‘‘ఏ సినిమాకైనా ప్రయాణమే ముఖ్యం. దాని ఫలితం బోనస్ లాంటిది’’ అన్నారు త్రివిక్రమ్. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెకిక్కంచిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల అవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన విశేషాలు...
# ఆడియో ఫంక్షన్‌లో ఎక్కువ మాట్లాడకపోవటానికి కారణం ఎన్టీఆర్‌కి జరిగిన విషాదం తాలూకు గాయం ఇంకా పచ్చిగానే ఉండటమే. ఏం మాట్లాడినా మళ్లీ ఆ విషయం గుర్తు చేసినట్టు ఉంటుంది అని తక్కువగా మాట్లాడాను. హరికృష్ణగారికి ఇలా అయింది అని తెలిసిన వెంటనే సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. కార్యక్రమాలు జరిగిన రెండో రోజే ఎన్టీఆర్ ఫోన్ చేసి 11న సినిమా విడుదల చేస్తున్నాం అని చెప్పాడు. అనుకోకుండా సినిమాలో తండ్రి చనిపోయిన తర్వాత చితి పెట్టే సన్నివేశాలతో పాటు మరికొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. నిజజీవితంలో తండ్రికి సంబంధించిన చివరి కార్యక్రమాలు పూర్తి చేశాక తారక్ ఈ సినిమాలో ఆ సీన్స్ చేశాడు.
# ఫ్యాక్షన్ సినిమా అనగానే యుద్ధం మొదలయ్యే ఘట్టం, ఆ తర్వాత యుద్ధం జరిగేప్పుడు బావుంటుంది. కానీ ఆ యుద్ధం తాలూకు పర్యవసనాలు అంత కిక్ ఇవ్వవు. అందుకే పురాణాలు చెప్పేటప్పుడు కూడా యుద్ధ పర్వాలు బాగా వివరించినప్పటికి చివరికి వచ్చేటప్పటికి లాగించేస్తారు. ఎందుకంటే ఆ హింస తాలూకు పర్యవసనాలు బతకాలన్న ఆశను చంపేస్తాయి. వాటి గురించి చెబితే సినిమాకు కొత్త యాంగిల్ వస్తుంది కదా అనుకున్నాం. అలాగే ఏ విషయాన్నైనా ఇంట్లో ఆడవాళ్లతో తప్ప ఊర్లో అందరితో చర్చిస్తాం. ఒకవేళ వాళ్లు ఇంట్లో ఆడవాళ్లు చెప్పింది వింటే హింస ఇంత దాకా రాకపోవచ్చు కూడా. ఆ విషయాన్ని కూడా సినిమాలో చెప్పాం.
# మన పురాణాలు, సాహిత్యాల్లో ఏదైనా మంగళం (శుభం)తో మొదలై మంగళంతో ముగుస్తుంది.ఇప్పుడు అంతా అమంగళమే. టీవీ పెట్టగానే ఆ యాక్సిడెంట్, ఆ విషాదం అని చూస్తున్నాం. మనం కూడా ఆ వార్తలు విని వాటికి రాటుదేలిపోయాం. కానీ మన పూర్వీకుల రచనల్లో ఎక్కువ రొమాన్స్ కనిపిస్తుంది. అంటే వాళ్లు లైఫ్‌ని అలా ఆస్వాదించారేమో? బయట ప్రపంచం తాలూకు పరిస్థితులే సినిమాల్లో ప్రతిబింబిస్తాయి. అప్పట్లో రాచరికం, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత నిరుద్యోగ సమస్యలు మన సినిమాల్లో కనిపించాయి.
# ‘అరవింద...’ సినిమా రీసెర్చ్‌లో భాగంగా రాయలసీమకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. తిరుమల రామచంద్రగారి సాహిత్యం గురించి తెలుసుకున్నాను. పెంచల్ దాస్ గారిని ఓ పాట కోసం పిలిచాను. తర్వాత డైలాగ్స్ విషయంలో కూడా సాయంగా ఉన్నారు. రీసెర్చ్‌లో భాగంగా చాలా మందిని కలిశాం. రాయలసీమ వాళ్లు ఉన్నారు కానీ వాళ్లలో రాయలసీమ లేదు. ఈయనలో ఉంది.
# ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా తక్కువగా మాట్లాడతాడు. ఫస్ట్ హాఫ్‌లో డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ రాని చోటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఫ్యాక్షన్ సినిమా అనగానే కొంచెం హింసను గ్లోరిఫై చేస్తాం. కానీ అదొక్కటే కాదు.. ఈ సినిమాలో రాయలసీమ సొగసును చూపించాం.
# కలెక్షన్స్ పట్టించుకోను అనడం అబద్ధం అవుతుంది. తెలుసుకుంటాను. కానీ అది ఆ క్షణం మాత్రమే. మళ్లీ మామూలే. స్థితప్రజ్ఞత అనను కానీ ఏదైనా ఎక్కువ సేపు నాతోపాటుగా ఉంచుకోలేను.
# సినిమా వైఫల్యాలు చూసి తెలుసుకునేది ఏం ఉండదు. పొరపాటు ఎక్కడ జరిగిందో మనకే అర్థం అయిపోతుంటుంది. ‘అజ్ఞాతవాసి’ సినిమా రిలీజ్‌కు ముందు ఇది కాపీ అంటూ ఓ హాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్లు వేశాడు అన్నారు. సినిమా తర్వాత? వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్లు అడిగి ఉంటే బాధపడుతూ ఇచ్చేవాణ్ణి. ఆ సంగతలా ఉంచితే.. ‘అజ్ఞాతవాసి’ నిర్మాత లాస్ అయ్యాడని మా రెమ్యునరేషన్ ఇచ్చేశాం కదా. సినిమా బాలేదని, కాపీ అని చాలా విమర్శలు వినిపించాయి. వాటిని తీసుకోవడమే. ఇంతకు మునుపు మనకు ఏదైనా కోపం, ఆవేశం వచ్చిందంటే మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతోనో పంచుకునేవాళ్లం. ఇప్పుడు మన చేతుల్లో ఫోన్ వచ్చేసింది. ఏమనిపించినా టక్కున (సోషల్ మీడియాలో పోస్ట్‌ని ఉద్దేశించి) చెబుతున్నాం. అన్నదాన్ని మళ్లీ వెనక్కి తీసుకోలేం. అది ఆ క్షణం మాత్రమే. తర్వాత కొన్ని రోజులకు ఇలా అన్నామేంటి? అని మనకే అనిపిస్తుంది.
# నాలో దర్శకుడు ఇష్టమా? రచయిత ఇష్టమా అంటే రెండిటినీ విడదీసి చూడలేను. రాముడు, భీముడు సినిమాలో ఇద్దరు రామారావుగార్లలాగా. మాటల మాంత్రికుడు ఇలాంటి బిరుదులు అన్నీ పెద్దగా తీసుకోను. అందుకే ఫంక్షన్స్‌లో యాంకర్స్ రెండు మూడు వాక్యాలు నా గురించి చెప్పేటప్పుడు మొదటి వాక్యం పూర్తి కాకముందే స్టేజ్‌పైకి వెళ్లిపోతా. అలా అయితే మిగతావి చెప్పలేరు కదా (నవ్వుతూ).
# ఫ్యాక్షన్ సమస్యను పరిష్కరిస్తున్నాం అనగానే హీరో మంచి మాటలు బోధిస్తాడనుకోవద్దు. ఇందులో హీరో ఏదీ బోధించడు. ఈ జనరేషన్‌కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటారు. జీవితంలోని సంఘటనల్ని పూర్తి చేసేది సంభాషణలే. ఇద్దరు మనుషులు కొట్టుకునేది, ప్రేమించుకునేది అన్నీ మాటల వల్లే. అలానే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు చూపించాం.
# మన సినిమాల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ సినిమాల్లో మజిల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ల సినిమా 90 నిమిషాల్లో అయిపోతుంది. మనది అప్పటికి సగం అవుతుంది. వాళ్లతో మనం ఏం తక్కువ? వాళ్ల కెమెరాలు కొత్తగా ఏం బంధిస్తాయి? వాళ్ల లైటింగ్‌లో కాంతి కొత్తగా ఏం ఉంటుంది? ఈ విధానాన్ని ఎవరో ఒకరు బద్దలు కొట్టాలి అని చూస్తుంటాం. కానీ మనం మాత్రం చేయం. నేను కూడా మినహాయింపేం కాదు. వాడికి వర్కౌట్ అయితే మనం చేద్దాంలే అన్నట్టుగా ఉంటాం. కానీ ప్రతి పది, పదిహేనేళ్లకు ఇండస్ట్రీ మారుతుంటుంది. ‘లవకుశ’ సినిమా కలర్‌లో తీసినప్పటికీ పూర్తి స్థాయి కలర్ సినిమాలు రావడానికి 12 ఏళ్లు పట్టింది. అప్పటికి హిందీ, తమిళంలో కలర్ సినిమాలు చేసేస్తున్నా కూడా.
# ఇప్పుడు ప్రేక్షకుడు ఇంట్లో జబర్దస్త్, కపిల్ శర్మ, బ్రహ్మానందం షో.. ఇలా కామెడీ షోస్ చూస్తున్నారు. సినిమాలో అనవసరమైన కామెడీ పెడితే, సినిమా మధ్యలో ఈ కామెడీ ఏంటి.. కథ చెప్పరా బాబు అంటారు ఆడియన్స్.
# ఈ మధ్య కొత్త దర్శకుల సినిమాలు చూస్తుంటే ఆనందంగాను, ఈర్ష్యగానూ ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి, రంగస్థలం, కంచరపాలెం, పెళ్ళి చూపులు, గూఢచారి, ఆర్‌ఎక్స్ 100’.
# దర్శకుడికి బడ్జెట్ మీద కొంత అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎక్కువైతే ఇటలీలో జరిగేది ఇండియాలో అన్నట్లుగా, మరెక్కడో జరిగేది ఇంకో చోట అన్నట్లు సీన్లు రాసేస్తాం (నవ్వుతూ).
# ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు అనుకున్నాం. కానీ ‘నీకు తెలుగు సినిమా అర్థం అవ్వడానికి టైమ్ పడుతుంది, నాకు నీ మ్యూజిక్ అర్థం అవ్వడానికి టైమ్ పడుతుంది’ అని చెప్పాను. ఈ సినిమాలో తమన్ నాకు చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చాడు. సాధారణంగా నీ పాటల్లో హిందీ ఎక్కువ వినిపిస్తుంది. అలాగే డ్యాన్స్ నంబర్‌లు ఉండే పాటలు వద్దు అని రెండు మూడు సూచనలు చెప్పాను. దేవిశ్రీ ప్రసాద్‌తో పని చేయకపోవడానికి కారణం నన్ను నేను వెతుక్కునే ప్రయత్నమే.
# పవన్ కల్యాణ్ తన అన్నయ్య, అమ్మగారికే చెప్పకుండా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. నేనూ మీలాగే పేపర్‌లో చూసి చదువుకున్నాను. ఆయన రాజకీయ ప్రసంగాలు రాసి పెడుతున్నాను అంటున్నారు. నాకు సినిమా స్క్రిప్ట్ రాయడమే బద్ధకం. ఇక అదెక్కడ రాస్తాను.
# నేను అందరితో నిజాయతీగా ఉంటాను. అందుకే అందరికీ దగ్గర అవుతుంటానేమో. నేను ఎవరితో అయితే పని చేస్తున్నానో వాళ్లందరూ నాకన్నా తెలివిగలవాళ్లు. మనం మన ఐడియాను సెల్ చేయడానికి వెళ్తున్నామా లేక మామూలుగా మాట్లాడుతున్నామా? అన్నది వాళ్లకు అర్థం అయిపోతుంది. ఎన్టీఆర్ చాలా త్వరగా చేసేస్తాడు అని అంటుంటాం. ఆ ట్రిక్ నాకు తెలిసిపోయింది. స్క్రిప్ట్‌ని చాలాసార్లు వింటాడు. బాగా విని మైండ్‌లోకి ఎక్కించేసుకుంటాడు. ఆ సన్నివేశం తీసేటప్పుడు వెంటనే అదే కదా అని పూర్తి సీన్ యాక్ట్ చేసేస్తాడు. విషాద సమయాల్లో ‘ఆయన పక్కన నేను ఉన్నాను’ అని ఎన్టీఆర్ అన్నాడు కానీ మా పక్కన ఆయన ఉండి సినిమా పూర్తి చేశాడు. అయినా మాటలతో తగ్గే విషాదం కాదు అది.
Comments
Please login to add a commentAdd a comment