అందుకే మాట్లాడటం మానేశాం : ఎన్టీఆర్‌  | NTR Emotional Speech at Aravinda Sametha Pre Release Event | Sakshi
Sakshi News home page

మా జీవితం మీకు అంకితం : ఎన్టీఆర్‌ 

Published Wed, Oct 3 2018 12:11 AM | Last Updated on Wed, Oct 3 2018 8:06 PM

NTR Emotional Speech at Aravinda Sametha Pre Release Event - Sakshi

‘‘త్రివిక్రమ్‌గారితో సినిమా చేయాలన్నది నా 12 ఏళ్ల కల. ఆయన ‘నువ్వే నువ్వే’ సినిమా తీయక ముందు నుంచి కష్టసుఖాలు మాట్లాడుకునేంత దగ్గర మిత్రుడు. ఎందుకు మా ఇద్దరికీ సినిమా కుదరట్లేదు అని చాలాసార్లు అనుకున్నా’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. మమత సమర్పణలో ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘బహుశా నా జీవితంలో నెలరోజుల కిందట జరిగిన సంఘటన (తండ్రి హరికృష్ణ మృతి) ఈ చిత్రంతో ముడిపడి ఉందేమో. ఆయనతో (త్రివిక్రమ్‌) సినిమా మొదలు పెట్టిన తర్వాతే.. నెలరోజుల కిందట జరిగిన సంఘటన తర్వాతే.. బహుశా నాకు జీవితం విలువ అర్థం అయింది. ఈ సినిమా తాత్పర్యం ఒక్కటే. ‘వాడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు.. కానీ యుద్ధం ఆపేవాడే మగాడు.. వాడే మొనగాడు..’. జీవితమంటే కొట్టుకోవడం.. తిట్టుకోవడం కాదు.. బతకడం. ఎలా బతకాలో చెప్పే చిత్రం ‘అరవిందసమేత వీరరాఘవ’.

మనిషిగా పుట్టినందుకు ఎంత హుందాగా, ఎంత ఆనందంగా, అస్సలు మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రమిది. ఒక మగాడి పక్కన ఆడదానికంటే బలం ఇంకోటి ఏదీ ఉండదు. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే.. జీవితం విలువ తెలుసుకోవడానికే.. నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఇప్పుడు ఆయనతో (త్రివిక్రమ్‌) ఈ సినిమా చేయించాడేమో. చాలా థ్యాంక్స్‌ స్వామీ. 12 ఏళ్ల ప్రయాణంలో ఓ స్నేహితుణ్ణి, ఓ దర్శకుణ్ణి చూశా.. ఈ సినిమా ముగిసేలోపు ఓ ఆత్మబంధువుని చూశా. రేపు నాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా మీ అందరితో పాటు నాతో నిలబడేవాడే మా త్రివిక్రమ్‌. ఈ చిత్రం తప్పకుండా నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలు ఏ దర్శకుడూ నాకు పెట్టలేదు. కానీ, ఈ చిత్రంలో అది యాధృచ్చికమో, అలా జరిగిందో తెలీదు.. మనం అనుకునేది ఒకటి.. పైనవాడు రాసేది ఇంకోటి. ఈ నెలరోజులు నాకు అన్నలాగా, తండ్రిలాగా, మిత్రుడిలాగా తోడుగా ఉన్నాడీయన. థ్యాంక్స్‌ స్వామీ (త్రివిక్రమ్‌).

కొన్ని బంధాలు కలిసినప్పుడు వాళ్ల ప్రయత్నం సక్సెస్‌ అయితే ఆ బంధం ఇంకా గట్టిపడిపోతుందని అంటారు. ఈ బంధాన్ని మా నాన్నగారు (హరికృష్ణ) చూస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించేలా చేసి, మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారని నమ్ముతున్నా. ఈ సినిమాకి తమన్‌ ప్రాణం పెట్టాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ అయినప్పుడు.. చాలామంది ‘ఎన్టీఆర్‌ మాస్‌ హీరో కదా.. డ్యాన్సులుండే పాటలు లేవేంటి?’ అని అడిగారు. నటనలో భాగం డ్యాన్స్‌ మాత్రమే తప్ప.. డ్యాన్స్‌లో భాగం నటన కాదు.. అలాంటి ఓ నటుడి కోసం త్రివిక్రమ్‌ రాసిన ఓ చిత్రానికి పూర్తిగా తమన్‌ తప్ప వేరే ఇంకెవరూ న్యాయం చేయలేరు. థ్యాంక్స్‌ తమన్‌. ఈ సినిమాలో ప్రతి పాట ఓ సందేశాన్ని ఇస్తుంది. అలాంటి గొప్ప పాటలు రాసిన మా గురువుగారు సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రిగార్లకు ధన్యవాదాలు. నాకు–త్రివిక్రమ్‌కి మధ్యలో ఫ్రెండ్‌షిప్‌కి ఓ పిల్లర్‌ ఉంది.. మా రాధాకృష్ణగారు. ఓ సినిమా గురించి నిర్మాత ఎంత తాపత్రయ పడతాడో నేనెప్పుడో విన్నా. చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా చూశా. సినిమా ఎలా తీయాలి. ఎంత బాగా రావాలి? అని అనలైజ్‌ చేసే తక్కువమందిలో రాధాకృష్ణగారు ఒక్కరు.



కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ– ‘‘నెలకిందట ఓ సంఘటన జరిగింది (హరికృష్ణ మరణం). అది జరిగినప్పుడు చాలామంది సినిమా అనుకున్న తేదీకి రిలీజ్‌ కాదేమో? అనుకున్నారు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పారు. అవి మీతో పంచుకుందామనుకుంటున్నా. 1962లో పొద్దున్నే మేకప్‌ వేసుకుని షూటింగ్‌ వెళ్లిన మా తాతగారు, మనందరి అన్నగారు (తారక రామారావు) షూటింగ్‌లో ఉండగా ఆయన పెద్దకొడుకు, మా పెదనాన్న నందమూరి రామకృష్ణ చనిపోయారని తెలిసింది. ఏ తండ్రైనా తట్టుకుంటాడా? కానీ నిర్మాతకి నష్టం రాకూడదని రోజంతా షూటింగ్‌ చేసి అప్పుడెళ్లారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అదే వృత్తి ధర్మం. 1976లో తాతగారు షూటింగ్‌లో ఉండగా మా ముత్తాతగారు (లక్ష్మయ్య చౌదరి) శంషాబాద్‌ నుంచి ఇంటికొస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికి, నిర్మాతకి ఇచ్చే గౌరవంతో ఆ రోజు షూటింగ్‌ పూర్తి చేసి వెళ్లారు. 1982లో మా బాలయ్య బాబాయ్, రామకృష్ణ బాబాయ్‌ల పెళ్లి.. నెల రోజుల్లో ఎలక్షన్స్‌ ఉండటంతో ఆ ప్రచారంలో ఉన్న తాతగారు పెళ్లికి కూడా రాలేదు. ఎందుకంటే.. ప్రజలకి సేవ చేయాలి అనుకున్నారు కాబట్టి, అది వృత్తి ధర్మం అని నమ్మారు కాబట్టి. ఆయన పనికి ఇచ్చిన గౌరవం అది.

నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను అని వాళ్ల అమ్మకిచ్చిన మాట కోసం నాన్నగారు (హరికృష్ణ).. వారి తండ్రిని (ఎన్టీఆర్‌) ఆఫీస్‌ బాయ్‌గా, చైతన్య రథ సారధిగా ఆయన వెన్నంటి ఉండి కొడుకు కర్తవ్యాన్ని నెరవేర్చారు. 2018 ఆగస్టు 29. మా ఇంట్లో కూడా ఓ సంఘటన (హరికృష్ణ మృతి) జరిగింది. అది జరిగినప్పుడు ‘అరవింద సమేత’ షూటింగ్‌ నెలరోజులే బ్యాలెన్స్‌ ఉంది. సమయానికి రిలీజ్‌ అవ్వుద్దా? అనుకున్నారు. కానీ, నిర్మాత బాగుండాలి.. మనమిచ్చిన మాట నిలబడాలి.. అని ఐదో రోజే తమ్ముడు షూటింగ్‌కి వెళ్లి నాన్‌స్టాప్‌గా రేయి, పగలు కష్టపడ్డాడు. నాన్నా.. ‘నిర్మాత బాగుండాలి.. వృత్తి పట్ల ఏ మాత్రం ఇంట్రెస్ట్‌ కోల్పోకుండా ఉండాలి’ అని మీరు చెప్పిన దోవలోనే నేను, తమ్ముడు నడుస్తాం’’ అన్నారు.  ‘‘త్రివిక్రమ్‌గారు ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సరికొత్త బాణాన్ని తెలుగు ప్రాంతాల మీదికి వదులుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ వైవిధ్యమైన పాత్రలో నటించారు’’ అన్నారు పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘ఈ సినిమా సమయంలో జరిగిన ఒక అతి పెద్ద విషాదం నుంచి అతి తొందరగా కోలుకుని... జీవితంలో కూడా నిజమైన హీరో అని నిరూపించుకున్న ఎన్టీఆర్‌కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు’’ అన్నారు త్రివిక్రమ్‌. నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, ‘దిల్‌’ రాజు, పీడీవీ ప్రసాద్, నాగవంశీ ఎస్, సంగీత దర్శకుడు తమన్,  జగపతిబాబు, సునీల్, ఈషా, రామజోగయ్యశాస్త్రి   పాల్గొన్నారు. 

అందుకే మాట్లాడటం మానేశాం
నెల రోజులుగా మేమిద్దరం (కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌) మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే.. మనిషి బతికున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయాక విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. నాన్నగారు బతికున్నంతవరకూ.. ‘నాన్నా.. మనం ఏదో చాలా గొప్పో అని కాదు. ఓ మహానుభావుడి కడుపున నేను పుట్టాను.. నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అందర్నీ మోసుకెళ్లేది వీళ్లే (ఫ్యాన్స్‌). బతికున్నంతవరకూ అభిమానులు జాగ్రత్త. మనం వాళ్లకోసం ఏమీ చేయకపోయినా వాళ్లు మన కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు’ అని ఎన్నిసార్లు అన్నారో నాకు తెలుసు. ఈ ఒక్క సినిమా చూడ్డానికి ఆయన ఉండుంటే బాగుండేది. చాలా ఫంక్షన్స్‌లో తాతగారి బొమ్మ చూసేవాణ్ణి. కానీ, నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని ఊహించలేదు. మా నాన్నకు ఇచ్చిన మాటే మీ అందరికీ ఇస్తున్నా ఈ రోజు. మా జీవితం మీకు అంకితం’’ అన్నారు.  


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement