బాబాయ్‌కి ప్రేమతో... | Interview JrNTR on Nannaku Prematho | Sakshi
Sakshi News home page

బాబాయ్‌కి ప్రేమతో...

Published Sun, Jan 10 2016 1:15 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాబాయ్‌కి ప్రేమతో... - Sakshi

బాబాయ్‌కి ప్రేమతో...

  సంక్రాంతి... పండగ టైమ్
 అల్లుళ్ళే కాదు... అబ్బాయిలూ ఇంటికొచ్చే టైమ్
 బాధలను భోగిమంటల్లో వేసి, బంధుత్వాలను బలపరిచే టైమ్
 వారసత్వాలు... ప్రేమకే ఉండాలని చెప్పే టైమ్
 ఆత్మీయతలు చేతులు చాచి, గుండెలకు హత్తుకొనే టైమ్

 
 ఈ సంక్రాంతి సీజన్‌లో అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో...’, బాబాయ్ సినిమా ‘డిక్టేటర్’ - రెండూ వస్తున్న వేళ...   చిన్న ఎన్టీయార్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ నుంచి ముఖ్యాంశాలు
 
‘ఐ వాంట్ టు ఫాలో... ఫాలో యు’ అని మీరన్నారు. మీడియా ఫాలో అవడమే కానీ, మీరు మీడియా ముందుకు రావడం లేదేం?
 ప్రత్యేకంగా కారణమేమీ లేదండీ! దాదాపు సంవత్సరంగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా, విదేశాల్లో షూటింగ్‌ల్లోనే బిజీ.

 హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1991) నుంచి చూస్తే ఇప్పటికి పాతికేళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. పెద్ద జర్నీనే!
 (నవ్వేస్తూ...) విశ్వామిత్ర, పిల్లలతో గుణశేఖర్ ‘రామాయణం’, టీవీ సీరియల్ ‘భక్త మార్కండేయ’ - ఇలా చూస్తే చాలా పెద్ద కథే. కాని మరీ పాతికేళ్ళ నుంచి చేస్తున్నానని నన్ను ముసలివాణ్ణి చేసేయకండి. నా వయసు 32 ఏళ్ళే!  కాకపోతే, ఈ ప్రయాణంలో బోలెడన్ని అనుభవాలు.

ఇది హీరోగా 25వ సినిమా! ‘నాన్నకు ప్రేమతో’ అంటున్నారేంటి?
 చనిపోతున్న తండ్రి ఆఖరి కోరిక తీర్చడం కోసం ఎంతకైనా తెగించే ఒక కొడుకు కథ ఇది. ఒక మనిషి జీవితంలోని 30 రోజుల్లో జరిగే కథ. బ్రిటన్‌లో కథ జరిగినప్పటికీ ఇది పండితుల నుంచి పామరుల దాకా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. సుక్కు (దర్శకుడు సుకుమార్) తన నిజజీవితం నుంచి తీసుకున్న ఆలోచన ఇది. అంతే తప్ప, నిజజీవిత కథ కాదు. కమర్షియల్ అంశాలున్న పాయింట్ కూడా! ఈ కథ విని దర్శకుడితో పాటు నేను, నిర్మాత భోగవల్లి ప్రసాద్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమేరామన్ విజయ్ కె. చక్రవర్తి - ఇలా సినిమా చేసే అందరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. అలాగే ప్రతి ఒక్కరూ కనెక్టయ్యే సినిమా ఇది.

తండ్రి కోసం కొడుకనే కథలు చాలా వచ్చాయిగా కొత్తేంటి? పైగా, ఈ సినిమాలో మీది ద్విపాత్రాభినయమనీ, పోలీసనీ...?
 పోలీసు పాత్ర, ద్విపాత్రాభినయం - లాంటివన్నీ వట్టి పుకార్లు. నాది ఒకే షేడ్‌తో... ఇదే గడ్డం, జుట్టు గెటప్‌తో సాగే పాత్ర. ఇక, తండ్రి కోసం కొడుకనే కథల్లో కూడా ఇటీజ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ‘డిఫరెంట్’ అనగానే అర్థం కాని ప్రయోగం కాదు. మేకింగ్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, గెటప్స్, స్క్రీన్‌ప్లే - ఇలా చాలావాటిలో విభిన్నంగా ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేని, ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్. ముఖ్యంగా, ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చే చివరి 40 నిమిషాలు సినిమాకు ఆయువుపట్టు. సుకుమార్ శైలిలో సాగే కథ. కథలో తండ్రి కోసం తపించే కొడుకుగా కొన్ని కోణాల్లో నా లాగా, ఇంకొన్ని కోణాల్లో సుక్కు లాగా అనిపిస్తాను.



దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో సినిమా రిలీజ్ వాయిదా ఆలోచన చేశారా?
 వాయిదా ఆలోచన లేదు కానీ, ఏం చేయాలన్న క్వశ్చన్‌మార్క్ ఉంది. మేము స్పెయిన్‌లో షూటింగ్‌లో ఉండగా, ఆ ముందు రోజే ఆఖరి సాంగ్ ట్యూన్ దేవిశ్రీ పంపారు. తీరా మరునాడే ఈ దుర్వార్త. ఇంట్లోవాళ్ళకు అది ఎంతో తీవ్రమైన మానసిక వేదన కలిగించే విషయం. గత ఏడాది మా అన్నయ్య జానకీరామ్ పోయినప్పుడు మేము అది అనుభవించాం. మాట్లాడలేక, దేవిశ్రీకి కండొలెన్స్ మెసేజ్ పెట్టా. రెండు రోజుల తర్వాత దేవిశ్రీనే ‘వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశా. పాట కూడా పాడించేశా’ అని మెసేజ్ పెడితే, నాకు ఏడుపొచ్చేసింది. దేవిశ్రీకి వాళ్ళ నాన్న గారు నేర్పిన విలువలు, పని పట్ల అతనికి ఉన్న కమిట్‌మెంట్‌కు అది నిదర్శనం.

సినిమా ఫీల్‌తో... మీ నాన్న గారు హరికృష్ణతో ప్రేమ పంచుకున్నారా?!
 క్లైమాక్స్‌లో ఒక బిట్‌కు సుక్కు నాతో 5 వెర్షన్లు చేయించారు. నా తండ్రి పాత్రధారి రాజేంద్రప్రసాద్ గారిని పట్టుకొని ఏడ్చే సీన్. అందులో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి, షాట్ అయిపోయినా దాదాపు 20 నిమిషాలు ఏడ్చేశా. అందరూ కలసి ఊరుకోబెట్టాల్సి వచ్చింది. ఆ రోజు సెప్టెంబర్ 2. మా అమ్మా నాన్నలిద్దరి పుట్టినరోజు అదే. నాన్న గారికి ఫోన్ చేసి నా భావాలు పంచుకున్నా. పక్కనే జగపతిబాబు గారు కూడా ఉన్నారు. అప్పుడు నాన్న గారు నాతో, ‘ఇది సినిమా. డోన్ట్ టేకిట్ టూ పర్సనల్’ అని చెప్పారు. కానీ, చేస్తున్న పాత్రను పర్సనల్‌గా తీసుకోకపోతే, నేను యాక్ట్ చేయలేను. ప్లాస్టిక్ నటన నా వల్ల కాదు. కానీ, రొమాన్స్ నటిస్తున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ నటన చేసేస్తా. తెర ముందైనా, నిజజీవితంలోనైనా రొమాన్స్ వ్యక్తం చేయడం నాకు రాదు. నాకు అదో ప్రాబ్లమ్. మా ఆవిడ ప్రణతి కూడా అదే కంప్లయింట్ చేస్తుంటుంది.

పాత్రను పర్సనల్‌గా తీసుకుంటానన్నారు. మరి, పాత్రపోషణకు ప్రిపేర్ అవుతారా? ఆ మూడ్ నుంచి బయటకు రావడానికేం చేస్తారు?  
 నటన ప్రాక్టీస్ చేయను కానీ, లీనమైపోయి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ట్రై చేస్తా. ఐ హ్యావ్ టు లివ్ ఇట్. ఎక్స్‌పీరియన్స్ ఇట్. నిజానికి, అలా పాత్రలోకి వెళ్ళడం కష్టమే. బయటపడాలన్నా కష్టమే. ఫలానా సీన్‌లో ఫలానా పాత్రకు ఏదో జరిగిందంటే, అలాంటిది నిజజీవితంలో నాకు ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచిస్తా. అలాగే ప్రవర్తిస్తా. అందుకే, రేపు పొద్దున్న నిజజీవితంలో నన్ను ఎప్పుడైనా చూస్తే, అచ్చం నా సినిమాలో నన్ను చూసినట్లే ఉంటుంది. నేను

ఇలా ఇన్‌వాల్వ్ అయితే, మీరు ఏకకాలంలో రెండేసి సినిమాలు, పాత్రలు చేయలేరుగా?  
 నిజమే. నాకు కష్టం. ముఖ్యంగా, ఇప్పుడు రాసుకొనే కథల్లో అలా ఒకేసారి రెండు సినిమాలు నేను చేయలేనేమో! కాకపోతే, సినిమాల్లో చేస్తున్న పాత్రల నుంచి బయటపడడానికి నా ఫ్యామిలీనే నాకు అండ. ఏడాదిలో 365 రోజులకు 340 రోజులు ఇల్లు దాటి బయటకు వెళ్ళను. ఎప్పుడైనా సరదాగా ఏ ఫ్రెండ్ ఇంటికో వెళతా. అంతే.



‘నాన్నకు ప్రేమతో...’ సినిమా ద్వారా దర్శకుడు సుకుమార్‌తో తొలిసారిగా పని చేయడం ఎలా ఉంది?
 సుక్కు, నేను కలసి సినిమా చేయాలని ఆరేడేళ్ళుగా అనుకుంటున్నాం. కానీ, కుదరలేదు. ఎప్పుడైతో ‘నాన్నకు ప్రేమతో...’ కుదిరిందో, అప్పటి నుంచి ఈ ఎమోషనల్ ఫిల్మ్ మా జీవితం, ప్రాణంగా మారింది. సుకుమార్ ఒకపట్టాన సినిమా పూర్తిచేయడనీ, క్లారిటీ ఉండదనీ చాలామంది చాలా రకాలుగా నన్ను భయపెట్టారు. కానీ, జూలైలో మొదలైన ఈ సినిమా జనవరి కల్లా పూర్తయింది కదా! తన తండ్రి జీవితం స్ఫూర్తితో రాసుకున్న ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించడంలో ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా నేను స్పష్టత ఇవ్వాలి. ‘తారక్ కేవలం హిట్ దర్శకులనే ఎంచుకొంటాడు’ అని నా మీద అపవాదు వేస్తుంటారు. నిజానికి, రాజమౌళి (‘స్టూడెంట్ నంబర్1’), వంశీ (‘బృందావనం’), వర ముళ్ళపూడి (‘నా అల్లుడు’), వినాయక్ (‘ఆది’), ఇప్పుడు సుకుమార్... వీళ్ళెవరూ నాతో తొలి సినిమా చేసినప్పుడు వాళ్ళు హిట్స్‌లో ఏమీ లేరు కదా! మనకు కథ నచ్చిందంటే, దర్శకుణ్ణి నమ్మి వెళ్ళాలి.

 వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జునతో కలసి చేయాల్సిన ‘ఊపిరి’ నుంచి మీరు తప్పుకొన్నారెందుకు? స్క్రిప్ట్ నచ్చలేదా?
 ఇటీజ్ డెఫినెట్లీ గుడ్ స్క్రిప్ట్. నేనూ చేద్దామనే అనుకున్నాను. కానీ, ‘ఊపిరి’కీ, మా ‘నాన్నకు ప్రేమతో’కూ డేట్స్ సర్దుబాటు కాలేదు. నా కోసం ఆగితే, ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. నాగార్జున గారి డేట్స్ వృథా అవుతాయి. అందుకే, నేనే కావాలని ఆ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గాను. దానివల్ల ఇప్పుడు నా సినిమా పూర్తయిపోయింది. వాళ్ళ సినిమా కూడా దాదాపు పూర్తయిపో వచ్చింది. లేకపోతే, రెండూ డిలే అయ్యేవి.

