ఎవరినైనా సరే...అవసరానికి వాడుకోవడంలో టీడీపీ పెద్దలకు ఎవరూ సాటిరారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక కూరలో కరివేపాకులా ఏరి పారేయడంలో వారికి వారే సాటి. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ను శుభ్రంగా వాడేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత జూనియర్ ఎవరో కూడా తెలినయట్లుగా పక్కన పెట్టేశారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో రేపన్న రోజున జూనియర్ ను మళ్లీ వాడుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. అబ్బాయి సినిమా సక్సెస్ మీట్ కి బాబాయ్‌ని చంద్రబాబే పంపించారని అమరావతి కోళ్లు డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో అదే పనిగా కూస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా నచ్చిన ఫిలాసఫీ ఒకటుంది. అదే..యూజ్ అండ్ త్రో. అవసరానికి వాడుకో..అవసరం తీరిన వెంటనే అవతలికి విసిరేయ్. ఈ పాలసీని చంద్రబాబు నాయుడు తన రాజకీయ కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అమలు చేస్తూనే ఉన్నారని ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు అంటూ ఉంటారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి ఎదురీత తప్పదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా చంద్రబాబు నిర్వహించుకున్న సర్వేలతోపాటు.. ప్రైవేటు సంస్థల సర్వేల్లోనూ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని తేలడంతో చంద్రబాబు నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలన్న ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
ఈ క్రమంలో భాగంగా..పదేళ్ల క్రితం తాము వాడుకుని పక్కన పారేసిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ బుట్టలో వేసుకోవాలన్న వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఉన్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే కావచ్చు... జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా అరవింద సమేత వీరరాఘవ సక్సెస్ మీట్ సభకు బాబాయ్ బాలకృష్ణ వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎందుకంటే 2009 ఎన్నికల తర్వాత...జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కార్యక్రమంలోనూ బాలకృష్ణ కనిపించలేదు. ఇపుడు అమాంతం జూనియర్ సినిమా సక్సెస్ మీట్ కి రావడం...జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ టిడిపి ప్రచారం కోసం ఆకట్టుకోవడానికేనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. అంతకన్నా కొసమెరుపు ఏంటంటే.. ఇంచుమించు రెండేళ్ల క్రితం బాలకృష్ణ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జూనియర్ ఎన్టీఆర్ తో తమకి సంబంధాలే లేవన్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు.
అంతగా సంబంధాలు లేని జూనియర్ సినిమా కార్యక్రమానికి ఇపుడు బాలయ్య అమాంతం ఎందుకొచ్చినట్లు? వచ్చారు సరే... అరవింద సమేత వీరరాఘవ సినిమాలో హీరోయిన్ తో పాటు ప్రతీ ఒక్కరినీ పొగిడిన బాలయ్య... జూనియర్ ఎన్టీఆర్ గురించి నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు. అందరినీ పొగిడిన బాలయ్య అసలు ఈ సినిమా చూడనే లేదట. సినిమా చూడకుండానే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడేశారు. అసలు సినిమా కూడా చూడకుండా.. మొక్కుబడిగా బాలయ్య ఈ మీట్ కి ఎందుకొచ్చారంటే జూనియర్ ఎన్టీఆర్‌ను ట్రాప్ చేయడానికే అంటున్నారు రాజకీయ పండితులు.
చంద్రబాబే వ్యూహం ప్రకారం తన బావమరిది అయిన బాలయ్యను జూనియర్ ను మంచి చేసుకునే పనిలో ఉండమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్‌ను మంచి చేసుకోవలసిన అవసరం ఏముంది? బాబాయ్ గా రమ్మని పిలిస్తే జూనియర్ వస్తాడు కదా అంటారా? ఆ సీన్ లేదిపుడు. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్‌ని, ఆయనలోని అనితర సాధ్యమైన వక్తృత్వపు ప్రతిభను వీలైనంతగా వాడేసుకుని ఎన్నికల్లో లాభపడాలన్న వ్యూహంతో 2009లో చంద్రబాబు నాయుడే దగ్గరుండి జూనియర్‌ను పార్టీ వేదికలపైకి ఆహ్వానించారు. అప్పట్లో చంద్రం మావయ్య చూపించేది ఆప్యాయతే కాబోలు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన రమ్మనమనడమే ఆలస్యం అన్నట్లు.. ఎన్నికల ప్రచారం బరిలోకి దూకేశారు. తన అద్భుత ప్రసంగ పాటవాలతో ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. ఎంతగా ప్రచారం చేశారంటే.. ప్రాణాలకు సైతం తెగించి తెలుగుదేశానికి అంకితమై రాత్రింబవళ్లూ శ్రమించారు జూనియర్ ఎన్టీఆర్. ఆ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురై తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కూడా. తీవ్ర గాయాలపాలై కట్లుకట్టుకుని ఆసుపత్రి మంచంపై ఉండి కూడా టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు జూనియర్.
సరే... 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని యుక్తులు పన్నిన్నా.. అందరితో కలిసి మహాకూటమి పెట్టినా.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మా ముందు కూటమి తేలిపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్నికలు అయిపోగానే... నెమ్మది నెమ్మదిగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. తన తనయుడు లోకేష్‌ను పార్టీలో తన వారసుడిగా నిలబెట్టేందుకు.. పార్టీలో అసలు జూనియర్ ఎన్టీఆర్ నీడ కూడా లేకుండా జాగ్రత్తలు పడ్డారు చంద్రబాబు. జూనియర్‌ను పక్కన పెట్టడమే కాదు.. జూనియర్ తండ్రి హరికష్ణకూ, ఆయనకు అత్యంత విధేయులైన పార్టీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. ఆ కారణంగానే హరికృష్ణకు నమ్మకస్తుడైన పార్టీ సీనియర్ నేత కొడాలి నాని టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హరికృష్ణనీ, ఆయన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ నీ, హరికష్ణ అనుచరులైన పార్టీ నేతలను పార్టీలో డమ్మీలుగా మార్చేశారు చంద్రబాబు. జూనియర్ సినిమా దమ్ము విడుదలైన సందర్భంలో అయితే ఆ సినిమాని ఎవరూ చూడవద్దని టీడీపీ నేతలే ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి థియేటర్లు దొరక్కుండా టీడీపీ పెద్దలే అడ్డుకున్నారన్న ఆరోపణలు వినపడ్డాయి. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, నరేంద్ర మోదీ ప్రభంజనాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాలుగున్నరేళ్లు గడిచే సరికి చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకుని.. పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు. మరోవైపు బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఎవరో ఒకరి అండ.. జనాకర్షణ గల నేతల ప్రచారం లేనిదే ఎన్నికల ఏరు దాటలేని చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ వేదికలపైకి రప్పించి పార్టీ తరపున ప్రచారం చేయించుకుంటే బాగుంటుందని చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రిత జూనియర్ ఎన్టీఆర్‌పై కక్షగట్టేసినట్లు ఆయన సినిమాలకు థియేటర్లు దొరక్కుండా, ఆయన సినిమాలు ఎవరూ చూడకూడదంటూ ప్రచారం చేసిన వారే ఇపుడు మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జూనియర్‌ను మంచి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఒకసారి వాడుకుని పక్కన పెట్టేసిన జూనియర్ ఎన్టీఆర్ అంత ఈజీగా టీడీపీ వైపు రారేమోనన్న అనుమానంతోనే.. బాబాయ్ బాలయ్యను ఎన్టీఆర్ సినిమా సక్సెస్ మీట్ కి పంపారు. తద్వారా.. జూనియర్‌ను టీడీపీ వైపు రప్పించుకోడానికి చంద్రబాబు పథక రచన చేశారని అంటున్నారు.
చంద్రబాబు వైఖరి, విధానాలు నచ్చకనే నందమూరి హరికృష్ణ కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల హరికష్ణ దుర్మరణం చెందిన సందర్భంలో ఆయన పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద కాసేపు ఉంచుదామని చంద్రబాబు అనుకున్నారు. అయితే హరికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం దానికి నో అనేశారని సమాచారం. పార్టీ తనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని హరికృష్ణ తన కుటుంబ సభ్యులతోనూ, అనుచరులతోనూ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ నేపథ్యంలోనే కుటుంబసభ్యులతోపాటు అనుచరులు కూడా టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు హరికృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయలేదంటారు. ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో జూనియర్‌ను ఎలాగైనా మచ్చిక చేసుకుని ఆయన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట. జూనియర్ అభిమానులైతే.. టీడీపీ ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వెళ్లరాదని సోషల్ మీడియాలో ఇప్పుడే డిమాండ్ చేస్తున్నారు. జూనియర్‌ను మరోసారి వాడుకుని వదిలేస్తారని కూడా ట్వీట్లు పెట్టారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది చూడాలి.
- సీఎన్‌ఎస్ యాజులు
Comments
Please login to add a commentAdd a comment