నందమూరి ఫ్యామిలీ 'వార్'
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తమ కుటుంబం మధ్య ఎలాంటి విబేధాలు లేవని తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా..... బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం వేదికగా అన్నదమ్ముల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. బాలయ్య ఇంట శుభకార్యానికి ఆయన సోదరుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది.
అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ వివాహానికి హాజరయ్యారు. మరోవైపు అసలు జూనియర్ ఎన్టీఆర్కు వివాహ ఆహ్వానం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ల మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఎన్టీఆర్కు పెళ్లిపిలుపు అందలేదన్న చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను పెళ్లికి పిలవనందునే హరికృష్ణ కూడా ఈ వివాహా కార్యాక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజస్విని వివాహ వేడుకను జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో టీవీలో వీక్షించినట్లు సమాచారం.
ఇక హరికృష్ణ, బాలకృష్ణల మధ్య విబేధాలు చోటు చేసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత బాలయ్య, బాబుల దోస్తీ మరింత బలపడింది. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్కు ప్రాధాన్యత ఇవ్వని విషయంలో ఏర్పడిన విబేధాలు హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య అంతరం పెంచాయి.
తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు అప్పగించాలనే ప్రయత్నాలతోనే వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా సోదరుడు బాలయ్య భవిష్యత్తులో బావ నుండి పార్టీ బాధ్యతలు తీసుకొని ‘ముఖ్య’ పదవులను అధిష్టించడమో లేక తన అల్లుడు లోకేష్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ చేతికి పగ్గాలు పోతే పార్టీ తన చేతుల్లోకి రావడం కుదరదని భావించి పార్టీలో పట్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ మధ్యకాలంలో బాలయ్య,ఎన్టీఆర్లు కొన్ని వేదికలపై కలిసి కనిపించినా, తదుపరి కాలంలో మళ్లీ అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఆ కారణంగానే జూనియర్ తన మావయ్య, బాబాయ్‌ల పైన అసంతృప్తితోనే ఉన్నారనే ప్రచారం జరిగింది.
వీటికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ....రాజకీయాల్లోకి వచ్చేంత వయసు తనకు రాలేదని.... ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇటీవల ఈ విభేదాలు సద్దుమణగినట్లు కనిపించినా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ రాజకీయాలకు పదును పెడుతూనే ఉన్నారని తెలుస్తోంది. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ వ్యూహం, తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకోవాలనే తపన వెరసి ప్రస్తుతం నందమూరి కుటుంబంలో ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమని తెలుస్తోంది.
అంతే కాకుండా తెలంగాణ విషయంలో పార్టీ అధ్యక్షుడు, బావ చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ బహిరంగంగానే లేఖాస్త్రాలు సంధించారు. సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చైతన్య రథయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.