
ప్రేమతో... తారక్
‘నాన్నకు ప్రేమతో..’ అంటున్నారు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్‌ను ఖరారు చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సహనిర్మాతలుగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘కథ, స్క్రీన్‌ప్లే, ఎన్టీ ఆర్ పాత్రచిత్రణ, గెటప్.. ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉండటంతోపాటు కొత్త స్టయిల్‌లో ఉండే సినిమా’’ అని సుకుమార్ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. విజయ దశమికి టీజర్ విడుదల చేస్తాం. లండన్‌లో ప్లాన్ చేసిన 80 రోజుల భారీ షెడ్యూల్ ఈ నెల 24తో పూర్తవుతుంది. అక్టోబర్‌లో స్పెయిన్‌లో చేయబోయే 20 రోజుల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. జనవరి 8న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: విజయ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్.