
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడు అని పేరు ఉంది. ఈ క్రమంలోనే నెల్లారు జిల్లా కావలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున స్వయంగా వాహనం నడుపుతూ బయలుదేరి వెళ్లారు.
ఇంతలో జరిగిన తాజా విషాదం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. నందమూరి అభిమానులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఎంతో ఇష్టమైన డ్రైవింగే.. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, 2009లో నల్లగొండ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుప్రమాదంలో గాయాలపాలై.. అదృష్టవశాత్తు బయటపడ్డారని, నాలుగేళ్ల కిందట హరికృష్ణ తనయుడు జానకీరామ్ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హరికృష్ణ సైతం రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారని అభిమానులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment