జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ? | Dictator Vs Nannaku Prematho theaters war in West Godavari district | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ?

Published Mon, Jan 11 2016 6:05 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ? - Sakshi

జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ?

బాబాయ్, అబ్బాయ్ సినిమాలు పోటాపోటీగా విడుదల
థియేటర్ల కొరతతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ?
టీడీపీలో ఓ వర్గం నేతల మద్దతు బాలయ్యకే
యువకుల బలం జూనియర్‌కు

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలతో పశ్చిమాన పందెం కోళ్ల ముచ్చట ఎలా ఉన్నా సినిమా బరిలో మాత్రం నందమూరి హీరోలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానుండటంతో టీడీపీ నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా జోరును తగ్గించేలా థియేటర్ల కొరత సృష్టించనున్నట్టు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమా ఈనెల 13వ తేదీన, మరుసటి రోజు 14వ తేదీన బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా విడుదల కానున్నాయి.
 
 గత ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు, నందమూరి, నారా కుటుంబాలకు దూరంగా ఉంటున్న జూనియర్‌ను దెబ్బతీసేందుకు సరిగ్గా ఇదే అదనుగా టీడీపీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. ఇటీవలికాలంలో నిఖార్సైన హిట్ లేని జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమా రూ.వందకోట్ల క్లబ్‌లో చేరి చాన్నాళ్లయినా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రూ.50 కోట్ల బెంచ్‌మార్క్ దాటలేకపోయారు. ఈ నేపథ్యంలో రూ.50 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన నాన్నకు ప్రేమతో సినిమా కమర్షియల్ హిట్ సాధించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. పొరపాటున ఈ సినిమా అటు ఇటు అయితే జూనియర్ సినిమా కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో ఇదే అవకాశంగా థియేటర్లు దొరక్కుండా చేసి జూనియ్ సినిమా కలెక్షన్లు దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీలోని ఓ వరం్గ నేతలు పావులు కదుపుతున్నారు.
 
 నాన్నకు ప్రేమతో రూ.2.5 కోట్లు డిక్టేటర్ రూ.1.50 కోట్లు
 పశ్చిమగోదావరి జిల్లాలో నాన్నకు ప్రేమతో సినిమాను రూ.రెండున్నర కోట్లకు ప్రముఖ పంపిణీదారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా ప్రదర్శన హక్కులను కూ.కోటిన్నరకు ఓ ఔత్సాహికుడైన యువకుడు పొందినట్టు సమాచారం. 13వ తేదీన విడుదలయ్యే నాన్నకు ప్రేమతో సినిమాను ఆ రోజు దాదాపుగా జిల్లాలోని అన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరుసటి రోజు 14వ తేదీన సగం థియేటర్లు ఎత్తివేసి.. వాటిలో బాలకృష్ణ డిక్టేటర్ సినిమాను ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్క్రీన్లు మరిన్ని తగ్గించేలా కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది.
 
  ఇక 15వ తేదీన అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు ఉండటంతో జూనియర్ స్క్రీన్లు ఇంకా తగ్గించేస్తారని అంటున్నారు. ఇటీవలికాలంలో జూనియర్ సినిమాలకు ఆశించిన కలెక్షన్లు రాకపోయినా.. నాన్నకు ప్రేమతోపై భారీ అంచనాలు ఉండటంతో రూ.రెండున్నర కోట్లకు సినిమాను పంపిణీ చేస్తున్నారు. ఆది, సింహాద్రి స్థాయి హిట్ వస్తేనే నాన్నకు ప్రేమతో బయ్యర్లకు లాభాలు వస్తాయి. ఇప్పుడు పచ్చనేతల రాజకీయంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బలయ్యే పరిస్థితి నెలకొందని అంటున్నారు.
 
 మంచి థియేటర్లు బాలయ్యకే
 కాగా, థియేటర్ల పంపిణీలో కూడా రాజకీయం జరుగుతోందని అంటున్నారు. డీటీఎస్‌తో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్న థియేటర్లు బాలకృష్ణకు, బీ, సీ గ్రేడ్ థియేటర్లు జూనియర్ సినిమాకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో ఈ మేరకు థియేటర్ల పంపిణీ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీలో వర్గనేతల అండ బాలకృష్ణకు ఉన్నప్పటికీ అదే వర్గ యువకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
 
  సినిమా హిట్ అయ్యేవరకే ఈ రాజకీయాలు.. ఒక్కసారి హిట్ టాక్ బయటకు వస్తే థియేటర్ల కొరత సృష్టించడం ఎవరి వల్లా కాదు.. అప్పుడు బాలకృష్ణ సినిమా అయినా, జూనియర్ సినిమా అయినా ఎవ్వరూ ఆపలేరు.. అని ఏలూరుకు చెందిన ఓ ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో పందెంకోళ్లలా దిగుతున్న నందమూరి హీరోల్లో హిట్‌టాక్ పరంగా ఎవరిది పైచేయి అవుతుందో నాలుగు రోజుల్లో తేలిపోనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement