సాక్షి, నక్కపల్లి/పాయకరావుపేట: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమా టికెట్ల వ్యవహారం నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ సినిమా నేడు (గురువారం) విడుదల కానుంది. పాయకరావుపేటలో సాయిమహల్ థియేటర్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. పట్టణంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సినిమాలు విడుదలైతే నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను హడావుడి చేస్తుంటారు.
వీరిద్దరూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే. అయితే రాంబాబు కొద్దిరోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వనాధుల శ్రీను ఇటీవలే వైఎస్సార్ సీపీలో చేరారు. అయినా నందమూరి హీరోలపై అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ‘అరవింద సమేత’ మొదటి షో అభిమానులే చూడాలన్న ఆశతో రాంబాబు, శ్రీను అభిమానులను వెంటబెట్టుకుని టికెట్ల కోసం వెళ్లారు. అయితే థియేటర్ మేనేజర్.. మీరు వైఎస్సార్‌సీపీకి చెందినవారు కావడంతో టికెట్లు ఇవ్వొద్దని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పారని కాబట్టి టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
థియేటర్ వద్ద ఫ్లెక్సీలు తొలగించి కిందపడేసిన అభిమానులు
పార్టీలు వేరైనా తాము నందమూరి అభిమానులమేనని, తమకు టికెట్లు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి తమ అభిమాన నటుడి సినిమాకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టామని, తమకే టికెట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. సినిమా టికెట్లలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిత హయాంలోనే ఇలా జరుగుతోందని చెప్పారు. అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకే టికెట్లు అమ్ముకోండి.. వారే సినిమా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (అందుకే మాట్లాడటం మానేశాం : ఎన్టీఆర్)
తమకు టికెట్లు ఇవ్వనప్పుడు తాము కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎందుకంటూ వాటిని తొలగించారు. థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారు. ఉదయం ఎమ్మెల్యే అనిత టికెట్లు ఇవ్వొద్దన్నారని చెప్పిన మేనేజర్ సీతారామ్ సాయంత్రానికి మాటమార్చి తాను ఎమ్మెల్యే పేరు ప్రస్తావించలేదని మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఇవ్వొద్దన్నారని మాత్రమే చెప్పానన్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ సభ్యులంతా వైఎస్సార్‌సీపీకి చెందినవారని వారికి టికెట్లు ఇవ్వద్దని చెప్పినట్లు వెల్లడించారు. (ప్రొఫెషనల్ బ్రదర్స్)
Comments
Please login to add a commentAdd a comment