ఆ నలుగురే మూలస్తంభాలు: జూ.ఎన్టీఆర్
‘‘ నిస్వార్థంగా మేం చేసింది ప్రయోగమో, ప్రయత్నమో గానీ మా వెంట నిలబడ్డ ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనసా, వాచా, కర్మణ మాతో పాటూ అందరూ నమ్మి అందించిన విజయ మిది. ఇది నా 25వ చిత్రంగా కాక జీవితకాలం గుర్తుండి పోయేలా కథ రాసిచ్చిన సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఈ నెల 13న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం సక్సెస్‌లో నేను మెయిన్ పిల్లర్ అంటున్నారు. కానీ సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబులే మూల స్తంభాల్లా నిలిచారు. ఎన్ని వసూళ్లు సాధించాం, సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందనే విషయాన్ని పక్కనపెడితే ఇలాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అని తెలిపారు. ‘‘సినిమా సక్సెస్ చూస్తే మాటలు రావడం లేదు. సక్సెస్‌కు ముందు బాగా అలసిపోయాను, ఇప్పుడు నిద్రపోవాలనిపిస్తోంది. ఈ సక్సెస్‌లో నాతోపాటూ నా టీమ్, ప్రొడక్షన్ టీమ్ అందరి సపోర్ట్ ఉంది’’ అని సుకుమార్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో హీరో, విలన్‌కు మధ్య వచ్చే సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆ సీన్ చూసిన ఎన్టీఆర్ ‘నీకు ముద్దివ్వాలనుంది’ అని నాతో అంటున్నాడు’’ అని జగపతి బాబు పేర్కొన్నారు. ‘‘37 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నా, ఈ చిత్రం చూశాక నా భార్య ‘చాలా బాగా నటించారు’ అంది. నేనింత నిజా యితీగా నటించడానికి కారణం జూ. ఎన్టీఆర్’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, హీరోయిన్ రకుల్, నటులు రాజీవ్ కనకాల, నవీన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.