ఆ సీన్ చూసి మా అమ్మగారు ఏడ్చారు: దేవిశ్రీ ప్రసాద్
‘‘ఈ పదిహేనేళ్లల్లో మొట్టమొదటిసారి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బ్రతికున్నంత కాలం నాలో నిలిచిపోయే అనుభూతి ఈ చిత్రం. దీన్ని సక్సెస్‌గా భావించట్లేదు. ఓ మంచి అనుభూతినిచ్చిన సుకుమార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చిన్న ఎన్టీఆర్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో చిన్న ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రాసి, స్వరపరిచిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ పాటను ఆయన తండ్రి సత్యమూర్తికి అంకితమిచ్చారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ-‘‘‘నాన్నకు ప్రేమతో’ బొమ్మ అయితే దానికి తన సంగీతంతో ప్రాణం పోశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాట క్లయిమాక్స్ లో వచ్చినా, విని వెళుతున్నారు’’ అన్నారు. ‘‘నా 37 ఏళ్ల సినీ చరిత్రలో సక్సెస్ ఇంత మనస్ఫూర్తిగా, ఇంత గొప్పగా ఉంటుందని ఈ సినిమా ద్వారా తెలిసింది. ‘చాలెంజ్’ నుంచి దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తిగారు క థ అందించిన చాలా సినిమాల్లో నేను నటించాను’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘‘ఈ సినిమా పర్శనల్‌గా కూడా నాకు కనెక్ట్ అయింది.
క్లయిమ్యాక్స్‌లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎలా నవ్వుతూ చనిపోతుందో సరిగ్గా మా నాన్నగారు కూడా అంతే. ఆ సీన్ చూశాక మా అమ్మగారు ఏడ్చేశారు. ఈ సినిమాను మా నాన్నగారికి అంకితమివ్వడం ఆనందంగా ఉంది’’ అని దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘ఈ పాటను త నకు తాను సొంతగా రాత్రికి రాత్రి ఎడిట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. రీ- రికార్డింగ్ కూడా ఈ నెలలోనే పూర్తి చేశారు. రాజేంద్రప్రసాద్‌గారు సినిమా షూటింగ్ కోసం మా ఊరు రాజోలు రాకపోయుంటే దర్శకుణ్ణి అయ్యేవాణ్ని కాదేమో’’ అన్నారు. రకుల్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, విజయ్ కె చక్రవర్తి మాట్లాడారు.