ వినలేదు. ఒక డైరెక్టర్ని నమ్మానంటే అంతే. సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ ఓ నలభై మందిని కొడుతుంటే, ఎప్పుడూ ఇవేనా ఇంక మారరా? అనుకున్నాను. త్రివిక్రమ్ అయినా కొత్తగా చేయొచ్చుగా అనుకున్నాను. మధ్యాహ్నానికి ఫైట్ వద్దు.. ఇంకోలా చేద్దాం అనడంతో ఆశ్చర్యపోయా. అది ఈ సినిమా బ్యూటీ. ♦ ‘గూఢచారి’లో టెర్రరిస్ట్‌గా, ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్‌గా, ‘అరవింద సమేత..’లో ఫ్యాక్షనిస్ట్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేశాను. మూడు రకాల పాత్రలకు కారణం దర్శకులే. తర్వాత సినిమాకు ఏం చేయాలి అని ప్రతి సినిమాకు అనుకుంటూనే ఉంటాను. ♦ పాత సినిమాల్లో యస్వీ రంగారావు, నాగభూషణం పాత్రలు తమ పాత్రలను డామినేట్ చేసినా కూడా ఇష్టంగా పెట్టుకునేవారు హీరోలు. అందుకే అవి అంత పెద్ద సినిమాలు అయ్యాయి. ‘శుభలగ్నం’ సినిమాని ఆమని సినిమా అని దర్శకుడు అన్నారు. నేను కూడా క్రెడిట్ ఆమనికి వెళ్లాలని అన్నాను. ఈ సినిమాకు కూడా తారక్ ఇలానే చెప్పారు. ‘మన కంటే సినిమా పెద్దది. సినిమా పెద్దది అయితేనే హీరో ఇంకా పెద్దవాడు అవుతాడు అని అన్నాడు. ♦ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఎంటర్టైన్మెంట్తో ఉన్నది అయినా, సాఫ్ట్ హస్బెండ్ పాత్రలు చేయాలని ఉంది. క్లాస్ పాత్రలను ఇష్టపడతాను. ‘గాడ్ పాధర్’ లాంటి సినిమా చేయాలనుంది. -
అరవింద సమేత.. నాన్–బాహుబలి రికార్డు!
అరవింద ఆల్రెడీ మెప్పించింది.. పండగ మార్కులు కొట్టేసింది.ఈ రోజు మరో రెండు సినిమాలకు తోరణాలు రెడీ అయ్యాయి. అభిమానులకు ఇంతకు మించి పండగ ఏముంటుంది? మూడు సినిమాలు! ఒకటి హిట్టు, రెండు మంచి టాపిక్. ఎంజాయ్ ది సినిమా దసరా. కుటుంబ సమేతంగా... ‘కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ల దాక .. కర్నూల్ కొండారెడ్డి బురుజు నుండి అనంతపూర్ క్లాక్ టవర్ దాకా.. బళ్లారి గనుల నుండి బెలగావ్ గుహల దాకా తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’... పవర్ఫుల్ డైలాగ్.‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు లేదు’.. అర్థవంతమైన డైలాగ్.. ‘పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా’ ఆలోచింపజేసే డైలాగ్... ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈ డైలాగ్స్ చాలు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేయడానికి. హీరో అంటే విలన్‌తో హోరాహోరీగా తలపడాలి. ఫర్ ఎ చేంజ్ ‘శాంతి’ మార్గం అంటే.. పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఆ మాట అంటే? సినిమా చప్పగా ఉంటుంది. కానీ హీరోతో ఆ మాట అనిపించి, అభిమానులకు కావాల్సిన యాక్షన్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. అందుకే ‘అరవింద సమేత వీర రాఘవ’ భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దసరా పండగకి వారం ముందే ఈ సినిమా విడుదలై, ఎన్టీఆర్ అభిమానులకు పండగని ముందే తెచ్చింది. దాదాపు 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్లను ‘సేఫ్ జోన్’లో ఉంచుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్, టేకింగ్.. అన్నీ కుదిరిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం విడుదలైన ఈ సినిమా ఈ మంగళవారం సెకండ్ షో కలెక్షన్లు వరకూ ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం ఈ విధంగా... – ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కలెక్షన్స్ – 115 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన షేర్ 55 కోట్లు కాగా వరల్డ్ వైడ్ షేర్ 74 కోట్లు. ఓవర్సీస్ 12 కోట్లకు అమ్మితే మంగళవారం వరకు 11కోట్ల 30 లక్షలు రాబట్టింది. నైజాం హక్కులను ‘దిల్’ రాజు 18 కోట్లకు కొన్నారు. ఆయన ఫుల్ సేఫ్‌లో ఉన్నారట. ఇప్పటికే గుంటూరు, సీడెడ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లంతా సేఫ్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా వైజాగ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, కర్ణాటక బయ్యర్లు ఈ శుక్రవారం నుండి లాభాల బాటలో ఉంటారని ట్రేడ్ వర్గాల అంచనా. ఇవే కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను, శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 45 కోట్లకు అమ్మారట చిత్రనిర్మాతలు. మొత్తం మీద ‘అరవింద సమేత...’ చిత్రబృందానికి దసరా పండగే పండగ. ‘బాహుబలి’ తర్వాత! ‘అరవింద సమేత...’ ఓపెనింగ్ వీకెండ్ సేల్స్‌లో నాన్–బాహుబలి రికార్డును సాధించినట్లు బుక్ మై షో నిర్వాహకులు అధికారికంగా పేర్కొన్నారు. ‘‘బుక్ మై షోలో ‘అరవిందసమేత’.. చిత్రానికి 12 లక్షల టిక్కెట్స్ సేల్ అయ్యాయి. ఈ ప్లాట్ఫామ్లో ఓపెనింగ్ వీకెండ్ సేల్స్ విషయంలో ‘బాహుబలి–2’ తర్వాత ఈ ప్లేస్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానిదే. తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి’’ అని బుక్ మై షో ప్రతినిధి పేర్కొన్నారు. ఇద్దరు మగువల మధ్య... స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా.. జాయినైన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పనేంటో తెలుసా... అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా? అని అమ్మాయిలు. అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా? అని అబ్బాయిలు ఏరుకోవడం. రామ్ లాంటి హుషారైన ఓ కుర్రాడు ఇలాంటి డైలాగ్ చెప్పాడంటే.. ఇంకా అతను ఎవర్నీ ఏరుకోనట్టే. అదేనండీ.. ప్రేమలో పడనట్టే. కానీ అతను అనుపమా పరమేశ్వరన్‌ని చూసి మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది ఫాలోయింగ్ స్టార్ట్ చేశాడు రామ్. కానీ ఈజీగా పడితే వాళ్లు అమ్మాయిలు ఎందుకు అవుతారు? పైగా అది వాళ్ల హక్కాయే. ఈ లవ్‌ట్రాక్ అలా ఉండగానే... రామ్ లైఫ్‌లోకి మరో అమ్మాయి ప్రణీత వస్తుంది. ఈ ఇద్దరి అమ్మాయిల మధ్యలో రామ్‌కి ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి ప్రకాశ్‌రాజ్ ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేస్తే.. ఆ ఫ్రెండ్ రామ్‌కి మావయ్య అవుతాడట. ఆ మావయ్య కూతురే అనుపమ అట. అంటే.. విడిపోయిన కుటుంబాలను కలపడం కోసమే అనుపమాను రామ్ ప్రేమించాడా? ఏమో.. ఈ రోజు థియేటర్స్‌కి వెళ్లి ‘హలో గురు ప్రేమ కోసమే’ చూస్తే తెలుస్తుంది. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ బిజినెస్ 28 కోట్లు అయిందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. ‘హలో..’ కొన్ని డైలాగ్స్ ‘‘పెళ్లయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ అవ్వడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండటం వల్ల బాగుటుంది’’ – అనుపమ‘‘ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’’ – రామ్ ‘‘అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా?’’ – ప్రకాశ్‌రాజ్‘‘అబద్ధం చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు’’ – రామ్ ‘‘గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అనే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి.. మర్చిపోవాలి అని అనుకునే అమ్మాయిని మాత్రం...చచ్చేదాకా మర్చిపోలేం’’ – రామ్ పొట్టేల్ని కాదురా... పులివెందుల బిడ్డని ‘‘నీకు దమ్ముంటే పగ తీర్చుకోవడానికి మళ్లీ మా ఊరికి రా.. చూసుకుందాం’’... విలన్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు హీరో. విలన్ కూడా తక్కువోడేం కాదు. పవర్‌ఫుల్లే. మరి.. హీరో ఊరికి విలన్ వెళతాడా? పగ తీర్చుకుంటాడా? పందెంలో గెలిచేది ఎవరు? దసరా పండగకి తెలిసిపోతుంది. దసరా బాక్సాఫీస్ బరిలోకి పందెం కోడిలా దూసుకొచ్చారు విశాల్. కెరీర్ స్టార్టింగ్‌లో విశాల్ చేసిన మంచి మాస్ మాసాలా మూవీ ‘పందెం కోడి’. ఈ సినిమాకి సీక్వెల్ ‘పందెం కోడి–2’. పార్ట్ 2 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ పార్ట్ కథని గుర్తు చేసుకుందాం.హీరో విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, వేరే ఊళ్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళతాడు. ఆ ఫ్రెండ్ చెల్లెలు మీరా జాస్మిన్ అందచందాలకు, అల్లరికి పడిపోతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. చుట్టపు చూపుగా వచ్చిన హీరో మళ్లీ తన ఊరికి ప్రయాణం అవుతాడు. కట్ చేస్తే.. సరిగ్గా బస్ ఎక్కుతున్న సమయంలో ఓ గూండా ఓ వ్యక్తిని చంపడానికి వెంటాడతాడు. అతన్నుంచి ఆ వ్యక్తిని కాపాడి, గూండాని రప్ఫాడిస్తాడు విశాల్. అతనెవరో కాదు.. పేరు మోసిన గూండా. ఊరుకుంటాడా? విశాల్ వివరాలన్నీ అతని స్నేహితుడి కుటుంబం ద్వారా తెలుసుకుని, అతని ఊరెళతాడు. అక్కడికెళ్లాక తెలుస్తుంది.. విశాల్ తండ్రి చాలా పవర్ఫుల్ అని. అయినా విశాల్ కుటుంబాన్ని అంతం చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురు చూస్తాడు. గుడి ఉత్సవాల్లో ఆ పని పూర్తి చేయాలనుకుంటాడు. ఒకవైపు విలన్ ప్లాన్‌లో అతనుంటే మరోవైపు రెండు కుటుంబాలూ మాట్లాడుకుని విశాల్‌కి, మీరా జాస్మిన్‌కి పెళ్లి చేయాలనుకుంటారు. గుడి ఉత్సవాలు రానే వచ్చాయి. విలన్ ప్లాన్ ఫెయిలవుతుంది. అప్పుడు హీరో.. దమ్ముంటే మళ్లీ మా ఊరు రా అని విలన్‌తో పందెం కాస్తాడు. 13ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పందెం కోడి’ కథ ఇది. ఇప్పుడర్థమైంది కదా.. పార్ట్ 2 ఎలా ఉంటుందో? రెండు భాగాలకు లింగుస్వామియే దర్శకుడు. దసరా సందర్భంగా ఇవాళ సినిమా రిలీజవుతోంది. శాంపిల్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘కత్తిని చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డన‘ఏసేస్తా ఏసేస్తా అని చెప్పడం కాదు.. ఏసెయ్యాలి’.‘రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండ్రా’, ‘మగాడు నరికితేనే కత్తి నరుకుద్దనుకుంటున్నావా? ఆడది నరికినా నరుకుద్ది రా’‘మా వంశంలోని చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకూ మేము ఉంటాం’.ఇదండీ ట్రైలర్. టీజర్లోనూ ఆకట్టుకునే డెలాగ్స్ ఉన్నాయి.‘‘పవర్ఫుల్ డైలాగ్స్‌తో, పవర్ఫుల్ యాక్షన్‌తో, కుటుంబం మొత్తం చూసే మంచి సెంటిమెంట్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫెస్టివల్ ఫీస్ట్‌లా ఉంటుంది’’ అని చిత్రసమర్పకుడు ‘ఠాగూర్’ మధు తెలిపారు. విశాల్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 60 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 థియేటర్లలో విడుదలవుతోందని ‘పందెం కోడి–2’ యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అప్పట్లో మీరా జాస్మిన్ చేసిన అల్లరి అమ్మాయి పాత్రను ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ చేయడం విశేషం. అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట. -
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాపై కక్షగట్టింది
-
రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్ స్టార్ట్!
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్. గత కొన్ని నెలలుగా ఈ సినిమాను ఫుల్ టైట్ షెడ్యూల్స్‌తో ఏకధాటిగా పూర్తి చేశారాయన. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఓ హాలిడే తీసుకుంటారని ఊహించారు. కానీ, నో హాలిడే అంటున్నారాయన. రాజమౌళితో చేయబోయే సినిమా లుక్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమాలో ఇద్దరి హీరోల లుక్స్ పూర్తిగా సరికొత్తగా ఉండనున్నాయట. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 45రోజుల పాటు కఠినమైన శారీరక శిక్షణ తీసుకోబోతున్నారట. వచ్చే నెల 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2020లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. -
అరవింద సమేత..సక్సెస్ మీట్
-
ఆజన్మాంతం రుణపడి ఉంటా
‘‘ఒక సంఘటన వల్ల విషాదఛాయలు కమ్మిన మా ఇంట్లోకి వెలుతురు రేఖను, ఓ నవ్వు రేఖను తీసుకొచ్చిన నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, చిత్ర బృందానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. చాలా రోజుల తర్వాత మా అమ్మగారి ముఖంలో నవ్వు చూశా. ఈ ‘అరవిందసమేత...’ విజయాన్ని మా నాన్నగారికి (హరికృష్ణ) ఎందుకో గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉంది సామీ (త్రివిక్రమ్‌ని ఉద్దేశిస్తూ) అని అడిగాను. మా నాన్నగారికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేలా దోహదం చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్‌మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నా గుండె లోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని త్రివిక్రమ్‌గారితో చేయాలనుకున్నా. ఆ తరుణం మూడు రోజుల క్రితం ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంతో రానే వచ్చింది. ఈ చిత్రం విజయం నా ఖాతాలో వేశారు త్రివిక్రమ్‌గారు. కానీ, ఇది ఆయన కలంలోని సిరా నుంచి వచ్చిన విజయం. దర్శకునిగానే కాదు.. ఓ గురువుగా కూడా త్రివిక్రమ్ ఈ సినిమాను ముందుండి నడిపించారు. నిర్మాత పాత్రను వంద శాతం నిర్వహించారు చినబాబుగారు. సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా.. ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా ‘అర వింద సమేత వీరరాఘవ’. వీటన్నింటినీ దాటుకుని ఒక వెల్లువలాంటి విజయాన్ని ఇచ్చి, పండగను మా ఇళ్లలోకి తీసుకొచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లో వంద కోట్లు దాటించడానికి సారధి ఎన్టీఆరే. వాళ్ల తాతగారి పేరు నిలబెట్టడం కాదు.. దాన్ని మ్యాచ్ చేయగల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆయన లైఫ్‌లో అంత విషాదం జరిగినా... మేము ఎక్కడ నలిగిపోతామేమోనని ఆయన నలిగిపోయాడు. ఈ సినిమా విజయం కచ్చితంగా ఎన్టీఆర్ ఖాతాలోకే వెళుతుంది. చినబాబుగారు ఖర్చుకు వెనకాడరు. నా మొదటి విమర్శకుడు ఆయనే’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు సునీల్, నవీన్‌చంద్ర, శత్రు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రచయితలు రామజోగయ్యశాస్త్రి, పెంచలదాస్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజ్‌కి అప్‌గ్రేడ్ అయినట్టుంది
‘‘పాటలు ఎంత సక్సెస్ సాధించినా కూడా సినిమా హిట్ అయితేనే పాటలు మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్తాయి. డైలాగ్‌కు మ్యూజికల్ వెర్షనే పాట అని నమ్ముతాను’’ అని తమన్ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్.రాధాకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘అరవింద సమేత’ సినిమా కోసం పని చేయడం మంచి అనుభూతి. ఒక్కోపాట చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ అన్నయ్య, త్రివిక్రమ్‌గారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మనసు పెట్టి చేశావు అని ఆ ఇద్దరూ అభినందించడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది దర్శకులు అభినందిస్తున్నారు. ► ఈ చిత్రం కథకు అనుగుణంగానే మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఎక్కడా కావాలని పాటను ఇరికించలేదు. అంత ఇంపార్టెన్స్ ఉంది కథకు. పక్కదారి పట్టకుండా తెరకెక్కించినందుకు త్రివిక్రమ్ గారికి హ్యాట్సాఫ్. ► ఎనిమిదేళ్లుగా త్రివిక్రమ్‌గారితో పని చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా పూర్తయ్యాక స్కూల్ నుంచి కాలేజ్‌కి అప్‌గ్రేడ్ అయినట్టుంది. ► గత కొంత కాలంగా కేవలం కథానుగుణంగా పాటలు అడుగుతున్నారు. అందరి అభిరుచులు మారుతున్నాయి. మంచి పరిణామం. కాపీ ట్యూన్స్ వాడితే ఇంత మైలేజ్ ఉండేదా? నేను ఏమీ అనననేగా నన్ను అడుగుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని ఆమాట అడుగుతారా? ► సంగీత దర్శకుడిగా రాణించాలంటే చాలా ప్రోగ్రామ్స్ చేయాలి. స్టేజ్షోలు కూడా ఉపయోగపడతాయి. ఆ అనుభవంతోనే రాణించగలం అని నమ్ముతాను. -
పరిచయం లేనోళ్లూ అభినందిస్తున్నారు
‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కథ చెప్పినప్పటి నుంచి ఎన్టీఆర్‌కి విజయంపై చాలా ఎక్కువ నమ్మకం. నాకంటే కూడా ఎక్కువ నమ్మాడు. పాటలు, డ్యాన్స్‌లు, ఎంటర్టైన్మెంట్.. కొంచెం జోడిద్దామా? అంటే ‘అవేవీ అవసరం లేదు మీరు కథ చెప్పింది చెప్పినట్టు తీయండి చాలు’ అని బలంగా నమ్మారు. థ్యాంక్స్ టు ఎన్టీఆర్’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. మమత సమర్పణలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు చాలా గౌరవం తెచ్చింది. నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. నాకు పరిచయం లేనోళ్లు కూడా నా ఫోన్ నంబర్ కనుక్కుని మరీ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. జెన్యూన్ కథని ఒత్తిడికి లోనవకుండా చెప్పాం. సినిమా బాగుంది కాబట్టే రివ్యూలు కూడా నిజాయతీగా ఇస్తున్నారు. ఇంట్రడక్షన్, ఇటర్వెల్ ఫైట్స్‌ని రామ్–లక్ష్మణ్ అద్భుతంగా కంపోజ్ చేశారు. మమ్మల్ని ఎగై్జట్ చేసిన అంశాల్లో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడటం ఒకటి. మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం అందరికీ నచ్చింది’’ అన్నారు. నిర్మాత ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాని నైజాంలో విడుదల చేశా. తొలి షో నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. త్రివిక్రమ్ ఈ సినిమాతో చాలా మాయ చేశాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ‘ఇంద్ర, ఆది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’వంటి చిత్రాలొచ్చినా ఈ చిత్రంలో ఫ్యాక్షన్ని సెటిల్డ్‌గా చూపించారు. ఎన్టీఆర్ ఒన్‌మేన్ షో ఇది. ఇండస్ట్రీలో రెండు నెలలుగా మంచి హిట్ పడలేదు. ఈ సినిమాతో హిట్ వచ్చింది’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్, నటులు సునీల్, నవీన్‌చంద్ర, శత్రు, చమ్మక్ చంద్ర, ఎడిటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ
టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : ఎన్టీఆర్, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్ చంద్ర, రావూ రమేష్ సంగీతం : తమన్ ఎస్ దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు) ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ కలిసి వర్క్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. (సాక్షి రివ్యూస్) అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడా..? త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్, టేకింగ్‌తో పాత ఫామ్‌ను అందుకున్నాడా? కథ ; ‘అరవింద సమేత వీర రాఘవ’ నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయి 30 ఏళ్ల పాటు ఊళ్లను నాశనం చేస్తాయి. 12 ఏళ్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. కాని తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఎన్టీఆర్ సినిమా అంటేనే వన్ మెన్ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పేందుకు ఎన్టీఆర్ చూపించిన డెడికేషన్ స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. లుక్స్‌పరంగానూ ఎన్టీఆర్ పడిన కష్టం సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్గా పూజా హెగ్డే ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. గ్లామర్ పరంగానూ మంచి మార్కులు సాధించింది. విలన్ పాత్రలో జగపతి బాబు జీవించాడు. లుక్స్ పరంగానూ భయపెట్టాడు. (సాక్షి రివ్యూస్) యంగ్ హీరో నవీన్ చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్‌గా టర్న్ అయిన సునీల్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కింది. రావూ రమేష్, దేవయాని, సుప్రియా పాతక్, ఈషా రెబ్బా, శుభలేక సుధాకర్, బ్రహ్మాజీలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ఫ్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. అభిమానులు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్, ఎమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా.. తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా లవ్ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, టేకింగ్ అలరిస్తాయి. ద్వితీయార్థం ఎమోషనల్ సీన్స్‌తో భారంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది. తమన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలతో రిలీజ్‌కు ముందే ఆకట్టుకున్న తమన్.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. పీఎస్ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; ఎన్టీఆర్, జగపతి బాబుల నటన డైలాగ్స్ యాక్షన్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; కొన్ని బోరింగ్ సీన్స్ రొటీన్ స్టోరి సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘అరవింద సమేత’కు టీడీపీ చిచ్చు
సాక్షి, నక్కపల్లి/పాయకరావుపేట: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమా టికెట్ల వ్యవహారం నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ సినిమా నేడు (గురువారం) విడుదల కానుంది. పాయకరావుపేటలో సాయిమహల్ థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. పట్టణంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సినిమాలు విడుదలైతే నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను హడావుడి చేస్తుంటారు. వీరిద్దరూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే. అయితే రాంబాబు కొద్దిరోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వనాధుల శ్రీను ఇటీవలే వైఎస్సార్ సీపీలో చేరారు. అయినా నందమూరి హీరోలపై అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ‘అరవింద సమేత’ మొదటి షో అభిమానులే చూడాలన్న ఆశతో రాంబాబు, శ్రీను అభిమానులను వెంటబెట్టుకుని టికెట్ల కోసం వెళ్లారు. అయితే థియేటర్ మేనేజర్.. మీరు వైఎస్సార్సీపీకి చెందినవారు కావడంతో టికెట్లు ఇవ్వొద్దని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పారని కాబట్టి టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ వద్ద ఫ్లెక్సీలు తొలగించి కిందపడేసిన అభిమానులు పార్టీలు వేరైనా తాము నందమూరి అభిమానులమేనని, తమకు టికెట్లు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి తమ అభిమాన నటుడి సినిమాకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టామని, తమకే టికెట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. సినిమా టికెట్లలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిత హయాంలోనే ఇలా జరుగుతోందని చెప్పారు. అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకే టికెట్లు అమ్ముకోండి.. వారే సినిమా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (అందుకే మాట్లాడటం మానేశాం : ఎన్టీఆర్) తమకు టికెట్లు ఇవ్వనప్పుడు తాము కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎందుకంటూ వాటిని తొలగించారు. థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారు. ఉదయం ఎమ్మెల్యే అనిత టికెట్లు ఇవ్వొద్దన్నారని చెప్పిన మేనేజర్ సీతారామ్ సాయంత్రానికి మాటమార్చి తాను ఎమ్మెల్యే పేరు ప్రస్తావించలేదని మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఇవ్వొద్దన్నారని మాత్రమే చెప్పానన్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ సభ్యులంతా వైఎస్సార్సీపీకి చెందినవారని వారికి టికెట్లు ఇవ్వద్దని చెప్పినట్లు వెల్లడించారు. (ప్రొఫెషనల్ బ్రదర్స్) -
పవన్ కల్యాణ్ చెప్పకుండా వెళ్లిపోయారు
‘‘ఏ సినిమాకైనా ప్రయాణమే ముఖ్యం. దాని ఫలితం బోనస్ లాంటిది’’ అన్నారు త్రివిక్రమ్. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెకిక్కంచిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల అవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన విశేషాలు... # ఆడియో ఫంక్షన్లో ఎక్కువ మాట్లాడకపోవటానికి కారణం ఎన్టీఆర్‌కి జరిగిన విషాదం తాలూకు గాయం ఇంకా పచ్చిగానే ఉండటమే. ఏం మాట్లాడినా మళ్లీ ఆ విషయం గుర్తు చేసినట్టు ఉంటుంది అని తక్కువగా మాట్లాడాను. హరికృష్ణగారికి ఇలా అయింది అని తెలిసిన వెంటనే సినిమాని సమ్మర్లో రిలీజ్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. కార్యక్రమాలు జరిగిన రెండో రోజే ఎన్టీఆర్ ఫోన్ చేసి 11న సినిమా విడుదల చేస్తున్నాం అని చెప్పాడు. అనుకోకుండా సినిమాలో తండ్రి చనిపోయిన తర్వాత చితి పెట్టే సన్నివేశాలతో పాటు మరికొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. నిజజీవితంలో తండ్రికి సంబంధించిన చివరి కార్యక్రమాలు పూర్తి చేశాక తారక్ ఈ సినిమాలో ఆ సీన్స్ చేశాడు. # ఫ్యాక్షన్ సినిమా అనగానే యుద్ధం మొదలయ్యే ఘట్టం, ఆ తర్వాత యుద్ధం జరిగేప్పుడు బావుంటుంది. కానీ ఆ యుద్ధం తాలూకు పర్యవసనాలు అంత కిక్ ఇవ్వవు. అందుకే పురాణాలు చెప్పేటప్పుడు కూడా యుద్ధ పర్వాలు బాగా వివరించినప్పటికి చివరికి వచ్చేటప్పటికి లాగించేస్తారు. ఎందుకంటే ఆ హింస తాలూకు పర్యవసనాలు బతకాలన్న ఆశను చంపేస్తాయి. వాటి గురించి చెబితే సినిమాకు కొత్త యాంగిల్ వస్తుంది కదా అనుకున్నాం. అలాగే ఏ విషయాన్నైనా ఇంట్లో ఆడవాళ్లతో తప్ప ఊర్లో అందరితో చర్చిస్తాం. ఒకవేళ వాళ్లు ఇంట్లో ఆడవాళ్లు చెప్పింది వింటే హింస ఇంత దాకా రాకపోవచ్చు కూడా. ఆ విషయాన్ని కూడా సినిమాలో చెప్పాం. # మన పురాణాలు, సాహిత్యాల్లో ఏదైనా మంగళం (శుభం)తో మొదలై మంగళంతో ముగుస్తుంది.ఇప్పుడు అంతా అమంగళమే. టీవీ పెట్టగానే ఆ యాక్సిడెంట్, ఆ విషాదం అని చూస్తున్నాం. మనం కూడా ఆ వార్తలు విని వాటికి రాటుదేలిపోయాం. కానీ మన పూర్వీకుల రచనల్లో ఎక్కువ రొమాన్స్ కనిపిస్తుంది. అంటే వాళ్లు లైఫ్‌ని అలా ఆస్వాదించారేమో? బయట ప్రపంచం తాలూకు పరిస్థితులే సినిమాల్లో ప్రతిబింబిస్తాయి. అప్పట్లో రాచరికం, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత నిరుద్యోగ సమస్యలు మన సినిమాల్లో కనిపించాయి. # ‘అరవింద...’ సినిమా రీసెర్చ్‌లో భాగంగా రాయలసీమకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. తిరుమల రామచంద్రగారి సాహిత్యం గురించి తెలుసుకున్నాను. పెంచల్ దాస్ గారిని ఓ పాట కోసం పిలిచాను. తర్వాత డైలాగ్స్ విషయంలో కూడా సాయంగా ఉన్నారు. రీసెర్చ్‌లో భాగంగా చాలా మందిని కలిశాం. రాయలసీమ వాళ్లు ఉన్నారు కానీ వాళ్లలో రాయలసీమ లేదు. ఈయనలో ఉంది. # ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా తక్కువగా మాట్లాడతాడు. ఫస్ట్ హాఫ్‌లో డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ రాని చోటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఫ్యాక్షన్ సినిమా అనగానే కొంచెం హింసను గ్లోరిఫై చేస్తాం. కానీ అదొక్కటే కాదు.. ఈ సినిమాలో రాయలసీమ సొగసును చూపించాం. # కలెక్షన్స్ పట్టించుకోను అనడం అబద్ధం అవుతుంది. తెలుసుకుంటాను. కానీ అది ఆ క్షణం మాత్రమే. మళ్లీ మామూలే. స్థితప్రజ్ఞత అనను కానీ ఏదైనా ఎక్కువ సేపు నాతోపాటుగా ఉంచుకోలేను. # సినిమా వైఫల్యాలు చూసి తెలుసుకునేది ఏం ఉండదు. పొరపాటు ఎక్కడ జరిగిందో మనకే అర్థం అయిపోతుంటుంది. ‘అజ్ఞాతవాసి’ సినిమా రిలీజ్‌కు ముందు ఇది కాపీ అంటూ ఓ హాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్లు వేశాడు అన్నారు. సినిమా తర్వాత? వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్లు అడిగి ఉంటే బాధపడుతూ ఇచ్చేవాణ్ణి. ఆ సంగతలా ఉంచితే.. ‘అజ్ఞాతవాసి’ నిర్మాత లాస్ అయ్యాడని మా రెమ్యునరేషన్ ఇచ్చేశాం కదా. సినిమా బాలేదని, కాపీ అని చాలా విమర్శలు వినిపించాయి. వాటిని తీసుకోవడమే. ఇంతకు మునుపు మనకు ఏదైనా కోపం, ఆవేశం వచ్చిందంటే మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతోనో పంచుకునేవాళ్లం. ఇప్పుడు మన చేతుల్లో ఫోన్ వచ్చేసింది. ఏమనిపించినా టక్కున (సోషల్ మీడియాలో పోస్ట్‌ని ఉద్దేశించి) చెబుతున్నాం. అన్నదాన్ని మళ్లీ వెనక్కి తీసుకోలేం. అది ఆ క్షణం మాత్రమే. తర్వాత కొన్ని రోజులకు ఇలా అన్నామేంటి? అని మనకే అనిపిస్తుంది. # నాలో దర్శకుడు ఇష్టమా? రచయిత ఇష్టమా అంటే రెండిటినీ విడదీసి చూడలేను. రాముడు, భీముడు సినిమాలో ఇద్దరు రామారావుగార్లలాగా. మాటల మాంత్రికుడు ఇలాంటి బిరుదులు అన్నీ పెద్దగా తీసుకోను. అందుకే ఫంక్షన్స్‌లో యాంకర్స్ రెండు మూడు వాక్యాలు నా గురించి చెప్పేటప్పుడు మొదటి వాక్యం పూర్తి కాకముందే స్టేజ్‌పైకి వెళ్లిపోతా. అలా అయితే మిగతావి చెప్పలేరు కదా (నవ్వుతూ). # ఫ్యాక్షన్ సమస్యను పరిష్కరిస్తున్నాం అనగానే హీరో మంచి మాటలు బోధిస్తాడనుకోవద్దు. ఇందులో హీరో ఏదీ బోధించడు. ఈ జనరేషన్‌కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటారు. జీవితంలోని సంఘటనల్ని పూర్తి చేసేది సంభాషణలే. ఇద్దరు మనుషులు కొట్టుకునేది, ప్రేమించుకునేది అన్నీ మాటల వల్లే. అలానే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు చూపించాం. # మన సినిమాల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ సినిమాల్లో మజిల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ల సినిమా 90 నిమిషాల్లో అయిపోతుంది. మనది అప్పటికి సగం అవుతుంది. వాళ్లతో మనం ఏం తక్కువ? వాళ్ల కెమెరాలు కొత్తగా ఏం బంధిస్తాయి? వాళ్ల లైటింగ్‌లో కాంతి కొత్తగా ఏం ఉంటుంది? ఈ విధానాన్ని ఎవరో ఒకరు బద్దలు కొట్టాలి అని చూస్తుంటాం. కానీ మనం మాత్రం చేయం. నేను కూడా మినహాయింపేం కాదు. వాడికి వర్కౌట్ అయితే మనం చేద్దాంలే అన్నట్టుగా ఉంటాం. కానీ ప్రతి పది, పదిహేనేళ్లకు ఇండస్ట్రీ మారుతుంటుంది. ‘లవకుశ’ సినిమా కలర్లో తీసినప్పటికీ పూర్తి స్థాయి కలర్ సినిమాలు రావడానికి 12 ఏళ్లు పట్టింది. అప్పటికి హిందీ, తమిళంలో కలర్ సినిమాలు చేసేస్తున్నా కూడా. # ఇప్పుడు ప్రేక్షకుడు ఇంట్లో జబర్దస్త్, కపిల్ శర్మ, బ్రహ్మానందం షో.. ఇలా కామెడీ షోస్ చూస్తున్నారు. సినిమాలో అనవసరమైన కామెడీ పెడితే, సినిమా మధ్యలో ఈ కామెడీ ఏంటి.. కథ చెప్పరా బాబు అంటారు ఆడియన్స్. # ఈ మధ్య కొత్త దర్శకుల సినిమాలు చూస్తుంటే ఆనందంగాను, ఈర్ష్యగానూ ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి, రంగస్థలం, కంచరపాలెం, పెళ్ళి చూపులు, గూఢచారి, ఆర్ఎక్స్ 100’. # దర్శకుడికి బడ్జెట్ మీద కొంత అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎక్కువైతే ఇటలీలో జరిగేది ఇండియాలో అన్నట్లుగా, మరెక్కడో జరిగేది ఇంకో చోట అన్నట్లు సీన్లు రాసేస్తాం (నవ్వుతూ). # ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు అనుకున్నాం. కానీ ‘నీకు తెలుగు సినిమా అర్థం అవ్వడానికి టైమ్ పడుతుంది, నాకు నీ మ్యూజిక్ అర్థం అవ్వడానికి టైమ్ పడుతుంది’ అని చెప్పాను. ఈ సినిమాలో తమన్ నాకు చాలా సర్ప్రైజ్లు ఇచ్చాడు. సాధారణంగా నీ పాటల్లో హిందీ ఎక్కువ వినిపిస్తుంది. అలాగే డ్యాన్స్ నంబర్లు ఉండే పాటలు వద్దు అని రెండు మూడు సూచనలు చెప్పాను. దేవిశ్రీ ప్రసాద్‌తో పని చేయకపోవడానికి కారణం నన్ను నేను వెతుక్కునే ప్రయత్నమే. # పవన్ కల్యాణ్ తన అన్నయ్య, అమ్మగారికే చెప్పకుండా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. నేనూ మీలాగే పేపర్లో చూసి చదువుకున్నాను. ఆయన రాజకీయ ప్రసంగాలు రాసి పెడుతున్నాను అంటున్నారు. నాకు సినిమా స్క్రిప్ట్ రాయడమే బద్ధకం. ఇక అదెక్కడ రాస్తాను. # నేను అందరితో నిజాయతీగా ఉంటాను. అందుకే అందరికీ దగ్గర అవుతుంటానేమో. నేను ఎవరితో అయితే పని చేస్తున్నానో వాళ్లందరూ నాకన్నా తెలివిగలవాళ్లు. మనం మన ఐడియాను సెల్ చేయడానికి వెళ్తున్నామా లేక మామూలుగా మాట్లాడుతున్నామా? అన్నది వాళ్లకు అర్థం అయిపోతుంది. ఎన్టీఆర్ చాలా త్వరగా చేసేస్తాడు అని అంటుంటాం. ఆ ట్రిక్ నాకు తెలిసిపోయింది. స్క్రిప్ట్‌ని చాలాసార్లు వింటాడు. బాగా విని మైండ్లోకి ఎక్కించేసుకుంటాడు. ఆ సన్నివేశం తీసేటప్పుడు వెంటనే అదే కదా అని పూర్తి సీన్ యాక్ట్ చేసేస్తాడు. విషాద సమయాల్లో ‘ఆయన పక్కన నేను ఉన్నాను’ అని ఎన్టీఆర్ అన్నాడు కానీ మా పక్కన ఆయన ఉండి సినిమా పూర్తి చేశాడు. అయినా మాటలతో తగ్గే విషాదం కాదు అది. -
అరవింద సమేత బ్యానర్ కడుతూ ..
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెంలోని శేషమహాల్ థియేటర్లో పండు అనే యువకుడు పని చేస్తున్నాడు. ‘జూ.ఎన్టీఆర్’ కథానాయకునిగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న సందర్భంగా థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు కట్టే పనిని యాజమాన్యం పండుకు అప్పగించింది. దీంతో బ్యానర్ కట్టే పనిలో అతడు తలమునకలై ఉండగా విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలాడు. ఇది గమనించిన థియేటర్ యాజమాన్యం అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రికి తీసుకురాకముందే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండు మృతితో తమకు సంబంధంలేదంటూ థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం పండు మృతదేహంతో ఆసుపత్రి వద్ద వారు ఆందోళన చేపట్టారు. -
అమ్మ, ప్రణతి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది!
దుఃఖం మనిషిని ఎడారిలో నిలబెడుతుంది.మనసంతా పొడిపొడిగా అనిపిస్తుంది.ముట్టుకుంటే పగిలిపోతుందేమోనన్నంతగా..హృదయం సున్నితం అయిపోతుంది.కష్టం ఒక తీవ్రమైన, తీరని దాహం. ఈ దాహాన్ని కన్నీరే తీర్చగలదు.బంధాల్లో పంచుకున్న ఉప్పే..బాధలోని ఉప్పెనని సమసిపోయేలా చేయగలదు.అవును. కన్నీరూ.. నీరే!జీవనతృష్ణకు పన్నీరే!!∙ జీవితం చిత్రమైనది. కొన్ని నెలల వ్యవధిలోనే ఒక జననం, ఓ దుర్ఘటన చూశారు. ఇప్పుడు మీరు జీవితాన్ని చూసే కోణంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఎన్టీఆర్: జీవితం మీద నాకు అవగాహన ఉంది. ‘జీవితం అంటేనే క్షణికం’. ఆనందాలను ఎదురుచూసి, అవి వచ్చినప్పుడు ఆనందించినట్లుగానే ఒడిదుడుకుల కోసం కూడా సిద్ధంగా ఉండాలి. అవి ఎదుర్కొనేంత మనోధైర్యం ఉండాలి. అప్పుడే అది జీవితం అవుతుంది. ఇది తెలుసు కాబట్టి కొత్తగా నాలో ఏ మార్పూ రాలేదు. ఈ ఆలోచనా ధోరణి ఎప్పుడు అలవాటైంది? మొదట్నుంచీ ఇంతే. బేసిక్‌గా నేనిలానే ఉంటాను. మనకు ఎప్పుడు పిలుపొస్తుందో తెలియదు. జీవితం తాలూకు అన్ని బరువు బాధ్యతలు నిర్వర్తించాలి, ఆనందాలు అనుభవించేయాలి. అద్భుతమైన జీవితాన్ని బతకాలన్నదే నా ఉద్దేశం. నేను నిద్రలేచిన ప్రతి రోజునీ బోనస్లానే అనుకుంటాను. నాన్నగారి హఠాన్మరణం నుంచి మీ అమ్మగారు తేరుకున్నారా? ఆ షాక్ నుంచి మెల్లిగా తేరుకుంటున్నారు. గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మా అందరికంటే అమ్మకు, పెద్దమ్మకు (కల్యాణ్ రామ్ తల్లి) కష్టం. ఇద్దరూ నెమ్మదిగా ఆ విషాదం నుంచి బయటికొస్తున్నారు. ఈ సమయంలో అమ్మకు కొడుకుగా ధైర్యం చెప్పాలి. అలాగే ఇద్దరు బిడ్డలకు తండ్రిగా వాళ్లతో హుషారుగా గడపాలి. ఈ రెండు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? కొన్ని భావాలను బయటకు చెప్పుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉన్న ఈ పరిస్థితిని పంచుకోవడానికి పదాలు దొరకడంలేదు. చెప్పడానికి వీలుగా ఉండే వాక్యాలు కొన్నిసార్లు దొరకవు. ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు నా పరిస్థితి అదే (కాసేపు మౌనం). సాధారణంగా ఆనందం, దుఃఖం.. ఈ రెంటినీ ఎవరితో పంచుకుంటారు? నాలో సగం నా భార్య ప్రణతి. తనతో అన్నీ చెప్పుకుంటాను. మా అమ్మ, నాన్న, కల్యాణ్ అన్న, కొంతమంది మిత్రులు... వీళ్లంతా నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తులు. నా కోసం నిలబడేవాళ్లు. వాళ్ళతో చెప్పుకుంటాను. ఇప్పుడు నాన్నగారు లేరు. కొన్ని ఆనంద సంఘటనలు, విచారకర పరిస్థితులు కొత్త బంధాలను తీసుకు వస్తాయంటారు. మీకు అలాంటివి ఏమైనా ఏర్పడ్డాయా? ఏదీ లేదు. నా బంధాలన్నీ అలానే ఉన్నాయి. ఇలాంటివి నేను నమ్మను. ఇవాళ ఇది జరిగిందని కొత్తగా ఓ బంధం ఏర్పడటం అనేది లేదు. ఉన్న బంధాలు పోతాయని లేదు. బంధాలన్నీ మంచికి, చెడుకి అతీతంగానే ఏర్పడతాయన్నది నా నమ్మకం. చెడు జరిగిందని ఏ బంధాన్నీ తుంచేసుకోలేం. నా పిల్లలిద్దరూ చిన్నవాళ్లే అయినా వాళ్లను చూస్తున్నప్పుడు ఏదో బిగ్గెస్ట్ సపోర్ట్‌లా అనిపిస్తుంది. ఇక నా జీవితం అంతా నా పిల్లలే. దీన్నే సినిమాలకూ అన్వయిస్తారా? రిజల్ట్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్‌తో కొనసాగుతారా? రిజల్ట్‌ని బట్టి రిలేషన్‌షిప్‌లు ఉండవు. ఉండకూడదు అని నమ్ముతాను. మనం ఆరు నెలల పాటు ఒక ప్రయాణం (సినిమా మేకింగ్) చేసిన తర్వాత దాని తాలూకు రిజల్ట్ బాగాలేకపోయినా ఆ ఆరు నెలల ప్రయాణం చాలా బావుంటే దాన్ని వదిలేయలేం కదా. రిలేషన్స్ మనకు అద్భుతమైన ఫీలింగ్‌నిస్తాయి. లోపల చాలా బలాన్ని, భరోసాన్నిస్తాయి. అందుకే సినిమా రిజల్ట్‌తో అవి ముడిపడి ఉండకూడదని అనుకుంటాను. పాతికేళ్ల వయసులో కొంచెం ఆవేశపరుడు అనిపించుకున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. అప్పుడు అలా ఆవేశంగా ఉండి ఉండకూడదని ఎప్పుడైనా అనిపించిందా? నేనెప్పుడూ దేనికీ పశ్చాత్తాపపడలేదు. పాతికేళ్ల వయసులో ఆవేశపరుడు అని మీరు అంటున్నారు. ఆ ఆవేశమే సక్సెస్ తీసుకువచ్చింది అని నేనంటే? మనం మనుషులం. నిరంతరం మారుతూనే ఉంటాం. మార్పు మంచికా లేక చెడుకా అని మనం చెప్పలేం. అయితే మనం మారుతూనే ఉండాలి. మారుతూనే ఉంటాం. ఒక్కో వ్యక్తికి ఒక్కో వయసులో ఒక్కోలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. పాతికేళ్ల వయసులో నాకు పెళ్లి అవ్వలేదు. 27 ఏళ్ల వయసులో పెళ్లయింది. నాకో లైఫ్ పార్టనర్ ఉంది. ఇద్దరు పిల్లలున్నారు. నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మనవళ్లను చూసుకొని మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవారు? మనవళ్లందరితో నాన్నగారు క్లోజ్. జానకి రామ్ అన్న, కల్యాణ్ అన్న పిల్లలు, నా పిల్లలు అభయ్‌తో, భార్గవ్‌తో కూడా సరదాగా ఉండేవారు. నా ఆనందమేంటంటే నాన్నగారు నా రెండో అబ్బాయి భార్గవ్‌ని కూడా చూశారు. మా ఇంట్లో జరిగిన అన్ని వేడుకలకు.. ఆ మధ్య జరిగిన భార్గవ్ నామకరణ వేడుక వరకూ అన్నింట్లో నాన్నగారు ఉన్నారు. ఇక మీద జరగబోయే వేడుకల్లో ఉండరు. అది మాకెప్పటికీ కొరతగానే ఉంటుంది. భౌతికంగా మాతో లేకపోయినా మా అందరి జ్ఞాపకాల్లో ఆయన ఎప్పటికీ ఉండిపోతారు. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు మీ నాన్నగారిని సలహా అడిగేవారా? అడుగుతాం. మా అందరికీ రాముడి పేర్లు పెట్టారు. జానకిరామ్, కల్యాణ్ రామ్, తారకరామ్ అని. మా పిల్లలకు కూడా మేం అలానే పెట్టాం. జానకిరామ్ అన్న కొడుక్కి తారక రామారావు అని, కల్యాణ్ అన్న శౌర్యా రామ్ అని పేర్లు పెట్టారు. నా పిల్లలకు అభయ్ రామ్, భార్గవ రామ్ అని నామకరణం చేశా. నాకు చాలా ఇష్టమైన పేరు భార్గవ రామ్. పిల్లలిద్దరూ అల్లరి చేస్తున్నారా? అల్లరి కామన్. అయితే ఏ ఇంట్లో అయినా పిల్లల అల్లరి తట్టుకోవడం కష్టం. మా ఇంట్లోవాళ్లు నా అల్లరి తట్టుకోలేరు. పిల్లలను నేను బాగా ముద్దు చేసేస్తుంటాను. మా అబ్బాయిలతో ‘నిన్ను సాల్ట్ పెప్పర్ వేసి కొరుక్కు తినేస్తాను రా’ అంటుంటా. మా పెద్దబ్బాయి ఎప్పుడైనా ‘ఇదిగో తీసుకో.. నన్ను తినేయ్’ అని సరదాగా అంటుంటాడు. సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తే భర్తకు కంప్లైంట్ చేస్తుంది భార్య. మీ అల్లరిని ప్రణతి ఎవరికి చెబుతారు? మా అమ్మకు (నవ్వుతూ). ‘వాడి అల్లరి గురించి తెలిసిందే కదా’ అంటుంది. భార్గవ్ అప్పుడు ఆడపిల్ల పుట్టాలి అనుకున్నాం కానీ అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ప్రణతి అంటుంది.. నాకు ముగ్గురు కొడుకులు అని. నాతో కలిపి ముగ్గురు అని తన ఉద్దేశం. కోడలితో తన కొడుకు చేసిన అల్లరిని అత్తగారు షేర్ చేసుకుంటారా ? చాలా షేర్ చేసుకుంటారు. అబ్బో.. నా అల్లరి గురించి చెప్పాలంటే ఒక్కటి కాదు.. చాలా ఉన్నాయి. మా అమ్మ ఏకంగా పుస్తకం రాసేంత ఉన్నాయి. జనరల్‌గా అమ్మమ్మ, తాతయ్యలు ఇంట్లో ఉంటే పిల్లలకు బోలెడన్ని కథలు చెబుతుంటారు. నా పిల్లలకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మా అమ్మ పిల్లలకు చాలా కథలు చెబుతుంది. నా డౌట్ ఏంటంటే.. నా అల్లరి పుస్తకంలో నుంచి కూడా ఏమైనా లీక్ చేస్తుందేమో అని (నవ్వులు). అత్తా కోడళ్ల ఈక్వేషన్ ఎలా ఉంటుంది? నా పెళ్లవ్వక ముందు నేను బాగా కోరుకున్నది ఒక్కటే. మా అమ్మ, నా భార్య బాగా కలసి మెలసి ఉండాలని. ఎందుకంటే నా జీవితంలో అతి ముఖ్యమైన ఆడవాళ్లు వాళ్లిద్దరే. ఎవరితో ఎవరికి పడకపోయినా బాధపడేవాడ్ని. లక్కీగా అలాంటిదేం జరగలేదు. ఇద్దరి మధ్య అద్భుతమైన అండర్‌స్టాడింగ్ ఉంది. నేను ఒక్కడ్నే అబ్బాయిని కాబట్టి అమ్మకు అమ్మాయి లేని లోటు ఉండేది. అందుకే ప్రణతిని కూతురిలా చూసుకుంటుంది. అందుకేనేమో మీ అమ్మగారి తోబుట్టువుల కూతుళ్లను ఆమె బాగా చూస్తారట. అక్కాచెల్లెళ్ల విషయంలో మీరు కూడా బాధ్యతగా ఉంటారని విన్నాం.. ఇది సహజమైన బాధ్యత. దీని గురించి బయటికి చెప్పాలంటే ఏదోలా ఉంటుంది. చెబితే ఆకతాయితనంగా ఉండే అబ్బాయిలకు ఓ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా? అమ్మవాళ్ళు మొత్తం తొమ్మిది మంది. వాళ్లకు పుట్టినవాళ్లల్లో ఆడపిల్లలు ఐదుగురు ఉన్నారు. కూతుళ్లందరూ బాగుండాలని అమ్మ కోరిక. అమ్మ కోరికకు తిరుగుండదు కదా. ఇందాక అన్నాను కదా.. జీవితం క్షణికం అని. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరం కాదు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన బాధ్యతలన్నీ తీర్చాలి. అన్నగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఫ్రెండ్‌గా, మనవడిగా, నటుడిగా... ఈ బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేస్తే జీవితానికి ఓ పరిపూర్ణత వస్తుందని నమ్ముతాను. నేను ప్రాక్టికల్ పర్సన్‌ని. ‘జీవితం అంటే ఇది.. ఇలా ఉండాలి’ అని బోధించే రకాన్ని కాదు నేను. ప్రాక్టికల్‌గా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. మొన్న ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో మీ నాన్నగారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రాక్టికల్‌గా ఉండే మనిషి ఎమోషనల్‌గా ఉండటం కుదురుతుందా? కుదురుతుంది. ప్రాక్టికల్‌గా ఉండటమే ఎమోషనల్‌గా ఉండటం అంటున్నాను. ప్రాక్టికాలిటీ అంటే నిజాన్ని అంగీకరించడం. అందులో ఎమోషన్ కూడా ఓ భాగమే. ఎమోషనల్‌గా ఎందుకు ఉండకూడదు అంటాను. మా నాన్నగారు చనిపోయారు. మరణం సహజం అని తెలుసు. తెలిసినా మనిషి పోయినందుకు బాధగా ఉంటుంది. మా నాన్న పోయారు. బాధ చాలా ఉంటుంది. అది కన్నీళ్ల రూపంలో వస్తుంది. నా దృష్టిలో అది కూడా ప్రాక్టికాలిటీనే. మీ ఫ్యామిలీ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్‌కి గురి కావడం చూస్తున్నాం. అది భయంగా అనిపిస్తుందా? లేదు. జరిగింది జరిగిపోయింది. ఆ ఘటనలను ఎనలైజ్ చేయకూడదు. ఇలా జరిగింది కాబట్టి అలా ఆలోచిస్తున్నాం తప్పితే ఒకవేళ వేరేలా జరిగితే? ఇలా అనుకోం కదా. మనం దేంట్లో నుంచి తప్పించుకోలేం కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం.. హఠాత్తుగా పైన తిరుగుతున్న ఫ్యాన్ మన తల మీద పడొచ్చు. లేదా బయటికి వెళ్లినప్పుడు వేరే ఏదో జరగొచ్చు. ఇది ఇలానే ఎందుకు జరిగింది? అని ఎనలైజ్ చేయలేం. జరగాలని రాసి పెట్టి ఉంటే.. జరుగుతుంది. అంతే. అందుకే ఉన్నంతవరకూ హ్యాపీగా జీవించాలి.బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్లో నాకు మంచి పేరు రావడం ఆనందంగా ఉంది. నెక్ట్స్ సీజన్లో నేనే చేస్తానా? అంటే దాని గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది. త్రివిక్రమ్‌ని స్వామీ అనడంవెనక స్టోరీ లేదు ‘అరవింద సమేత వీర రాఘవ’ అంటూ.. టైటిల్లో హీరోయిన్‌కి ప్రాధాన్యం ఇచ్చారు... కథకు సరిపోతుందని ఆ టైటిల్ పెట్టాం. లక్ష్మీసమేత లక్ష్మీనరసింహులువారు, సీతాసమేత రాములువారు అని దేవాలయాల్లో అంటుంటాం. దేవతలను గౌరవంగా స్మరించుకోవడం అనేది మన సంప్రదాయంలోనే ఉంది. ఈ సినిమా కథ అలాంటిదే కాబట్టి, ఇది జెన్యూన్ టైటిల్‌గా భావించాం. ఒక మనిషి జీవితంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమన్నది ఈ సినిమాలో చెప్పాం. త్రివిక్రమ్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నారు. కాంబినేషన్ కుదిరాక ‘సూపర్ హిట్’ని టార్గెట్ చేయాలని మాట్లాడుకున్నారా? త్రివిక్రమ్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. మా కాంబినేషన్ కుదిరాక హిట్ సినిమానే తీయాలనే ఒత్తిడి నేను పెట్టుకోలేదు. అసలు దాని గురించి ఆయనతో మాట్లాడలేదు. బేసిక్‌గా నేను సినిమా జర్నీ బాగుండాలని కోరుకుంటాను. ఒక్కోసారి ఫిల్మ్ మేకింగ్ జర్నీ బాగుండదు. కానీ రిజల్ట్ బాగుంటుంది. ఇంకొన్నిసార్లు జర్నీ బాగుంటుంది కానీ ఎండ్ రిజల్ట్ నెగటీవ్‌గా ఉండొచ్చు. ఒక్కోసారి జర్నీ బాగుంటుంది. రిజల్టూ బాగుంటుంది. నాది, త్రివిక్రమ్‌ది జర్నీ బాగుంది. మంచి సినిమా ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాం. అది మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. ఎండ్ రిజల్ట్ గురించి ఊహించలేం. ఒక సూపర్‌హిట్ సినిమాను ఎలా ప్రేక్షకులకు అందించాలి అని అడిగితే ఏ ఫిల్మ్‌మేకర్ దగ్గరా సమాధానం ఉండదు. ఇలా చేయాలని ఒక మెథడ్ ఉండదు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఓ హిట్ సినిమా తీయాలనే ప్రెజర్‌తో త్రివిక్రమ్ ఈ సినిమా చేసినట్లు మీకనిపించిందా? హిట్ సాధించాలనే ప్రెజర్ త్రివిక్రమ్‌కే కాదు. అలాంటి ప్రెజర్ అందరికీ ఉంటుంది. ఆ మాటకు వస్తే నాకూ ఉంటుంది. నేనూ వైఫల్యాలను చూశాను. ఇక్కడ ఎవరూ ఫెయిల్యూర్‌కి అతీతం కాదు. ఒత్తిడి కామన్. అయితే దీనిని ఎంత పాజిటివ్‌గా తీసుకుని, ముందుకు వెళతామన్నదే జీవితం. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలొచ్చాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే కదా? అవును.. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఈ జానర్లో చాలా సినిమాలు వచ్చాయి. ఓ పరిష్కారం కోసం వాళ్ల కోణంలో సినిమాలు తీశారు. ‘అరవింద..’ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో వయొలెన్స్ కూడా ఒక పార్ట్‌లానే ఉంటుంది. సందేశం కోసం సినిమా తీయకూడదు. స్టోరీలో దానికి ఆస్కారం ఉండి, సమాజానికి ఉపయోగపడుతుందంటే అప్పుడు సందేశం ఉండాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి అడిగే హక్కులేదు’ అని. ఎంత అర్థం ఉంది. నిజమే కదా.. మాట్లాడకుండా ఒక సమస్యకు పరిష్కారం ఉండదు కదా. అలాగని ‘అరవిందసమేత’ ఫుల్ యాక్షన్ సినిమా కాదు. ఇగో శాటిస్ఫ్యాక్షన్, పూర్తి హింస నేపథ్యంలో సాగే చిత్రం కాదు. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు కనెక్ట్ అయ్యాను. వ్యక్తిగతంగా కూడా నాలో మార్పు వచ్చిందనుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ చేశాను. మంచి భర్త, మంచి నాన్న, మంచి కొడుకు.. ఇలా ఇంకా బెటర్ పర్సన్ కావాలనుకుంటున్నాను. ఈ సినిమా ప్రభావం ఆడియన్స్‌పై కూడా ఉండొచ్చు. త్రివిక్రమ్‌ని స్వామీ అని ప్రీ–రిలీజ్ వేడుకలో అన్నారు.. అలా అనడానికి స్టోరీ లేదు. మామూలుగా భయ్యా అని అంటుంటాం కదా. అలా సరదాగా పిలిచినదే. ఈ సినిమా మీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటుందా? త్రివిక్రమ్ స్టైల్లోనా? ఇది నా ఇమేజ్ మీద తీసినది కాదు. త్రివిక్రమ్ జర్నీలో ఎన్టీఆర్ కలిశాడు. త్రివిక్రమ్ స్టోరీ టెల్లింగ్‌లో మేముందరం భాగం అయ్యాం. ఎప్పుడైతే డైరెక్టర్‌కు ఆ స్వేచ్ఛ దొరుకుతుందో అప్పుడు మంచి పాత్రలు రాయగలడు. దర్శకుడు, హీరో భార్యాభర్తల్లాంటి వాళ్లు. ఎలా అంటే హీరోకి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే. ఎందుకంటే తను అనుకున్న కథకు ముఖం నటుడు. నటులు శాటిస్ఫై చేయాల్సిన మొట్టమొదటి ప్రేక్షకుడు కూడా దర్శకుడే అవుతాడు. డైరెక్టర్ దృష్టి కోణం నుంచే ఏ సినిమా అయినా వస్తుంది. ఈ విషయంలో నా డైరెక్టర్స్ అందరితో మంచి సంబంధాలున్నాయి. ‘పెనివిటీ...’ సాంగ్‌కు బాగా కనెక్ట్ అయినట్లున్నారు? మా నాన్నగారు చనిపోయిన తర్వాత తీసిన పాట ఇది. ఆ పాట తీస్తున్నంత సేపూ మా అమ్మగారే గుర్తు వచ్చారు. నా జీవితంలో రీసెంట్గా ఓ దుర్ఘటన జరిగింది కాబట్టి ఈ పాటకు కదిలిపోయానని కాదు. అందరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఏంటీ అంటే అది ‘పెనివిటీ.. ’ సాంగ్. సినిమాలో రాయలసీమ స్లాంగ్ మాట్లాడారు కదా. కష్టం అనిపించిందా? రాయలసీమ యాస గురించి రచయిత పెంచల్దాస్గారితో మాట్లాడితే నాకు అర్థం అయ్యింది. ఆ యాస పలకడం చాలెంజింగ్‌గా అనిపించింది. ►‘అరవింద సమేత..’ తర్వాత వెంటనే చేయబోయేది రాజమౌళి సినిమానే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ ఎగై్జట్‌మెంట్. ఈ సినిమా ఓ కొత్త ఒరవడికి నాంది అనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ కాదు. జస్ట్ అనౌన్స్మెంట్ కోసం అలా ఇచ్చాం. అలాగే అశ్వినీ దత్‌గారి బ్యానర్లో ఓ సినిమా ఉంది. ►మహేశ్‌బాబు, నేను, రామ్‌చరణ్ కలిసి సినిమా చేయడానికి మాకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరు హ్యాండిల్ చేయగలరు? ఆ కెప్టెన్ (దర్శకుడు) ఎవరు? మేం ముగ్గురం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. కానీ ప్రీ ప్లాన్ చేసి సినిమాలు చేయాలనుకోం. ప్రీ ప్లాన్ చేసుకున్నవి ఏం అయ్యాయో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫైనల్లీ.. మీ నాన్నగారి గురించి ఇంకో ప్రశ్న.. మీ సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి ఎలా స్పందించేవారు? మా సక్సెస్‌కి ఆనందం పొందారు. ఫెయిల్యూర్స్‌కి బాధపడ్డారు. సంతోషం ఏంటంటే నాన్నగారు అన్నీ చూసేశారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. – డి.జి. భవాని -
‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అందుకే మాట్లాడటం మానేశాం : ఎన్టీఆర్
‘‘త్రివిక్రమ్‌గారితో సినిమా చేయాలన్నది నా 12 ఏళ్ల కల. ఆయన ‘నువ్వే నువ్వే’ సినిమా తీయక ముందు నుంచి కష్టసుఖాలు మాట్లాడుకునేంత దగ్గర మిత్రుడు. ఎందుకు మా ఇద్దరికీ సినిమా కుదరట్లేదు అని చాలాసార్లు అనుకున్నా’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. మమత సమర్పణలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘బహుశా నా జీవితంలో నెలరోజుల కిందట జరిగిన సంఘటన (తండ్రి హరికృష్ణ మృతి) ఈ చిత్రంతో ముడిపడి ఉందేమో. ఆయనతో (త్రివిక్రమ్) సినిమా మొదలు పెట్టిన తర్వాతే.. నెలరోజుల కిందట జరిగిన సంఘటన తర్వాతే.. బహుశా నాకు జీవితం విలువ అర్థం అయింది. ఈ సినిమా తాత్పర్యం ఒక్కటే. ‘వాడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు.. కానీ యుద్ధం ఆపేవాడే మగాడు.. వాడే మొనగాడు..’. జీవితమంటే కొట్టుకోవడం.. తిట్టుకోవడం కాదు.. బతకడం. ఎలా బతకాలో చెప్పే చిత్రం ‘అరవిందసమేత వీరరాఘవ’. మనిషిగా పుట్టినందుకు ఎంత హుందాగా, ఎంత ఆనందంగా, అస్సలు మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రమిది. ఒక మగాడి పక్కన ఆడదానికంటే బలం ఇంకోటి ఏదీ ఉండదు. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే.. జీవితం విలువ తెలుసుకోవడానికే.. నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఇప్పుడు ఆయనతో (త్రివిక్రమ్) ఈ సినిమా చేయించాడేమో. చాలా థ్యాంక్స్ స్వామీ. 12 ఏళ్ల ప్రయాణంలో ఓ స్నేహితుణ్ణి, ఓ దర్శకుణ్ణి చూశా.. ఈ సినిమా ముగిసేలోపు ఓ ఆత్మబంధువుని చూశా. రేపు నాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా మీ అందరితో పాటు నాతో నిలబడేవాడే మా త్రివిక్రమ్. ఈ చిత్రం తప్పకుండా నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలు ఏ దర్శకుడూ నాకు పెట్టలేదు. కానీ, ఈ చిత్రంలో అది యాధృచ్చికమో, అలా జరిగిందో తెలీదు.. మనం అనుకునేది ఒకటి.. పైనవాడు రాసేది ఇంకోటి. ఈ నెలరోజులు నాకు అన్నలాగా, తండ్రిలాగా, మిత్రుడిలాగా తోడుగా ఉన్నాడీయన. థ్యాంక్స్ స్వామీ (త్రివిక్రమ్). కొన్ని బంధాలు కలిసినప్పుడు వాళ్ల ప్రయత్నం సక్సెస్ అయితే ఆ బంధం ఇంకా గట్టిపడిపోతుందని అంటారు. ఈ బంధాన్ని మా నాన్నగారు (హరికృష్ణ) చూస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించేలా చేసి, మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారని నమ్ముతున్నా. ఈ సినిమాకి తమన్ ప్రాణం పెట్టాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ అయినప్పుడు.. చాలామంది ‘ఎన్టీఆర్ మాస్ హీరో కదా.. డ్యాన్సులుండే పాటలు లేవేంటి?’ అని అడిగారు. నటనలో భాగం డ్యాన్స్ మాత్రమే తప్ప.. డ్యాన్స్‌లో భాగం నటన కాదు.. అలాంటి ఓ నటుడి కోసం త్రివిక్రమ్ రాసిన ఓ చిత్రానికి పూర్తిగా తమన్ తప్ప వేరే ఇంకెవరూ న్యాయం చేయలేరు. థ్యాంక్స్ తమన్. ఈ సినిమాలో ప్రతి పాట ఓ సందేశాన్ని ఇస్తుంది. అలాంటి గొప్ప పాటలు రాసిన మా గురువుగారు సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రిగార్లకు ధన్యవాదాలు. నాకు–త్రివిక్రమ్‌కి మధ్యలో ఫ్రెండ్షిప్కి ఓ పిల్లర్ ఉంది.. మా రాధాకృష్ణగారు. ఓ సినిమా గురించి నిర్మాత ఎంత తాపత్రయ పడతాడో నేనెప్పుడో విన్నా. చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా చూశా. సినిమా ఎలా తీయాలి. ఎంత బాగా రావాలి? అని అనలైజ్ చేసే తక్కువమందిలో రాధాకృష్ణగారు ఒక్కరు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘నెలకిందట ఓ సంఘటన జరిగింది (హరికృష్ణ మరణం). అది జరిగినప్పుడు చాలామంది సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాదేమో? అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పారు. అవి మీతో పంచుకుందామనుకుంటున్నా. 1962లో పొద్దున్నే మేకప్ వేసుకుని షూటింగ్ వెళ్లిన మా తాతగారు, మనందరి అన్నగారు (తారక రామారావు) షూటింగ్లో ఉండగా ఆయన పెద్దకొడుకు, మా పెదనాన్న నందమూరి రామకృష్ణ చనిపోయారని తెలిసింది. ఏ తండ్రైనా తట్టుకుంటాడా? కానీ నిర్మాతకి నష్టం రాకూడదని రోజంతా షూటింగ్ చేసి అప్పుడెళ్లారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అదే వృత్తి ధర్మం. 1976లో తాతగారు షూటింగ్లో ఉండగా మా ముత్తాతగారు (లక్ష్మయ్య చౌదరి) శంషాబాద్ నుంచి ఇంటికొస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికి, నిర్మాతకి ఇచ్చే గౌరవంతో ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి వెళ్లారు. 1982లో మా బాలయ్య బాబాయ్, రామకృష్ణ బాబాయ్‌ల పెళ్లి.. నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉండటంతో ఆ ప్రచారంలో ఉన్న తాతగారు పెళ్లికి కూడా రాలేదు. ఎందుకంటే.. ప్రజలకి సేవ చేయాలి అనుకున్నారు కాబట్టి, అది వృత్తి ధర్మం అని నమ్మారు కాబట్టి. ఆయన పనికి ఇచ్చిన గౌరవం అది. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను అని వాళ్ల అమ్మకిచ్చిన మాట కోసం నాన్నగారు (హరికృష్ణ).. వారి తండ్రిని (ఎన్టీఆర్) ఆఫీస్ బాయ్‌గా, చైతన్య రథ సారధిగా ఆయన వెన్నంటి ఉండి కొడుకు కర్తవ్యాన్ని నెరవేర్చారు. 2018 ఆగస్టు 29. మా ఇంట్లో కూడా ఓ సంఘటన (హరికృష్ణ మృతి) జరిగింది. అది జరిగినప్పుడు ‘అరవింద సమేత’ షూటింగ్ నెలరోజులే బ్యాలెన్స్ ఉంది. సమయానికి రిలీజ్ అవ్వుద్దా? అనుకున్నారు. కానీ, నిర్మాత బాగుండాలి.. మనమిచ్చిన మాట నిలబడాలి.. అని ఐదో రోజే తమ్ముడు షూటింగ్‌కి వెళ్లి నాన్‌స్టాప్‌గా రేయి, పగలు కష్టపడ్డాడు. నాన్నా.. ‘నిర్మాత బాగుండాలి.. వృత్తి పట్ల ఏ మాత్రం ఇంట్రెస్ట్ కోల్పోకుండా ఉండాలి’ అని మీరు చెప్పిన దోవలోనే నేను, తమ్ముడు నడుస్తాం’’ అన్నారు. ‘‘త్రివిక్రమ్‌గారు ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సరికొత్త బాణాన్ని తెలుగు ప్రాంతాల మీదికి వదులుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వైవిధ్యమైన పాత్రలో నటించారు’’ అన్నారు పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘ఈ సినిమా సమయంలో జరిగిన ఒక అతి పెద్ద విషాదం నుంచి అతి తొందరగా కోలుకుని... జీవితంలో కూడా నిజమైన హీరో అని నిరూపించుకున్న ఎన్టీఆర్‌కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు’’ అన్నారు త్రివిక్రమ్. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, పీడీవీ ప్రసాద్, నాగవంశీ ఎస్, సంగీత దర్శకుడు తమన్, జగపతిబాబు, సునీల్, ఈషా, రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు. అందుకే మాట్లాడటం మానేశాం నెల రోజులుగా మేమిద్దరం (కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్) మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే.. మనిషి బతికున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయాక విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. నాన్నగారు బతికున్నంతవరకూ.. ‘నాన్నా.. మనం ఏదో చాలా గొప్పో అని కాదు. ఓ మహానుభావుడి కడుపున నేను పుట్టాను.. నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అందర్నీ మోసుకెళ్లేది వీళ్లే (ఫ్యాన్స్). బతికున్నంతవరకూ అభిమానులు జాగ్రత్త. మనం వాళ్లకోసం ఏమీ చేయకపోయినా వాళ్లు మన కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు’ అని ఎన్నిసార్లు అన్నారో నాకు తెలుసు. ఈ ఒక్క సినిమా చూడ్డానికి ఆయన ఉండుంటే బాగుండేది. చాలా ఫంక్షన్స్‌లో తాతగారి బొమ్మ చూసేవాణ్ణి. కానీ, నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని ఊహించలేదు. మా నాన్నకు ఇచ్చిన మాటే మీ అందరికీ ఇస్తున్నా ఈ రోజు. మా జీవితం మీకు అంకితం’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిజమేనా?
ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా చెప్పలేదు. పోనీ హింటైనా ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ గురించి తాజాగా ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అదేంటంటే... ఈ చిత్రంలో ఎన్టీ ఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారట. తండ్రి, కొడుకుల పాత్రల్లో కనిపిస్తారట. సినిమాలో తన తండ్రి గురించి కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌కు వివరించే సమయంలోనే ‘పెనివిటీ..’ పాట ఉంటుందని టాక్. తండ్రి పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తున్నారట.ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని కావాలనే ఈ విషయాన్ని దాచారట చిత్రబృందం. అలాగే ఎన్టీఆర్, రావు రమేశ్‌ల మధ్య రాజకీయ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టాక్. మరి.. ఈ వార్తలు నిజమేనా? అనేది తెలియడానికి ఇంకో పది రోజులు ఆగితే చాలు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని సమాచారం. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఈషా రెబ్బాలపైనే ‘పెనివిటీ..’ సాంగ్‌ను తీస్తున్నారట. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. జగపతిబాబు, నాగబాబు, రావు రమేశ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్‌నే మళ్లీ ‘బిగ్ బాస్ 3’కి కూడా హోస్ట్‌గా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
భలే కొట్టావోయ్!
ముందు బెంచీలో కూర్చున్నవాడి ట్యూన్ చూసి మనం కొడితే.. కొట్టి.. పరీక్ష పాస్ అయితే.. దాన్ని కాపీ అంటారు. ముందు బెంచీ కాదు, పక్క బెంచీ కాదు.. మన పేపర్లోది మనమే తిప్పి రాసి పరీక్షలో ఫస్ట్‌గా పాస్ అయితే.. దాన్ని హిట్ ట్యూన్ అంటారు. నీ ట్యూను.. నీ ఇష్టం! ఇది.. నీ మ్యూజిక్కు.. నీ మ్యాజిక్కు! భలే కొట్టావోయ్.. తమన్. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో మ్యూజిక్.. కాపీ మ్యూజిక్ అని కూనిరాగాలు తీస్తున్న రూమర్లకు ఎస్.ఎస్. తమన్ బాదిన డ్రమ్స్ ఈ ఇంటర్వ్యూలో చదవండి. ‘అరవింద సమేత వీర రాఘవ’ సాంగ్స్‌కి రెస్పాన్స్ బాగుంది. దాంతో పాటు వేరే సినిమాలకు మీరిచ్చిన ట్యూన్‌నే వాడుకున్నారనీ... కాపీ అని.. తమన్: అవన్నీ నేను పట్టించుకోను. నా పాట నేనే మళ్లీ వాడుకుంటే దాన్ని కాపీ అని ఎలా అంటారు? ఎవరో రచయిత ప్రేమ అని రాస్తారు. అదే పదాన్ని మళ్లీ వేరే పాటకు వాడితే కాపీనా? ఐ డోంట్ కేర్. జీవితం పట్ల వాళ్లకు ఏదో నిరాశ ఉండి ఉంటుంది. చిరాకులు తగ్గించుకోవడానికి సోషల్ మీడియాలో ఏవేవో కామెంట్ చేస్తుంటారు. వాటికి ప్రాధాన్యం ఇస్తే నా పని నేను చేసుకోలేను. ‘నా పాటను నేను వాడుకుంటే’ అన్నారు.. అంటే మీ ట్యూన్‌ని మళ్లీ వాడుకున్నారా? రాగాలన్నీ ఒకేలా ఉంటాయి. కాపీ అనడమే తప్పు. నా కంపోజిషన్ అలానే ఉంటుంది. అది నా స్టైల్. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇటీవల ఏఆర్ రెహమాన్‌తో మీ ట్యూన్స్ దాదాపు ఒకేలా ఉంటాయి అన్నప్పుడు ‘నా స్టైల్’ అని మీరన్నట్లే అన్నారు. అంతే కదా. మీరు ఏ సంగీత దర్శకుడిని తీసుకున్నా.. వాళ్లకో స్టైల్ ఉంటుంది. మణిశర్మగారివి ఒకలా ఉంటాయి. కోటిగారు, ఎస్ఏ రాజ్‌కుమార్‌గారు, దేవిశ్రీ.. ఇలా ఒక్కొక్కరివి ఒకలా ఉంటాయి. నేను మాట్లాడలేను కదా అని నన్ను పదే పదే విమర్శిస్తే నేనేం చేయగలను. నన్ను నేను కాపాడుకోవడానికి ఏదోటి మాట్లాడాలనుకోను. ఇలా కామెంట్ చేయడం ఒకరి బతుకు తెరువు.. దాంతో బతుకుతున్నారంటే బతకనివ్వండి. ‘నువ్వు (కామెంట్ చేసేవాళ్లు) హ్యాపీగా ఉన్నావా? సరే చేస్కో’. నాకేం నష్టం లేదు. నా దర్శక–నిర్మాతలు, హీరోలు నన్ను నమ్ముతున్నారు. విమర్శల వల్ల నాకు పోయేదేం లేదు. అలాగని పొగడమని అనడంలేదు. పొగిడినా నాకు పెరిగేదేం లేదు. నా టీమ్ నన్ను నమ్మడం నాకు ముఖ్యం.. అంతే. అప్పుడు ‘బిజినెస్‌మేన్’, ఇప్పుడు ‘అరవింద...’ మధ్యలో వేరే సినిమాలకు విమర్శలు. ఎందుకు మిమ్మల్నే టార్గెట్ చేస్తుంటారు? ‘బిజినెస్‌మేన్’ అప్పుడు పూరీగారే నేను పెట్టమంటేనే తమన్ ఆ పాట (‘పిల్లా చావ్...’) కొట్టాడు అని చెప్పారు. ‘బిజినెస్‌మేన్’ తర్వాత నేను చాలా సినిమాలు చేసేశా. విమర్శల వల్ల జరిగిన నష్టం ఏమీ లేదు. ఇంతకు ముందు ఆల్బమ్ అంతా ఒకేసారి విడుదలయ్యేది. ఇప్పుడు ఒక్కో పాట విడుదల అవ్వడం వల్ల పోలికలు పెట్టడానికి చాలా టైమ్ ఉంది కదా? ప్రస్తుతం ఒక్కో పాట రిలీజ్ చేయడం ట్రెండ్. ఒక్కో పాట రిలీజ్ చేయడం వల్ల అని కూడా కాదు. వెక్కిరించడం వాళ్ల పని. జీవితాంతం వెక్కిరిస్తూనే ఉంటారు. నా కష్టాన్ని కామెంట్ చేసేంత ఖాళీగా ఉన్నారంటే వాళ్లు పని చేయడం లేదనేగా. ఖాళీగా కూర్చొని వాళ్లు చేసే పని గురించి మాట్లాడటం వేస్ట్. మీరన్నట్లు ‘బిజినెస్‌మేన్’ అప్పుడు ‘తమన్ కాపీ క్యాట్’ అనే విమర్శలు వచ్చినా మీకు సినిమాలేవీ తగ్గలేదు. ఇండస్ట్రీ మిమ్మల్ని నమ్ముతున్నట్లే.. అవును. నా బలం అదే. ‘బిజినెస్‌మేన్’ నా 18వ సినిమా. లెక్కలేసుకోను కాబట్టి కరెక్ట్ నంబర్ చెప్పలేకపోతున్నా. ఇప్పుడు 80వ సినిమా చేస్తున్నట్టున్నా. నన్నెవరైనా ఆపగలిగారా? నా లిరిక్ రైటర్స్, హీరోలు బాగా మాట్లాడతారు నా గురించి. నా డైరెక్టర్లు నాతో బాగుంటారు. మ్యూజిక్‌లో నేను ఇన్వెస్ట్ చేసేంత తెలుగులో ఏ మ్యూజిక్ డైరెక్టరూ పెట్టడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. దానివల్ల మీరు ఇన్కమ్ తక్కువ చూస్తారేమో? ఫర్వాలేదండీ. బడ్జెట్ పెరిగితే ఇంకా బెస్ట్ మ్యూజిక్ టీమ్‌తో పని చేయాలనుకుంటాను. మంచి బడ్జెట్ ఇచ్చినప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు. నా నిర్మాతలు ‘ఎందుకయ్యా.. నీకిచ్చిన బడ్జెట్‌కి తగ్గట్టు చేయొచ్చు కదా. కొంచెం దాచుకో’ అని అంటారు. నా హీరోలంటే నాకు ప్రేమ. వాళ్ల ఫ్యాన్‌గా మారకపోతే హిట్ మ్యూజిక్ ఇవ్వలేను. నేను వరుణ్ తేజ్‌కి పెద్ద ఫ్యాన్ అని ఫీల్ అవ్వకపోతే ‘తొలిప్రేమ’లాంటి అవుట్‌పుట్ రాదు. అనుష్కను ప్రేమించకపోతే ‘భాగమతి’లో ‘మందారా..’ లాంటి మెలోడి ఇవ్వలేం. ఎన్టీఆర్‌ని ప్రేమించకపోతే ‘అరవింద..’కి ఇంత మంచి పాటలు ఇవ్వలేను. మనం కొట్టిన సాంగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండాలి. ఫ్యాన్‌లా ఉంటే తప్ప అలా చేయలేం. సాధారణంగా క్వాంటిటీ ఎక్కువయ్యే కొద్దీ క్వాలిటీ తగ్గే ఆస్కారం ఉంది. మరి.. సినిమాలు తగ్గించుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? నాకు మ్యూజిక్ తప్ప వేరే డైవర్షన్ లేదు. పబ్‌కి వెళ్లను. గొడవలు అవేం లేవు. నాకు తెలిసింది మ్యూజిక్ చేయడం, ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుకోవడం. కొత్త మ్యూజిక్ వస్తువులు కొనుక్కోవడం... అంతే. క్వాలిటీ విషయంలో రాజీపడను. హీరోలకు అభిమానులు ఉన్నంత కాలం మన దర్శక–నిర్మాతలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు. అందరూ భయంతో పని చేస్తుంటాం. ఆఖరి నిమిషం వరకూ మెరుగులు దిద్దుతూనే ఉంటాం. సినిమా చేయడం అంటే పెళ్లి చేయడమే. ఇతర భాషల్లో కూడా పని చేసిన అనుభవంతో చెబుతున్నాను.. క్వాలిటీ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ నిలబడుతుంది. నిజానికి గతంలో కూడా పోలిక ఉన్న ట్యూన్స్ వచ్చి ఉంటా యేమో.. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టే ‘కాపీ క్యాట్’ లాంటివి రాలేదేమో.. నిజమే. డైరెక్ట్‌గా దింపేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇది అక్కడిదీ.. అది ఇక్కడిదీ అని ఆలోచించకుండా పాటలను ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి బదులు ఎలా విమర్శించాలా? అని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ‘ఈ ట్యూన్ ఫలానా ట్యూన్లా ఉంది’ అని వీళ్లు చూపించేవరకూ నాకే తెలియదు. అప్పుడు అర్థం అయింది... ఇది నా స్టైల్ అని. అయినా అన్నీ కాపీ ట్యూన్లే చేస్తే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఒప్పుకుంటారా? చాన్సులు ఇస్తారా? సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచాయి. ఆల్రెడీ మీవి ఏడు సినిమాలు రిలీజ య్యాయి. బిజీ బిజీగా ఉంటున్నారన్న మాట.. తమన్: (నవ్వుతూ) ఎన్ని సినిమాలు చేస్తున్నాం అని ఎప్పుడూ లెక్కపెట్టుకోను. ఫీలింగ్ గుడ్. పైగా ఈ ఏడాది మంచి ఆల్బమ్స్ పడ్డాయి. భాగమతి, తొలిప్రేమ, ఛల్ మోహన రంగా... చిత్రాలకు మ్యూజికల్‌గా మంచి ఆదరణ లభించింది. ‘భాగమతి’కి అయితే బ్యాగ్రౌండ్ స్కోర్‌కి కూడా. ఆ సినిమాల వల్లే ‘అరవింద సమేత వీర రాఘవ’కు చాన్స్ వచ్చిందనుకుంటున్నాను. మణిశర్మగారి దగ్గర చేసినప్పుడు ‘అతడు’ సినిమాకి పని చేసే చాన్స్ దక్కింది. అప్పటినుంచి త్రివిక్రమ్‌గారితో వర్క్ చేయాలన్నది డ్రీమ్. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తితో పని చేస్తే లైఫ్ ఇంకా బావుంటుంది, మ్యూజిక్ డైరెక్టర్‌గా నా స్థాయిలో ఇంకా మంచి మార్పు వస్తుందని నా ఫీలింగ్. మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఇలాంటి దర్శకులతో వర్క్ చేస్తే ఆలోచనా విధానం పెరగడంతో పాటు గ్రేడ్ మారుతుంది. త్రివిక్రమ్గారిలాంటి కొందరు దర్శకులతో పని చేస్తుంటే మెల్లిగా మనం మారుతుంటాం. ‘అరవింద సమేత వీర రాఘవ’ విషయంలో అది జరిగింది. సాధారణంగా కొందరు దర్శకులు ఇలాంటి ట్యూన్ కావాలి అని ఏదో ఒక ట్యూన్‌ని రిఫర్ చేస్తారు. త్రివిక్రమ్ అలా అడిగారా? లేదు. ఆయన చాలా ఓపెన్ మైండ్‌తో వస్తారు. ఫ్రెష్‌గా కూర్చుంటారు. అక్కడ జరిగే సంభాషణలే పాట రూపంలో వస్తాయి. ఈ సినిమా కమిట్ అయిన 2 నెలలకు పనే చేయలేదు. అందరూ ఇంకా ట్యూన్ రాలేదేంటి? అనడిగితే, ‘త్రివిక్రమ్‌గారిని చదువుతున్నాను’ అని చెప్పా. ఈయన సినిమాలు అంత స్పెషల్ ఏంటి? మిగతావాటికన్నా ఇవి ఎందుకు వేరేగా ఉంటున్నాయి అని స్టడీ చేశా. నేనెలాంటి ట్యూన్ ఇవ్వాలి. ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని స్టడీ చేశా. పెళ్లికి ముందు వైఫ్‌ని రెండు మూడు సార్లు కలిసినపుడు అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తామో అలాగ (నవ్వుతూ). ‘అరవింద సమేత..’కు చేసిన 8 నెలల జర్నీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇంతకు ముందు పూరీ, శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, హరీశ్, గోపీచంద్.... ఇలా అందర్నీ అర్థం చేసుకునే పని చేశాను. దర్శకులను అర్థం చేసుకుంటే పని చేయడం ఈజీ అవుతుంది. మీకు చిన్నప్పుడే మ్యూజిక్ అంటే ఇష్టమట కదా? మా నాన్న (ఘంటసాల శివకుమార్) డ్రమ్మర్. స్వతహాగా నాలో కూడా మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఎనిమిదేళ్ల వయసులోనే డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టా. నా చిన్నప్పుడు మేం చెన్నైలో ఓ అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. అందులో దాదాపు 60 ఫ్లాట్లు ఉండేవి. ఎంత లేదన్నా వారానికో బర్త్‌డే పార్టీ అయినా ఉండేది. నేనోసారి సరదాగా ఓ పార్టీలో డ్రమ్స్ వాయిస్తే, అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి అన్ని పార్టీల్లో వాయించడం మొదలుపెట్టాను. అందరితో పాటు కేక్, స్నాక్స్ ఇచ్చేవాళ్లు. డ్రమ్స్ వాయించినందుకు 30 రూపాయలిచ్చేవాళ్లు. మ్యూజిక్ మీద నాకు ఇంట్రస్ట్ ఉందని గ్రహించి, నాన్నగారు డ్రమ్స్ అవీ కొనిచ్చేవారు. ‘అరవింద..’ పాటలు విని ఎన్టీఆర్ ఏమన్నారు? నాకు పెద్ద ఆఫర్ ఇచ్చింది ఎన్టీఆరే. ‘కిక్’ కంటే ముందే ‘బృందావనం’ ఓకే అయింది. నాకు ఎన్టీఆర్ అంటే అందుకే అంత ప్రేమ. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని. ‘బృందావనం’ అప్పుడు నేనింతకన్నా లావుగా ఉన్నా.. పాటలు విని అమాంతం ఎత్తేసుకున్నారు. బీభత్సమైన ఫ్యాన్లానే పని చేశాను. మళ్లీ ఈ సినిమాకు అలానే ఎంజాయ్ చేశాను. ‘అరవింద...’ పాటలు విని, భలే ఉన్నాయి అని ఎన్టీఆర్ ఫోన్లో చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ కాల్ని స్క్రీన్ షాట్ తీసుకుని, దాచుకున్నాను. తారక్ బాడీ మొత్తం మ్యూజిక్ ఉంటుంది. ఫేక్‌గా ఎప్పుడూ మాట్లాడరు. సెన్సిటివ్. నచ్చితే వేరే లెవల్లో ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమ వల్ల ఇంకా జాగ్రత్తగా పని చేయాలనిపిస్తుంది. ‘అరవింద..’కు మీరెన్ని ట్యూన్స్ ఇచ్చారు. అందులో ఎన్ని తీసుకున్నారు? ఐదే ట్యూన్స్ ఇచ్చాను. ఎక్కువ అవుతుందని చెప్పి ఒకటి వాడలేదు. స్క్రిప్ట్ అంత స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల అందరం కూర్చుని అనవసరంగా పాట పెట్టినట్టు ఉంటుందని దాన్ని తీసేశాం. అలా పక్కన పెట్టిన పాటను వేరే సినిమా కోసం వాడుకునే హక్కు మీకు ఉంటుందా? అది డైరెక్టర్, నిర్మాత, హీరోకే ఉంటుంది. వాళ్ల అనుమతి తీసుకోకుండా మేం వాడలేం. ఇప్పుడు వాళ్లు వాడుకోమని చెప్పినా ఆ పాట అయితే ఎవ్వరికీ ఇవ్వదలచుకోలేదు. ఈ సినిమా కోసం ఫస్ట్ కంపోజ్ చేసిన పాట అదే. త్రివిక్రమ్‌గారితో పని చేసినందుకు గుర్తుగా ఆ పాటను దాచుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆయనతోనే మళ్లీ పని చేస్తే ఆ సాంగ్‌ని వాడతాను. పెద్ద హీరోలకు పాటలు చేయడం కష్టమా? హీరోలు, వాళ్ల ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాంగ్స్ చేయడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఈరోజు నేనెక్కడికెళ్లినా నాకు అంత గుర్తింపు ఉందంటే కారణం ఫ్యాన్సే. ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఫ్యాన్స్ ఉంటేనే కదా హంగామా ఉంటుంది. ఫ్యాన్స్ ఉంటేనే కదా రియాక్షన్ కనిపించేది. సాంగ్స్ అనేవి ఫ్యాన్స్‌కు బ్లడ్లాంటివి. ‘బిజినెస్‌మేన్’ నా ఇరవయ్యో.. ఇరవైఐదో సినిమానో అనుకుంటా. ఇప్పటికి డెబ్బై, ఎనభై సినిమాలు చేసేశాను. టాలెంట్ లేకపోతే అన్ని సినిమాలు ఎలా చేస్తాం చెప్పండి? సక్సెస్ అన్నది లేకుంటే ఫిల్మ్‌నగర్‌లో తిరగలేం.. ఇటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేం. సక్సెస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే గౌరవమే లేదు. కొంతమంది డైరెక్టర్లు ఏదో ఒక ట్యూన్ చెప్పి, దాన్ని యాజిటీజ్‌గా కాపీ చేయమంటే మీకు మైనస్ అవుతుంది కదా? ఏం చేయలేం. ఎందుకు కాపీ చేయాలండి? అని అడిగిన సందర్భాలున్నాయి. సపోజ్ సినిమాకి ఆరు పాటలు ఉంటే, ఐదు ట్యూన్లు చేసినవాడికి ఆరో ట్యూన్ చేయడం కష్టం కాదు కదా. కానీ, ౖడైరెక్టర్ చేయమంటే తప్పదు. ఎగ్జాంపుల్.. హిందీలో హిట్టయిన ఓ పాటను తెలుగులో కాపీ కొట్టమంటారు. ‘చేస్తాను కానీ, పరిణామాలకు మీదే బాధ్యత’ అని ముందే చెప్పేస్తాను. ఓకే అంటారు. బట్.. లాస్ట్ మినిట్‌లో వాళ్లు ఎస్కేప్ అవుతుంటారు. ఆ టైమ్‌లో డైరెక్టరే చేయమన్నాడు.. అందుకే చేశా అని పబ్లిక్‌గా చెప్పలేం కదా. నిందలపాలు కావాల్సి వస్తుంది. తప్పదు. ‘దూకుడు’ తర్వాత నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటున్నా. సక్సెస్ వచ్చింది. దాన్ని ఎలా కాపాడుకోవాలి. ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలుసుకుంటున్నా. ‘తొలిప్రేమ’ ఆల్బమ్ బాగా కుదిరింది. మళ్లీ వెంకీ అట్లూరితో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నారు. ఒక డైరెక్టర్‌తో ఒక బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చాక మళ్లీ కలసి పనిచేసేప్పుడు కొంచెం చనువు, లిబర్టీ ఉంటాయి. నమ్మకం కూడా పెరుగుతుంది. వెంకీ నాకు చాలా స్పెషల్. వెంకీ నాకు మణిరత్నం. మ్యూజిక్‌ని బాగా డీల్ చేస్తాడు. నన్ను చాలా నమ్ముతాడు. ఆ నమ్మకమే నన్ను భయపెడుతుంది. అయ్యో.. మనల్ని ఇంతలా నమ్మేస్తున్నాడే ఇంకా బాగా చూసుకోవాలి, మంచి ట్యూన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. అతనితో ఎప్పుడు పని చేసినా బెస్టే వస్తుంది. అదే యూనిట్టే మళ్లీ కలసి పని చేస్తున్నాం. బాధ్యత ఇంకా పెరిగింది. ఆ మాటకొస్తే ఏ సినిమాకి చేసినా భయం భయంగానే చేస్తాను. 70 సినిమాలు చేశాక కూడా భయం ఉంటుందా? అది లేకపోతే పని చేయలేం. ఫ్రీగా పని చేయలేం. సుడి, లక్ అంటారు. దాన్ని ఎప్పుడూ నమ్ముతూ కూర్చోలేం. కష్టమే విజయాన్ని తీసుకు వస్తుంది. లక్ వర్షంలాగా. ఎప్పుడో ఓసారి వర్షం వచ్చి పోతుంది. కష్టమే ఎప్పుడూ ఉండేది. సో.. కష్టపడుతూనే ఉండాలి. తమిళంలో ఏదైనా సినిమా చేస్తున్నారా? సిద్ధార్థ్‌తో ‘జగజ్యోతి’ చేస్తున్నాను. తమిళంలో అది ఒక్కటే. ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ చేస్తున్నా. ‘టెంపర్’ని ఇక్కడ మిస్సయ్యాను. రీమేక్‌కి చేసే చాన్స్ వచ్చినందుకు హ్యాపీ. హిందీలో దర్శకుడు రోహిత్ శెట్టితో వరుసగా రెండోసారి చేస్తున్నారు.. నాకు అతను బాగా ఇష్టం. సౌత్ దర్శకుల్లాగే ఆలోచిస్తాడు. సింక్ అయ్యాడు. ‘రేసుగుర్రం, సరైనోడు’ లాంటి కమర్షియల్ సౌండ్ కావాలి అంటాడు. మేం పుట్టిందే దానికి, 100 పర్సెంట్ ఇస్తాను అంటాను. ఆయనతో ‘గోల్మాల్ ఎగైన్’ చేశాను. 200 కోట్లు చేసిందా సినిమా. ఇండస్ట్రీలో సక్సెస్ చాలా ముఖ్యం. ఏ భాషలో అయినా సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అసలు ఫిల్మ్‌నగర్‌లోకి ఎంట్రీ ఉండదు. ఫిల్మ్‌నగర్ రైటే తీసుకోం. స్ట్రయిట్‌గా వెళ్ళిపోవడమే. కొన్నిసార్లు మాములుగా చేసినా కూడా ఎక్కువ క్రెడిట్స్ వస్తాయి. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ‘బిజినెస్‌మేన్’లో ‘సారొస్తారా...’ పాటకు అలా జరిగింది. సరదాగా ఓ పాట పెడదాం అని చేశాం. అది పెద్ద హిట్ అయింది. మహేశ్‌కి మెలోడీ చేయాలనుకుని కేవలం పది నిమిషాల్లో చేసిన పాట అది. ఆడియో కంపెనీకి చాలా లాభం తెచ్చిన పాట అది. కొందరు ట్యూన్స్ రెడీ చేయడానికి గోవా అనో విదేశాలో వెళతారు. మీరు? నేనెక్కడిక్లీ వెళ్లను. ఫ్లైట్ టికెట్స్ వేసి, ఉండటానికి రూములు బుక్ చేసి, నిర్మాత ఇంత ఖర్చు చేసి, మంచి ట్యూన్ రాకపోతే? అందుకే నాకు భయం. నా స్టూడియోలో పని చేస్తాను. ప్రశాంతంగా ట్యూన్స్ చేస్తా. ఒకవేళ అటూ ఇటూ అయిందనుకోండి... మనవాళ్లు ఎంత పొగుడుతారో అంత దించేస్తారు. బీచ్ వ్యూ చూస్తేనే నాకు ట్యూన్ వస్తుంది అంటారు కొందరు సంగీత దర్శకులు? అలా ఏం ఉండదు. సిచ్యువేషన్ బుర్రలోకి కరెక్ట్‌గా ఎక్కిస్తే ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ‘తొలిప్రేమ’ ఆల్బమ్ సూపర్ హిట్. స్టూడియోలోనే కూర్చున్నాం. రెండు రోజుల్లో 6 పాటలు వచ్చేశాయి. ఇప్పుడు అఖిల్ ‘మజ్ను’ సినిమాకు ఫస్ట్ నాలుగు రోజులు ట్యూన్ రాలేదు. ఆ తర్వాత లోకల్లోనే లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాం. ఆ తర్వాత మూడు రోజుల్లో ఫినిష్. ఫైనల్లీ... వేరే సంగీతదర్శకుడి మీద ఉన్న కోపం మీకు ప్లస్ అయ్యిందని, ఎక్కువ చాన్సులు రావడానికి అదే కారణమని కొందరి అభిప్రాయం.. ఇండస్ట్రీ మొత్తం ఈగో మీద నడుస్తుంది. గుడ్ ఈగో ఉన్నంతవరకూ ఫర్వాలేదు. బ్యాడ్ ఈగో అయితే కష్టం. నేను రెండో రకాన్ని నా దగ్గరకు రానివ్వను. అందుకే నన్ను ఇష్టపడతారేమో. మనమంటే గిట్టనివాళ్లు ఆ పాటను కాపీ కొట్టాడు అని ప్రచారం చేస్తుంటారు. అటువంటి వారిని మనం ఏమీ చేయలేం. కానీ, ఇండస్ట్రీకి తెలుసు నేనేంటో. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకొక లైఫ్ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. నా మీద వచ్చే విమర్శలను మనసుకి తీసుకోను.. ప్రశంసలను తలకి ఎక్కించుకోను. – డి.జి. భవాని -
ఇప్పుడు అధికారికంగా...
అరవింద సమేతంగా థియేటర్స్‌లో రాఘవ ఎప్పుడు సందడి చేస్తాడో అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. యస్. రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల ఇటలీ బార్డర్లో చివరి పాట చిత్రీకరణ పూర్తి చేశారు. ఈషా రెబ్బా, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. -
అనగనగనగా... ఫారిన్లో పాటంట
మొన్నా మధ్య ఆలయంలో పూజాలు చేశారు వీర రాఘవ. ఆ తర్వాత ప్రేయసితో కలిసి రైల్వేస్టేషన్‌కి వెళ్లారు. ఆ నెక్ట్స్ రాయలసీమలో విలన్స్‌పై వీరవిహారం చేశారు. ఇప్పుడు పాట కోసం ఫారిన్ వెళ్లారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పైన చెప్పిందంతా ఈ సినిమా గురించే. టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మరింత ఊపందుకున్నాయి. ఈ సినిమాలోని ఓ పాటను చిత్రీకరించడం కోసం స్విస్–ఇటాలియన్ బోర్డర్ వెళ్లారు టీమ్. ఆల్రెడీ ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మరి.. ఏ సాంగ్ కోసం వీర రాఘవ అండ్ కో ఫారిన్ వెళ్లారు? అని ఆలోచించే పనిలో పడ్డారు ఫ్యాన్స్. కొందరైతే ‘అనగనగనగా’ అనే సాంగ్ అని ఊహిస్తున్నారు. ఈ సాంగ్ షూట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందట. నిజానికి విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఒకటి ఫిక్స్ అయ్యిందన్న మాట. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో జరగనుందని టాక్. నాగబాబు, జగపతిబాబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
కూల్ కూల్‌గా....
సినిమా షూటింగ్ చివరికి వచ్చేసరికి ఫుల్ టెన్షన్‌తో తికమకగా ఉంటారు చిత్రబృందం. కానీ ‘అరవింద సమేత వీర రాఘవ’ యూనిట్ మాత్రం చాలా కూల్‌గా చకాచకా పనులు చేసుకుంటూ వెళ్తున్నారట. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టైజ్లో ఉంది. అక్టోబర్ 11కు రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ హడావిడిలో కూడా కూల్‌గా ఓ సెల్ఫీ దిగారు ఎన్టీఆర్, త్రివిక్రమ్, ఈషా రెబ్బా. ‘సెట్స్‌లో మోస్ట్ కూల్ పీపుల్‌తో దిగిన ఫొటో ఇది’ అని ఈ ఫొటోను షేర్ చేశారు ఈషా. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రంలోని ‘అనగనగా...’, ‘పెని మిటి...’ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇవాళ ఈ చిత్రం పూర్తి ఆల్బమ్ మార్కెట్లోకి రానుంది. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశేనా..?
వరుస విజయాలతో సూపర్ ఫాంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తారక్ అభిమానులకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ చూసే అవకాశం అభిమానులకు లేదన్న ప్రచారం జరుగుతోంది. రిలీజ్‌కు మరింత సమయం లేకపోవటంతో విదేశాల్లో చిత్రీకరించాలనుకున్న ఓ పాటను తొలిగించినట్టుగా తెలుస్తోంది. దీంతో సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండనున్నాయి. వాటిలో ఒకటి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్, మరొకటి ఇటీవల రిలీజ్ అయిన రొమాటింక్ సాంగ్ కావటంతో వాటిలో ఎన్టీఆర్ డ్యాన్సులు చూసే అవకాశం లేదు. ఎన్టీఆర్ సోలో సాంగ్ ఫ్యాన్స్‌ను కాస్త అలరించినా మరో పాటు కూడా మెలోడీనే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో తారక్ డ్యాన్స్‌లు చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అందుకే అంత పొగరు!
‘అనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకనే అంత పొగరు’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ సాంగ్‌ను శనివారం రిలీజ్ చేసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రబృందం. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని ఓ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం రిలీజ్ చేశారు. కేవలం సాంగ్‌ను మాత్రమే కాకుండా పాట స్టార్ట్ అయ్యే లీడ్ సన్నివేశంలోని చిన్న బిట్‌ని కూడా జోడించారు. ‘చూడటానికి టఫ్‌గా కనిపిస్తావు కానీ... చెప్పిన మాట వింటావు’ అని ప్రేయసి పూజా హెగ్డే పొగడగా ఎన్టీఆర్ సిగ్గుపడుతుంటే పాట మొదలవుతుందని ఈ బిట్ స్పష్టం చేసింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పాటల షూటింగ్ మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచార ం. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మరోపక్క శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేస్తున్నారు చిత్రబృందం. ∙ -
కథ మొదలెడుతున్న తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌ను రిలీజ్ చేసిన యూనిట్ ఈ రోజు(శనివారం) ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ‘అనగనగనగా’ అనే పాటను ఈ రోజు సాయంత్ర 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కథ మొదలు పెట్టేప్పుడు అనగనగనగా అంటూ ప్రారంభించినట్టుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ పాటతో మరింత వేగం పెంచనున్నారు చిత్రయూనిట్. తమన్ సంగీత సారధ్యంలో అర్మన్ మాలిక్ అనగనగనగా పాటను ఆలపించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్, రావూ రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Special lyrical video of "Anaganaganaga" from #AravindhaSametha will be releasing today at 04:05pm. A @MusicThaman musical!@tarak9999 #Trivikram @hegdepooja #PSVinod @vamsi84 pic.twitter.com/0IF15QAIu0 — Haarika & Hassine Creations (@haarikahassine) 15 September 2018 -
పాటల సమేతంగా..!
‘రం... రుధిరం.. రం.. శిశిరం... రం.. సమరం’... ఇది ‘అరవింద సమేత వీరరాఘవ’ టీజర్ చివర్లో బ్యాగ్రౌండ్లో మ్యూజిక్. శాంపిల్‌గా వదిలినా ఈ మ్యూజిక్కే ఫ్యాన్స్‌కు అంత కిక్ ఇస్తే.. ఇక ఫుల్ పాటలను వదిలితే వచ్చే డబుల్ కిక్ ఎలా ఉంటుందో ఈ నెల 20న తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా పాటలను ఆ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. వినాయక చవితి సందర్భంగా చిత్రంలోని ఎన్టీఆర్ కొత్త స్టిల్‌ని రిలీజ్ చేసి, పాటలను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరకర్త. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘అరవింద సమేత’లో బాలీవుడ్ టాప్ స్టార్..!
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టారు. గతంలో మనం సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన బిగ్‌బీ ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అరవింద సమేతలోనూ అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. -
అరవిందతో చిందేయంగా...
వీర రాఘవ తన కోపాన్ని వీడి కూల్ అయ్యారట. ఫైట్స్‌కి ఫుల్స్టాప్ పెట్టి అరవింద సమేతంగా చిందేస్తున్నారట. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై ఓ డ్యాన్స్ నంబర్ చిత్రీకరణ జరుగుతోంది. పాటల షూటింగ్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: పీయస్ వినోద్. -
ఒక రోజు.. 3 సినిమాలు
జనరల్‌గా ఒక సినిమా షూటింగ్‌లోనే కథానాయికల డే అంతా ముగిసిపోతుంది. కానీ శనివారం పూజా హెగ్డే ఏకంగా మూడు డిఫరెంట్ సినిమాల వర్క్‌లో భాగమై మంచి వర్కింగ్ డేను ఎంజాయ్ చేశారామె. ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఆ నెక్ట్స్ మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. ఫైనల్‌గా ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగమయ్యారు. ఇలా ఒకే రోజు మూడు సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగమయ్యారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. -
యమా స్పీడ్
ఓ వైపు శరవేగంగా షూటింగ్.. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు.. ఓ సైడేమో డబ్బింగ్ పనులు.. మరోసైడ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు ‘అరవింద సమేత’ చిత్రబృందం. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 11న సినిమాని రిలీజ్ చేయడం కోసం టీమ్ అన్ని పనులనూ ఒకేటైమ్‌లో యమా స్పీడ్‌గా చేస్తున్నారు. కుటుంబంలో జరిగిన విషాదాన్ని కూడా దిగమింగుకొని సినిమా కంప్లీట్ చేయడం కోసం ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అరవింద సమేత’. పూజాహెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా, నాగబాబు, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన గుడి సెట్లో చిత్రబృందంపై ఫ్యామిలీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడతారట. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీయస్ వినోద్. -
ప్రొఫెషనల్ బ్రదర్స్
నటుడు హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి చనిపోయిన విషాదంలో ఉన్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. కానీ తమ కుటుంబానికి సంబంధించిన బాధను తమ సినిమా మీద పడనీయకూడదని అనుకున్నారు. అందుకే తమ తమ సినిమా షూటింగ్స్‌కి హాజరు కానున్నారు. తమ ప్రొఫెషనలిజమ్ చూపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాను దసరాకు విడుదల చేద్దాం అనుకున్నారు. ఆ డెడ్‌లైన్ మీట్ అవ్వడం కోసం ఆల్రెడీ చిత్రబృందం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు తన వల్ల షూటింగ్ ఆలస్యం కాకూడదని ప్రొఫెషనల్‌గా ఆలోచించారు ఎన్టీఆర్. ఆయన షూట్లో జాయిన్ అవుతున్నట్టు చిత్రబృందం తెలిపింది. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా ఇదే విధంగా ఆలోచించారు. కెమెరామేన్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో ఎప్పటిలానే పాల్గొంటారట కల్యాణ్ రామ్. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ హీరోలుగా తమ బాధ్యతను నిర్వర్తించాలనుకున్న ఈ అన్నదమ్ములను ‘ప్రొఫెషనల్ బ్రదర్స్’ అనొచ్చు. -
ఇప్పుడు పూజా వంతు!
దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి. ఇప్పుడీ విషయాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నాం అంటే ఓ కారణం ఉంది. ఇప్పటివరకు ఆమె పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం పూజా సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇటీవల సమంత, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇలా కొందరు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు తమన్ స్వరకర్త. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
సుయ్ ధాగా – అఫీషియల్ ట్రైలర్ నిడివి:3 ని. 11 సె. హిట్స్ :2,20,51,230 అంటే ‘సూది దారం’ అని అర్థం. అమాయకుడైన భర్తను ప్రయోజకుడిగా చేసుకునే భార్య కథలు మనకు గతంలో వచ్చాయి. అలాంటి కథే ఇది. ఇంట్లో దర్జీ పని వంశపారంపర్యంగా ఉన్నా అది మర్చిపోయి చిల్లర పనులు చేసుకుంటూ వెన్నెముక లేని జీవితం గడుపుతున్న భర్తను అతడి భార్య జాగురూకతలోకి తీసుకుని వస్తుంది. మన కాళ్ల మీద మనం నిలబడదాం అంటుంది. దిగువ మధ్యతరగతికి చెందిన ఈ జంట టైలర్ వృత్తిని మొదలుపెట్టి లోకాన్ని ఎదిరించి తమ ఉనికి చాటుకోవడానికి ఎన్ని సంఘర్షణలు చేశారనేది కథ. గతంలో వచ్చి, హిట్ అయిన ‘దమ్ లగాకే హైసా’ సినిమా దర్శకుడు శరత్ కటారియా ఈ సినిమాకు దర్శకుడు. వరుణ్ ధావన్ హీరో, అనుష్క శర్మ హీరోయిన్. ఒకరికి బానిసగా ఉండటం కంటే స్వయం ఉపాధికి పూనుకోవడం మంచిదని చెబుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. అరవింద సమేత వీరరాఘవ – టీజర్ నిడివి: 0.52 సె. హిట్స్ :99,58,492 రాయలసీమ తెలుగు సినిమాకు జీవధాత్రిగా కొనసాగడం చూస్తే ఒక వైపు సంతోషపడాలో మరోవైపు ఆలోచనలో పడాలో తెలియని స్థితి. ఫ్యాక్షన్ అంశాన్ని కథగా తీసుకుని డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. చాలా హిట్ అయ్యాయి. దానిని దాటేసి తెలుగు సినిమా వేరే కథలవైపు చూడటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తిరిగి రాయలసీమ ఫ్యాక్షన్ కథను తీసుకొని ఎన్.టి.ఆర్.తో త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టడం ఒకవైపు గన్‌షాట్ హిట్‌కు సూచన ఇస్తుంటే మరోవైపు మళ్లీ అదే కథనా అని సందేహం కలుగుతుంది. స్థలకాలాలు మారితే అదే అంశం కొత్తగా ఉంటుంది. హీరోనిబట్టి దర్శకుడిని బట్టి ఈ కథాంశం మళ్లీ కొత్తగా ఉంటుందని ఆశించవచ్చేమో. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎలా ఉంటుందో తెలుసా’... అని జగపతిబాబు డైలాగ్ చెబుతుంటే ఆ ఫోర్స్ హీరోను ఎలివేట్ చేసేలా ఉంది. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో వెంటపడ్డానా నరికేస్తా వొబా’ అని ఎన్టీఆర్ చెప్పే పంచ్ డైలాగ్ అభిమానులకు కిక్ ఇచ్చే స్థాయిలో ఉంది. పూజా హెగ్డే ఈ సినిమా హీరోయిన్. దసరా విడుదల. మంటో – అఫీషియల్ ట్రైలర్ నిడివి :2 ని. 22 సె. హిట్స్ :64,45,475 హీరోలంటే రాజకీయ నాయకులో, సినిమా హీరోలో మాత్రమే కాదు. రచయితల్లో కూడా హీరోలుంటారు. సాదత్ హసన్ మంటో అలాంటి హీరో. అమృత్‌సర్‌లో జన్మించి ముంబైలో కొంత కాలం ఉండి దేశ విభజన సమయంలో లాహోర్‌ను ఎంచుకుని ఆయన ఆ సమయంలో రాసిన కథలు ఆయన యశస్సును శాశ్వతం చేశాయి. మంటో రాసిన కథలు ఆ కాలంలో సంచలనం. వాటి మీద కేసులు పడ్డాయి. ఆయనను చాలామంది కోర్టుకు ఈడ్చారు. మంటో కథల్లోని పదును, నగ్నత్వం ఎప్పూడూ ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఆయన జీవితం గురించి పలు సృజనాత్మక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. మంటో పై పాకిస్తాన్లో ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో మరో సినిమా రానుంది. నందితా దాస్ దర్శకురాలు. నవాజుద్దీన్ సిద్దిఖీ మంటో పాత్రను పోషించారు. రిషి కపూర్, జావేద్ అఖ్తర్ వంటి సీనియర్స్ కూడా ఇందులో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చలనచిత్ర ఉత్సవాల్లో ప్రశంసలు పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. సాహిత్యం, దేశ విభజన పట్ల ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ ఈ సినిమాను గమనించాల్సి ఉంది. -
డేట్ ఫిక్స్ చేశారు వోబా
కంటబడితే కనికరిస్తానేమో కానీ ఎంటబడితే నరికేస్తా వోబా... అంటూ వీర రాఘవ రెడ్డి ప్రతాపాన్ని టీజర్ ద్వారా ఆడియన్స్‌కు చూపించారు ఎన్టీఆర్. ఇప్పుడు ఫుల్ మూవీతో ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారాయన. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా గుమ్మడికాయ కొట్టే డేట్‌ను సెప్టెంబర్ 14కి ఫిక్స్ చేశారు చిత్రబృందం. సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా ఒకటే షెడ్యూల్లో సినిమాని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తారట. సెప్టెంబర్ 1న పాటల చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. జగపతిబాబు, నాగబాబు, ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు. -
ఓ లుక్ వేయండి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో మాస్ టీజర్ అందిస్తే, వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్ చూపించారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో, రాజుగాడికి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్ పెట్టారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ అంటూ బలమైన డైలాగ్ వినిపిస్తే, ‘మణికర్ణిక’గా కంగనా వీరనారి ప్రతాపం చూపించారు. తమిళంలో జ్యోతిక ‘మహిళలూ వినండి... మీకు కొన్ని సూచనలు ఉన్నాయి’ అన్నారు. ఏది ఏమైనా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్‌కు ఐ–ఫీస్ట్. ఓ లుక్ వేద్దాం. ఎంటబడ్డానా నరికేస్తా... ‘ఆది, సాంబ’ వంటి ఫ్యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్. మళ్లీ ఆ జానర్‌ని చాలా కాలంగా పూర్తి స్థాయిలో టచ్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో మళ్లీ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సీమలో వీర రాఘవ రెడ్డి వీర విహారం ఎలా ఉంటుందో టీజర్ ద్వారా చిన్న శాంపిల్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ మూడు వాక్యాల్లో హీరో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని జగపతిబాబు వాయిస్ ద్వారా మనకు పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పట్టుకున్న కత్తికి తన కలంతో పదును పెట్టారు త్రివిక్రమ్. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా ఓబా..’ అంటూ సీమ యాసలో ఎన్టీఆర్ పలికిన సంభాషణలు టీజర్‌కి హైలైట్ అని చెప్పొచ్చు. జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కంచరపాలెం ప్రేమ ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లాంటివి ఏమీ రిలీజ్ కాకముందే న్యూయార్క్ ఇండియన్æ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అఫీషియల్ ఎంట్రీ అందుకొని అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఇండిపెండెంట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. మొత్తం నూతన నటీనటులతోనే దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కంచరపాలెం అనే ఊరిలోని ప్రజలనే పాత్రలుగా.. వాళ్లందరికీ నటనలో వర్క్‌షాప్ చేసి కంచరపాలెం ఊళ్లోనే మొత్తం చిత్రాన్ని షూటింగ్ చేశారు దర్శకుడు వెంకటేశ్. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఒక ఊరిలోనే నాలుగు భిన్న వయసుల వారి మధ్య ప్రేమకథగా తెరకెక్కిందీ చిత్రం. మా సూచనలు వినండి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొన్ని సూచనలు ఇస్తున్నారు జ్యోతిక. ఇదంతా తన లేటెస్ట్ సినిమా ‘కాట్రిన్ మొళి’ ఫస్ట్ లుక్‌లో భాగమే. రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘కాట్రిన్ మొళి’. హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కు రీమేక్ ఇది. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బుధవారం హీరో సూర్య రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో ‘‘మనసుకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఆకలేస్తే భర్త కంటే ముందే తినొచ్చు. భర్త ఒక చెంప మీద కొట్టాడని మరో చెంప చూపించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినది మనం చేయొచ్చు. కావాలనుకుంటే బొద్దుగా ఉండొచ్చు. ఇంట్లో రోజువారి పనులను షేర్ చేసుకొమ్మని భర్తను అడగొచ్చు. సంపాదించొచ్చు, ఇంట్లో కూడా ఇవ్వాలి, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనసులో కాదు.. అనుకున్నదాన్ని బయటకు అవును అని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. స్త్రీ, పురుషుడు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అంటూ పది రూల్స్ ఉన్న బోర్డ్‌ని పట్టుకున్న జ్యోతిక ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందం. ఇందులో మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని జి. ధనుంజయ్ నిర్మించారు. నాకు రెండూ ఉన్నాయి సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఖాన్ – అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘భారత్’. దేశభక్తి చిత్రంగా వస్తున్న ఈ చిత్రం డైలాగ్ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్ని బంధాలు రక్తం వల్ల ఏర్పడతాయి.. మరికొన్ని మట్టి వల్ల ఏర్పడతాయి. నా దగ్గర అవి రెండూ ఉన్నాయి’’ అంటూ సల్మాన్ ఖాన్ డైలాగ్స్ పలికారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సర్కస్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. పర్సనల్ కారణాలతో ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నుంచి హీరోయిన్గా తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్ ఆ స్థానంలోకి వచ్చారు. మరో బ్యూటీ దిశా పాట్నీ కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్టాలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది. వీరనారి ఝాన్సీ రణభూమిలో మణికర్ణిక ఎంత రౌద్రంగా, ఆవేశంగా ఉంటారో చిన్నప్పుడు ఎన్నో కథలు విన్నాం, చదువుకున్నాం. వెండి తెరపై చూపించదలిచారు దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్. ఝాన్సీ పోరాట పటిమ ఏ విధంగా ఉంటుందో మనకు సరిగ్గా అంచనా లేదు. ఆ ఆవేశాన్ని ఫస్ట్ లుక్ ద్వారా కొంచెంగా చూపించారు ‘మణికర్ణిక’ చిత్రబృందం. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భుజాన బిడ్డ, మొహంలో మొండి ధైర్యంతో యుద్ధ భూమిలో కత్తి పట్టుకున్న కంగనా రనౌత్ ఫొటోను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్లా రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాన్ని రచించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లే అందించారు. వచ్చే ఏడాది జనవరి 25 ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్, తమిళంలో ‘జయం’ రవి ‘అడంగమారు’ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశాయి. మరో ప్రపంచంలోకి... వరుణ్ తేజ్ ఆకాశానికి నిచ్చెన వేశారు. అంతరిక్ష వీధిలో తన విధి నిర్వహించడానికి ఎన్నో సాహసాలు చే శారట. మరి ఆ విశేషాలన్నీ చూడాలంటే డిసెంబర్ 21 వరకూ వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపిహెచ్’. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఏదో మిషన్‌లో నిమగ్నమై ఉన్న వరుణ్ తేజ్ లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ సెట్‌ని డిజైన్ చేశారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. దాని కోసం యూనిట్ అంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కీమీ’ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మీ అందరి కోసం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’’ అని వరుణ్ తేజ్ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. కెమెరా: జ్ఞానశేఖర్. -
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ టీజర్.. సునీల్ రీఎంట్రీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. బుధవారం విడుదలైన ఎన్టీఆర్ తాజా సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్ నెటిజన్లను తెగ ఆకట్టుకోంటోంది. టీజర్ విడుదలైన మూడు గంటల్లోనే దీనిని 30 లక్షల మంది వీక్షించారు. చిత్ర నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ యూట్యూబ్ పేజీలో టీజర్ శరవేగంగా 4 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. ఇతర యూట్యూబ్ చానెళ్లలోనూ ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. వరుస హిట్లతో ఊపుమీదున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో పక్కా మాస్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. Our very own @MusicThaman the #Rockstar #Composer from south film industry recorded a mammoth powerhouse song. For movie #AravindaSametha @tarak9999 pic.twitter.com/uRocg1ilzW — Kailash Kher (@Kailashkher) 14 August 2018 రాయలసీమ యాస డైలాగ్‌లతో అభిమానులను అలరించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పంథా మార్చుకొని వినూత్న రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోసం ప్రముఖ సింగర్ కైలేశ్ ఖేర్‌తో ప్రత్యేక గీతాన్ని పాడారు. ఈ విషయాన్ని ట్విటర్లో కైలాశ్ ఖేర్ పోస్టుచేశారు. తమన్‌ను ప్రశంసిస్తూ పాడిన ఓ పాట వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ టీజర్ చూసిన నందమూరి అభిమానులు.. యంగ్‌టైగర్ ఖాతాలో సింహాద్రి లాంటి భారీ యాక్షన్ హిట్ మరోసారి రిపీట్ అవుతుందని సంబరపడుతున్నారు. సునీల్ రీఎంట్రీ కమెడియన్ నుంచి కథానాయకుడిగా మారిన సునీల్ మళ్లీ తన యథాస్థానానికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. హీరోగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన సునీల్‌ను త్రివిక్రమ్ మరోసారి ఆదరించాడు. సునీల్‌కు కెరీర్ తొలినాళ్లలో కమెడియన్‌గా మంచి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈ చిత్రంలోనూ ఆయనకు కీలకపాత్ర ఇచ్చినట్టు తెలుస్తోంది. టీజర్లో మెరున్ కలర్ టీషర్టుతో కనిపించడంతో సునీల్-త్రివిక్రమ్‌ల కాంబో మరోసారి అభిమానులను నవ్వించడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇది కమెడియన్‌గా సునీల్‌కు రీ ఎంట్రీ అని భావిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ సంబంధించిన లీకులతో అంచనాలు పెరిగిన ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా’
జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు విడుదల చేసింది. ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్‌తో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. కత్తి పట్టుకోని ఎన్టీఆర్ నోట వచ్చిన మాటలు తూటాల్లా పేలాయి. ‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా ఓబా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీజర్లో.. మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు చెప్పిన ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అనే డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ సంబంధించిన లీకులతో అంచనాలు పెరిగిన ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అరవింద సమేత’ దృశ్యాలు లీక్.. నిందితుడి గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సినిమాలను ‘లీక్’ భయం వెంటాడుతోంది. ఏపీలో ‘గీత గోవిందం’ సినిమా క్లిప్పింగ్స్ లీకేజ్ మరువక ముందే నిర్మాణంలో ఉన్న జూ.ఎన్టీఆర్ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ వీడియోలు సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో తమ చిత్రంలోని కొన్ని వీడియోలు లీక్ అయ్యాయంటూ నిర్మాణ సంస్థ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ మధుసూదన్ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని నిర్మిస్తోంది. షెడ్యూల్స్ వారీగా ప్రతిరోజు జరిగే షూటింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను వీరు ఓ హార్డ్‌డిస్క్‌లో సేవ్ చేస్తారు. ఈ డేటాను సినిమా ఎడిటింగ్ చేసి తుది మెరుగులు దిద్దే సమయంలో అవసరమైతే వినియోగిస్తారు. ఈ వీడియోల డేటాను భద్రపరిచే బాధ్యతలను నిర్మాణ సంస్థ ఫిల్మ్‌నగర్‌లోని డాటా డిజిటల్ బ్యాంక్‌కు అప్పగించింది. అందులో పనిచేసే టెక్నికల్ సిబ్బంది సినిమా షూటింగ్‌కు సంబంధించిన మూడు నిమిషాల నిడివి గల వీడియో క్లిప్‌ను లీక్ చేశారు. ఇది యూట్యూబ్‌తో పాటు మరికొన్ని సోషల్ మీడియా సైట్లలో వైరల్‌గా మారడంతో విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సంస్థ నిర్వాహకుడు రాధకృష్ణ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మధుసూదన్ సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేయగా డేటాను భద్రపరిచే విభాగంలో పనిచేస్తున్న చక్రవర్తి అనే యువకుడు ఈ వీడియోను కాపీ చేసి, తన స్నేహితులకు షేర్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. -
స్టేషన్లో అరవింద సమేతంగా...
ట్రైన్ కరెక్ట్ టైమ్‌కి వస్తుందా? ఆలస్యం ఏమైనా ఉందా? అని ఎంక్వైరీ చేస్తున్నారు వీర రాఘవ. ప్రేయసిని కూడా వెంటబెట్టుకుని రైల్వే స్టేషన్‌కు వచ్చారు. మరి ఈ ప్రేమ ప్రయాణం ఎక్కడిదాకా? అనేది దసరా పండగ టైమ్‌లో తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివ్రికమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్లో జరుగుతోందని సమాచారం. ఎన్టీఆర్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ తాలూకు ఫొటోలు బయటకు రాకూడదని యూనిట్ ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం యూనిట్‌ను కలవరపెడుతోంది. ఆ మధ్య కొన్ని ఫొటోలు లీకయ్యాయి. ఆ సంగతలా ఉంచితే.. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ క్లాస్, ఎన్టీఆర్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి ఉండేలా ఈ టీజర్‌ను కట్ చేస్తున్నారట టీమ్. జగపతిబాబు, నాగబాబు, రావు రమేష్, ఈషా రెబ్బా కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీజర్లో మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా లాక్ చేస్తారని ఊహించవచ్చు. -
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఫొటోలు మళ్లీ లీక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. అయితే వరుస లీకులతో ఈ మూవీ యూనిట్ ఆందోళనకు చెందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ స్టిల్ ఒకటి ఇటీవల లీక్ కాగా, తాజాగా అదే సీన్‌కు సంబంధించి మరిన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు అంచనాలు పెరుగుతున్న మూవీకి లీకుల బెడద తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకులు ఎవరు చేస్తున్నారన్న దానిపై మూవీ యూనిట్ దృష్టిసారించినట్లు సమాచారం. ఇటీవల లీకైన ఫొటోలో ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. తాజాగా లీకైన ఫొటోల్లో ఆ సీన్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు ఉన్నాయి. జూన్ 21న షూటింగ్ జరిగినట్లు ఫొటోలపై మనం గమనించవచ్చు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయనిపిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అక్టోబర్ 10న మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
దేవాలయంలో వీర రాఘవ
ఆలయంలో పూజలు చేస్తున్నారట వీర రాఘవ. ఈ పూజ ఫలం ఎవరికి దక్కుతుంది అనేది వెండితెరపై తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ దేవాలయంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.ఇటీవల పూజాహెగ్డే, సునీల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు టీమ్. అలాగే ఈ సినిమాలో నటుడు నాగబాబు ఓ గ్రామ సర్పంచ్ పాత్రలో నటిస్తున్నారని, ఈ సర్పంచ్ కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్. రావు రమేష్ ఓ పొలిటికల్ లీడర్ రోల్ చేస్తున్నారని సమాచారం. జగపతిబాబు, ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆ సెట్.. ఈ సెట్.. భలే సెట్
అతనేమో రాఘవ. మామూలు రాఘవ కాదు. వీర రాఘవ. ఆమె అరవింద. అందంగా ఉంటుంది. అరవింద సమేతంగా వీర రాఘవ ఏం చేశాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పుడు మాత్రం రాఘవ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈషా రెబ్బ కీలక పాత్రలో కనిపించనున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రెండు వేరు వేరు స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో ఏకకాలంలో çషూటింగ్ చేస్తున్నారు. ఈ సెట్స్ భలే ఉన్నాయట. రెండు సెట్స్‌లో షూటింగ్ కూడా భలేగా ప్లాన్ చేశారట. దాంతో అటూ ఇటూ తిరుగుతూ లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారట. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సాంగ్ షూట్ కోసం చిత్రబృందం ఫారిన్ వెళ్లనుంది. సెప్టెంబర్ 15 కల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నాగబాబు, నవీన్ చంద్ర, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీయస్ వినోద్ కెమెరామేన్.2 -
‘అరవింద సమేత’ స్టిల్ లీక్.. వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయమైన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో ఎంతో ఎమోషన్ ఉండబోతుందనేది అర్థమవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
ఓన్లీ ఎంటర్టైన్మెంట్
కాలేజ్‌లో స్టూడెంట్‌గా అల్లరి చేయడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్. యాక్షన్ నుంచి ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఎక్కారు. త్రివిక్రమ్ పంచ్‌లను చిత్తూరు యాసలో పేల్చనున్నారాయన. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను నిన్న స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్లో కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇందులో ఎన్టీఆర్, పూజా హెగ్డే పాల్గొంటారు. ఆగస్ట్ మూడు వరకు జరిగే ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీద దృష్టి పెట్టనున్నారట దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయని సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత కొన్ని సాంగ్స్ కోసం చిత్రబృందం పొల్లాచ్చి వెళ్లనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
ఫస్ట్‌లుక్ 12th July 2018