కానీ, ఈసారి సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు పోటీపడడం అవసరమా?
 గతంలో సినిమాలు సంవత్సరం ఆడేవి. క్రమంగా అది 200 రోజులకీ, 175 రోజులకీ, 50 రోజులకీ, 25 రోజులకీ తగ్గి, ఇప్పుడు 14 రోజుల దగ్గర ఆగింది. ఫిల్మ్స్ ఆర్ రన్నిగ్ ఓన్లీ ఫర్ 2 వీక్స్. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందని కాకుండా, ఎంత కలెక్ట్ చేసిందనేది కీలకమైంది. పెట్టిన పెట్టుబడి వచ్చేసిందా, ఎంత లాభాలు వచ్చాయన్నది చూసుకుంటున్నాం. అందుకనే, సంక్రాంతి, సమ్మర్, దసరా అనే మూడు మెయిన్ సీజన్లలో ఎక్కువమంది తీరుబడిగా ఉండి సినిమాలు చూస్తుంటారు కాబట్టి, ఆ సీజన్స్‌లో రిలీజ్ ఇంపార్టెంట్ అయింది. అయినా, సంక్రాంతికి ఒకేసారి రెండు, మూడు సినిమాలు రిలీజై, విజయవంతమైన సంఘటనలు పాత రోజుల నుంచి నిన్న మొన్నటి ‘నాయక్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దాకా చాలానే ఉన్నాయి. కాబట్టి, పండగకి ఒకేసారి సినిమాలు రిలీజైతే తప్పేముంది! ఇందులో పోటీ ఏమీ లేదు. నా సినిమా, బాబాయ్ సినిమా, నాగార్జున గారి సినిమా, శర్వానంద్ సినిమా - అన్నీ బాగా ఆడాలి. డబ్బులు రావాలి. అప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. దీన్ని నమ్ముకొన్న వందల కుటుంబాలు బాగుంటాయి.



పెద్ద హీరోల సినిమా ఎప్పుడు రిలీజైతే అప్పుడే పండగ కదా!
 (నవ్వేస్తూ...)  అలా అనుకుంటే, పెద్ద హీరోల సినిమాలు కూడా కేవలం సీజన్ చూసుకొనే వస్తున్నాయెందుకు? కాబట్టి, పండగ సీజన్ ఇంపార్టెంటే. నా ‘టెంపర్’ లాంటి కొన్నే నాన్ సీజన్‌లో రిలీజయ్యాయి.

కానీ, మీ సినిమా, మీ బాబాయ్ బాలకృష్ణ సినిమా ‘డిక్టేటర్’ మధ్య పోటీ అనీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ అనీ ప్రచారం!
 (గంభీరంగా...) మా మధ్య పోటీ కానీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ కానీ లేనే లేదు. ఆ మాటకొస్తే, నాకు ఎవరితోనూ ఎలాంటి క్లాషూ ఉందని అనుకోవడం లేదు. బాబాయ్ సినిమా, నా సినిమా - ఇలా అందరి సినిమాలూ ఆడాలనే కోరుకుంటున్నా. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రిలీజ్ ఉండగా నాగార్జున గారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షోకి వెళ్ళి, పాల్గొన్నాను. నా ఒక్కడి సినిమానే ఆడాలనుకుంటే, ఆ పని చేయను కదా!

మీ చిన్నతనంలో కానీ, ఇప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ చూస్తుంటే ఒంటరితనం ఎప్పుడైనా ఫీలవుతుంటారా?
 లేదు. మా అమ్మ నన్నెప్పుడూ అలా ఫీలవనివ్వలేదు. మా చిన్నమ్మలు, మామయ్యలు -ఇలా ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో ఉండేవాణ్ణి. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నా గురించి చాలా మంది, చాలా విధాలుగా మాట్లాడుకొంటారు కానీ, అవేవీ నిజాలు కావు. ఇది నా జీవితం. నన్ను ఎవరూ ఒంటరివాణ్ణి చేద్దామని అనుకోలేదు. నా కుటుంబం, నా శ్రేయోభిలాషులు, నాన్న గారిచ్చిన ధైర్యం, క్రమశిక్షణ నా వెంటే ఉన్నాయి. బాబాయ్‌ల దగ్గర నుంచి అన్నయ్యల దాకా అందరూ ఉండగా నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతాను!

కానీ, మీరేదో అన్నట్లూ..., కొన్ని సినిమాల రిలీజ్ టైమ్‌లో అందరూ మిమ్మల్ని ఒంటరి చేసినట్లూ...?
 (మధ్యలోనే అందుకుంటూ...) అదేమీ లేదు. నేను ఏదైనా అనదలుచుకొంటే అనే ధైర్యం ఉంది. అన్నానని చెప్పే నిజాయతీ ఉంది. కానీ, నేను అననిదానికి నేను బాధ్యత ఎలా వహిస్తాను! నన్ను ఒంటరిని చేశారంటూ... బయట మాట్లాడేవాళ్ళదేముంది! అలాంటిది ఏమైనా ఉంటే నేను ఫీలవ్వాలి! నేను అందరివాణ్ణి. నాకు అందరూ కావాలి. నా మనస్తత్వం అది.

మరి, బాబాయ్ సినిమా, మీ సినిమా ఒకేసారి రావడం...?
 ఇది ఎవరు చేసిన తప్పూ కాదు. పండగ సీజన్‌లో రెండు సినిమాలూ వస్తుంటే, మా ఇద్దరిలో లేని మనస్పర్థలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మా ఇద్దరి సినిమాలే కాదు... అందరి సినిమాలూ ఆడాలి.

‘డిక్టేటర్’ వాళ్ళు మీ సినిమాకు థియేటర్లు ఇవ్వనివ్వడం లేదనీ, నిర్మాతను బెదిరిస్తున్నారనీ వార్తలొస్తున్నాయే?
 ఐ డోన్ట్ థింక్ సో! దోజ్ ఆర్ ఆల్ రూమర్స్! అలాంటిదేమైనా ఉంటే చెప్పేవారు కదా... మా మా నిర్మాత నాకేమీ చెప్పలేదు.

మీరెవర్ని ‘ఫాలో’ అవుతున్నారో కానీ, మిమ్మల్ని ఎప్పుడూ ఏవో వివాదాలు ఫాలో అవుతూనే ఉన్నాయి. వివాదాలకు వివరణలివ్వరేం?
 నా మీద వచ్చేవన్నీ రూమర్లే. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను. ప్రతి విషయానికీ, చీటికీ మాటికీ క్లారిఫికేషన్ ఇవ్వలేం. పైగా, ఒక విషయం గురించి మనం ఎన్నోసార్లు చెప్పినా కొందరు మళ్ళీ అదే అదే మాట్లాడుతుంటే, క్లారిఫికేషన్ ఇవ్వడమెందుకని వదిలేయడమే బెటర్. పైగా నేనేమిటన్నది మా అమ్మకూ, నా భార్యకూ, నా శ్రేయోభిలాషులకూ తెలుసు. అందుకే, నా మీద పడ్డ ప్రతి అభాండానికీ నేను రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు.

ఈ సందర్భంగా బాబాయ్‌కి ప్రేమతో ఏమైనా చెబుతారా?
 మేమంతా ఒకే కుటుంబం. బాబాయ్ అంటే ఎవరు? నా తండ్రి తరువాత తండ్రి లాంటివాడు. మేమంతా ప్రేమను పంచుకుంటాం. ‘నాన్నకు ప్రేమతో’ లాగానే రేపు ‘బాబాయ్‌కి ప్రేమతో’అనే మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అలాగే, ‘తాతయ్యకు ప్రేమతో’!

మొత్తానికి, గత చిత్రాలు కొన్ని సరిగ్గా ఆడకపోవడంతో మీ మీద ఒత్తిడి ఉన్నట్లుంది!
నూటికి నూటొక్కపాళ్ళు నా మీద ఒత్తిడి ఉన్న మాట నిజమే. కాకపోతే, అది రిజల్ట్ గురించి కాదు. మేమందరం ఒక చట్రంలో ఇరుక్కుపోయాం. కేవలం కమర్షియల్, మెయిన్‌స్ట్రీమ్ సినిమాలే చేస్తూ ఒక చట్రంలో ఉండిపోతుండడం వల్ల, కొత్తగా ఏం చేసి, జనాన్ని ఆకట్టుకోవాలనే నిరంతరమైన ఒత్తిడి ఒక నటుడిగా నా మీద ఉంది. కేవలం ఆ తరహా సినిమాల్లోనే నటించడం నాకిష్టం లేదు.

మరి, మీరు ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధమేనా?
కచ్చితంగా. కాకపోతే, ఎవరికీ అర్థం కాని విధంగా ఉండే ప్రయోగాలు కాదు. ప్రేక్షకులకు అర్థమయ్యేలానే ఉంటూనే, కొత్తగా చెబుతూ, వాణిజ్యపరంగానూ వర్కౌట్ అయ్యే సినిమాలు చేయాలని ఉంది. ఉదాహరణకు, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి స్క్రిప్టులు, అంత కన్విన్సింగ్‌గా వాటిని తెరపై చెప్పే సమర్థులైన దర్శకులు ఉంటే జనం ఎందుకు చూడరు! చూస్తారు. చేయడానికి నేనూ రెడీ! మాస్, క్లాస్ అనే వర్గీకరణ మనం పెట్టుకున్నదే! భావోద్వేగాల్ని బయటకే ఎక్కువగా ఫీలయ్యేవాణ్ణి మాస్ అనీ, లోలోపలే ఎక్కువ ఫీలయ్యేవాణ్ణి క్లాస్ అనీ అంటున్నాం. ఇది కేవలం మన సైకాలజీ. కానీ ఆడియన్స్ అందరూ ఒకటే!

కానీ, ప్రేక్షకుల అభిరుచి ఇటీవల మారుతున్నట్లుంది!
 నిజమే. ప్రపంచవ్యాప్తంగానే సినిమా మేకింగ్ మారుతోంది. అంతెందుకు! మొన్ననే ముగిసిన 2015వ సంవత్సరం మన తెలుగు పరిశ్రమకు అద్భుతమైన సంవత్సరం. రొటీన్ సినిమాలు కాకుండా, విషయం ఉండి, దాన్ని కొత్త రకమైన ధోరణిలో చూపెట్టిన సినిమాలు చూశారు. తెరపై ఏం చెప్పినా ఎమోషనల్‌గా, సరదాగా, నిజాయతీగా ఫీలయ్యేలా తీస్తే చూడడానికి జనం రెడీగా ఉన్నామంటున్నారు. అలాంటి ప్రయత్నాలు చేయాల్సింది మనమే. కేవలం మనం కొత్తదనం అనుకుంటే చాలదు... అది వాళ్ళకు నచ్చే కొత్తదనం అయ్యుండాలి. ఆడియన్స్ సైకాలజీని ఎవరూ పట్టుకోలేం!

గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నారా?
 ఎవరైనా తప్పకుండా నేర్చుకొని తీరాల్సిందే! మనుషులం మనుషుల లాగా ఉండాలి కాబట్టి, దేవుడు మధ్యలో మొట్టికాయలు మొడుతుంటాడు. దాంతో, దోవలోకి వస్తాం. చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటాం. నేనూ అందుకు మినహాయింపేమీ కాదు.

దర్శకుడు కొరటాల శివతో మీ నెక్స్ట్‌ఫిల్మ్‌కి ‘జనతా గ్యారేజ్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టినట్లున్నారు?
 ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్ మాత్రం వర్కింగ్ టైటిలే కాదు... ఒక రకంగా కన్‌ఫర్మ్డ్ టైటిల్ కూడా! అక్కడ ఫోన్లు, కార్ల దగ్గర నుంచి అన్ని రిపేర్లూ ఉంటాయి (నవ్వులు...)

గెటప్‌తో సహా మళ్ళీ పూర్తిగా మారిపోనున్నారా?
 (నవ్వేస్తూ...) శివ దగ్గర చాలా ఆలోచనలున్నాయి. చాలా చేయాలనుంది. ఏం చేస్తామో తెలీదు. ‘నాన్నకు ప్రేమతో...’ రిజల్ట్ బట్టి అంతా ఉంటుంది.

వి.వి. వినాయక్‌తో ‘అదుర్స్-2’ లాంటిదేదో చేయాలనుకున్నట్లున్నారు!
అవును. నాకు కూడా డెఫినెట్‌గా ‘అదుర్స్-2’ లాంటిది చేయాలనుంది. అన్నీ కుదరాలి.

 రాజమౌళితో మళ్ళీ సినిమా మాటేమిటి?
 రాజమౌళితో నా సినిమా ఎప్పుడనేది ఆయన ఛాయిసే! అయినా, మాతో సినిమాలు చేస్తూ ఆయన ఇక్కడే చిక్కుపడిపోకూడదని నా భావన. ‘క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్’ సినిమా ఎలాగైతే హాలీవుడ్‌లో ఏషియన్ సినిమాలకు ఒక కొత్త మార్కెట్ తెచ్చిందో, అలాంటి సినిమాలు ఆయన చేయాలి. ఆయనకు ఆ సత్తా ఉంది. ఐ వాంట్ హిమ్ టు డు ఇట్!

 ఇంతకీ, పెద్ద ఎన్టీయార్ వారసుడిగా పౌరాణికాలు చేయడానికి మీరింకా ఎందుకు ఆలోచిస్తున్నారు?
 నిజం చెప్పాలంటే, ఇవాళ పౌరాణికాలు ఎవరు చేస్తారో కూడా తెలియడం లేదు. పైగా, మంచి స్క్రిప్ట్స్ కూడా బాగా వర్కౌట్ చేయాలి. ఇవాళ అలాంటి చిత్రాలు తీసేవాళ్ళంటే ఆ తరంలో సింగీతం శ్రీనివాసరావు గారు, తర్వాత సీనియరైన కె. రాఘవేంద్రరావు గారు లాంటి ఒకరిద్దరే ఉన్నారు. పైగా, నేను ఏది చేసినా పెద్దాయన ఎన్టీఆర్‌తో పోలుస్తారు. అందుకని అది అంత ఈజీ కాదు. ఒక్కముక్కలో నేను పెద్దాయనకు వారసుణ్ణి కాదు. వారసుణ్ణని ఎప్పుడూ అనుకోను. నేను ఆయన అభిమానిని. మనుమణ్ణి. అదొక్కటీ చాలు.

మునుపటితో పోలిస్తే, మీరు మారినట్లు కనిపిస్తున్నారే!
 యస్. ఐ హ్యావ్ ఛేంజ్డ్ ఎ లాట్! మా అబ్బాయి అభయ్‌రామ్ పుట్టాక చాలా మారా. అంతకు ముందు చాలా హైపర్‌గా ఉండేవాణ్ణి. పెళ్ళయి, పిల్లాడు పుట్టాక కుదురు వచ్చింది. మరింత ఫోకస్డ్‌గా మారాను. పిల్లాడి మీద నా ప్రేమ, వాడితో ఆటపాటలు హెల్పయ్యాయి. అలాగే, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని పాత్ర పోషణ కూడా ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా నన్ను మార్చింది. మా నాన్న గారిని ఇప్పుడు ఇంకోలా చూడడం మొదలుపెట్టాను. అలాగే, అన్నయ్యని కూడా! నిజం చెప్పాలంటే, మనుషుల్ని కొత్తగా చూసున్నా. ఈ సినిమా నా పర్సనల్ లైఫ్‌కు బాగా హెల్పయింది. ఇంకా అవుతుంది. అందుకే, ఈ సినిమాను మర్చిపోలేను.

 ఇంతకీ నాన్న గారి నుంచి మీరు నేర్చుకున్న గుణమేంటి? నేర్చుకోకూడదనుకుంటున్నదేంటి?
 రెండిటికీ జవాబు - నిజాయతీనే! నిజాయతీ నేర్చుకున్నాను కానీ, ఈ రోజున్న సమాజంలో ఆయనలా నిజాయతీగా, ముక్కుసూటిగా, ఎమోషనల్‌గా మాట్లాడితే అర్థం చేసుకొనేవారు లేరు.

కష్టపడి మిమ్మల్ని ఇంతవాణ్ణి చేసిన మీ అమ్మ గారు శాలినికి ఈ క్షణంలో ఏమైనా చెప్పాలని ఉందా?
 అమ్మకు ఏమీ చెప్పనక్కర్లేదు. నేను హ్యాపీగా ఉంటే, మా అమ్మ హ్యాపీగా ఉంటుంది. ఒక్క మాటలో అందరు అమ్మలూ గొప్పే! నాకు మా అమ్మ ఇంకా గొప్ప!

మరి, మీ ఆవిడ మాటేమిటి?
 మా ఆవిడ ప్రణతి వచ్చాక నా జీవితం చాలా మారింది. నా జీవితనౌకకు ఆమే లంగరు. నన్ను కుదుటపరిచింది. నా జీవితంలో వచ్చిన ఈ అందమైన మార్పుకు మా ఆవిడే కారణం. మా ఆవిడ ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా! తనవే కాదు, నా వర్కౌట్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుంది. అందరి సినిమాలూ చూస్తుంది. అలాగే, సినిమా నటుడిగా నా జీవితంలో ఉండే కష్టసుఖాలను అర్థం చేసుకుంటుంది.

