అబ్బాయి 'ట్వీట్'ని బాబాయ్ స్వీకరిస్తారా?
నందమూరి ఫ్యామిలీలో నెలకొన్న నిశ్శబ్దాన్ని చాలా రోజులకు జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. గత కొంతకాలంగా బాబాయ్కి దూరంగా ఉన్న అబ్బాయ్.... ట్విట్టర్ ద్వారా పలకరించాడు. నాలుగు రోజుల క్రితం ఓ షూటింగ్లో నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య బైక్ మీదనుంచి జారిపడటంతో స్వల్పంగా గాయపడ్డాడు. దాంతో బాలయ్య ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అది కూడా ట్విట్వర్ వేదికగా.
ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ... 'అభిమానులు కంగారుపడొద్దు, బాబాయ్ క్షేమంగా ఉన్నాడు' అని ట్వీట్ చేశాడు. మళ్లీ సింహం గర్జిస్తుందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూ.ఎన్టీఆర్ విష్ చేశాడు. అయితే ఇద్దరు హైదరాబాద్లో ఉన్నా.... జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బాబాయ్ని కలిసి ఆరోగ్యంపై ఆరా తీయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే పలకరించటం విశేషం. ఇటీవలి కాలంలో నందమూరి ఫ్యామిలీ ఒకటిగా కనిపించిన దృశ్యాలు అరుదనే చెప్పుకోవచ్చు.
ఇక నందమూరి కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవకాశం ఉన్నప్పుడల్లా తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా అవి చిలకపలుకుల్లాంటివే. ఇటీవలి జరిగిన ఎన్నికలు నందమూరి ఫ్యామీలి మధ్య విభేదాలు తారాస్థాయికి తీసుకు వెళ్లాయి. తండ్రి హరికృష్ణను చంద్రబాబు పక్కనపెట్టి... బాబాయ్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో పాటు... పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో హరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కినుక వహించారు. దాంతో ఎన్నికల ప్రచారానికి కూడా వారు దూరంగా ఉన్నారు. పిలిస్తే తాను పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
ఇదే విషయమై బాలకృష్ణ స్సందిస్తూ 'ప్రచారం చేయాలని ఎవ్వరినీ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇదేమి ఇంట్లో పెళ్లికాదు' అని వ్యాఖ్యానించిన తెలిసిందే. అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీలో వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా బాబాయ్ ఆరోగ్యంపై జూనియర్ స్పందించటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రభస త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో... బాబాయ్తో పాటు అభిమానులకు చేరువ కావటానికి... జూనియర్ ప్రయత్నిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రభస ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అబ్బాయ్ ఒంటరిగానే కనిపించాడు. మరి అబ్బాయి 'ట్వీట్' పలకరింపును బాబాయ్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఇక గాయపడిన బాలయ్యను చంద్రబాబు స్వయంగా వెళ్లి పలకరించటం కొసమెరుపు.