సాక్షి, హైదరాబాద్ : ఈ మధ్య విడుదలైన నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వచ్చే వాయిస్ ఓవర్ వినే ఉంటారు. ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మా ప్రియ సోదరున్ని కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అనే మాటలు వినిపిస్తాయి. కానీ అతివేగమే నందమూరి కుటుంబం పాలిట శాపమవుతోంది. హరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే వారి ఇంట మూడు యాక్సిడెంట్లు జరిగాయి. జూ ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఈ రోడ్డు ప్రమాదాల పరంపర నందమూరి హరికృష్ణ మరణం వరకూ కొనసాగింది. ఓ సారి ఆ ప్రమాదాల వివరాలు..
2009 నుంచి ప్రారంభం..
నందమూరి ఇంట తొలి రోడ్డు ప్రమాదం 2009లో చోటు చేసుకుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూ. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్ ఖమ్మంలో ప్రచారం నిర్వహించి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం మోతే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూ. ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడినా.. సురక్షితంగా బయటపడ్డారు.
నాలుగేళ్ల క్రితం జానకీరామ్ దుర్మరణం..
నాలుగేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.
నాడు కుమారుడు.. నేడు తండ్రి
ఈ రోజు ఉదయం నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నెల్లూరులో ఓ వివాహానికి వెళ్తున్న హరికృష్ణ స్వయంగా తానే వాహనం నడిపారు. ఈ సందర్భంగా అతి వేగంగా దూసుకెళ్లిన హరికృష్ణ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ కారులోంచి ఎగిరి 30 అడుగుల దూరంలో పడ్డారు. తీవ్ర గాయల పాలైన ఆయన కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే నందమూరి వారి ఇంట జరిగిన యాక్సిడెంట్లు అన్ని నల్గొండ జిల్లాలోనే జరగడం గమనార్హం. మరో ఆసక్తికర అంశం ఏంటంటే నాడు జానకీరామ్ వాహనం నెంబర్.. నేడు హరికృష్ణ ప్రయాణం చేసిన వాహనం నంబర్లు రెండు కూడా ఒక్కటే (AP 29 BD 2323) కావటం విశేషం.
సంబంధిత కథనాలు...
ఇష్టమైన డ్రైవింగే.. విషాదం నింపింది!
ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు!
Comments
Please login to add a commentAdd a comment