'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ | Nannaku prematho Movie Review | Sakshi
Sakshi News home page

'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ

Published Wed, Jan 13 2016 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ

'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ

టైటిల్ : నాన్నకు ప్రేమతో
జానర్ : థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా
తారాగణం : ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : సుకుమార్
నిర్మాత : బివియస్ఎన్ ప్రసాద్


టెంపర్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న సుకుమార్తో కలిసి చేసిన ఎమోషనల్ ప్రయోగం నాన్నకు ప్రేమతో. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్లో కనిపించిన ఎన్టీఆర్, కథా కథనాల ఎంపిక విషయంలో కూడా అదే కొత్తదనం చూపించాడు. ముఖ్యంగా భారీ పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఎంతో నమ్మకంగా తన సినిమాను రిలీజ్ చేసిన జూనియర్ నాన్నకు ప్రేమతో అంటూ సక్సెస్ అయ్యాడా.. 'వన్ నేనొక్కడినే' లాంటి భారీ డిజాస్టర్ తరువాత సుకుమార్ దర్శకుడిగా సక్సెస్ సాధించాడా..?

కథ :
అభిరామ్ (ఎన్టీఆర్) లండన్లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. ఫస్ట్ సీన్ లోనే తన ఎమోషన్ను దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం(రాజేంద్ర ప్రసాద్)కు సీరియస్గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్న( రాజీవ్ కనకాల) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు.

ఈ ఆపరేషన్లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరామ్ను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమా అంతా వన్ మేన్ షోగా నడిపించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడు. రిలీజ్కు ముందు నుంచి చుపుతున్నట్టుగా చివరి 45 నిమిషాలు అద్భుతమైన నటనతో ఆడియన్స్తో కంటతడి పెట్టించాడు. లుక్ విషయంలో కూడా ఎన్టీఆర్కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు మాస్ లుక్ లోనే కనిపించిన జూనియర్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ విషయంలోనూ కొత్త దనం చూపించాడు. రకుల్ ప్రీత్ మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రానీ రకుల్కు ఈ సినిమాలో ఆ ఛాన్స్ వచ్చింది.

 

తల్లిని కలుసుకునే సన్నివేశంలో తన నటనతో మెప్పించింది. విలన్గా జగపతి బాబు మరోసారి బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. స్టైలిష్ లుక్లో మైండ్ గేమ్ ఆడే బిజినెస్ మేన్గా ఆకట్టుకున్నాడు. తెరపై కనిపించేది తక్కువ సేపే అయినా, రాజేంద్ర ప్రసాద్ తన మార్క్ చూపించాడు. ఇతర పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశిష్ విద్యార్థి, మధుబాల లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :
నాన్నకు ప్రేమతో సినిమాతో సుకుమార్ మరోసారి తన మార్క్ కొనసాగించాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా కొత్త తరహా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరో, విలన్ పాత్రలను చిత్రణ చాలా కొత్తగా అనిపిస్తోంది. తన గత సినిమాల మాదిరిగా కథలో సైన్స్ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాకు మెయిన్ ఎసెట్ విజయ్ సి చక్రవర్తి సినిమాటోగ్రఫి లండన్, స్పెయిన్ అందాలను అద్భుతంగా తెరకెక్కించాడు.

ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ఛేజ్తో పాటు పాటలు కూడా చాలా రిచ్గా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందే ఆడియో హిట్ అనిపించుకున్న దేవి, నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని మరింత పెంచాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే నాన్నకు ప్రేమతో పాట థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆడియన్స్ ఆ మూడ్ లోనే కట్టి పడేస్తుంది. ఎడిటింగ్, కొరియోగ్రాఫి, యాక్షన్ కొరియోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి.


ప్లస్ పాయింట్స్ :

ఎన్టీఆర్
మ్యూజిక్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
సినిమా లెంగ్త్

ఓవరాల్ గా నాన్నకు ప్రేమతో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఆశించే ఆడియన్స్ను కాస్త నిరాశపరిచినా.. కొత్త కథా కథనాలను కోరుకునే వారిని మాత్రం అలరిస్తోంది. సంక్రాంతి బరిలోకి సక్సెస్ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్

 

 - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement