Aravinda Sametha Review, in Telugu, ‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 9:07 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Aravinda Sametha Veera raghava Telugu Movie Review - Sakshi

టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్‌ చంద్ర, రావూ రమేష్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. (సాక్షి రివ్యూస్‌) అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. టీజర్‌, ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడా..? త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాత ఫామ్‌ను అందుకున్నాడా? 

కథ ;
‘అరవింద సమేత వీర రాఘవ’ నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయి 30 ఏళ్ల పాటు ఊళ్లను నాశనం చేస్తాయి. 12 ఏళ‍్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. కాని తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్‌) అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
ఎన్టీఆర్‌ సినిమా అంటేనే వన్‌ మెన్‌ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్‌ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఎన్టీఆర్‌ చూపించిన డెడికేషన్‌ స్క్రీన్‌ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. లుక్స్‌పరంగానూ ఎన్టీఆర్‌ పడిన కష్టం సినిమాకు ప్లస్‌ అయ్యింది. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ పరంగానూ మంచి మార్కులు సాధించింది. విలన్‌ పాత్రలో జగపతి బాబు జీవించాడు. లుక్స్‌ పరంగానూ భయపెట్టాడు. (సాక్షి రివ్యూస్‌) యంగ్ హీరో నవీన్‌ చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్‌గా టర్న్‌ అయిన సునీల్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కింది. రావూ రమేష్‌, దేవయాని, సుప్రియా పాతక్‌, ఈషా రెబ్బా, శుభలేక సుధాకర్‌, ‍బ్రహ్మాజీలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ :
త్రివిక్రమ్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ఫ్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్‌. అభిమానులు తన నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే డైలాగ్స్‌, ఎమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్‌ మార్క్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా మిస్‌ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్‌ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్‌ కూడా తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా.. తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా లవ్‌ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్‌) అయితే త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌, టేకింగ్ అలరిస్తాయి. ద్వితీయార్థం ఎమోషనల్‌ సీన్స్‌తో భారంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది. తమన్‌ సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలతో రిలీజ్‌కు ముందే ఆకట్టుకున్న తమన్‌.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. పీఎస్‌ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్‌. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 



ప్లస్‌ పాయింట్స్‌ ;
ఎన్టీఆర్‌, జగపతి బాబుల నటన
డైలాగ్స్‌
యాక్షన్‌ సీన్స్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
కొన్ని బోరింగ్‌ సీన్స్‌
రొటీన్‌ స్టోరి

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement