Nannaku Prematho
-
కోలీవుడ్‌కు ప్రేమతో..!
ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వటం చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళ నాట రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ టెంపర్‌ను అయోగ్య పేరుతో విశాల్ హీరోగా ప్రారంభించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సినిమా చేరింది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించిన ఈ సినిమా కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఓ స్టార్ హీరో ఈ రీమేక్‌లో నటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో జగ్గూ భాయ్
జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించేందుకు కష్టపడుతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా కనిపించబోయే నటుణ్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్‌గా నటించిన జగపతి బాబు మరోసారి ఎన్టీఆర్‌కు విలన్‌గా నటించనున్నాడట. ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌గా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాపై జగపతిబాబు ఎన్టీఆర్‌తో అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
నాన్నకు ప్రేమతో..
♦ రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు ♦ పోస్టుకార్డులను రాయించిన పోలీసులు హిందూపురం : ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు రోడ్డు భద్రత నియామాలు పాటించేవిధంగా విద్యార్థులతో వారి నాన్నకు రోడ్డుభద్రత గురించి వివరించాడానికి విద్యార్థులతో నాన్నకు ప్రేమతో అంటూ పోస్టుకార్డులు రాయించారు పోలీసులు. బుధవారం కిరికెరలోని ఎల్‌ఆర్‌జీ పాఠశాలలో పెనుకొండ డీఎస్పీ కరీమూల్లా షరీఫ్, రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్యర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలతో వారి నాన్నకు ఒక కార్డుపై రోడ్డు భద్రత గురించి హెల్మ్‌ట్ ధరించామని, తాగిబండి నడపొద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడావద్దని మీ ప్రాణలకు ప్రమాదం జరిగితే మేము అనాథలవుతామని పోస్టుకార్డులపై రాయించి పోస్టు చేయించారు. అనంతరం డీఎస్పీ కరీమూల్లా షరీఫ్ మాట్లాడుతూ హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాలను పూర్తీగా నివారించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆంజినేయులు, ఎల్‌ఆర్‌జీ పాఠశాల ఏఓ నరేష్ ప్రధానోపాధ్యాయులు ప్రసాధ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులపై స్పందించిన ఎన్టీఆర్
నాన్నకు ప్రేమతో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు అందుకున్న ఎన్టీఆర్ వాటిపై స్పందించారు. తమ సినిమా పూర్తిగా లండన్ లో నిర్మించామని, లండన్ లో తీసిన సినిమాకు భారత్ లో టాక్స్ వర్తించదన్నారు. ఇప్పటికే కాగ్ నోటీసులకుతన ఆడిటర్ రిప్లై ఇచ్చినట్టుగా తెలిపారు. ఆదాయపు పన్నుతో పాటు సర్వీన్ టాక్స్ ను కూడా క్రమం తప్పకుండాచెల్లిస్తున్నాని తెలిపిన ఎన్టీఆర్, భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఎప్పుడూ మరవలేదన్నారు. చెల్లించాల్సిన పన్ను ఏదైనా ఉన్నట్టుగా తేలితే అణా పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగ్ సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి ఎన్టీఆర్ 1.10 కోట్ల టాక్స్ మినహాయింపు పొందారని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్, రణబీర్లకు కాగ్ నోటీసులు..!
సినిమా పారితోషకానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, రణబీర్ కపూర్ లు పొందిన పన్ను మినహాయింపుపై నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాగ్ తప్పు పట్టగా.. ఈ వ్యవహారంలో ఈ హీరోకి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన పారితోషకం వ్యవహారంలో ఎన్టీఆర్ అనుచిత రీతిలో పన్ను మినహాయింపు పొందినట్టుగా తెలుస్తోంది. ఆ సినిమాకు గానూ ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడట. లెక్క ప్రకారం అందులో కోటీ పది లక్షల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద తారక్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఎక్కువగా భాగం లండన్ లో షూట్ చేయటంతో సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి 1.10 కోట్ల ట్యాక్స్ మినహాయింపు పొందారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా విషయంలో ఈ తరహా మినహాయింపు పొందటంతో అతనికి కూడా నోటీసులు అందాయి. వీరికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాగ్ భావించింది. దీంతో ఇద్దరు నటులకు షోకాజ్ కం డిమాండ్ నోటీసులు ఇవ్వటంతో పాటు అలాంటి అవకతవకలు ఇంకా ఉన్నాయా పరిశీలించమని సంబంధిత అధికారులను కోరింది. -
చెర్రీ, సుకుమార్‌లది పాత ప్రేమకథ..!
రొటీన్ మూస కథలతో సినిమాలు చేయటం దర్శకుడు సుకుమార్‌కు నచ్చదు. అందుకే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలతో పాటు ఆయన నిర్మించిన సినిమాలు కూడా సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా ఉంటాయి. ఇటీవల నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్, త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ఇది ఓ ప్రేమకథ అంటూ ప్రచారం జరిగింది. సుకుమార్ చెర్రీ కోసం ప్రయోగాలను పక్కన పెట్టేశాడన్న టాక్ వినిపించింది. కానీ సుకుమార్ మాత్రం మారలేదట. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాలో కూడా తన మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాను పీరియడ్ డ్రామాగా రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగే ఓ అందమైన పల్లె ప్రేమకథను వెండితెర మీద చూపించనున్నాడు. సెల్ ఫోన్లు ఈ మెయిల్స్ లేని కాలంలోని స్వచ్చమైన ప్రేమకథతో ఆడియన్స్ మెప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు. -
దర్శకుడికి కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. మాస్ ఇమేజ్ను ఎన్టీఆర్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించటంతో పాటు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాదు 52 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ హ్యాపి ఫీల్ అయిన నిర్మాత బివియస్ఎన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 52 లక్షల ఖరీదు చేసే బీయండబ్ల్యూ ఎక్స్3 సీరీస్ కారును సుకుమార్‌కు కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఈ అక్టోబర్‌లో చెర్రీ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతోంది. -
ఎన్టీఆర్‌కి సుకుమార్ వెరైటీ గిఫ్ట్
శుక్రవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్టైల్లో విషెస్ తెలియజేశారు. తమ జనరేషన్ హీరో అయినా ఈగోలు పక్కన పెట్టి రామ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్, జూనియర్‌కు ఇది సక్సెస్ ఫుల్ ఏడాది కావాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఎన్టీఆర్‌ను తొలిసారిగా 50 కోట్ల క్లబ్లో నిలబెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన క్రియేటివిటీతో ఓ స్పెషల్ గిఫ్ట్‌ను తయారు చేయించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా థీమ్‌తో రూపొందించిన ఈ గిఫ్ట్‌తో ఎన్టీఆర్‌ను సర్ప్రైజ్ చేశాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ వాచ్‌ను తయారు చేయించాడు. 'టు డాడ్ విత్ లవ్' అని రాసున్న ఈ వాచ్‌లో నాన్నకు ప్రేమతో సినిమాలో బటర్ ఫ్లై ఎఫెక్ట్‌ను తెలిపేలా ఏడు బటర్‌ఫ్లై లతో డిజైన్ చేయించాడు. వీటితో పాటు ఫాలో ఫాలో సాంగ్ లిరిక్స్, గేమ్ ఓవర్ అని పదాలను యాడ్ చేశాడు. ఇక సినిమాలో జగపతిబాబు ఆడే బాల్ గేమ్‌కి సంబంధించిన బాల్స్ కూడా ఈ వాచ్ డిజైనింగ్‌లో ఉపయోగించాడు. సుక్కూ ఇచ్చిన సర్ప్రైజ్పై స్పందించిన ఎన్టీఆర్, ఇది ఇప్పటివరకు అందుకున్న వాటిలో అరుదైన గిఫ్ట్ అంటూ ట్వీట్ చేశాడు. The most unique gift I have ever received for my birthday.thanks Sukumar Garu. pic.twitter.com/2rIzhCw6ae — tarakaram n (@tarak9999) 20 May 2016 -
మళ్లీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్, తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన సుకుమార్ మంచి విజయాన్ని సాధించాడు. అదే జోరులో వచ్చే సంక్రాంతి బరిలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు సుక్కు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఇంత వరకు సినిమా మొదలు పెట్టని సుకుమార్, రామ్ చరణ్ హీరోగా ఓ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ చేస్తానంటూ ప్రకటించాడు. తన గత సినిమాల మాదిరిగా ఎలాంటి సైన్స్ పాఠాలు లేకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. చెర్రీ కూడా ఆరెంజ్ సినిమా తరువాత లవ్ స్టోరీలో నటించలేదు. అందుకే సుకుమార్ డైరెక్షన్లో రొమాంటిక్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా పూర్తయిన తరువాత సుకుమార్ డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటిన సుకుమార్ వచ్చే ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
పాత లుక్‌లో జూనియర్
గత కొద్ది రోజులుగా తన లుక్ విషయంలో ప్రయోగాలు చేస్తున్న ఎన్టీఆర్, ప్రస్తుతం చేస్తున్న జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రయోగం చేయటం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా ఉంగరాల జుట్టుతో, వత్తయిన గెడ్డంతో కనిపించిన జూనియర్, కొన్ని సినిమాల్లో మాత్రం డిఫరెంట్ లుక్‌ని ట్రై చేశాడు. ముఖ్యంగా ఇటీవల కాలం ప్రతి సినిమాకు భారీ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. బాద్ షా సినిమాలో స్ట్రయిట్నింగ్ చేయించిన హెయిర్ స్టయిల్‌తో స్టైలిష్‌గా కనిపించిన జూనియర్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించాడు. ఆ తరువాత టెంపర్ సినిమా కోసం మరోసారి ప్రయోగం చేశాడు. ఈ సినిమాలో పోలీస్ హెయిర్ కట్‌తో రఫ్ లుక్‌లో కనిపించిన జూనియర్ భారీ సక్సెస్‌ను నమోదు చేశాడు. అదే జోరులో నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా కొత్త అవతారంలో కనిపించాడు. పూర్తి వెస్ట్రన్ లుక్‌లో కనిపించి మెప్పించాడు. అయితే ఇలా వరుసగా తన ప్రతీ సినిమాకు లుక్ మారుస్తూ వచ్చిన జూనియర్ నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం పాత లుక్‌లోనే కనిపిస్తున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలకు పోవటం లేదు. మాస్ కమర్షియల్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాత లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ దిగిన ఫోటోతో ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. -
నేను వెంటపడడం మొదలుపెట్టా!
- అల్లు అరవింద్ ‘‘నేను నిర్మించిన చిన్న చిత్రాలు చూడండి అంటూ దర్శకుడు హుస్సేన్ షా నా వెంట పడ్డాడు. అవి చూసిన తరువాత నేను నివ్వెరపోయా. నా బ్యానర్లో సినిమా చేయమని ఇప్పుడు నేను తన వెంటపడడం మొదలుపెట్టా. సుకుమార్ వద్ద కొద్ది రోజులు పనిచేశాడు. ‘నాన్నకు ప్రేమతో’ చూసిన నేను హుస్సేన్ షాను ఆఫీసుకు పిలిపించి ఏప్రిల్ నుంచి మా బేనర్లో సినిమా చేయమని అడిగా. అందుకు తను కూడా ఓకే అన్నాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. తరుణ్ శెట్టి, అవంతిక, కిరీటి దామరాజు, జెన్నీ, భరణ్ ప్రధాన పాత్రల్లో నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై హుస్సేన్ షా దర్శకత్వంలో రూపొందిన ‘మీకు మీరే.. మాకు మేమే’ పాటలను అల్లు అరవింద్ చేశారు. ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఆర్య-2’లో, వేరే సినిమాల్లో హుస్సేన్ షా చిన్న చిన్న పాత్రలు చేస్తూ దర్శకత్వం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తను తీసిన షార్ట్ ఫిలిం చూసి జెలసీ ఫీలయ్యా. ‘నాన్న కు ప్రేమతో’ను ఏ హాలీవుడ్ నుంచో కాపీ కొట్టాననుకుంటారు. కానీ, నేను కాపీ కొట్టింది హుస్సేన్ షా నుంచే. ఈ చిత్రం మూలకథ తనదే. భవిష్యత్తులో అతను నా బేనర్లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. నిర్మాతలు లగడపాటి శ్రీధర్, రామ్మోహన్, హీరో తరుణ్ శెట్టి, చిత్ర దర్శకుడు కూడా మాట్లాడారు. అవంతిక, కిరీటి దామరాజు, జెన్నీ, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్, కెమేరామ్యాన్ సూర్య వినయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ వంశీ తాడేపల్లి పాల్గొన్నారు. -
కోనసీమ నేపథ్యంతో కుటుంబ కథాచిత్రం: సుకుమార్
త్వరలో కోనసీమ నేపథ్యంలో ఓ కుటుంబ కథాచిత్రాన్ని నిర్మిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత.. తన కుటుంబసభ్యులతో కలిసి అమలాపురం సావరంలోని తన ఆప్తమిత్రుడు, పంచాయతీరాజ్ ఇంజనీర్ అన్యం రాంబాబు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తనను విలేకరులతో మాట్లాడారు. తాను, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కోనసీమ ప్రాంతానికి చెందినవారమేనని చెబుతూ, కోనసీమ నేపథ్యంలో చిత్రాన్ని తమ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిస్తామని చెప్పారు. రాంబాబు, తాను చిన్నతనం నుంచి స్నేహితులమని, 1993-97 మధ్య కాకినాడ ఆదిత్య కళాశాలలో అధ్యాపకులుగా పని చేశామని చెప్పారు. కోనసీమకు వస్తే రాంబాబును కలవకుండా వెళ్లలేనని చెప్పారు. భార్య హంసిని, కుమారుడు నాయుడు, కుమార్తె సుకృతిలతో కలిసి రాంబాబు కుటుంబసభ్యులతో కొంతసేపు సరదాగా గడిపిన సుకుమార్ అనంతరం అమలాపురం సమీపంలోని ఈదరపల్లిలోని సోదరి ఇంటికి వెళ్లారు. -
పవన్‌ను దాటేసిన జూనియర్
-
పవన్‌ను దాటేసిన జూనియర్
ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను ఎన్ని రోజులు ఆడింది అన్న దాన్ని బట్టి చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలు కూడా 15 రోజులకు మించి థియేటర్లలో ఉండే పరిస్థితి లేదు. దీంతో సినిమా సక్సెస్‌ను కలెక్షన్లతో లెక్కవేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల మధ్య ఈ కలెక్షన్ల రికార్డ్ల పోటి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ఓ రికార్డ్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఓవర్సీస్లో సాధిస్తున్న కలెక్షన్లు సినిమా సక్సెస్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలందరూ ఓవర్సీస్లో మిలియన్ మార్క్ కలెక్షన్ల కోసం ఆరాటపడుతున్నారు. ఈ లిస్ట్‌లో భారీ వసూళ్లతో బాహుబలి నెంబర్ వన్ స్థానంలో ఉండగా, మహేష్ శ్రీమంతుడు రెండో స్థానంలో ఉంది. ఇక మొన్నటి వరకు పవన్ అత్తారింటికి దారేది మూడో స్థానంలో ఉండగా, తాజాగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ పవన్ కలెక్షన్ రికార్డ్‌ను అధిగమించాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన అత్తారింటికి దారేది ఓవర్ సీస్ మార్కెట్లో 11 కోట్ల 34 లక్షలు వసూళు చేసింది. అయితే ఎన్టీఆర్, ఈ రికార్డ్‌ను కేవలం పది రోజుల్లోనే దాటేశాడు. జనవరి 13న నాన్నకు ప్రేమతో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్, ఇప్పటికే 11 కోట్ల 51 లక్షలకు పైగా వసూళ్లు సాధించాడు. దీంతో ఓవర్సీస్లో పవన్ రికార్డ్‌ను అధిగమించి హైయస్ట్ కలెక్షన్లు సాధించిన మూడో హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు. -
'ఆ నలుగురే మూలస్తంభాలు'
-
ఆ నలుగురే మూలస్తంభాలు: జూ.ఎన్టీఆర్
‘‘ నిస్వార్థంగా మేం చేసింది ప్రయోగమో, ప్రయత్నమో గానీ మా వెంట నిలబడ్డ ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనసా, వాచా, కర్మణ మాతో పాటూ అందరూ నమ్మి అందించిన విజయ మిది. ఇది నా 25వ చిత్రంగా కాక జీవితకాలం గుర్తుండి పోయేలా కథ రాసిచ్చిన సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఈ నెల 13న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం సక్సెస్‌లో నేను మెయిన్ పిల్లర్ అంటున్నారు. కానీ సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబులే మూల స్తంభాల్లా నిలిచారు. ఎన్ని వసూళ్లు సాధించాం, సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందనే విషయాన్ని పక్కనపెడితే ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అని తెలిపారు. ‘‘సినిమా సక్సెస్ చూస్తే మాటలు రావడం లేదు. సక్సెస్‌కు ముందు బాగా అలసిపోయాను, ఇప్పుడు నిద్రపోవాలనిపిస్తోంది. ఈ సక్సెస్‌లో నాతోపాటూ నా టీమ్, ప్రొడక్షన్ టీమ్ అందరి సపోర్ట్ ఉంది’’ అని సుకుమార్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో హీరో, విలన్‌కు మధ్య వచ్చే సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సీన్ చూసిన ఎన్టీఆర్ ‘నీకు ముద్దివ్వాలనుంది’ అని నాతో అంటున్నాడు’’ అని జగపతి బాబు పేర్కొన్నారు. ‘‘37 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నా, ఈ చిత్రం చూశాక నా భార్య ‘చాలా బాగా నటించారు’ అంది. నేనింత నిజా యితీగా నటించడానికి కారణం జూ. ఎన్టీఆర్’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరోయిన్ రకుల్, నటులు రాజీవ్ కనకాల, నవీన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించనున్న సుకుమార్..?
'నాన్నకు ప్రేమతో' లాంటి భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సుకుమార్ త్వరలోనే అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడట. ఇంత ఫాంలో ఉన్న సమయంలోనే దర్వకుడిగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే ఈ లెక్కల మాస్టర్ మరో రెండు సినిమాలు చేసిన దర్శకత్వం నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రొడక్షన్ స్థాపించిన సుకుమార్. ఆ బ్యానర్ పై 'కుమారి 21 ఎఫ్' సినిమాను నిర్మించిన మంచి విజయం సాధించాడు. భవిష్యత్తులో కూడా తన బ్యానర్ ద్వారా తెరకెక్కే సినిమాలకు రచయితగా, నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సుక్కు, ఆ తరువాత మరో సినిమా చేసి డైరెక్షన్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట. -
మాకేదైనా అవుతుందని నాన్నకు భయం!
చాలా సినిమాలు లెక్కల్లో నిలుస్తాయి. కొన్ని సినిమాలే లెక్కలేనన్ని మనసుల్ని గెలుస్తాయి. ‘ఆర్య’, ‘100% లవ్’, ‘1... నేనొక్కడినే’ ... ఇలా ఏ సినిమా చేసినా ఏవేవో లెక్కలేసుకొని సినిమాలు చేయడం రాని మాజీ లెక్కల మాస్టారు సుకుమార్. ‘‘బ్రెయిన్ కన్నా హృదయాన్ని ఎక్కువ నమ్ముతా’’ అని బల్లగుద్దే ఆయన మరోసారి ప్రేక్షకుల మనసుల్ని గెలిచేందుకు చేసిన ప్రయత్నం - ‘నాన్నకు ప్రేమతో’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తాలూకు అనుభూతుల్ని గుర్తు చేసుకుంటున్న ఈ సుమనస్సుకుమారుడి ఎమోషనల్ టాక్... మీరూ, మీ హీరో తారక్ గెటప్ లాగా గడ్డం పెంచుతున్నారే! గడ్డం ఉంటేనే నాకు బాగుంటుందని కొద్దికాలంగా అలా కనిపిస్తున్నా. ఇప్పుడు మా పిల్లాడు కూడా ‘చేతితో దువ్వుకోవడానికి వీలుండేలా నాన్నలా నాకూ గడ్డం కావాల’ని వాళ్ళమ్మను అడుగుతున్నాట్ట! ‘నాన్నకు ప్రేమతో’కి వస్తున్న రెస్పాన్స్ విన్నాక ఏమనిపిస్తోంది? సంతోషంగా ఉంది. మునుపటి సినిమాలకు వేటికీ మా ఊరు, చుట్టు పక్కల నుంచి ఎప్పుడూ ఫోన్లు రాలేదు. కానీ ఈ సినిమా బాగుందంటూ చాలా ఫోన్లు వచ్చాయి. పరీక్షలో డిస్టింక్షన్లో పాసయ్యాననిపిస్తోంది. మరి, సినిమా పరిశ్రమలో వాళ్ళేమన్నారేంటి? మొదటి రోజే దర్శకుడు వి.వి. వినాయక్ ఫోన్ చేశారు. ఊళ్ళో వాళ్ళ మామయ్య గారు సినిమా చూసి ఆ ఎమోషన్‌తో ఏడుస్తూ బయటకొచ్చార్ట! ‘ఎవరేమన్నా పట్టించుకోకు. మంచి సినిమా తీశావ’ని వినాయక్ అన్నారు. అలాగే, దర్శకుడు కొరటాల శివ, వక్కంతం వంశీ అభినందించారు. తారక్ ఫ్యాన్స్ నుంచీ మంచి రెస్పాన్సొచ్చింది. అందుకే, తొలిరోజు నుంచి నమ్మకంగా ఉన్నా. ‘గుర్తుంచుకో మళ్ళీ చెబుతా’ డైలాగ్ ఎక్కడిది? (నవ్వేస్తూ) అది నా అలవాటు. డిస్కషన్స్‌లో ఒక విషయం మాట్లాడుతుంటే, మధ్యలో మరో ముఖ్య విషయం గుర్తొస్తే, నా అసిస్టెంట్స్‌తో అలా అంటూ ఉంటాను. అదే సినిమాలో పెట్టాను. అందరికీ నచ్చింది. జనానికి చూపించకుండా, మీరే పక్కనపెట్టిన సినిమా ఎంతుంది? (నవ్వేస్తూ...) చిత్రీకరించక ముందే కొన్ని లేపేశా. ఫస్టాఫ్‌లో ఒక సీన్ ఎడిటింగ్‌లో తీసేశాం. ఇప్పుడు అది కూడా కలుపుదామనుకుంటున్నాం. ‘కుమారి 21ఎఫ్’ హీరోయిన్‌తో సీన్లు తీసేశార్ట! అదేమీ లేదండి. అవన్నీ వట్టి పుకార్లు. అసలు హెబ్బా పటేల్ ఈ సినిమాలో నటించనే లేదు. మీరు ఐటమ్ సాంగ్స స్పెషలిస్ట్కదా. ఈ సినిమాలో మాత్రం పెట్టలేదేం? ఈసారీ పెడదామనుకున్నా, కానీ కథలో కుదరలేదు (నవ్వులు...) జనరల్‌గా నా సినిమాల్లో సెకండాఫ్‌లో సెకండ్ సాంగ్ అదే ఉంటుంది. ఇది ఇంటెలిజెంట్ఫిల్మనీ, కింద సెంటర్లకు అర్థమవుతుందా అనీ కొందరు అనుమానం వ్యక్తం చేశారు! ఎగ్జామ్‌లో మనం ఫెయిలవ్వచ్చేమో కానీ, ఆడియన్స్ ఫెయిల్ కారు. ‘1’ సినిమా కింద సెంటర్లలో అర్థమవుతుందా, లేదా అని భయపడ్డా. ఆడియన్స్‌కు అర్థమయ్యేలా చెప్పకపోవడం వల్లే అది ఆడలేదు. నా తప్పే. కానీ, ఈసారి అందరికీ అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే, ‘టెర్మినేటర్’ సినిమా నాకు అప్పట్లో అర్థం కాలేదు. కానీ, అమ్మాయిని రక్షించడమనే ఎమోషన్‌ను బీ, సీ సెంటర్ల జనమూ చూశారు. కానీ, ఇదేదో ‘ఏ’ క్లాస్ సెంటర్ల సినిమా అని...! (నవ్వేస్తూ...) ఊరి నుంచి సామాన్య డ్రైవర్ ఒకతను నాకు ఫోన్ చేసి, ‘సార్! ఈ సినిమా మనకు అర్థమవుతుంది సార్. కానీ, బీ, సీ సెంటర్స్‌లో అర్థమవుతుందో లేదో’ అన్నాడు. అప్పుడెప్పుడో ‘శంకరాభరణం’ సినిమాకు ఓ రిక్షావాడు ‘సినిమా చాలా బాగుంది సార్. కానీ, మాస్‌కి నచ్చుతుందో, లేదో’ అన్న సంగతి నాకు గుర్తొచ్చింది. హీరో తండ్రిని విలనెలా మోసం చేశాడో ఒక్క సీనైనా చూపిస్తే...! (మధ్యలోనే అందుకుంటూ...) మోసం ఎలా చేశారనేది ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాం. కానీ, ఈసారి ఆ మోసం వల్ల ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడేదన్నది చూపించాలనుకున్నా. చూపించా. కొద్దిగా వయసొచ్చిన పిల్లలు జరిగినవి మర్చిపోవడం లాజిక్కేనా? పదకొండేళ్ళ పిల్లలు తప్పిపోయి, కుటుంబం, భాష మర్చిపోయిన ఘటనలెన్నో పత్రికల్లో చూస్తూనేవున్నాం. అయినా నన్నడిగితే లాజిక్‌లు మాట్లాడడం మొదలెడితే, సినిమాల్లో ఒక్క సీనూ మిగలదు. కథనీ, ఎమోషన్స్‌నీ జాగ్రత్తగా కూర్చామా, పేర్చామా, చెప్పామా అనేదే ముఖ్యం. ఏమైనా లెక్కల మాస్టార్ పాఠం చెప్పినట్లు సిన్మా తీశారని...! ప్రశ్నలడగడంలో మీదో స్టైల్. సినిమా తీయడంలో నాదో స్టైల్. ఎవరి శైలి వాళ్ళదే. నా స్టైల్ నుంచే నా సృజన వస్తుంది. అది లేకుండా మీరైనా, నేనైనా పని చేయలేం. అలాకాక వేరే రకంగా చేయాలంటే, మానసికంగా మరణించి, పునర్జన్మనెత్తాలి. నేను బ్రెయిన్ కన్నా హృదయాన్ని నమ్ముతా. హృదయం మాట విని, (డబ్బు) లెక్కలేసుకోవడం మానేస్తున్నట్లున్నారే! కెరీర్ మొదటి నుంచి కూడా నేను (డబ్బు) లెక్కల మీద దృష్టి పెట్టలేదు. ‘డబ్బు వెనక పడకు. డబ్బే నీ వెనక పడుతుంది’ అని అల్లు అరవింద్ గారు ఒకసారి నాతో అన్నారు. నేనిప్పటికీ అదే ఫాలో అవుతున్నా. ఇంతకీ సినిమా చూసి, అన్నయ్యలేమన్నారు? అమ్మ ఏమన్నారు? అన్నయ్యలతో పాటు ఇంట్లో అందరూ బాగుందన్నారు. బాగా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. మా అమ్మ ఇంకా చూడలేదు. (ఉద్వేగానికి గురవుతూ..) మా నాన్న బాగోగులే లోకంగా బతికి, చివరి దాకా సేవ చేసిన ఆవిడ నాన్న పోయాక, అనారోగ్యం పాలైంది. లేచి నడవలేకపోతోంది. సినిమా మాటలా ఉంచి, లైఫ్‌లో అమ్మానాన్నలతో మీ అనుబంధం? (ఆలోచనల్లోకెళుతూ...) మిగిలిన ప్రేమలన్నీ వేరు, అమ్మానాన్న ప్రేమ వేరు. వాళ్ళ ప్రేమ ఎప్పుడూ 100% ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు వాళ్లు మన కోసం పడ్డ కష్టం ఒక్కసారి గుర్తు చేసుకుంటే కళ్ళు చెమరుస్తాయి. నేను చదువుకునేటప్పుడు ఇంట్లో మొత్తం పని చేసి, మా అమ్మ నా కోసం కాచుకు కూర్చొనేది. రాత్రి అంతా నేను చదువుకుంటూ ఉంటే, నేనెప్పుడు కాఫీ అడుగుతానో, టీ అడుగుతానో అని నా పక్కనే కూర్చునేది. మా నాన్న మేం పడుకున్నప్పుడు వచ్చి దుప్పటి సరిగ్గా కప్పుకున్నామా, లేదా అని చూసి, సరిచేసేవారు. అంటే వాళ్లకి లైఫ్ అంటే పిల్లలే! అవన్నీ ఈ తరంలో ఊహించలేం! మన ప్రాధాన్యాలు మనకు ఉన్నాయి. మీ నాన్న గారు మీతో ఎలా ఉండేవారు? మేము నలుగురు అన్నదమ్ములం, ఇద్దరు సిస్టర్స్. నేను ఆఖరు. మాకు కనీసం కూరగాయలు కొనడం కూడా రాదు. మా నాన్న ఒక్క పని కూడా మాకు చెప్పేవారు కాదు. మేం సైకిలెక్కి వెళితే ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందని ఆయన టెన్షన్. పల్లెటూళ్లో అందరికీ ఈత వచ్చు. కానీ మాకు రాదు. ఆయన చేయనిచ్చే వారు కాదు. ఎందుకంటే మాకు ఏదైనా అవుతుందేమోనని భయం. మా మీద ఆయనకంత ప్రేమ. నేను లెక్చరర్‌గా చేసేటప్పుడు తెల్లవారే 4 గంటలకు నిద్ర లేస్తే, రాత్రి 12 గంటల వరకూ క్లాస్లుండేవి. శనివారం రాత్రి బస్సెక్కి ఆదివారం ఉదయం ఇంటి కెళ్లేవాణ్ణి. నిద్రలేకుండా పీక్కుపోయిన నన్ను చూశారనుకోండి- ‘బోడి ఉద్యోగం... మానేయ’మనేవారు మా నాన్న. మేము చాలా దిగువ మధ్యతరగతి. అయినా సరే ‘అంత కష్టపడడమెందుకు! నేను పోషిస్తా’ అనేవారు. మమ్మల్ని అందర్నీ కష్టపడి చదివించి, పెద్ద చేశారు. నాన్న గారి చివరి క్షణాల్లో మీరెలా గడిపారు? ఆయన్ని హ్యాపీగా ఉంచాలని చాలా చెప్పేవాణ్ణి. ‘నాన్నా! సినిమా సూపర్‌హిట్’ అనో, ‘హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింద’నో - ఇలా బిల్డప్పులిచ్చేవాణ్ణి. అలా చెప్పడం వల్ల ఆయన హ్యాపీగా ఉంటే కొన్నాళ్లు ఎక్కువ జీవిస్తారని మనసులో ఏ మూలో ఆశ! ఏ వయసులో పోయినా ఫాదర్ ఫాదరేగా! కానీ ‘100 % లవ్’ క్లైమాక్స్ తీస్తున్నప్పుడే నాన్న పోయారు! నాన్న ఉన్నప్పుడు ఎక్కువ టైమ్ గడపలేదనే బాధ ఉందా? అవును. ఆయన చెప్పే మాటలన్నీ వినాలి. రాసుకోవాలి. డ్రామాల్లో నటించిన ఆయన పద్యాలన్నీ పాడుతుంటే, రికార్డ చేయాలి. ఆయన్ని దేశ దేశాలు తిప్పాలి. ఇలా ఎన్నో అనుకున్నా. కానీ, ఎప్పుడూ కెరీర్ పరుగులో, ఫ్లాపొస్తే డిప్రెషన్ నుంచి బయటపడి మరొకటి తీసే పనిలో పడి ఫ్యామి లీపై దృష్టి పెట్టలేకపోయా. ఇప్పటికీ అంతే. అదే మనసుని బాధిస్తుం టుంది. ఇప్పటికైనా, మా అమ్మతో ఎక్కువ టైమ్ గడపాలని ప్రయత్నం. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు, రచనలంటే? దర్శకుణ్ణయిన 2004కు ముందు చదివిన పుస్తకాల ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా చలంవి. ‘కుమారి 21ఎఫ్’ మెయిన్ ఫిలాసఫీ చలందే. మీ టైటిల్కార్డ్స, పాత్రచిత్రణ-అన్నీ డిఫరెంట్. మనసులో ఏముంటుంది? అశాంతి. ఎందుకో తెలియదు కానీ లోపల భయంకరమైన అశాంతి ఉంటుంది. దాని నుంచే కథలు పుడుతుంటాయి. మా నాన్నకీ, నాకూ విచిత్రమైన అనుబంధం. ఇప్పుడంటే పిల్లలతో క్లోజ్‌గా ఉంటాం. అన్నీ మాట్లాడేస్తుంటాం. అప్పుడు జనరేషన్ గ్యాప్ కదా... గౌరవంతో ఏమీ చెప్పేవాళ్లం కాదు. నాన్న వస్తున్నారంటే, వీధిలో నిలబడే వాళ్ళం కాదు. బుద్ధిగా ఇంట్లో కూర్చొనేవాళ్ళం. నాకు తెలిసి మా నాన్న నన్ను ముద్దు పెట్టుకున్నట్లు కూడా గుర్తులేదు. కానీ, ఆయన మన కోసం చేసే పనులను బట్టి... ఆయన ప్రేమ మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. - రెంటాల జయదేవ -
అన్నతో కలిసి నటించనున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన జూనియర్ ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతోతో తన కమర్షియల్ స్టామినాను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. భారీ పోటీలో కూడా కోట్ల వసూళ్లతో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోలకు ఓవర్సీస్ మార్కెట్‌పై పట్టు కష్టం అన్న టాక్ చెరిపేస్తూ విదేశాల్లో కూడా రికార్డ్ వసూళ్లను రాబడుతున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు కూడా రాకముందే తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు ఆ సినిమాలో తన అన్న కళ్యాణ్ రామ్‌తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే వక్కంతం వంశీ, ఇద్దరు నందమూరి హీరోలు కలిసి నటించడానికి కావలసిన కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. షేర్ సినిమా తరువాత వేరే సినిమాకు సైన్ చేయని కళ్యాణ్ రామ్, ఈ మల్టీ స్టారర్ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకోనున్నాడు. త్వరలోనే నందమూరి వారసుల మల్టీ స్టారర్‌కు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
'బ్రతికున్నంత కాలం నాలో నిలిచిపోతుంది'
-
ఆ సీన్ చూసి మా అమ్మగారు ఏడ్చారు: దేవిశ్రీ ప్రసాద్
‘‘ఈ పదిహేనేళ్లల్లో మొట్టమొదటిసారి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బ్రతికున్నంత కాలం నాలో నిలిచిపోయే అనుభూతి ఈ చిత్రం. దీన్ని సక్సెస్‌గా భావించట్లేదు. ఓ మంచి అనుభూతినిచ్చిన సుకుమార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చిన్న ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో చిన్న ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రాసి, స్వరపరిచిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ పాటను ఆయన తండ్రి సత్యమూర్తికి అంకితమిచ్చారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ-‘‘‘నాన్నకు ప్రేమతో’ బొమ్మ అయితే దానికి తన సంగీతంతో ప్రాణం పోశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాట క్లయిమాక్స్ లో వచ్చినా, విని వెళుతున్నారు’’ అన్నారు. ‘‘నా 37 ఏళ్ల సినీ చరిత్రలో సక్సెస్ ఇంత మనస్ఫూర్తిగా, ఇంత గొప్పగా ఉంటుందని ఈ సినిమా ద్వారా తెలిసింది. ‘చాలెంజ్’ నుంచి దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తిగారు క థ అందించిన చాలా సినిమాల్లో నేను నటించాను’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘‘ఈ సినిమా పర్శనల్‌గా కూడా నాకు కనెక్ట్ అయింది. క్లయిమ్యాక్స్‌లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎలా నవ్వుతూ చనిపోతుందో సరిగ్గా మా నాన్నగారు కూడా అంతే. ఆ సీన్ చూశాక మా అమ్మగారు ఏడ్చేశారు. ఈ సినిమాను మా నాన్నగారికి అంకితమివ్వడం ఆనందంగా ఉంది’’ అని దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘ఈ పాటను త నకు తాను సొంతగా రాత్రికి రాత్రి ఎడిట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. రీ- రికార్డింగ్ కూడా ఈ నెలలోనే పూర్తి చేశారు. రాజేంద్రప్రసాద్‌గారు సినిమా షూటింగ్ కోసం మా ఊరు రాజోలు రాకపోయుంటే దర్శకుణ్ణి అయ్యేవాణ్ని కాదేమో’’ అన్నారు. రకుల్, బీవీఎస్ఎన్ ప్రసాద్, విజయ్ కె చక్రవర్తి మాట్లాడారు. -
నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం!
తెలుగులో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. వరుసగా టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ, బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీఆర్ సరసన రకుల్ నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంలో రకుల్ ఫస్ట్ టైమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఆ హ్యాపీనెస్‌ని మీడియాతో పంచుకున్నారు. ♦ ఎన్టీఆర్ చాలా అద్భుతమైన నటుడు. ఇలాంటి సినిమాలో అవకాశం దక్కడం నా అదృష్టం. లండన్‌లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు ‘తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా.. డబ్బింగ్ చెబుతావా’ అని సుకుమార్ అడిగారు. ఏదో అలా అంటున్నారులే అనుకుని, ‘సరే’ అన్నాను. ఇండియా వచ్చాక వాయిస్ టెస్ట్‌కి పిలిపించి, నిజంగానే డబ్బింగ్ చెప్పించేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ నా డబ్బింగ్ బాగుందంటున్నారు. ♦ హిందీలో ‘సిమ్లా మిర్చి’ పూర్తయ్యింది. అది ఏప్రిల్‌లో విడుదలవుతుంది. తమిళ్ నుంచి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. నేను ఏ భాషలో సినిమా చేసినా తెలుగమ్మాయినే. అంతలా తెలుగుకి కనెక్ట్ అయిపోయాను. ♦ తాను రొమాన్స్‌లో వీక్ అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మరి.. మీ సంగతి ఏంటని అనడిగితే, ‘‘నేను కూడా వీక్. బాధ, కోపం, నవ్వు, రొమాన్స్... ఏదైనా సరే డెరైక్టర్ చెప్పినట్లు చేసేస్తాను. అంతే తప్ప ఎమోషనల్ సీన్లో నటించాలనప్పుడే ఏదైనా బాధాకరమైన సంఘటన గుర్తు తెచ్చుకోవడమో, రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు అలాంటి సీన్ గుర్తు చేసుకోవడమో చేయను. ♦ నాకు మూడు ‘ఎఫ్’లంటే ఇష్టం. ఫుడ్, ఫిలిం, ఫిట్నెస్. -
మూడు రోజుల్లో ముప్పై కోట్లు
ఇటీవల ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందరి కంటే ముందు జనవరి 13న రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కలెక్షన్ల పరంగా ఎన్టీఆర్ కెరీర్లోనే సరికొత్త రికార్డ్లను సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే 12 కోట్ల వసూళ్లతో ఆకట్టుకుంది. రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం నాన్నకు ప్రేమతో దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల వసూళ్లను రాబట్టింది నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ స్థాయిలో 1700 థియేటర్లకు పైగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో తొలి వారంలో 50 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈసినిమాలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసేశాడు
సంక్రాంతికి నాన్నకు ప్రేమతో అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శతక్వంలో 'జనతా గ్యారేజ్' సినిమాను ప్రారంభించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మాత్రం వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు జూనియర్. జనతా గ్యారేజ్ ను ఆగస్టు 12న ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో విషయంలోనూ ముందుగానే డేట్ ఎనౌన్స్ చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేసిన ఎన్టీఆర్ మంచి రిజల్ట్‌నే రాబట్టాడు. అదే ఊపులో మరోసారి పక్కా ప్లాన్‌తో జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తొలి షెడ్యూల్ షూట్ కోసం సారథి స్టూడియోస్‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాడు ఆర్ట్ డైరెక్టర్ ఎయస్ ప్రకాష్. ఈ సెట్లో ఎన్టీఆర్, సమంత, మోహన్ లాల్ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రేక్షకుల...తెలివి మీద ప్రేమతో...
తారాగణం: జూనియర్ ఎన్టీయార్, రకుల్ ప్రీత్‌సింగ్, కెమేరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: బి.వి. ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బి. సుకుమార్ నవలలు సినిమాలుగా రావడం చాలా తెలుసు కానీ, సినిమాయే నవలలాగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా చూస్తుంటే, గతంలో చదివిన యండమూరి వీరేంద్రనాథ్ తరహా రచయితల కమర్షియల్ నవలలు, వాటిలోని తెలివైన వ్యూహాలు గుర్తుకొస్తాయి. ఇరవయ్యేళ్ళ క్రితం తన తండ్రిని మోసం చేసి, బిలియనీర్‌ని కాస్తా మధ్యతరగతి మనిషిగా మార్చేసిన విలన్ మీద పగ తీర్చుకోవడం హీరో లక్ష్యం. ఆ విలన్‌ను రోడ్డుపైకి ఈడ్చేయడం కోసం అచ్చంగా మళ్ళీ తెలివైన ఆ విలన్ స్వభావాన్నీ, గుణాన్నే హీరో అతి తెలివిగా అనుసరిస్తాడు. అభి (చిన్న ఎన్టీయార్) తండ్రి (రాజేంద్రప్రసాద్) ఒకప్పటి బిలియనీర్ రమేశ్చంద్రప్రసాద్ . కానీ, కృష్ణమూర్తి (జగపతి బాబు) మోసంతో రోడ్డునపడతాడు. జనం తరిమితే, పారిపోయి, సుబ్రమ ణ్యంగా పేరు, రూపు మార్చుకొని బతుకుతాడు. పిల్లల్ని పెంచి, ముసలివాడవుతాడు. ఇక మరో నెలరోజుల్లో ప్రాణం పోయే తీవ్రవ్యాధితో మంచం మీద ఉన్న ఆ తండ్రి ఆ సంగతి తన కొడుకులకి చెప్పి, ప్రతీకారేచ్ఛ వెల్లడిస్తాడు. అన్నలు (రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్) కాదన్నా, తమ్ముడు అభి రంగంలోకి దిగుతాడు. మరో ముగ్గురి సాయంతో, కృష్ణమూర్తి కూతుర్ని (రకుల్) ప్రేమలో పడేస్తాడు. తర్వాత బ్రెయిన్ గేవ్‌ులో విలన్‌పై చివరకు హీరో ఎలా విజయం సాధించి, తండ్రి పగ తీర్చాడనేది సినిమా. ఫస్టాఫ్‌లో లవ్‌ట్రాక్ వ్యవహారం సరదాగా అనిపిస్తుంది. సెకం డాఫ్ కీలక ఘట్టం. కానీ, తొలి పావుగంటలోనే విషయమంతా విప్పేసి, రెండుమ్ముప్పావు గంటలు సుదీర్ఘంగా హాలులో కూర్చో పెట్టడం కత్తి మీద సామే. అనేక లోపాల మధ్యనే ఆ ప్రయత్నం చేశారు. హీరోగా 25వ చిత్రంగా ఈ స్క్రిప్ట్‌నెంచుకోవడంలో, పాత్ర పోషణలో చిన్న ఎన్టీయార్ తన మూస నుంచి బయటకు రావాలని శ్రమించినట్లర్థమవుతుంది. గెటప్ శ్రద్ధా కనిపిస్తుంది. డ్యాన్సల్లో హుషారు సరేసరి! అతి మాస్ యాక్షన్ ఇమేజ్‌కు కొద్దిగా పక్కకు జరగడం బాక్సాఫీస్ రీత్యా అయినా కాకున్నా లాంగ్ కెరీర్లో ఆయనకు అవసరమైన మార్పే! తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న పంజాబీ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నారైగా నప్పింది. కాస్ట్యూవ్‌ు్స వగైరా పాత్రకు తగ్గట్లున్నాయి. ప్రత్యేకంగా చెప్పాల్సింది తెలివైన విలన్ కృష్ణమూర్తి పాత్రలో ట్రిమ్ గా, సూపర్ ఫిట్నెస్తో కనిపించిన జగపతిబాబు నటన. విలనైనా ఆ క్యారెక్టరైజేషన్‌లోని తెలివికి ప్రేమలో పడతాం. రాజేంద్రప్రసాద్ కనిపించేది కాసేపే. అదీ ఎక్కువగా మంచానికి పరిమితమయ్యే! ఆ స్టేజ్‌లో, అందులోనూ క్లైమాక్స్‌లో డైలాగైనా లేకుండా కేవలం ముఖంలో చూపే భావం ఆయన సీనియారిటీకి మచ్చుతునక. మిగిలినవన్నీ సహాయపాత్రలే. లండన్ నేపథ్యంలో ఎక్కువగా నడిచే ఈ సినిమాకు ఆయువుపట్టు - నిర్మాణ విలువలు, కెమేరా వర్క, సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ రాసి, చిన్న ఎన్టీయార్‌తో పాడించిన ‘ఐ వాంట్ టు ఫాలో ఫాలో’ కొన్నాళ్ళు యువతరం ఫాలో అయ్యే పాట. భావోద్విగ్న సన్నివేశాల్లో రీరికార్డింగ్ మెరుపులూ ఆకట్టుకుంటాయి. అయితే ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని, ఆ అంశం చుట్టూ సినిమా తీస్తున్నప్పుడు, సెంటిమెంటల్ సీన్లకు మరింత ప్రాధాన్యమివ్వాల్సింది. అలాగే, హీరోయిన్ను చిన్నప్పటి నుంచి వెంటాడుతున్న కల తాలూకు అంశాన్ని హీరో ఛేదిస్తాడు. కానీ, జీవితంలో కీలకమైన ఆ సంగతి వెల్లడయ్యాక హీరోయిన్ పాత్ర తెరపై హఠాత్తుగా కనిపించడం మానేసింది. అంత చేసిన హీరో వెంట హీరోయిన్ నడిచిందా? తండ్రితో ఆమె బాంధవ్యమెలా మారింది లాంటి ప్రశ్నలకు తెరపై సమాధానాలు వెతకకూడదు. పాత్రలు, పాత్ర చిత్రణ, కథను చెప్పిన విధానం చూస్తే... ప్రేక్షకుల తెలివితేటలు, అవగాహన మీద అతి ప్రేమతో దర్శక - రచయిత ఈ సినిమా తీశారనిపిస్తుంది. పూర్వాశ్రమంలో కాలేజ్‌లో లెక్కల లెక్చరరైన సుకుమార్ ఏవేవో లెక్కలు వేసుకొని ఈ సినిమా తీయలేదనీ అర్థమవుతుంది. ‘బటర్‌ఫై్ల ఎఫెక్ట్’ లాంటి అంశాలు, ఈస్ట్రోజెన్ లెవల్స్ లాంటి ప్రస్తావనలు సులభంగా అర్థమయ్యేలా చేయాలని పడిన తపన చూస్తే పాఠం విడమర్చి చెప్పారన్న భావన కలుగుతుంది. ఎక్కడో తీర్చుకోలేకపోయిన నొప్పుల్ని మరెక్కడో తీర్చుకోవడానికి చూడడం మానవ నైజం. అందుకే, ఒక ఎమోషన్‌ను మరొకచోట చూపిస్తుంటాం. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఇదొక ప్రధానమైన పాయింట్. నిజజీవితంలో తండ్రి మరణవేళ ఎదురైన కొన్ని ఎమో షన్‌సను తెరపై చూపేందుకు సుకుమార్ ప్రయత్నించారు. ‘ఆర్య’, ‘1’ లాంటి సినిమాల్లో లాగే ఎక్స్‌ట్రీవ్‌ు ఆలోచనలు, కథలో ఇంటెలిజెన్స్, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం మామూలే. ఈసారి స్ట్రెయిట్ నేరేషన్ స్క్రీన్‌ప్లేను ఆయన అనుసరించినా, ఆ మార్క చెరిగిపోలేదు. అందుకే, పాత్రల మధ్య ఇంటెలిజెన్స్‌తో మొత్తం నడిచే ఈ సినిమా కొండొకచో ప్రేక్షకుడి మెదడుకీ పనిపెడుతుంది. డైలాగులు, ఘట్టాల్లో కొన్ని పదేపదే చూడా లనిపిస్తే, మరికొన్ని చూడాల్సొస్తాయి. ప్రేక్షకులు ఆ శ్రమకు ఎంతమేర సిద్ధపడతారన్నదాన్ని బట్టి, వారి బాక్సాఫీస్ ప్రేమ వర్షిస్తుంది. మొత్తం మీద అజ్ఞాతంలోని హీరో... విలన్ ఇంట్లో హీరో దాగుడుమూతలు... హీరో చేతిలో విలన్ బకరా... ఆల్రెడీ పెళ్ళి ఫిక్సయిన హీరోయిన్ను ఒప్పించి మరీ పెళ్ళిచేసుకోవడాలు - ఇలా వచ్చిన సినిమాలే కొత్తగా వస్తున్నరోజులివి. ఈ టైమ్‌లో కొత్తదనం కోరుకొంటున్నవారికి పాతకాలపు రివెంజ్ ఫార్ములా కథనే ఇంటెలిజెంట్ గేమ్‌గా, కొత్త పద్ధతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. కొన్నిచోట్ల బుర్రకు పదును, ఇంకొన్నిచోట్ల వేడి తెప్పిస్తుంది. టైటిల్స్ నుంచి కొత్తదనం మాత్రం కాదనలే మనిపిస్తుంది. అన్నట్లు, హాలులోంచి బయటకొస్తుంటే ఒక పెద్ద మనిషి, ‘ఇంతకీ సినిమా ఎలా ఉంది’ అని అడిగిన ఫ్రెండ్‌తో సినిమాలో జగపతిబాబు అన్నట్లే ‘గుర్తుపెట్టుకో! మళ్ళీ చెబుతా!’ ననడం వినిపించింది. హీరో చాలాసార్లన్నట్లు యాంగిల్ మార్చి కూర్చొనిచూస్తే మరోలా ఉండే ఈ సినిమా.. చూసిన ‘ఎమోషన్‌ను అక్కడికక్కడే తీర్చేసుకోలేం!’ ఎంతైనా జీరో ఎమోషన్స... జీరో ఎనిమీస్ సూత్రం చెప్పినంత ఈజీ కాదుగా! -
నాన్నకు ప్రేమతో టీంకు నోటీసులు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్ర బృందానికి రాష్ట్ర మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తులు కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో దానిని పరిశీలించిన కమిషన్ నోటీసులు పంపించింది. చిత్ర నిర్మాతలకు, చిత్ర నటీనటులకు పంపించింది. అంతకుముందు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు కమిషనర్లకు, సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారికి నోటీసులు పంపించింది. ఎందుకు మీపై ఈ ఫిర్యాదులకు సంబంధించి చర్యలు తీసుకోకూడదో వివరించాలని పేర్కొటూ ఈ నెల 18కి వాయిదా వేసింది. అంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు వరంగల్ జిల్లా జనగామ కోర్టులో కొందరు ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ క్షమాపణలు కూడా చెప్పారు. -
'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ
టైటిల్ : నాన్నకు ప్రేమతో జానర్ : థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా తారాగణం : ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : సుకుమార్ నిర్మాత : బివియస్ఎన్ ప్రసాద్ టెంపర్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న సుకుమార్‌తో కలిసి చేసిన ఎమోషనల్ ప్రయోగం నాన్నకు ప్రేమతో. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్, కథా కథనాల ఎంపిక విషయంలో కూడా అదే కొత్తదనం చూపించాడు. ముఖ్యంగా భారీ పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఎంతో నమ్మకంగా తన సినిమాను రిలీజ్ చేసిన జూనియర్ నాన్నకు ప్రేమతో అంటూ సక్సెస్ అయ్యాడా.. 'వన్ నేనొక్కడినే' లాంటి భారీ డిజాస్టర్ తరువాత సుకుమార్ దర్శకుడిగా సక్సెస్ సాధించాడా..? కథ : అభిరామ్ (ఎన్టీఆర్) లండన్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. ఫస్ట్ సీన్ లోనే తన ఎమోషన్‌ను దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం(రాజేంద్ర ప్రసాద్)కు సీరియస్‌గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్న( రాజీవ్ కనకాల) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు. ఈ ఆపరేషన్‌లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరామ్‌ను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా వన్ మేన్ షోగా నడిపించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడు. రిలీజ్‌కు ముందు నుంచి చుపుతున్నట్టుగా చివరి 45 నిమిషాలు అద్భుతమైన నటనతో ఆడియన్స్‌తో కంటతడి పెట్టించాడు. లుక్ విషయంలో కూడా ఎన్టీఆర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు మాస్ లుక్ లోనే కనిపించిన జూనియర్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ విషయంలోనూ కొత్త దనం చూపించాడు. రకుల్ ప్రీత్ మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రానీ రకుల్‌కు ఈ సినిమాలో ఆ ఛాన్స్ వచ్చింది. తల్లిని కలుసుకునే సన్నివేశంలో తన నటనతో మెప్పించింది. విలన్‌గా జగపతి బాబు మరోసారి బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. స్టైలిష్ లుక్‌లో మైండ్ గేమ్ ఆడే బిజినెస్ మేన్‌గా ఆకట్టుకున్నాడు. తెరపై కనిపించేది తక్కువ సేపే అయినా, రాజేంద్ర ప్రసాద్ తన మార్క్ చూపించాడు. ఇతర పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశిష్ విద్యార్థి, మధుబాల లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నాన్నకు ప్రేమతో సినిమాతో సుకుమార్ మరోసారి తన మార్క్ కొనసాగించాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్త తరహా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరో, విలన్ పాత్రలను చిత్రణ చాలా కొత్తగా అనిపిస్తోంది. తన గత సినిమాల మాదిరిగా కథలో సైన్స్ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాకు మెయిన్ ఎసెట్ విజయ్ సి చక్రవర్తి సినిమాటోగ్రఫి లండన్, స్పెయిన్ అందాలను అద్భుతంగా తెరకెక్కించాడు. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ఛేజ్‌తో పాటు పాటలు కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో హిట్ అనిపించుకున్న దేవి, నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని మరింత పెంచాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే నాన్నకు ప్రేమతో పాట థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆడియన్స్ ఆ మూడ్ లోనే కట్టి పడేస్తుంది. ఎడిటింగ్, కొరియోగ్రాఫి, యాక్షన్ కొరియోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎన్టీఆర్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సెకండాఫ్ లో కొన్ని సీన్స్ సినిమా లెంగ్త్ ఓవరాల్ గా నాన్నకు ప్రేమతో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఆశించే ఆడియన్స్‌ను కాస్త నిరాశపరిచినా.. కొత్త కథా కథనాలను కోరుకునే వారిని మాత్రం అలరిస్తోంది. సంక్రాంతి బరిలోకి సక్సెస్ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
బాబాయ్, అబ్బాయ్... ఎవరి బలమెంత..?
ఎన్నడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతికి వెండితెర మీద భారీ యుద్ధం జరుగుతోంది. నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటం, వీటిలో మూడు టాప్ స్టార్ హీరోలు నటించిన సినిమాలే కావటం, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి బాబాయ్, అబ్బాయ్‌లు బరిలో దిగుతుండటంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా.. 'నాన్నకు ప్రేమ'తో సినిమాతో వస్తున్న ఎన్టీఆర్, 'డిక్టేటర్'గా గర్జిస్తున్న బాలయ్యల మధ్య పోటినే ప్రధానంగా చర్చకు వస్తోంది. బాలయ్య టిడిపి ఎమ్మెల్యేగా ఉండటం, ఈ మధ్య ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటంతో ఈ పోటీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి కలిగిస్తోంది. సినిమాల విడుదల విషయంలో ఎత్తుకు పై ఎత్తులు కూడా బాగానే సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేసేది తొలి రోజు.. తొలి వారం కలెక్షన్లే కావటంతో బాబాయ్, అబ్బాయ్‌లు రికార్డ్ వసూళ్ల మీద కన్నేశారు. అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో థియేటర్లు దక్కించుకోవటం కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయంతో మాత్రమే జరిగిన థియేటర్ల ఎంపికలో ఈ రెండు సినిమాల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కూడా అబ్బాయ్, బాబాయ్‌కి గట్టి పోటీనే ఇస్తున్నాడట. సినిమా విషయానికి వస్తే, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సక్సెస్.. హీరోతో పాటు దర్శకుడికి కూడా చాలా కీలకం. వన్ సినిమాతో నిరాశపరిచిన సుకుమార్, తనని తానూ ప్రూవ్ చేసుకోవటం కోసం భారీ హిట్ ఇచ్చి తీరాలి. చాలా రోజులుగా ఫ్లాప్ లలో ఉన్న జూనియర్ టెంపర్ సినిమాతో హిట్ ఇచ్చినా.. ఆ సక్సెస్ లక్ కాదు అనిపించుకోవటం కోసం హిట్ కంపల్సరీ. అందుకే ఇద్దరు కసిగా నాన్నకు ప్రేమతో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయని ఎన్టీఆర్, ఈ సినిమాలో పూర్తి వెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ లుక్‌తో పాటు ఆడియో కూడా సూపర్ హిట్ అవ్వటం నాన్నకు ప్రేమతో సినిమాకు ప్లస్ పాయింట్స్. భారీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ తన కెరీర్ లోనే బెస్ట్ అంటున్నారు యూనిట్. సినిమా బడ్జెట్‌తో పాటు శాటిలైట్ రైట్స్, ఏరియా బిజినెస్ లాంటి విషయాల్లో కూడా జూనియర్, బాబాయ్ కన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరైన సంఖ్యలో థియేటర్లు దొరికితే ఎన్టీఆర్ రికార్డ్‌లు తిరగరాయటం ఖాయంగా కనిపిస్తోంది. బాబాయ్ బాలయ్య కూడా భారీగానే వస్తున్నాడు. రెగ్యులర్‌గా చేసే మాస్ తరహా పాత్రలో కాకుండా డిక్టేటర్ సినిమాలో స్టైలిష్ డాన్‌లా కనిపిస్తున్నాడు బాలకృష్ణ. లౌక్యం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీవాస్, బాలకృష్ణతో ఓ పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడియోకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ప్రొమోస్‌లో బాలయ్య మరోసారి తన మార్క్ పంచ్ డైలాగ్లతోఅలరిస్తున్నాడు. అయితే ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఢీలా పడ్డ కోన వెంకట్, గోపి మోహన్, శ్రీధర్ సీపానలతో కలిసి కథా కథనాలు అందించటం డిక్టేటర్ పై అనుమానాలు కలిగిస్తోంది. బడ్జెట్ పరంగానే కాదు, బిజినెస్ పరంగా కూడా, డిక్టేటర్ బాలయ్య కెరీర్ లోనే టాప్‌గా నిలిచింది. శ్రీవాస్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ పాళ్లు బాగానే ఉంటాయి. దీనికి తోడు భారీ తారాగణంతో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎలాగూ ఉంటుంది. అంజలి, సోనాల్ చౌహాన్‌ల గ్లామర్ సినిమాకు యాడెడ్ ఎట్రాక్షన్. ఇది బాలయ్య 99వ సినిమా కావటంతో సినిమాకు భారీ వసూళ్లను అందించి 100వ సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా అన్ని రకాలుగా బాలయ్య కూడా భారీ హిట్‌నే టార్గెట్ చేశాడు. రెండు సినిమాలు యు/ఎ సర్టిఫికేట్‌తోనే రిలీజ్ అవుతుండటం, రెండూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఎమోషనల్ డ్రామాస్ కావటం, ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన అగ్రకథానాయకులు కావటం, గతంలో ఎప్పుడూ ముఖాముఖి తలపడని ఇద్దరు సంక్రాంతి బరిలో కాలు దువ్వుతుండటం, తొలిసారిగా సినిమా బిజినెస్‌లో రాజకీయ ప్రమేయం ప్రత్యక్షంగా కనిపించటం లాంటివి ఈసారి పోటిని మరింత వేడెక్కిస్తున్నాయి. మరి ఈ యుద్ధంలో బాబాయ్, అబ్బాయ్లలో గెలుపెవరిదో తెలియాలంటే మాత్రం మరో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల పోటి ఎలాగున్నా, అభిమానులకు మాత్రం ఈ సంక్రాంతి అతి పెద్ద సినిమా పండుగే అవుతోంది. -
ఫస్ట్ టైమ్ ఆయన్ను చూసి షాక్ అయ్యా..!
-
సీజన్లో సినిమా రీలీజ్ ముఖ్యం
-
ఫ్యాన్స్‌కు ప్రేమతో
-
జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ?
►బాబాయ్, అబ్బాయ్ సినిమాలు పోటాపోటీగా విడుదల ► థియేటర్ల కొరతతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ? ► టీడీపీలో ఓ వర్గం నేతల మద్దతు బాలయ్యకే ► యువకుల బలం జూనియర్‌కు సాక్షి ప్రతినిధి, ఏలూరు : హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలతో పశ్చిమాన పందెం కోళ్ల ముచ్చట ఎలా ఉన్నా సినిమా బరిలో మాత్రం నందమూరి హీరోలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానుండటంతో టీడీపీ నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా జోరును తగ్గించేలా థియేటర్ల కొరత సృష్టించనున్నట్టు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమా ఈనెల 13వ తేదీన, మరుసటి రోజు 14వ తేదీన బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా విడుదల కానున్నాయి. గత ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు, నందమూరి, నారా కుటుంబాలకు దూరంగా ఉంటున్న జూనియర్‌ను దెబ్బతీసేందుకు సరిగ్గా ఇదే అదనుగా టీడీపీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. ఇటీవలికాలంలో నిఖార్సైన హిట్ లేని జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమా రూ.వందకోట్ల క్లబ్లో చేరి చాన్నాళ్లయినా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రూ.50 కోట్ల బెంచ్‌మార్క్ దాటలేకపోయారు. ఈ నేపథ్యంలో రూ.50 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన నాన్నకు ప్రేమతో సినిమా కమర్షియల్ హిట్ సాధించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. పొరపాటున ఈ సినిమా అటు ఇటు అయితే జూనియర్ సినిమా కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో ఇదే అవకాశంగా థియేటర్లు దొరక్కుండా చేసి జూనియ్ సినిమా కలెక్షన్లు దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీలోని ఓ వరం్గ నేతలు పావులు కదుపుతున్నారు. నాన్నకు ప్రేమతో రూ.2.5 కోట్లు డిక్టేటర్ రూ.1.50 కోట్లు పశ్చిమగోదావరి జిల్లాలో నాన్నకు ప్రేమతో సినిమాను రూ.రెండున్నర కోట్లకు ప్రముఖ పంపిణీదారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా ప్రదర్శన హక్కులను కూ.కోటిన్నరకు ఓ ఔత్సాహికుడైన యువకుడు పొందినట్టు సమాచారం. 13వ తేదీన విడుదలయ్యే నాన్నకు ప్రేమతో సినిమాను ఆ రోజు దాదాపుగా జిల్లాలోని అన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరుసటి రోజు 14వ తేదీన సగం థియేటర్లు ఎత్తివేసి.. వాటిలో బాలకృష్ణ డిక్టేటర్ సినిమాను ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్క్రీన్లు మరిన్ని తగ్గించేలా కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇక 15వ తేదీన అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు ఉండటంతో జూనియర్ స్క్రీన్లు ఇంకా తగ్గించేస్తారని అంటున్నారు. ఇటీవలికాలంలో జూనియర్ సినిమాలకు ఆశించిన కలెక్షన్లు రాకపోయినా.. నాన్నకు ప్రేమతోపై భారీ అంచనాలు ఉండటంతో రూ.రెండున్నర కోట్లకు సినిమాను పంపిణీ చేస్తున్నారు. ఆది, సింహాద్రి స్థాయి హిట్ వస్తేనే నాన్నకు ప్రేమతో బయ్యర్లకు లాభాలు వస్తాయి. ఇప్పుడు పచ్చనేతల రాజకీయంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బలయ్యే పరిస్థితి నెలకొందని అంటున్నారు. మంచి థియేటర్లు బాలయ్యకే కాగా, థియేటర్ల పంపిణీలో కూడా రాజకీయం జరుగుతోందని అంటున్నారు. డీటీఎస్‌తో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్న థియేటర్లు బాలకృష్ణకు, బీ, సీ గ్రేడ్ థియేటర్లు జూనియర్ సినిమాకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో ఈ మేరకు థియేటర్ల పంపిణీ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీలో వర్గనేతల అండ బాలకృష్ణకు ఉన్నప్పటికీ అదే వర్గ యువకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సినిమా హిట్ అయ్యేవరకే ఈ రాజకీయాలు.. ఒక్కసారి హిట్ టాక్ బయటకు వస్తే థియేటర్ల కొరత సృష్టించడం ఎవరి వల్లా కాదు.. అప్పుడు బాలకృష్ణ సినిమా అయినా, జూనియర్ సినిమా అయినా ఎవ్వరూ ఆపలేరు.. అని ఏలూరుకు చెందిన ఓ ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో పందెంకోళ్లలా దిగుతున్న నందమూరి హీరోల్లో హిట్‌టాక్ పరంగా ఎవరిది పైచేయి అవుతుందో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. -
రాక్‌స్టార్‌లా దుమ్మురేపిన ఎన్టీఆర్
-
బాబాయ్‌కి ప్రేమతో...
సంక్రాంతి... పండగ టైమ్ అల్లుళ్ళే కాదు... అబ్బాయిలూ ఇంటికొచ్చే టైమ్ బాధలను భోగిమంటల్లో వేసి, బంధుత్వాలను బలపరిచే టైమ్ వారసత్వాలు... ప్రేమకే ఉండాలని చెప్పే టైమ్ ఆత్మీయతలు చేతులు చాచి, గుండెలకు హత్తుకొనే టైమ్ ఈ సంక్రాంతి సీజన్లో అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో...’, బాబాయ్ సినిమా ‘డిక్టేటర్’ - రెండూ వస్తున్న వేళ... చిన్న ఎన్టీయార్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుంచి ముఖ్యాంశాలు ‘ఐ వాంట్ టు ఫాలో... ఫాలో యు’ అని మీరన్నారు. మీడియా ఫాలో అవడమే కానీ, మీరు మీడియా ముందుకు రావడం లేదేం? ప్రత్యేకంగా కారణమేమీ లేదండీ! దాదాపు సంవత్సరంగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా, విదేశాల్లో షూటింగ్‌ల్లోనే బిజీ. హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1991) నుంచి చూస్తే ఇప్పటికి పాతికేళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. పెద్ద జర్నీనే! (నవ్వేస్తూ...) విశ్వామిత్ర, పిల్లలతో గుణశేఖర్ ‘రామాయణం’, టీవీ సీరియల్ ‘భక్త మార్కండేయ’ - ఇలా చూస్తే చాలా పెద్ద కథే. కాని మరీ పాతికేళ్ళ నుంచి చేస్తున్నానని నన్ను ముసలివాణ్ణి చేసేయకండి. నా వయసు 32 ఏళ్ళే! కాకపోతే, ఈ ప్రయాణంలో బోలెడన్ని అనుభవాలు. ఇది హీరోగా 25వ సినిమా! ‘నాన్నకు ప్రేమతో’ అంటున్నారేంటి? చనిపోతున్న తండ్రి ఆఖరి కోరిక తీర్చడం కోసం ఎంతకైనా తెగించే ఒక కొడుకు కథ ఇది. ఒక మనిషి జీవితంలోని 30 రోజుల్లో జరిగే కథ. బ్రిటన్‌లో కథ జరిగినప్పటికీ ఇది పండితుల నుంచి పామరుల దాకా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. సుక్కు (దర్శకుడు సుకుమార్) తన నిజజీవితం నుంచి తీసుకున్న ఆలోచన ఇది. అంతే తప్ప, నిజజీవిత కథ కాదు. కమర్షియల్ అంశాలున్న పాయింట్ కూడా! ఈ కథ విని దర్శకుడితో పాటు నేను, నిర్మాత భోగవల్లి ప్రసాద్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమేరామన్ విజయ్ కె. చక్రవర్తి - ఇలా సినిమా చేసే అందరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. అలాగే ప్రతి ఒక్కరూ కనెక్టయ్యే సినిమా ఇది. తండ్రి కోసం కొడుకనే కథలు చాలా వచ్చాయిగా కొత్తేంటి? పైగా, ఈ సినిమాలో మీది ద్విపాత్రాభినయమనీ, పోలీసనీ...? పోలీసు పాత్ర, ద్విపాత్రాభినయం - లాంటివన్నీ వట్టి పుకార్లు. నాది ఒకే షేడ్‌తో... ఇదే గడ్డం, జుట్టు గెటప్‌తో సాగే పాత్ర. ఇక, తండ్రి కోసం కొడుకనే కథల్లో కూడా ఇటీజ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ‘డిఫరెంట్’ అనగానే అర్థం కాని ప్రయోగం కాదు. మేకింగ్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, గెటప్స్, స్క్రీన్‌ప్లే - ఇలా చాలావాటిలో విభిన్నంగా ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేని, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా, ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చే చివరి 40 నిమిషాలు సినిమాకు ఆయువుపట్టు. సుకుమార్ శైలిలో సాగే కథ. కథలో తండ్రి కోసం తపించే కొడుకుగా కొన్ని కోణాల్లో నా లాగా, ఇంకొన్ని కోణాల్లో సుక్కు లాగా అనిపిస్తాను. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో సినిమా రిలీజ్ వాయిదా ఆలోచన చేశారా? వాయిదా ఆలోచన లేదు కానీ, ఏం చేయాలన్న క్వశ్చన్‌మార్క్ ఉంది. మేము స్పెయిన్‌లో షూటింగ్లో ఉండగా, ఆ ముందు రోజే ఆఖరి సాంగ్ ట్యూన్ దేవిశ్రీ పంపారు. తీరా మరునాడే ఈ దుర్వార్త. ఇంట్లోవాళ్ళకు అది ఎంతో తీవ్రమైన మానసిక వేదన కలిగించే విషయం. గత ఏడాది మా అన్నయ్య జానకీరామ్ పోయినప్పుడు మేము అది అనుభవించాం. మాట్లాడలేక, దేవిశ్రీకి కండొలెన్స్ మెసేజ్ పెట్టా. రెండు రోజుల తర్వాత దేవిశ్రీనే ‘వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశా. పాట కూడా పాడించేశా’ అని మెసేజ్ పెడితే, నాకు ఏడుపొచ్చేసింది. దేవిశ్రీకి వాళ్ళ నాన్న గారు నేర్పిన విలువలు, పని పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్కు అది నిదర్శనం. సినిమా ఫీల్‌తో... మీ నాన్న గారు హరికృష్ణతో ప్రేమ పంచుకున్నారా?! క్లైమాక్స్‌లో ఒక బిట్‌కు సుక్కు నాతో 5 వెర్షన్లు చేయించారు. నా తండ్రి పాత్రధారి రాజేంద్రప్రసాద్ గారిని పట్టుకొని ఏడ్చే సీన్. అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, షాట్ అయిపోయినా దాదాపు 20 నిమిషాలు ఏడ్చేశా. అందరూ కలసి ఊరుకోబెట్టాల్సి వచ్చింది. ఆ రోజు సెప్టెంబర్ 2. మా అమ్మా నాన్నలిద్దరి పుట్టినరోజు అదే. నాన్న గారికి ఫోన్ చేసి నా భావాలు పంచుకున్నా. పక్కనే జగపతిబాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు నాన్న గారు నాతో, ‘ఇది సినిమా. డోన్ట్ టేకిట్ టూ పర్సనల్’ అని చెప్పారు. కానీ, చేస్తున్న పాత్రను పర్సనల్‌గా తీసుకోకపోతే, నేను యాక్ట్ చేయలేను. ప్లాస్టిక్ నటన నా వల్ల కాదు. కానీ, రొమాన్స్ నటిస్తున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ నటన చేసేస్తా. తెర ముందైనా, నిజజీవితంలోనైనా రొమాన్స్ వ్యక్తం చేయడం నాకు రాదు. నాకు అదో ప్రాబ్లమ్. మా ఆవిడ ప్రణతి కూడా అదే కంప్లయింట్ చేస్తుంటుంది. పాత్రను పర్సనల్‌గా తీసుకుంటానన్నారు. మరి, పాత్రపోషణకు ప్రిపేర్ అవుతారా? ఆ మూడ్ నుంచి బయటకు రావడానికేం చేస్తారు? నటన ప్రాక్టీస్ చేయను కానీ, లీనమైపోయి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ట్రై చేస్తా. ఐ హ్యావ్ టు లివ్ ఇట్. ఎక్స్పీరియన్స్ ఇట్. నిజానికి, అలా పాత్రలోకి వెళ్ళడం కష్టమే. బయటపడాలన్నా కష్టమే. ఫలానా సీన్లో ఫలానా పాత్రకు ఏదో జరిగిందంటే, అలాంటిది నిజజీవితంలో నాకు ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచిస్తా. అలాగే ప్రవర్తిస్తా. అందుకే, రేపు పొద్దున్న నిజజీవితంలో నన్ను ఎప్పుడైనా చూస్తే, అచ్చం నా సినిమాలో నన్ను చూసినట్లే ఉంటుంది. నేను ఇలా ఇన్వాల్వ్ అయితే, మీరు ఏకకాలంలో రెండేసి సినిమాలు, పాత్రలు చేయలేరుగా? నిజమే. నాకు కష్టం. ముఖ్యంగా, ఇప్పుడు రాసుకొనే కథల్లో అలా ఒకేసారి రెండు సినిమాలు నేను చేయలేనేమో! కాకపోతే, సినిమాల్లో చేస్తున్న పాత్రల నుంచి బయటపడడానికి నా ఫ్యామిలీనే నాకు అండ. ఏడాదిలో 365 రోజులకు 340 రోజులు ఇల్లు దాటి బయటకు వెళ్ళను. ఎప్పుడైనా సరదాగా ఏ ఫ్రెండ్ ఇంటికో వెళతా. అంతే. ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా ద్వారా దర్శకుడు సుకుమార్‌తో తొలిసారిగా పని చేయడం ఎలా ఉంది? సుక్కు, నేను కలసి సినిమా చేయాలని ఆరేడేళ్ళుగా అనుకుంటున్నాం. కానీ, కుదరలేదు. ఎప్పుడైతో ‘నాన్నకు ప్రేమతో...’ కుదిరిందో, అప్పటి నుంచి ఈ ఎమోషనల్ ఫిల్మ్ మా జీవితం, ప్రాణంగా మారింది. సుకుమార్ ఒకపట్టాన సినిమా పూర్తిచేయడనీ, క్లారిటీ ఉండదనీ చాలామంది చాలా రకాలుగా నన్ను భయపెట్టారు. కానీ, జూలైలో మొదలైన ఈ సినిమా జనవరి కల్లా పూర్తయింది కదా! తన తండ్రి జీవితం స్ఫూర్తితో రాసుకున్న ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించడంలో ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా నేను స్పష్టత ఇవ్వాలి. ‘తారక్ కేవలం హిట్ దర్శకులనే ఎంచుకొంటాడు’ అని నా మీద అపవాదు వేస్తుంటారు. నిజానికి, రాజమౌళి (‘స్టూడెంట్ నంబర్1’), వంశీ (‘బృందావనం’), వర ముళ్ళపూడి (‘నా అల్లుడు’), వినాయక్ (‘ఆది’), ఇప్పుడు సుకుమార్... వీళ్ళెవరూ నాతో తొలి సినిమా చేసినప్పుడు వాళ్ళు హిట్స్‌లో ఏమీ లేరు కదా! మనకు కథ నచ్చిందంటే, దర్శకుణ్ణి నమ్మి వెళ్ళాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జునతో కలసి చేయాల్సిన ‘ఊపిరి’ నుంచి మీరు తప్పుకొన్నారెందుకు? స్క్రిప్ట్ నచ్చలేదా? ఇటీజ్ డెఫినెట్లీ గుడ్ స్క్రిప్ట్. నేనూ చేద్దామనే అనుకున్నాను. కానీ, ‘ఊపిరి’కీ, మా ‘నాన్నకు ప్రేమతో’కూ డేట్స్ సర్దుబాటు కాలేదు. నా కోసం ఆగితే, ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. నాగార్జున గారి డేట్స్ వృథా అవుతాయి. అందుకే, నేనే కావాలని ఆ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గాను. దానివల్ల ఇప్పుడు నా సినిమా పూర్తయిపోయింది. వాళ్ళ సినిమా కూడా దాదాపు పూర్తయిపో వచ్చింది. లేకపోతే, రెండూ డిలే అయ్యేవి. కానీ, ఈసారి సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు పోటీపడడం అవసరమా? గతంలో సినిమాలు సంవత్సరం ఆడేవి. క్రమంగా అది 200 రోజులకీ, 175 రోజులకీ, 50 రోజులకీ, 25 రోజులకీ తగ్గి, ఇప్పుడు 14 రోజుల దగ్గర ఆగింది. ఫిల్మ్స్ ఆర్ రన్నిగ్ ఓన్లీ ఫర్ 2 వీక్స్. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందని కాకుండా, ఎంత కలెక్ట్ చేసిందనేది కీలకమైంది. పెట్టిన పెట్టుబడి వచ్చేసిందా, ఎంత లాభాలు వచ్చాయన్నది చూసుకుంటున్నాం. అందుకనే, సంక్రాంతి, సమ్మర్, దసరా అనే మూడు మెయిన్ సీజన్లలో ఎక్కువమంది తీరుబడిగా ఉండి సినిమాలు చూస్తుంటారు కాబట్టి, ఆ సీజన్స్‌లో రిలీజ్ ఇంపార్టెంట్ అయింది. అయినా, సంక్రాంతికి ఒకేసారి రెండు, మూడు సినిమాలు రిలీజై, విజయవంతమైన సంఘటనలు పాత రోజుల నుంచి నిన్న మొన్నటి ‘నాయక్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దాకా చాలానే ఉన్నాయి. కాబట్టి, పండగకి ఒకేసారి సినిమాలు రిలీజైతే తప్పేముంది! ఇందులో పోటీ ఏమీ లేదు. నా సినిమా, బాబాయ్ సినిమా, నాగార్జున గారి సినిమా, శర్వానంద్ సినిమా - అన్నీ బాగా ఆడాలి. డబ్బులు రావాలి. అప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. దీన్ని నమ్ముకొన్న వందల కుటుంబాలు బాగుంటాయి. పెద్ద హీరోల సినిమా ఎప్పుడు రిలీజైతే అప్పుడే పండగ కదా! (నవ్వేస్తూ...) అలా అనుకుంటే, పెద్ద హీరోల సినిమాలు కూడా కేవలం సీజన్ చూసుకొనే వస్తున్నాయెందుకు? కాబట్టి, పండగ సీజన్ ఇంపార్టెంటే. నా ‘టెంపర్’ లాంటి కొన్నే నాన్ సీజన్లో రిలీజయ్యాయి. కానీ, మీ సినిమా, మీ బాబాయ్ బాలకృష్ణ సినిమా ‘డిక్టేటర్’ మధ్య పోటీ అనీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ అనీ ప్రచారం! (గంభీరంగా...) మా మధ్య పోటీ కానీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ కానీ లేనే లేదు. ఆ మాటకొస్తే, నాకు ఎవరితోనూ ఎలాంటి క్లాషూ ఉందని అనుకోవడం లేదు. బాబాయ్ సినిమా, నా సినిమా - ఇలా అందరి సినిమాలూ ఆడాలనే కోరుకుంటున్నా. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రిలీజ్ ఉండగా నాగార్జున గారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షోకి వెళ్ళి, పాల్గొన్నాను. నా ఒక్కడి సినిమానే ఆడాలనుకుంటే, ఆ పని చేయను కదా! మీ చిన్నతనంలో కానీ, ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ చూస్తుంటే ఒంటరితనం ఎప్పుడైనా ఫీలవుతుంటారా? లేదు. మా అమ్మ నన్నెప్పుడూ అలా ఫీలవనివ్వలేదు. మా చిన్నమ్మలు, మామయ్యలు -ఇలా ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో ఉండేవాణ్ణి. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నా గురించి చాలా మంది, చాలా విధాలుగా మాట్లాడుకొంటారు కానీ, అవేవీ నిజాలు కావు. ఇది నా జీవితం. నన్ను ఎవరూ ఒంటరివాణ్ణి చేద్దామని అనుకోలేదు. నా కుటుంబం, నా శ్రేయోభిలాషులు, నాన్న గారిచ్చిన ధైర్యం, క్రమశిక్షణ నా వెంటే ఉన్నాయి. బాబాయ్‌ల దగ్గర నుంచి అన్నయ్యల దాకా అందరూ ఉండగా నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతాను! కానీ, మీరేదో అన్నట్లూ..., కొన్ని సినిమాల రిలీజ్ టైమ్‌లో అందరూ మిమ్మల్ని ఒంటరి చేసినట్లూ...? (మధ్యలోనే అందుకుంటూ...) అదేమీ లేదు. నేను ఏదైనా అనదలుచుకొంటే అనే ధైర్యం ఉంది. అన్నానని చెప్పే నిజాయతీ ఉంది. కానీ, నేను అననిదానికి నేను బాధ్యత ఎలా వహిస్తాను! నన్ను ఒంటరిని చేశారంటూ... బయట మాట్లాడేవాళ్ళదేముంది! అలాంటిది ఏమైనా ఉంటే నేను ఫీలవ్వాలి! నేను అందరివాణ్ణి. నాకు అందరూ కావాలి. నా మనస్తత్వం అది. మరి, బాబాయ్ సినిమా, మీ సినిమా ఒకేసారి రావడం...? ఇది ఎవరు చేసిన తప్పూ కాదు. పండగ సీజన్లో రెండు సినిమాలూ వస్తుంటే, మా ఇద్దరిలో లేని మనస్పర్థలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మా ఇద్దరి సినిమాలే కాదు... అందరి సినిమాలూ ఆడాలి. ‘డిక్టేటర్’ వాళ్ళు మీ సినిమాకు థియేటర్లు ఇవ్వనివ్వడం లేదనీ, నిర్మాతను బెదిరిస్తున్నారనీ వార్తలొస్తున్నాయే? ఐ డోన్ట్ థింక్ సో! దోజ్ ఆర్ ఆల్ రూమర్స్! అలాంటిదేమైనా ఉంటే చెప్పేవారు కదా... మా మా నిర్మాత నాకేమీ చెప్పలేదు. మీరెవర్ని ‘ఫాలో’ అవుతున్నారో కానీ, మిమ్మల్ని ఎప్పుడూ ఏవో వివాదాలు ఫాలో అవుతూనే ఉన్నాయి. వివాదాలకు వివరణలివ్వరేం? నా మీద వచ్చేవన్నీ రూమర్లే. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను. ప్రతి విషయానికీ, చీటికీ మాటికీ క్లారిఫికేషన్ ఇవ్వలేం. పైగా, ఒక విషయం గురించి మనం ఎన్నోసార్లు చెప్పినా కొందరు మళ్ళీ అదే అదే మాట్లాడుతుంటే, క్లారిఫికేషన్ ఇవ్వడమెందుకని వదిలేయడమే బెటర్. పైగా నేనేమిటన్నది మా అమ్మకూ, నా భార్యకూ, నా శ్రేయోభిలాషులకూ తెలుసు. అందుకే, నా మీద పడ్డ ప్రతి అభాండానికీ నేను రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా బాబాయ్‌కి ప్రేమతో ఏమైనా చెబుతారా? మేమంతా ఒకే కుటుంబం. బాబాయ్ అంటే ఎవరు? నా తండ్రి తరువాత తండ్రి లాంటివాడు. మేమంతా ప్రేమను పంచుకుంటాం. ‘నాన్నకు ప్రేమతో’ లాగానే రేపు ‘బాబాయ్‌కి ప్రేమతో’అనే మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అలాగే, ‘తాతయ్యకు ప్రేమతో’! మొత్తానికి, గత చిత్రాలు కొన్ని సరిగ్గా ఆడకపోవడంతో మీ మీద ఒత్తిడి ఉన్నట్లుంది! నూటికి నూటొక్కపాళ్ళు నా మీద ఒత్తిడి ఉన్న మాట నిజమే. కాకపోతే, అది రిజల్ట్ గురించి కాదు. మేమందరం ఒక చట్రంలో ఇరుక్కుపోయాం. కేవలం కమర్షియల్, మెయిన్‌స్ట్రీమ్ సినిమాలే చేస్తూ ఒక చట్రంలో ఉండిపోతుండడం వల్ల, కొత్తగా ఏం చేసి, జనాన్ని ఆకట్టుకోవాలనే నిరంతరమైన ఒత్తిడి ఒక నటుడిగా నా మీద ఉంది. కేవలం ఆ తరహా సినిమాల్లోనే నటించడం నాకిష్టం లేదు. మరి, మీరు ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధమేనా? కచ్చితంగా. కాకపోతే, ఎవరికీ అర్థం కాని విధంగా ఉండే ప్రయోగాలు కాదు. ప్రేక్షకులకు అర్థమయ్యేలానే ఉంటూనే, కొత్తగా చెబుతూ, వాణిజ్యపరంగానూ వర్కౌట్ అయ్యే సినిమాలు చేయాలని ఉంది. ఉదాహరణకు, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి స్క్రిప్టులు, అంత కన్విన్సింగ్‌గా వాటిని తెరపై చెప్పే సమర్థులైన దర్శకులు ఉంటే జనం ఎందుకు చూడరు! చూస్తారు. చేయడానికి నేనూ రెడీ! మాస్, క్లాస్ అనే వర్గీకరణ మనం పెట్టుకున్నదే! భావోద్వేగాల్ని బయటకే ఎక్కువగా ఫీలయ్యేవాణ్ణి మాస్ అనీ, లోలోపలే ఎక్కువ ఫీలయ్యేవాణ్ణి క్లాస్ అనీ అంటున్నాం. ఇది కేవలం మన సైకాలజీ. కానీ ఆడియన్స్ అందరూ ఒకటే! కానీ, ప్రేక్షకుల అభిరుచి ఇటీవల మారుతున్నట్లుంది! నిజమే. ప్రపంచవ్యాప్తంగానే సినిమా మేకింగ్ మారుతోంది. అంతెందుకు! మొన్ననే ముగిసిన 2015వ సంవత్సరం మన తెలుగు పరిశ్రమకు అద్భుతమైన సంవత్సరం. రొటీన్ సినిమాలు కాకుండా, విషయం ఉండి, దాన్ని కొత్త రకమైన ధోరణిలో చూపెట్టిన సినిమాలు చూశారు. తెరపై ఏం చెప్పినా ఎమోషనల్‌గా, సరదాగా, నిజాయతీగా ఫీలయ్యేలా తీస్తే చూడడానికి జనం రెడీగా ఉన్నామంటున్నారు. అలాంటి ప్రయత్నాలు చేయాల్సింది మనమే. కేవలం మనం కొత్తదనం అనుకుంటే చాలదు... అది వాళ్ళకు నచ్చే కొత్తదనం అయ్యుండాలి. ఆడియన్స్ సైకాలజీని ఎవరూ పట్టుకోలేం! గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నారా? ఎవరైనా తప్పకుండా నేర్చుకొని తీరాల్సిందే! మనుషులం మనుషుల లాగా ఉండాలి కాబట్టి, దేవుడు మధ్యలో మొట్టికాయలు మొడుతుంటాడు. దాంతో, దోవలోకి వస్తాం. చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటాం. నేనూ అందుకు మినహాయింపేమీ కాదు. దర్శకుడు కొరటాల శివతో మీ నెక్స్ట్ఫిల్మ్కి ‘జనతా గ్యారేజ్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టినట్లున్నారు? ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్ మాత్రం వర్కింగ్ టైటిలే కాదు... ఒక రకంగా కన్ఫర్మ్డ్ టైటిల్ కూడా! అక్కడ ఫోన్లు, కార్ల దగ్గర నుంచి అన్ని రిపేర్లూ ఉంటాయి (నవ్వులు...) గెటప్‌తో సహా మళ్ళీ పూర్తిగా మారిపోనున్నారా? (నవ్వేస్తూ...) శివ దగ్గర చాలా ఆలోచనలున్నాయి. చాలా చేయాలనుంది. ఏం చేస్తామో తెలీదు. ‘నాన్నకు ప్రేమతో...’ రిజల్ట్ బట్టి అంతా ఉంటుంది. వి.వి. వినాయక్‌తో ‘అదుర్స్-2’ లాంటిదేదో చేయాలనుకున్నట్లున్నారు! అవును. నాకు కూడా డెఫినెట్‌గా ‘అదుర్స్-2’ లాంటిది చేయాలనుంది. అన్నీ కుదరాలి. రాజమౌళితో మళ్ళీ సినిమా మాటేమిటి? రాజమౌళితో నా సినిమా ఎప్పుడనేది ఆయన ఛాయిసే! అయినా, మాతో సినిమాలు చేస్తూ ఆయన ఇక్కడే చిక్కుపడిపోకూడదని నా భావన. ‘క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్’ సినిమా ఎలాగైతే హాలీవుడ్లో ఏషియన్ సినిమాలకు ఒక కొత్త మార్కెట్ తెచ్చిందో, అలాంటి సినిమాలు ఆయన చేయాలి. ఆయనకు ఆ సత్తా ఉంది. ఐ వాంట్ హిమ్ టు డు ఇట్! ఇంతకీ, పెద్ద ఎన్టీయార్ వారసుడిగా పౌరాణికాలు చేయడానికి మీరింకా ఎందుకు ఆలోచిస్తున్నారు? నిజం చెప్పాలంటే, ఇవాళ పౌరాణికాలు ఎవరు చేస్తారో కూడా తెలియడం లేదు. పైగా, మంచి స్క్రిప్ట్స్ కూడా బాగా వర్కౌట్ చేయాలి. ఇవాళ అలాంటి చిత్రాలు తీసేవాళ్ళంటే ఆ తరంలో సింగీతం శ్రీనివాసరావు గారు, తర్వాత సీనియరైన కె. రాఘవేంద్రరావు గారు లాంటి ఒకరిద్దరే ఉన్నారు. పైగా, నేను ఏది చేసినా పెద్దాయన ఎన్టీఆర్‌తో పోలుస్తారు. అందుకని అది అంత ఈజీ కాదు. ఒక్కముక్కలో నేను పెద్దాయనకు వారసుణ్ణి కాదు. వారసుణ్ణని ఎప్పుడూ అనుకోను. నేను ఆయన అభిమానిని. మనుమణ్ణి. అదొక్కటీ చాలు. మునుపటితో పోలిస్తే, మీరు మారినట్లు కనిపిస్తున్నారే! యస్. ఐ హ్యావ్ ఛేంజ్డ్ ఎ లాట్! మా అబ్బాయి అభయ్‌రామ్ పుట్టాక చాలా మారా. అంతకు ముందు చాలా హైపర్‌గా ఉండేవాణ్ణి. పెళ్ళయి, పిల్లాడు పుట్టాక కుదురు వచ్చింది. మరింత ఫోకస్డ్గా మారాను. పిల్లాడి మీద నా ప్రేమ, వాడితో ఆటపాటలు హెల్పయ్యాయి. అలాగే, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని పాత్ర పోషణ కూడా ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా నన్ను మార్చింది. మా నాన్న గారిని ఇప్పుడు ఇంకోలా చూడడం మొదలుపెట్టాను. అలాగే, అన్నయ్యని కూడా! నిజం చెప్పాలంటే, మనుషుల్ని కొత్తగా చూసున్నా. ఈ సినిమా నా పర్సనల్ లైఫ్‌కు బాగా హెల్పయింది. ఇంకా అవుతుంది. అందుకే, ఈ సినిమాను మర్చిపోలేను. ఇంతకీ నాన్న గారి నుంచి మీరు నేర్చుకున్న గుణమేంటి? నేర్చుకోకూడదనుకుంటున్నదేంటి? రెండిటికీ జవాబు - నిజాయతీనే! నిజాయతీ నేర్చుకున్నాను కానీ, ఈ రోజున్న సమాజంలో ఆయనలా నిజాయతీగా, ముక్కుసూటిగా, ఎమోషనల్‌గా మాట్లాడితే అర్థం చేసుకొనేవారు లేరు. కష్టపడి మిమ్మల్ని ఇంతవాణ్ణి చేసిన మీ అమ్మ గారు శాలినికి ఈ క్షణంలో ఏమైనా చెప్పాలని ఉందా? అమ్మకు ఏమీ చెప్పనక్కర్లేదు. నేను హ్యాపీగా ఉంటే, మా అమ్మ హ్యాపీగా ఉంటుంది. ఒక్క మాటలో అందరు అమ్మలూ గొప్పే! నాకు మా అమ్మ ఇంకా గొప్ప! మరి, మీ ఆవిడ మాటేమిటి? మా ఆవిడ ప్రణతి వచ్చాక నా జీవితం చాలా మారింది. నా జీవితనౌకకు ఆమే లంగరు. నన్ను కుదుటపరిచింది. నా జీవితంలో వచ్చిన ఈ అందమైన మార్పుకు మా ఆవిడే కారణం. మా ఆవిడ ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! తనవే కాదు, నా వర్కౌట్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుంది. అందరి సినిమాలూ చూస్తుంది. అలాగే, సినిమా నటుడిగా నా జీవితంలో ఉండే కష్టసుఖాలను అర్థం చేసుకుంటుంది. మీ అబ్బాయి అభయ్‌రామ్‌తో ఎలా గడుపుతుంటారు? మా అమ్మకు నేను ఒక్కణ్ణే. చెల్లెలుంటే బాగుండేదని ఎప్పుడూ అనుకొనేవాణ్ణి. అందుకే, ‘కూతురు పుట్టాలి... కూతురు పుట్టాలి’ అని ఉండేది. కూతురు పుడితే మా అమ్మ పేరే ‘శాలిని’ అని పెడదామనుకున్నా. కానీ, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు వాడికే ఆడపిల్లల డ్రెస్‌లు వేసి, అలా అలంకరణ చేసి ఆనందిస్తుంటాం. మా వాడి వయసు నిండా ఏడాదిన్నర లేదు. నడుస్తాడు. ఇప్పుడిప్పుడే జంప్ చేయడం నేర్చుకుంటున్నాడు. మాటలు వచ్చాయి. వాడికి వచ్చిన మొదటి మాటే - నాన్న. వాడు భయంకరమైన నాన్న పిచ్చోడు! నేను బయటకు వెళుతున్నానంటే, నా చెప్పులు పట్టుకొని వస్తాడు. నాన్న కారేది, అమ్మ కారేది, నాయనమ్మ కారేది అంటే అన్నీ చూపిస్తాడు. ‘మరి, నీ కారేది’ అంటే, అన్నీ చూపిస్తాడు. మీకున్నది కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్. ఎదుటివారిలో ఏది నచ్చి, మీరు స్నేహం చేస్తారు? నన్ను నన్నుగా చూడడం నాకు నచ్చుతుంది. మూడో తరగతి నుంచి క్లాస్మేట్ అయిన స్నేహల్, అలాగే ఆ తరువాత అవినాశ్, సినిమాల్లోకి వచ్చాక రాజీవ్ కనకాల, రాఘవ - ఇలా కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. లండన్‌లోని నా ఫ్రెండ్ స్నేహల్ కొన్నిసార్లు నా మీద ఒక దెబ్బ వేస్తాడు కూడా! ఆ మధ్య ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్‌కు వెళ్ళినప్పుడు నాకు లాగి, ఒకటిచ్చాడు. ఇప్పటికీ ఇంట్లో మంచైనా, చెడైనా వాడు, నేను ఒకరికొకరు చెప్పుకుంటాం. స్వతహాగా నేను హైపర్ కాబట్టి, అందరి మీదా అధికారం చలాయిస్తాను. వాళ్ళూ భరిస్తారు. మాలో మేము ఎన్ని అనుకున్నా, మాది విడిపోని బంధం. మీ సొంత అన్నయ్యలతో బంధం మాటేమిటి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది గుర్తులేదు కానీ, మేము చాలా సన్నిహితులమయ్యాం. గడచిన రెండేళ్ళుగా మా మధ్య అద్భుతమైన బంధం ఏర్పడింది. ఇవి మా అనుబంధంలోని బెస్ట్ ఇయర్స్. మా కుటుంబంలో ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని, లేనిపోనివి చెప్పడం వల్ల బంధాలు చెడిపోతాయి. ఇలాంటి టైమ్‌లో పెద్దన్నయ్య జానకీరామ్ ప్రమాదవశాత్తూ చనిపోవడం... (మధ్యలో అందుకుంటూ...) చాలా బాధ అనిపించింది. మరునాడు ‘పటాస్’ ఆడియో జరగాలి. పని మీద ఊరెళ్ళి వస్తానన్నవాడు ఆ రోజు సాయంత్రం శవమై వచ్చాడు. నిజానికి, ఆ రోజు పొద్దున్న 8 గంటలకే కల్యాణ్‌రామ్ అన్నయ్య మా ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట దాకా మాట్లాడుకున్నాం. మళ్ళీ సాయంత్రం కలుసుకున్నాం. ఇంతలో ఈ దుర్వార్త. ఆ బాధ నుంచి మా కుటుంబం బయటపడడం చాలా కష్టమైంది. కొన్నేళ్ళ క్రితం మీకు జరిగిన రోడ్డు ప్రమాదం, తరువాత మీ అన్నయ్య మరణం - ఇలాంటి వాటితో మీకు ఏమనిపిస్తోంది? ఉన్నది ఒకటే జీవితం. దాన్ని ఆనందంగా జీవిద్దాం. లేనిపోనివి పెట్టుకొని, అదీ ఇదీ అనుకుంటూ మనసునూ, జీవితాన్నీ పాడుచేసుకోకూడదు. తుచ్ఛమైన వాటి గురించి ఆలోచించే కన్నా, ఉచ్చమైన వాటి గురించి పాటుపడాలి. మన కుటుంబంతో అద్భుతమైన క్షణాల్ని తీర్చిదిద్దుకుంటూ, ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలి. అదే జీవిత సారాంశం. - రెంటాల జయదేవ -
జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ర్యాలీ
హైదరాబాద్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఓ సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టర్లను ముద్రించారని, తక్షణం ఆ పోస్టర్లను తొలగించి సినిమా నుంచి కూడా ఆ దృశ్యాలను తీసేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు శనివారం బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఈ పోస్టర్లపై ఫిర్యాదు కూడా చేశామని వెల్లడించారు. రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాసబ్‌ట్యాంకులోని సెన్సార్‌బోర్డు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దృశ్యాలు తొలగించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వందలాదిగా యువకులు బైక్ ర్యాలీతో వెళ్లడంతో బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
బాబాయ్, మామయ్యలకు డొనేషన్ ఇచ్చాడట..?
ఎన్నడూ లేనంతగా సంక్రాంతి సినిమాలు ఈ సారి చర్చకు వస్తున్నాయి. బరిలో నాలుగు సినిమాలు ఉన్నా ముఖ్యంగా చర్చించుకుంటుంది మాత్రం బాబాయ్, అబ్బాయ్‌ల గురించే. చాలా రోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఎన్టీఆర్, బాలకృష్ణలు ఈ సారి ప్రత్యక్ష యుద్దానికి దిగుతున్నారు. సంక్రాంతి బరిలో బాబాయ్ డిక్టేటర్‌గా వస్తుంటే, అబ్బాయి నాన్నకు ప్రేమతో సినిమాతో సవాల్ చేస్తున్నాడు. ఇలా ఫేస్ టు ఫేస్ వార్ జరుగుతున్న సందర్భంలో జూనియర్ తీసుకున్న ఓ నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సంక్రాంతి స్పెషల్ గా ఎన్టీఆర్ పాల్గొన్న మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ ప్రసారం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ను ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతుందంటున్నారు జూనియర్ అభిమానులు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ టివి షో మీలో ఎవరు కోటీశ్వరుడులో పాల్గొన్న ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో తాను గెలుచుకున్న మొత్తాన్ని బాబాయ్ బాలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు సగం, మామయ్య చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్‌కు సగం ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. దీంతో బాబాయ్ అబ్బాయిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న విషయం పై కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్. -
జూనియర్ vs బాలయ్య.. ఎందుకీ ఫైట్!
సంక్రాంతి ముంచుకొస్తోంది. నందమూరి అభిమానుల్లో కలకలం రేగుతోంది. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్, డిక్టేటర్ సినిమాతో బాలయ్య వస్తున్నారు. సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమా కోళ్లే. కాకపోతే.. తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొడుతున్నారా? లేకపోతే ఎవరి సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారా? ఇద్దరి అభిమానుల్లో ఒకటే సంఘర్షణ. బాలయ్య అభిమానులు జూనియర్‌కు విజ్ఞప్తులు చేస్తుంటే, జూనియర్ అభిమానులు బాలయ్యకు లేఖలు రాస్తున్నారు. నెట్లో.. వీళ్ల హడావిడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి సమయంలో రెండు సినిమాలు విడుదల చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరి మద్దతు ఎవరికి అన్నదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ - పెద్దహీరో. టీడీపీకి అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. తాత సిద్ధాంతాలున్న పార్టీకి తన ఓటు అన్నాడు. చంద్రబాబును మామయ్య అంటూ.. ప్రతి వేదిక మీదా ఆప్యాయంగా పిలిచాడు. సడెన్‌గా ఆనాటి కౌగిలింతలు, కమ్మటి మాటలు ఆగిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ప్రమాదానికి గురైన జూనియర్.. సీన్ నుంచి సైడైపోయాడు. క్రమంగా.. సైలెంటైపోయాడు. ఎన్నికల తర్వాత.. ఇక ఎన్టీఆర్ అనవసరం అనుకున్నారో, లేక భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదనుకున్నారో గానీ.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాలు అంటాయి. జూనియర్ పెళ్లి ప్రక్రియ మొత్తాన్ని తన చేతులమీదుగా నడిపించారు చంద్రబాబు. తన మేనకోడలి కూతురు ప్రణతిని జూనియర్‌కు ఇచ్చి పెళ్లిచేయడంలో బాబు కీలకపాత్ర పోషించారు. ఈ పెళ్లి తర్వాత.. జూనియర్‌ది ఒక దారైతే.. బాబుది మరో దారి. మొత్తమ్మీదకు బాబు - ఎన్టీఆర్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించిపోయాయి. ఇదో మరో టర్న్ తీసుకుంది. హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్ రాం దాదాపుగా ఏకాకులయ్యారు. ఈ పరిణామాలు అన్నీ జరిగే సమయంలోనే బాలకృష్ణ - చంద్రబాబుల మధ్య బంధం గట్టిపడుతుంటే జూనియర్ క్రమంగా దూరం కావాల్సి వచ్చింది. 2007లో కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇచ్చిన బాలకృష్ణ... పార్టీవ్యవహారాల్లో బావ చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండిపోయారు. ఫలితంగానే హిందూపురం ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. తనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండానే బాలకృష్ణకు రాజకీయ అవకాశాలు చంద్రబాబు కల్పించారన్నది అందరూ చెబుతున్న మాట. ఇదే సమయంలో.. హరికృష్ణ కుటుంబం పూర్తిగా దూరమైపోయింది. ఈ ఎపిసోడ్‌లోనే.. బాలయ్య వర్సెస్ జూనియర్ ఘటనకు ఆజ్యంపోసింది. సింహా ఆడియో ఫంక్షన్లో బాలయ్యకు ఆత్మీయంగా జూనియర్ పేల్చిన డైలాగులు అన్నీ ఇన్నీ కావు. తన తాత, ఆ తర్వాత నాన్న, తర్వాత బాబాయ్ అంటూ.. చెప్పుకొచ్చారు జూనియర్. అప్పుడు బాలయ్య కూడా.. జూనియర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ కొంత కాలం తర్వాత గ్యాప్ వచ్చేసింది. దీనికి కారణాలు ఏంటో గానీ, జూనియర్‌ను చంద్రబాబు తొక్కేశారని రాజకీయ విశ్లేషకులు అంటారు. ఈలోపే 2014 ఎన్నికలు వచ్చాయి. జూనియర్ మళ్లీ ప్రచారానికి వస్తారా? రారా? అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ఈలోగా బాలయ్య పేల్చిన డైలాగ్ జూనియర్‌తో ఉన్న భేదాభిప్రాయాలను బయటపెట్టింది. ఎవర్నీ బొట్టు పెట్టి పిలవమంటూ బాలయ్య వదిలిన బుల్లెట్.. జూనియర్‌ను గట్టిగానే తాకిందంటారు. కానీ, అదే బాబు.. పవన్‌కు బొట్టుపెట్టి పిలవడం కూడా జూనియర్‌ను మనస్తాపానికి గురిచేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఊహించని రీతిలో టీడీపీకి అధికారం దక్కడంతో జూనియర్‌కు కాస్త కష్టకాలం మొదలైంది. కొడుకు లోకేష్ కోసం చంద్రబాబు, అల్లుడి కోసం బాలకృష్ణ, బాలయ్య కోసం మిగతా కుటుంబ సభ్యులు.. ఇలా ఒక వలయం ఏర్పడింది. జూనియర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఒకానొక సమయంలో రెండు వర్గాలూ పరోక్షంగా కామెంట్లు కూడా చేసుకున్నాయి. అప్పుడే జూనియర్ దమ్ము సినిమా విడుదలైంది. థియేటర్లు ఇవ్వొద్దని, సినిమా చూడొద్దని కొంతమంది నందమూరి అభిమానులు పేరిట ఎస్ఎంఎస్లు వెల్లువెత్తాయి. సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉన్న విజయవాడలో పోస్టర్లు కూడా కట్టనీయకుండా కొంతమంది టీడీపీ నేతలు తెర వెనక నుంచి డ్రామా నడిపారు. అప్పుడు మొదలైన బాబాయ్- అబ్బాయ్ కోల్డ్‌వార్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో.. వారసత్వం మాట తలెత్తింది. ఎన్టీఆర్‌కు సిసలైన వారసుడు జూనియరే అంటూ హరికృష్ణ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆనాటి ఘటనలను ప్రజలముందు ఉంచారు. హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్రామ్లలో ఏ ఒక్కరూ బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా స్క్రిప్టు రాసుకొచ్చినట్టు చాలా క్లారిటీతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపారు. ఆడియో ఫంక్షన్‌కు పాసులు కూడా కేవలం జూనియర్ అభిమానులకు మాత్రమే ఇచ్చారు. మర్నాడే డిక్టేటర్ పోస్టర్లు పేపర్లో కనిపించాయి. నందమూరి అసలైన వారసుడు బాలకృష్ణే అంటూ యాడ్స్ కనిపించాయి. జూనియర్, బాలకృష్ణల మధ్య కుటుంబపరంగా ఉన్న విభేదాలు ఇప్పుడు సినిమా జోలికి వచ్చాయి. ఏకంగా ఒకరితో ఒకరు పోటీ పడి సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. సంక్రాంతి వేదికగా బాలయ్య డిక్టేటర్ వస్తుండగా, ఇదే సమయంలో జూనియర్ నాన్నకు ప్రేమతో వస్తోంది. రెండూ ఒకేసారి వస్తే.. నందమూరి అభిమానులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. సోషల్ మీడియాలో, సెల్ఫోన్లలో ఇద్దరి అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ అభిమానుల టెన్షన్ అంతా, ఇంతా కాదు. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న కౌంటర్లు కూడా అన్నీ ఇన్నీ కావు. జూనియర్ సినిమాకు సరైన థియేటర్లు రాకుండా, సరైన ప్రచారం లేకుండా చేయాలని బాలకృష్ణ వర్గం ప్రయత్నిస్తుంటే.. దీన్ని అధిగమించి సాగాలన్నది జూనియర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. స్వతహాగా బాలకృష్ణకు పట్టులేని నైజాంలో ఇప్పటికే జూనియర్ తన సినిమాకు ఎదురు లేకుండా చేసుకున్నారు. కానీ పక్కా ప్లాన్‌తో నైజాంలో థియేటర్లను జూనియర్‌కు వదిలేసి ఆంధ్రా, సీడెడ్ మాత్రం జూనియర్‌కు తగ్గించే ప్రయత్నాల్లో లోకేష్ బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నేరుగా ఫోన్లు కూడా చేస్తున్నాని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో కొనొద్దు, ఆడించొద్దన్నదే ఈ ఫోన్ కాల్స్ సారాంశమని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాలయ్యతో కాలుదువ్వే శక్తి జూనియర్ ఉందా? ఈ పోరులో జూనియర్ నిలబడగలడా? రాజకీయవర్గాలు ఇప్పుడు ఈ విషయాన్ని తక్కెటపెట్టి మరీ కొలుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారం, చంద్రబాబు అండ, రాజకీయ వర్గాల్లో పట్టు బాలకృష్ణకు ప్లస్ పాయింట్ కాగా, నిర్మాణాత్మక వ్యక్తిత్వం లేకపోవడం, ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు చేయలేకపోవడం, సమకాలీన అంశాలపై పట్టులేకపోవడం మైనస్ పాయింట్లు. అందుకే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణే అని ఒక దశలో పెద్ద హైప్ వచ్చినా అవేమీ ఆయనను పైస్థాయికి చేర్చలేకపోయాయి. సినిమాల్లో డిక్టేటర్ అయినా రాజకీయాల్లో, వ్యవహారజ్ఞానంలో పట్టులేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. చంద్రబాబుకు ఇది కలిసి వచ్చిందని టీడీపీ సీనియర్లే చెవులు కొరుక్కుంటారు. బాలయ్యలో లేనిది, తనకు ఉన్నది ఏంటని ఇటీవలి కాలంలో జూనియర్ బాగా అవలోకనం చేసుకుంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పెద్ద ఎన్టీఆర్ రూపురేఖలు రావడం, హీరోగా మంచి పేరు ఉండడం, ఇంగ్లిషులో పట్టు ఉండడం ఎన్టీఆర్‌కు కలిసొచ్చాయి. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా అనర్గళంగా మాట్లాడటం, ప్రజలను అట్టే నిలబెట్టడంలో.. బాలయ్యకన్నా బెటరనే పేరు జూనియర్‌కు ఉంది. అందుకే ఎప్పుడైనా బాబు-లోకేష్‌లకు ముప్పుగా మారుతాడనే భావనతోనే బాలయ్య ద్వారా జూనియర్‌ను తొక్కేశారని రాజకీయవర్గాలు విస్తృతంగా చర్చించుకున్నాయి. కాకపోతే బాబు-బాలయ్యలను ఢీకొట్టే నైపుణ్యం, ఆర్థికసత్తా జూనియర్‌కు ఉన్నాయా? ఒకవేళ సై అంటే జూనియర్ తట్టుకోగలరా అన్నదే అసలు డిస్కషన్. -
' నాన్నకు ప్రేమతో ' న్యూ స్టిల్స్
-
జూనియర్‌కి వీరాభిమానిని : కుష్బూ
సాధారణంగా యంగ్ జనరేషన్ హీరోయిన్లు, సీనియర్ హీరోలకు అభిమానులుగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అయ్యింది. టాలీవుడ్ యంగ్ జనరేషన్లో టాప్ హీరోగా ఉన్న జూనియర్‌కు, ఓ సీనియర్ హీరోయిన్ 'వీరాభిమానిని', అని తానే స్వయంగా చెప్పటంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. కొద్ది రోజులుగా వివిధ సందర్భాల్లో నాన్నకు ప్రేమతో సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు సీనియర్ నటి కుష్బూ. అయితే అభిమానులు ఈ సినిమా మీద ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీంతో తన అభిమానులకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది కుష్బూ. 'ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి నన్ను అడిగే వారికి చెపుతున్నాను. నేను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని, ఏవో కొన్ని తప్ప అతని సినిమాలన్నీ చూస్తాను'. అంటూ ట్వీట్ చేశారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్, కుష్బూలు కలిసి నటించారు. For all those who ask from AP n Telangana..I m a die hard #Jr.NTR fan..hardly miss his films except a few..watch it as n wen time permits — khushbusundar (@khushsundar) January 5, 2016 -
ఎన్టీఆర్ కల నెరవేరుతుందా..?
టెంపర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్, ప్రస్తుతం చేస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ టార్గెట్ మీద కన్నేశాడు. ఇప్పటి వరకు కెరీర్లో తనకు అందని ద్రాక్షగా ఉన్న 50 కోట్ల మార్క్‌ను ఈ సినిమాతో ఎలాగైనా సాధించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ సీజన్లో మాత్రం అది సాధ్యమయ్యే పరిస్థితి లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా, విశాల్ కథకళి (డబ్బింగ్ సినిమా)లు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలన్నింటిలో నాన్నకు ప్రేమతో భారీ బడ్జెట్ సినిమా. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అందులోనూ నాన్నకు ప్రేమతో లాంటి భారీ చిత్రం అదే స్థాయిలో విడుదలైతే తప్ప పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చే అవకాశం లేదు. కానీ ఈ సీజన్లో ఆ పరిస్థితి కనిపించటం లేదు. దీంతో జూనియర్ టార్గెట్ చేసిన 50 కోట్ల మార్క్ అందుకోవటం కష్టంగానే కనిపిస్తోంది. మరి ఇంత పోటీలో జూనియర్ కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎన్టీఆర్ పెద్ద ప్లానే వేశాడు
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, తన తరువాతి ప్రాజెక్ట్ మీద కూడా భారీ కసరత్తులే చేస్తున్నాడు. ముఖ్యంగా యంగ్ హీరోలందరూ భారీ మార్కెట్ కోసం ఇతర భాషల మీద దృష్టి పెడుతుండటంతో జూనియర్ కూడా అదే ప్లాన్స్ గీస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాను జనవరి నెలాఖరులో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో మళయాల మార్కెట్ మీద దండయాత్ర చేయాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే సినిమాలో కీలక పాత్రకు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఎంపిక చేశారు. ఈ పాత్ర కోసం తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. తాజాగా మరో పాత్రకు కూడా మళయాల నటుడినే ఎంపిక చేశారు. ప్రస్తుతం మాలీవుడ్‌లో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా జనతా గ్యారేజ్‌లో నటించనున్నాడట. ఇప్పటికే కథ విన్న ఫాజిల్ డేట్స్ కూడా ఇచ్చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఇద్దరు మళయాల స్టార్లు ఈ సినిమాలో నటిస్తుండటంతో జనతా గ్యారేజ్‌ను తెలుగుతో పాటు మళయాలంలో కూడా ఒకేసారి రిలీజ్ చేయోచ్చని భావిస్తున్నారట. అంతేకాదు ఈ ఇద్దరు మళయాలంలో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ కావటంతో ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉంటాయని భావిస్తున్నారు. -
తొలి సీడీ నాన్నకు ప్రేమతో
ఇటీవల కాలంలో ఇండస్ట్రీని తీవ్రంగా కదిలించిన మరణం ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి జి. సత్యమూర్తిది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న దేవీ శ్రీ తన ప్రతి సినిమాలో కుటుంబాన్ని కూడా భాగం చేసేవాడు. సంగీత దర్శకత్వంతో పాటు పాటల రచయితగానూ రాణిస్తున్న దేవీ వెనక తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే తండ్రి కోరిక మేరకు ఆయన మరణం తరువాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తిరిగి మ్యూజిక్ చేయటం మొదలు పెట్టాడు. దేవి సినిమాతో సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన దేవీ శ్రీ తన ప్రతి సినిమా తొలి ఆడియో సీడీని తన తల్లిదండ్రులకు ఇవ్వటం ఓ ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో రిలీజ్ సమయానికి తండ్రి లేకపోవటం దేవీ శ్రీని తీవ్రంగా బాధించింది. అయితే ఈ సారి కూడా తన ఆల్బమ్ తొలి సీడీని నాన్నకు ఇచ్చానంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు దేవీ శ్రీ. తండ్రి ఫోటో దగ్గర ఆడియో సీడీ ఉంచిన ఫోటో దేవీ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులను కదిలించింది. ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భోగవళ్లి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. As Always, gave d 1st CD of NNPT to Dad..Since my 1st film, its my habit 2 giv 1st CD of my films to my Mom n Dad -
ఆదినా..? అదుర్సా..?
అఖిల్ సినిమా ఫెయిల్యూర్‌తో డీలా పడిపోయిన వినాయక్ తిరిగి సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చిరు 150వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిని ఈ మాస్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమాల మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా రెండు భారీ ఫ్లాప్స్ తరువాత కూడా స్టార్ హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్నట్టుగా తేల్చేశాడు. అందుకే నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌తో త్వరలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలతో నిరాశపరిచిన వినాయక్, సినీ ప్రముఖులకు తనమీద ఉన్న నమ్మకాన్ని మాత్రం పొగొట్టుకోలేదు. అందుకే రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్తోనే త్వరలోనే సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఆ సినిమా ఆది లేదా అదుర్స్ సినిమాలకు సీక్వల్ అయ్యే చాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. -
ఈ ట్రైలర్ స్టైలిష్.. కూల్: రాజమౌళి
-
నాన్నకు థాంక్స్: దేవీ శ్రీ ప్రసాద్
'నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మా నాన్న సత్యమూర్తి గారికి థాంక్స్' అని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ అన్నారు. 'ప్రతి ఫంక్షన్‌కి మా నాన్నని తీసుకు వచ్చే వాడిని. మా సక్సెస్‌ని మా నాన్నగారు చూసేలా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా థాంక్స్. సామాజిక మాధ్య మాల్లో నాన్న మరణించిన సమయంలో(ఫేస్ బుక్, ట్విట్టర్) సపోర్ట్ చేసి వారికి కృతజ్ఞతలు' అని నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. నీ తోటి టెక్నిషియన్ వర్క్‌ను మనస్పూర్తిగా అప్రిషియేట్ చేయాలని మా నాన్న నాకు చెప్పిన మాటలే.. నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలిపేలా చేసిందన్నారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' టైటిల్ రావడం నా అదృష్టం. మైండ్ క్లియర్‌గా ఉంటేనే సక్సెస్ వస్తుంది. మా నాన్న హార్ట్ ప్రాబలమ్ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వారు. నాన్న ఆస్పత్రిలో ఉన్నప్పుడూ, ఒక్క రోజు కూడా నన్ను ఆస్పత్రికి రానివ్వకుండా తమ్ముడు సాగర్, అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకున్నారు. నా పాటలకు మీరు కొట్టే క్లాప్స్ విని మా నాన్న గారి కళ్లలో నీళ్లు వచ్చేవి. ఈ ఆడియో ఫంక్షన్ ని మానాన్నకి అంకితం చేయడం చాలా ఆనందంగా ఉంది అని దేవి అన్నారు. మొదటి సారి దేవి కళ్లలో నీళ్లు చూశా.. ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్వించే దేవీ కళ్లలో నీళ్లని మొదటిసారి సత్యమూర్తిగారు మృతి చెందిన తర్వతే చూశాను అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ఈ సంఘటన తర్వాత మూడో రోజే తిరిగి తన పనిలో దేవీ నిమగ్నమయ్యారన్నారు. -
జోరు చూపిస్తున్న జూనియర్
'టెంపర్' సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండో సినిమాను ఫైనల్ చేసిన జూనియర్ వెంటనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నటిస్తున్నయంగ్ టైగర్ సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాన్నకు ప్రేమతో సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాను ప్రారంభించిన ఎన్టీఆర్, త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఆదివారం ఆడియో రిలీజ్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ప్యాచ్ వర్క్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తయిన తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకొని మరో సినిమాను మొదలుపెడుతున్నాడు ఎన్టీఆర్. -
నాన్నకు ప్రేమతో ఆడియో డేట్..?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ఆడియో రిలీజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. దీంతో ఆడియోను ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయంపై కూడా సందిగ్థంలో ఉన్నారు. సంక్రాంతికే రిలీజ్ అవుతున్న మరో సినిమా.. డిక్టేటర్ ఆడియోను ఈ రోజు (ఆదివారం) రిలీజ్ చేస్తుండగా, వీలైనంత త్వరగా తమ ఆడియోను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నాన్నకు ప్రేమతో టీం. అందుకే డిసెంబర్ 27న ఈ సినిమా ఆడియోను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని, ఆ రోజే సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అనుకున్నట్టుగా బాబాయ్‌తో పోటీకి దిగుతాడో లేడో చూడాలి. -
నాన్నకు ప్రేమతో రిలీజ్ వాయిదా
-
ఎన్టీఆర్‌తో కుమారి..?
కుమారి 21ఎఫ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హేబాపటేల్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తొలి సినిమాలోనే బోల్డ్ యాక్టింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటి ప్రస్తుతం రాజ్ తరుణ్, నిఖిల్ సినిమాల్లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈసినిమాలు ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే మరో క్రేజ్ ఆఫర్‌ను పట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన ఆడిపాడే ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నాడు. స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కు హేబాను సెలెక్ట్ చేశారట. నిర్మాతగా హేబాకు తొలి బ్రేక్ ఇచ్చిన సుకుమార్, దర్శకుడిగా ఈ అమ్మడికి స్టార్ హీరో సరసన ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హేబా పాత్ర కుమారి 21ఎఫ్ తరహాలోనే బోల్డ్‌గా ఉండనుందట. కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటి ముందు ముందు స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందేమో చూడాలి. -
'నాన్నకు ప్రేమతో..' కొత్త పోస్టర్ రిలీజ్
సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమాకు సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సందడి చేసిన ఎన్టీఆర్.. మరో పోస్టర్ తో అలరించాడు. సుకుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంకాంత్రికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ పై యూనిట్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, స్టిల్స్, టీజర్స్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించనుండడంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు. -
స్పెషల్ సాంగ్ లో తమన్నా
2011లో రిలీజ్ అయిన ఊసరవెల్లి సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్, తమన్నాలు మరోసారి తెరను పంచుకుంటున్నారు. అయితే ఈ సారి ఫుల్ సినిమాలో ఈ జోడి జంటగా నటించటం లేదట. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమాలో.. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇప్పటికే అల్లుడు శీను సినిమా కోసం ఐటమ్ నెంబర్ చేసిన తమన్నా ఎన్టీఆర్ కోసం మరోసారి అదే పని చేస్తోంది. కెరీర్ కష్టాల్లో పడిందనుకున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా అవుతోంది. బాహుబలి 2 సినిమాలో బిజీగా ఉన్న తమన్నా, నాగార్జున్, కార్తీ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఊపిరిలో కార్తీకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి మెయిన్ హీరోయిన్ గా నటించిన బెంగాల్ టైగర్ గురువారం రిలీజ్ కు రెడీ అవుతోంది. -
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు..?
సినీ రంగంలో సెంటిమెంట్ ను ఫాలో అయినంతగా మరే రంగంలోనే ఫాలో అవ్వరు అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే హిట్ కాంబినేషన్లను, హిట్ ఫార్ములాలను పదే పదే రిపీట్ చేస్తుంటారు మన టాలీవుడ్ సినీ ప్రముఖులు. అలాంటి ఓ సెంటిమెంట్‌నే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్. గతంలో స్టార్ హీరోలతో తన సంగీతం దర్శకత్వంలో పాటలు పాడించి సక్సెస్ సాధించిన దేవీ, మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడట. రెగ్యులర్‌గా తన సినిమాలో సింగర్స్‌తో పాటు గొంతు కలిపే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... 'అత్తారింటికి దారేది', 'గబ్బర్‌సింగ్' సినిమాల్లోనూ పాటలు పాడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల సక్సెస్‌లో పవన్ పాడిన పాటలు కూడా తమ వంతుగా కలెక్షన్ల వేటకు సాయం చేశాయి. అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్‌తో ఓ పాటలో హమ్ చేయించాడు దేవీ శ్రీ. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఇది సెంటిమెంట్‌గా భావించిన దేవీ శ్రీ ప్రసాద్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' సినిమాతో పాటు, పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్థార్ గబ్బర్ సింగ్' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు దేవీ శ్రీ. ఈ రెండు సినిమాల్లో మరోసారి పవన్, ఎన్టీఆర్‌లతో పాటలు పాడించాలని ప్లాన్ చేస్తున్నాడట. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ రెండు సినిమాలు కూడా ఘనవిజయం సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
సొంత గొంతు వినిపిస్తుందట..!
ప్రజెంట్ టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు కూడా చేయలేని ఓ సాహసం, ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్‌లోనే చేసేస్తోంది. తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ పంజాబీ భామ తన నెక్ట్స్ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనుందట. ప్రస్తుతం ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' లో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలో తన సొంత గొంతును వినిపించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా ఫంక్షన్స్‌లో, ప్రెస్‌మీట్స్‌లో తెలుగులో గలగలా మాట్లాడేస్తున్న రకుల్ డబ్బింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా పదాలు సరిగ్గా పలకటం కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుంది. అయితే ఈ సినిమాలో... లండన్‌లో నివసించే తెలుగు అమ్మాయి పాత్రలో నటిస్తుంది కాబట్టి, తెలుగు ఉచ్ఛారణ కాస్త అటుఇటుగా ఉన్నా ఫరవాలేదనే ఉద్దేశంతో.. చిత్ర యూనిట్ రకుల్ సొంతం గొంతుకు ఓటు వేశారు. మరి ఇన్నాళ్లు అరువు గొంతుల మీద ఆధారపడ్డ ఈ భామ, సొంత గొంతుతో ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. -
ఎన్టీఆర్ మనసుపడ్డాడట..?
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా 'వేదలం'. ఇటీవల విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్‌రన్‌లో వంద కోట్లు వసూలు చేయటం ఖాయంగా కనిపిస్తున్న 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడిందట. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను స్పెషల్‌గా షో వేయించుకొని మరీ చూశాడు. గతంలో కూడా ఎన్టీఆర్ తమిళ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ అయినట్టే కనిపించినా, సెట్స్ మీదకు మాత్రం రాలేదు. తాజాగా 'వేదలం' సినిమా విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌పై ఎన్టీఆర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. 'నాన్నకు ప్రేమతో..' షూటింగ్లో ఉన్న జూనియర్ ఆ సినిమా పూర్తయ్యాక వేదలం సినిమాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. 'వేదలం' సినిమాను 'ఆవేశం' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగులో 'అఖిల్' రిలీజ్ ఉండటంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం రీమేక్ వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌పై అనుమానాలు ఏర్పాడ్డాయి. ఎన్టీఆర్‌తో పాటు రీ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగాస్టార్ కూడా వేదలం సినిమా రీమేక్‌పై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆవేశంగా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుందా..? లేకా రీమేక్ అవుతుందా..? తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎన్టీఆర్‌ని భయపెడుతున్న కుమారి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో 'నాన్నకు ప్రేమతో..' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది 'టెంపర్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ అదే జోష్‌లో సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ మాత్రం 'వన్ నేనొక్కడినే' లాంటి డిజాస్టర్ తరువాత ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే కసితో 'నాన్నకు ప్రేమతో..' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుకుమార్ నిర్మాతగా, కథ, స్క్రీన్ ప్లే అందించిన 'కుమారి 21ఎఫ్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ విషయమే 'నాన్నకు ప్రేమతో..' యూనిట్‌ను ఆలోచనలో పడేసింది. 'వన్ నేనొక్కడినే' రిజల్ట్ తరువాత దాదాపు మూడు నెలల పాటు సుకుమార్ ఎవరినీ కలవకుండా ఇంటికే పరిమితమయ్యాడట. ఇప్పుడు 'కుమారి 21ఎఫ్' రిజల్ట్ తేడా పడితే 'నాన్నకు ప్రేమతో..' పరిస్థితి ఏంటి..? అని కంగారుపడుతున్నారట యూనిట్. రాజ్ తరుణ్, హీబాపటేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'కుమార్ 21ఎఫ్' ఈ శుక్రవారం (నవంబర్ 20)న రిలీజ్ అవుతోంది. 'సినిమా చూపిస్త మామ' లాంటి హిట్ తరువాత రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా కావటం, తొలిసారిగా సుకుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, ఓ చిన్న సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేయటం లాంటి హంగులతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కానుంది. -
బాబాయ్‌తో ఢీ అంటున్న జూనియర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో'. తారక్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. 90 శాతానికి పైగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలైన సమయంలోనే 'నాన్నకు ప్రేమతో' సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించిన చిత్రయూనిట్, అదే సమయంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 'డిక్టేటర్' కూడా రిలీజ్ అవుతుండటంతో ఆలోచనలో పడింది. అంతేకాదు బాలయ్య సంక్రాంతి బరిలో దిగితే ఎన్టీఆర్ రేసు నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది 'నాన్నకు ప్రేమతో' టీం. ముందుగా అనుకున్నట్టుగానే పొంగల్ రేసులో దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు ఎన్టీఆర్. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో పొంగల్ రిలీజ్ అన్న లైన్‌తో బాబాయ్‌తో ఢీ కోడుతున్నట్టుగా తేల్చేశాడు. అయితే పొంగల్ సీజన్ జనవరి నెల అంతా ఉంటుంది కాబట్టి, కనీసం నందమూరి హీరోల రెండు సినిమాలు, రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు అభిమానులు. Wishing everyone a HAPPY and a safe DIWALI #NannakuPrematho pic.twitter.com/ZbVbQeYGpm — tarakaram n (@tarak9999) November 10, 2015 -
నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల
సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమా టీజర్ విడుదలైంది. ముందునుంచి అన్నట్లుగానే దసరా కానుకగా బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేశారు. 'ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు' అనే పాటతో కూడిన ఈ టీజర్‌ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. తారక్ నటిస్తున్న 25వ సినిమా కావడం, విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దీనికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు బాగా పెరిగాయి. దేవిశ్రీ ప్రసాద్ మార్కు సంగీతం ఈ టీజర్లో కనిపిస్తోంది. టెంపర్ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు. -
నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల
-
నందమూరి అభిమానులకు దసరా కానుక
నందమూరి అభిమానులు దసరాతో పాటు మరో పండుగకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' విజయదశమి రోజు, గురువారం సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ టీజర్ రిలీజ్ కానుంది. టెంపర్ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేస్తుంది. తన హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ రావటంతో టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేయకపోయినా గ్రాండ్ విజువల్స్‌తో అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉంటుదన్న టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. -
ఎన్టీఆర్‌పై 'అనంత' అభిమానం
మూడు నెలల భారీ షెడ్యూల్ తరువాత ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న ఎన్టీఆర్‌కు అభిమానులు భారీ గిఫ్ట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వచ్చిన నందమూరి అభిమానులు, ఎన్టీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బంగారు జరీతో నేసిన పట్టు వస్త్రాన్ని ఎన్టీఆర్‌కు అందజేశారు. ఈ పట్టు చీరలో మరో విశేషం కూడా ఉంది. ఈ వస్త్రం పై నందమూరి తారాక రామారావు, బసవతారకంల చిత్రపటాలు వచ్చే విధంగా నేసిని బంగారు జరీ చీర ఇది. ఈ చీర కోసం 35 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టుగా అభిమానులు తెలిపారు. తన పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. లండన్‌లో జరిగిన భారీ షెడ్యూల్ తరువాత బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ఈ నెల 24 నుంచి స్పెయిన్‌లో మరో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాడు. -
ఎన్టీఆర్ తిరిగొచ్చాడు
చాలా రోజులుగా తన నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో గడుపుతున్న ఎన్టీఆర్ ఇండియాకు తిరిగొచ్చాడు. సుకుమార్ డైరెక్షన్లో 'నాన్నకు ప్రేమతో' టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు విదేశాల్లో షూటింగ్ చేశారు. లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఓ కాస్ట్లీ ఇంట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ చేరుకున్న జూనియర్ శ్రీమంతుడు స్పెషల్ షో చూశాడు. లాంగ్ షూటింగ్ షెడ్యూల్ తరువాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటున్న ఎన్టీఆర్ అక్టోబర్ రెండో వారంలో బ్యాలెన్స్ షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. సెకండ్ షెడ్యూల్‌ను కూడా స్పెయిన్‌లో ప్లాన్ చేస్తున్న యూనిట్ ఈ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. టెంపర్ హిట్‌తో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ రికార్డ్‌లు తిరగరాసే భారీ హిట్‌ను టార్గెట్ చేస్తుంటే, వన్ ఫెయిల్యూర్‌తో ఇబ్బందుల్లో ఉన్న సుకుమార్ ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే నాన్నకు ప్రేమతో సక్సెస్ ఇద్దరి కెరీర్‌కు కీలకం కానుంది. -
ప్రేమతో... తారక్
‘నాన్నకు ప్రేమతో..’ అంటున్నారు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్‌ను ఖరారు చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సహనిర్మాతలుగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘కథ, స్క్రీన్‌ప్లే, ఎన్టీ ఆర్ పాత్రచిత్రణ, గెటప్.. ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉండటంతోపాటు కొత్త స్టయిల్లో ఉండే సినిమా’’ అని సుకుమార్ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. విజయ దశమికి టీజర్ విడుదల చేస్తాం. లండన్‌లో ప్లాన్ చేసిన 80 రోజుల భారీ షెడ్యూల్ ఈ నెల 24తో పూర్తవుతుంది. అక్టోబర్‌లో స్పెయిన్‌లో చేయబోయే 20 రోజుల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. జనవరి 8న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: విజయ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్. -
'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్ ఈ కొత్త పొస్టర్ లో టైటిల్ డిజైన్‌ను చూపించారు. బ్లూ అండ్ బ్లూలో కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది ఈ పోస్టర్ లో రివీల్ చేయకపోవటంతో అభిమానుల కాస్త నిరుత్సాహపడుతున్నారు. #NannakuPrematho pic.twitter.com/GfjM62yVPg — tarakaram n (@tarak9999) September 17, 2015 -
కొంచెం క్లాస్... కొంచెం మాస్!
మాస్‌గా కనిపించే క్లాస్ లుక్ ఎలా ఉంటుంది? అచ్చం ఇక్కడ మీరు చూస్తున్న స్టిల్లాగే ఉంటుంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రంలోనిదీ స్టిల్. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఎన్టీఆర్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లుక్ పరంగానే కాదు. ఆయన పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రధారులు’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘సెప్టెంబర్ 20 వరకు లండన్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆ తర్వాత 20 రోజుల పాటు స్పెయిన్‌లో చేసే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది’’ అని నిర్మాత అన్నారు. ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి అధికారికంగా పేరింకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు.