nandamuri fans
-
‘అరవింద సమేత’కు టీడీపీ చిచ్చు
సాక్షి, నక్కపల్లి/పాయకరావుపేట: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమా టికెట్ల వ్యవహారం నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ సినిమా నేడు (గురువారం) విడుదల కానుంది. పాయకరావుపేటలో సాయిమహల్ థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. పట్టణంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సినిమాలు విడుదలైతే నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను హడావుడి చేస్తుంటారు. వీరిద్దరూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే. అయితే రాంబాబు కొద్దిరోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశ్వనాధుల శ్రీను ఇటీవలే వైఎస్సార్ సీపీలో చేరారు. అయినా నందమూరి హీరోలపై అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ‘అరవింద సమేత’ మొదటి షో అభిమానులే చూడాలన్న ఆశతో రాంబాబు, శ్రీను అభిమానులను వెంటబెట్టుకుని టికెట్ల కోసం వెళ్లారు. అయితే థియేటర్ మేనేజర్.. మీరు వైఎస్సార్సీపీకి చెందినవారు కావడంతో టికెట్లు ఇవ్వొద్దని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పారని కాబట్టి టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ వద్ద ఫ్లెక్సీలు తొలగించి కిందపడేసిన అభిమానులు పార్టీలు వేరైనా తాము నందమూరి అభిమానులమేనని, తమకు టికెట్లు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి తమ అభిమాన నటుడి సినిమాకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టామని, తమకే టికెట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. సినిమా టికెట్లలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిత హయాంలోనే ఇలా జరుగుతోందని చెప్పారు. అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకే టికెట్లు అమ్ముకోండి.. వారే సినిమా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (అందుకే మాట్లాడటం మానేశాం : ఎన్టీఆర్) తమకు టికెట్లు ఇవ్వనప్పుడు తాము కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎందుకంటూ వాటిని తొలగించారు. థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు థియేటర్ యాజమాన్యంతో మాట్లాడారు. ఉదయం ఎమ్మెల్యే అనిత టికెట్లు ఇవ్వొద్దన్నారని చెప్పిన మేనేజర్ సీతారామ్ సాయంత్రానికి మాటమార్చి తాను ఎమ్మెల్యే పేరు ప్రస్తావించలేదని మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఇవ్వొద్దన్నారని మాత్రమే చెప్పానన్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ సభ్యులంతా వైఎస్సార్సీపీకి చెందినవారని వారికి టికెట్లు ఇవ్వద్దని చెప్పినట్లు వెల్లడించారు. (ప్రొఫెషనల్ బ్రదర్స్) -
పాయకరావుపేటలో నందమూరి అభిమానుల ఆందోళన
-
అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..
తిరుపతి: నందమూరి అభిమానులు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం విడుదల సందర్భంగా పేద విద్యార్థి చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. తిరుపతికి చెందిన పి. మోహిత్ అనే విద్యార్థికి 9వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లుగా నందమూరి ఫ్యాన్స్ డాట్ కాం ద్వారా ఆర్థిక సాయం అందించి చదివిస్తున్నామని తెలిపారు. ‘తుడా’ చైర్మన్ జి. నరసింహ యాదవ్ చేతుల మీదుగా ఆ విద్యార్థికి ఫీజు నిమిత్తం రూ. 17వేల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ అభిమానులు పి. మనోహర్‌రెడ్డి, కేపీ. చౌదరి మాట్లాడుతూ.. గతంలో చిత్రం విడుదల సమయంలో ఫ్లెక్సీలు కట్టి, బాణ సంచాలు కాల్చి సంబరాలు జరుపుకునే వారమని చెప్పారు. ఈ సంబరాల కన్నా పేద విద్యార్థులను చదివించేందుకు తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కారక్రమంలో పలువురు నందమూరి అభిమానులు పాల్గొన్నారు. -
ఫ్యాన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో షూట్
నటీ నటులకు అభిమానులే కొండంత అండ. అభిమానుల అభిమానానికి ఖరీదు కట్టడం ఎవరివల్లా కాదు. అభిమానులు హీరోలపై తమ అభిమానాన్ని చాటుకోవటానికి ప్రాణాలు సైతం పణంగా పెడతారంటే అతిశయోక్తి కాదేమో. అయితే వారు తమ అభిమాన హీరో నుంచి ఏం కోరుకుంటారు. కుదిరితే దగ్గరగా చూడాలని, ఓ మాట మాట్లాడాలని వీలైతే ఫోటో దిగాలనేది వారి కోరిక. 'అభిమానుల ఆశీస్సులే తమకు శ్రీరామ రక్ష' అని హీరోలు వేదికలపై చెప్పటం సాధారణమే. అసలు విషయానికి వస్తే కష్టకాలంలో కూడా తన వెంటే ఉన్న అభిమానుల కోసం ఏదైనా చేయాలనీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఇటీవల ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోతున్నాయి . అయినా అభిమానులు తమ అభిమాన హీరోపై ఆదరాభిమానాలు చూపిస్తూ వస్తున్నారు. ఫిల్మ్ నగర్ కథనాల ప్రకారం ఎన్టీఆర్ అభిమానులతో స్పెషల్ 'ఫోటో షూట్' ప్లాన్ చేశాడట. అతి త్వరలో అభిమానులతో ఓ భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాట. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్‌కు కాలం కలిసి రావటం లేదనే చెప్పాలి. అతడు నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతేకాకుండా గత కొంతకాలంగా నందమూరి ఫ్యాన్‌తో పాటు, టీడీపీ యూత్ కూడా జూనియర్ కు దూరంగా ఉంటున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, మామ చంద్రబాబుతో పాటు బాబాయి బాలయ్యతో కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన ప్రచారంలో కూడా పాల్గొనలేదన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఎన్టీఆర్ సినిమాలపై బాగా పడినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జూనియర్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.