మీ అబ్బాయి అభయ్‌రామ్‌తో ఎలా గడుపుతుంటారు?
 మా అమ్మకు నేను ఒక్కణ్ణే. చెల్లెలుంటే బాగుండేదని ఎప్పుడూ అనుకొనేవాణ్ణి. అందుకే, ‘కూతురు పుట్టాలి... కూతురు పుట్టాలి’ అని ఉండేది. కూతురు పుడితే మా అమ్మ పేరే ‘శాలిని’ అని పెడదామనుకున్నా. కానీ, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు వాడికే ఆడపిల్లల డ్రెస్‌లు వేసి, అలా అలంకరణ చేసి ఆనందిస్తుంటాం. మా వాడి వయసు నిండా ఏడాదిన్నర లేదు. నడుస్తాడు. ఇప్పుడిప్పుడే జంప్ చేయడం నేర్చుకుంటున్నాడు. మాటలు వచ్చాయి. వాడికి వచ్చిన మొదటి మాటే - నాన్న. వాడు భయంకరమైన నాన్న పిచ్చోడు! నేను బయటకు వెళుతున్నానంటే, నా చెప్పులు పట్టుకొని వస్తాడు. నాన్న కారేది, అమ్మ కారేది, నాయనమ్మ కారేది అంటే అన్నీ చూపిస్తాడు. ‘మరి, నీ కారేది’ అంటే, అన్నీ చూపిస్తాడు.

మీకున్నది కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్. ఎదుటివారిలో ఏది నచ్చి, మీరు స్నేహం చేస్తారు?
 నన్ను నన్నుగా చూడడం నాకు నచ్చుతుంది. మూడో తరగతి నుంచి క్లాస్‌మేట్ అయిన స్నేహల్, అలాగే ఆ తరువాత అవినాశ్, సినిమాల్లోకి వచ్చాక రాజీవ్ కనకాల, రాఘవ - ఇలా కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. లండన్‌లోని నా ఫ్రెండ్ స్నేహల్ కొన్నిసార్లు నా మీద ఒక దెబ్బ వేస్తాడు కూడా! ఆ మధ్య ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్‌కు వెళ్ళినప్పుడు నాకు లాగి, ఒకటిచ్చాడు. ఇప్పటికీ ఇంట్లో మంచైనా, చెడైనా వాడు, నేను ఒకరికొకరు చెప్పుకుంటాం. స్వతహాగా నేను హైపర్ కాబట్టి, అందరి మీదా అధికారం చలాయిస్తాను. వాళ్ళూ భరిస్తారు. మాలో మేము ఎన్ని అనుకున్నా, మాది విడిపోని బంధం.

మీ సొంత అన్నయ్యలతో బంధం మాటేమిటి?
 ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది గుర్తులేదు కానీ, మేము చాలా సన్నిహితులమయ్యాం. గడచిన రెండేళ్ళుగా మా మధ్య అద్భుతమైన బంధం ఏర్పడింది. ఇవి మా అనుబంధంలోని బెస్ట్ ఇయర్స్. మా కుటుంబంలో ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని, లేనిపోనివి చెప్పడం వల్ల బంధాలు చెడిపోతాయి.

ఇలాంటి టైమ్‌లో పెద్దన్నయ్య జానకీరామ్ ప్రమాదవశాత్తూ చనిపోవడం...
 (మధ్యలో అందుకుంటూ...) చాలా బాధ అనిపించింది. మరునాడు ‘పటాస్’ ఆడియో జరగాలి. పని మీద ఊరెళ్ళి వస్తానన్నవాడు ఆ రోజు సాయంత్రం శవమై వచ్చాడు. నిజానికి, ఆ రోజు పొద్దున్న 8 గంటలకే కల్యాణ్‌రామ్ అన్నయ్య మా ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట దాకా మాట్లాడుకున్నాం. మళ్ళీ సాయంత్రం కలుసుకున్నాం. ఇంతలో ఈ దుర్వార్త. ఆ బాధ నుంచి మా కుటుంబం బయటపడడం చాలా కష్టమైంది.

కొన్నేళ్ళ క్రితం మీకు జరిగిన రోడ్డు ప్రమాదం, తరువాత మీ అన్నయ్య మరణం - ఇలాంటి వాటితో మీకు ఏమనిపిస్తోంది?
 ఉన్నది ఒకటే జీవితం. దాన్ని ఆనందంగా జీవిద్దాం. లేనిపోనివి పెట్టుకొని, అదీ ఇదీ అనుకుంటూ మనసునూ, జీవితాన్నీ పాడుచేసుకోకూడదు.  తుచ్ఛమైన వాటి గురించి ఆలోచించే కన్నా, ఉచ్చమైన వాటి గురించి పాటుపడాలి. మన కుటుంబంతో అద్భుతమైన క్షణాల్ని తీర్చిదిద్దుకుంటూ, ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలి. అదే జీవిత సారాంశం.
 
 - రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement