శత్రు, ‘దిల్’రాజు, త్రివిక్రమ్, తమన్, సునీల్, నవీన్‌చంద్ర
‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కథ చెప్పినప్పటి నుంచి ఎన్టీఆర్‌కి విజయంపై చాలా ఎక్కువ నమ్మకం. నాకంటే కూడా ఎక్కువ నమ్మాడు. పాటలు, డ్యాన్స్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్.. కొంచెం జోడిద్దామా? అంటే ‘అవేవీ అవసరం లేదు మీరు కథ చెప్పింది చెప్పినట్టు తీయండి చాలు’ అని బలంగా నమ్మారు. థ్యాంక్స్ టు ఎన్టీఆర్’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’.
మమత సమర్పణలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు చాలా గౌరవం తెచ్చింది. నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. నాకు పరిచయం లేనోళ్లు కూడా నా ఫోన్ నంబర్ కనుక్కుని మరీ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. జెన్యూన్ కథని ఒత్తిడికి లోనవకుండా చెప్పాం. సినిమా బాగుంది కాబట్టే రివ్యూలు కూడా నిజాయతీగా ఇస్తున్నారు. ఇంట్రడక్షన్, ఇటర్వెల్ ఫైట్స్‌ని రామ్–లక్ష్మణ్ అద్భుతంగా కంపోజ్ చేశారు.
మమ్మల్ని ఎగై్జట్ చేసిన అంశాల్లో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడటం ఒకటి. మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం అందరికీ నచ్చింది’’ అన్నారు. నిర్మాత ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాని నైజాంలో విడుదల చేశా. తొలి షో నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. త్రివిక్రమ్ ఈ సినిమాతో చాలా మాయ చేశాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ‘ఇంద్ర, ఆది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’వంటి చిత్రాలొచ్చినా ఈ చిత్రంలో ఫ్యాక్షన్‌ని సెటిల్డ్‌గా చూపించారు. ఎన్టీఆర్ ఒన్‌మేన్ షో ఇది. ఇండస్ట్రీలో రెండు నెలలుగా మంచి హిట్ పడలేదు. ఈ సినిమాతో హిట్ వచ్చింది’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్, నటులు సునీల్, నవీన్‌చంద్ర, శత్రు, చమ్మక్ చంద్ర, ఎడిటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment