సంక్రాంతి ముంచుకొస్తోంది. నందమూరి అభిమానుల్లో కలకలం రేగుతోంది. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్, డిక్టేటర్ సినిమాతో బాలయ్య వస్తున్నారు. సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమా కోళ్లే. కాకపోతే.. తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొడుతున్నారా? లేకపోతే ఎవరి సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారా? ఇద్దరి అభిమానుల్లో ఒకటే సంఘర్షణ. బాలయ్య అభిమానులు జూనియర్‌కు విజ్ఞప్తులు చేస్తుంటే, జూనియర్ అభిమానులు బాలయ్యకు లేఖలు రాస్తున్నారు. నెట్లో.. వీళ్ల హడావిడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి సమయంలో రెండు సినిమాలు విడుదల చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరి మద్దతు ఎవరికి అన్నదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది.
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ - పెద్దహీరో. టీడీపీకి అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. తాత సిద్ధాంతాలున్న పార్టీకి తన ఓటు అన్నాడు. చంద్రబాబును మామయ్య అంటూ.. ప్రతి వేదిక మీదా ఆప్యాయంగా పిలిచాడు. సడెన్‌గా ఆనాటి కౌగిలింతలు, కమ్మటి మాటలు ఆగిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ప్రమాదానికి గురైన జూనియర్.. సీన్ నుంచి సైడైపోయాడు. క్రమంగా.. సైలెంటైపోయాడు. ఎన్నికల తర్వాత.. ఇక ఎన్టీఆర్ అనవసరం అనుకున్నారో, లేక భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదనుకున్నారో గానీ.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాలు అంటాయి. జూనియర్ పెళ్లి ప్రక్రియ మొత్తాన్ని తన చేతులమీదుగా నడిపించారు చంద్రబాబు. తన మేనకోడలి కూతురు ప్రణతిని జూనియర్‌కు ఇచ్చి పెళ్లిచేయడంలో బాబు కీలకపాత్ర పోషించారు. ఈ పెళ్లి తర్వాత.. జూనియర్‌ది ఒక దారైతే.. బాబుది మరో దారి. మొత్తమ్మీదకు బాబు - ఎన్టీఆర్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించిపోయాయి. ఇదో మరో టర్న్ తీసుకుంది. హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్ రాం దాదాపుగా ఏకాకులయ్యారు.
ఈ పరిణామాలు అన్నీ జరిగే సమయంలోనే బాలకృష్ణ - చంద్రబాబుల మధ్య బంధం గట్టిపడుతుంటే జూనియర్ క్రమంగా దూరం కావాల్సి వచ్చింది. 2007లో కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇచ్చిన బాలకృష్ణ... పార్టీవ్యవహారాల్లో బావ చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండిపోయారు. ఫలితంగానే హిందూపురం ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. తనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండానే బాలకృష్ణకు రాజకీయ అవకాశాలు చంద్రబాబు కల్పించారన్నది అందరూ చెబుతున్న మాట. ఇదే సమయంలో.. హరికృష్ణ కుటుంబం పూర్తిగా దూరమైపోయింది. ఈ ఎపిసోడ్‌లోనే.. బాలయ్య వర్సెస్ జూనియర్ ఘటనకు ఆజ్యంపోసింది.
సింహా ఆడియో ఫంక్షన్‌లో బాలయ్యకు ఆత్మీయంగా జూనియర్ పేల్చిన డైలాగులు అన్నీ ఇన్నీ కావు. తన తాత, ఆ తర్వాత నాన్న, తర్వాత బాబాయ్ అంటూ.. చెప్పుకొచ్చారు జూనియర్. అప్పుడు బాలయ్య కూడా.. జూనియర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ కొంత కాలం తర్వాత గ్యాప్ వచ్చేసింది. దీనికి కారణాలు ఏంటో గానీ, జూనియర్‌ను చంద్రబాబు తొక్కేశారని రాజకీయ విశ్లేషకులు అంటారు.
ఈలోపే 2014 ఎన్నికలు వచ్చాయి. జూనియర్ మళ్లీ ప్రచారానికి వస్తారా? రారా? అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ఈలోగా బాలయ్య పేల్చిన డైలాగ్ జూనియర్‌తో ఉన్న భేదాభిప్రాయాలను బయటపెట్టింది. ఎవర్నీ బొట్టు పెట్టి పిలవమంటూ బాలయ్య వదిలిన బుల్లెట్.. జూనియర్‌ను గట్టిగానే తాకిందంటారు. కానీ, అదే బాబు.. పవన్‌కు బొట్టుపెట్టి పిలవడం కూడా జూనియర్‌ను మనస్తాపానికి గురిచేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఊహించని రీతిలో టీడీపీకి అధికారం దక్కడంతో జూనియర్‌కు కాస్త కష్టకాలం మొదలైంది. కొడుకు లోకేష్ కోసం చంద్రబాబు, అల్లుడి కోసం బాలకృష్ణ, బాలయ్య కోసం మిగతా కుటుంబ సభ్యులు.. ఇలా ఒక వలయం ఏర్పడింది. జూనియర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఒకానొక సమయంలో రెండు వర్గాలూ పరోక్షంగా కామెంట్లు కూడా చేసుకున్నాయి. అప్పుడే జూనియర్ దమ్ము సినిమా విడుదలైంది. థియేటర్లు ఇవ్వొద్దని, సినిమా చూడొద్దని కొంతమంది నందమూరి అభిమానులు పేరిట ఎస్ఎంఎస్‌లు వెల్లువెత్తాయి. సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉన్న విజయవాడలో పోస్టర్లు కూడా కట్టనీయకుండా కొంతమంది టీడీపీ నేతలు తెర వెనక నుంచి డ్రామా నడిపారు. అప్పుడు మొదలైన బాబాయ్- అబ్బాయ్ కోల్డ్‌వార్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది.
నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్‌లో.. వారసత్వం మాట తలెత్తింది. ఎన్టీఆర్‌కు సిసలైన వారసుడు జూనియరే అంటూ హరికృష్ణ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆనాటి ఘటనలను ప్రజలముందు ఉంచారు. హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్‌రామ్‌లలో ఏ ఒక్కరూ బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా స్క్రిప్టు రాసుకొచ్చినట్టు చాలా క్లారిటీతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపారు. ఆడియో ఫంక్షన్‌కు పాసులు కూడా కేవలం జూనియర్ అభిమానులకు మాత్రమే ఇచ్చారు. మర్నాడే డిక్టేటర్ పోస్టర్లు పేపర్లో కనిపించాయి. నందమూరి అసలైన వారసుడు బాలకృష్ణే అంటూ యాడ్స్ కనిపించాయి.
జూనియర్, బాలకృష్ణల మధ్య కుటుంబపరంగా ఉన్న విభేదాలు ఇప్పుడు సినిమా జోలికి వచ్చాయి. ఏకంగా ఒకరితో ఒకరు పోటీ పడి సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. సంక్రాంతి వేదికగా బాలయ్య డిక్టేటర్ వస్తుండగా, ఇదే సమయంలో జూనియర్ నాన్నకు ప్రేమతో వస్తోంది. రెండూ ఒకేసారి వస్తే.. నందమూరి అభిమానులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. సోషల్ మీడియాలో, సెల్‌ఫోన్లలో ఇద్దరి అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది.
సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ అభిమానుల టెన్షన్ అంతా, ఇంతా కాదు. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న కౌంటర్లు కూడా అన్నీ ఇన్నీ కావు. జూనియర్ సినిమాకు సరైన థియేటర్లు రాకుండా, సరైన ప్రచారం లేకుండా చేయాలని బాలకృష్ణ వర్గం ప్రయత్నిస్తుంటే.. దీన్ని అధిగమించి సాగాలన్నది జూనియర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. స్వతహాగా బాలకృష్ణకు పట్టులేని నైజాంలో ఇప్పటికే జూనియర్ తన సినిమాకు ఎదురు లేకుండా చేసుకున్నారు. కానీ పక్కా ప్లాన్‌తో నైజాంలో థియేటర్లను జూనియర్‌కు వదిలేసి ఆంధ్రా, సీడెడ్ మాత్రం జూనియర్‌కు తగ్గించే ప్రయత్నాల్లో లోకేష్ బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నేరుగా ఫోన్లు కూడా చేస్తున్నాని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో కొనొద్దు, ఆడించొద్దన్నదే ఈ ఫోన్ కాల్స్ సారాంశమని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బాలయ్యతో కాలుదువ్వే శక్తి జూనియర్ ఉందా? ఈ పోరులో జూనియర్ నిలబడగలడా? రాజకీయవర్గాలు ఇప్పుడు ఈ విషయాన్ని తక్కెటపెట్టి మరీ కొలుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారం, చంద్రబాబు అండ, రాజకీయ వర్గాల్లో పట్టు బాలకృష్ణకు ప్లస్ పాయింట్ కాగా, నిర్మాణాత్మక వ్యక్తిత్వం లేకపోవడం, ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు చేయలేకపోవడం, సమకాలీన అంశాలపై పట్టులేకపోవడం మైనస్ పాయింట్లు. అందుకే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణే అని ఒక దశలో పెద్ద హైప్ వచ్చినా అవేమీ ఆయనను పైస్థాయికి చేర్చలేకపోయాయి. సినిమాల్లో డిక్టేటర్ అయినా రాజకీయాల్లో, వ్యవహారజ్ఞానంలో పట్టులేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. చంద్రబాబుకు ఇది కలిసి వచ్చిందని టీడీపీ సీనియర్లే చెవులు కొరుక్కుంటారు.
బాలయ్యలో లేనిది, తనకు ఉన్నది ఏంటని ఇటీవలి కాలంలో జూనియర్ బాగా అవలోకనం చేసుకుంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పెద్ద ఎన్టీఆర్ రూపురేఖలు రావడం, హీరోగా మంచి పేరు ఉండడం, ఇంగ్లిషులో పట్టు ఉండడం ఎన్టీఆర్‌కు కలిసొచ్చాయి. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా అనర్గళంగా మాట్లాడటం, ప్రజలను అట్టే నిలబెట్టడంలో.. బాలయ్యకన్నా బెటరనే పేరు జూనియర్‌కు ఉంది. అందుకే ఎప్పుడైనా బాబు-లోకేష్‌లకు ముప్పుగా మారుతాడనే భావనతోనే బాలయ్య ద్వారా జూనియర్‌ను తొక్కేశారని రాజకీయవర్గాలు విస్తృతంగా చర్చించుకున్నాయి. కాకపోతే బాబు-బాలయ్యలను ఢీకొట్టే నైపుణ్యం, ఆర్థికసత్తా జూనియర్‌కు ఉన్నాయా? ఒకవేళ సై అంటే జూనియర్ తట్టుకోగలరా అన్నదే అసలు డిస్కషన్.
జూనియర్ vs బాలయ్య.. ఎందుకీ ఫైట్!
Published Fri, Jan 8 2016 8:24 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement