అరవింద సమేత.. నాన్‌–బాహుబలి రికార్డు! | Special story to Dussehra telugu movies 2018 | Sakshi
Sakshi News home page

సినిమా దసరా

Published Thu, Oct 18 2018 12:01 AM | Last Updated on Thu, Oct 18 2018 11:39 AM

Special story to Dussehra  telugu movies 2018 - Sakshi

అరవింద ఆల్రెడీ మెప్పించింది.. పండగ మార్కులు కొట్టేసింది.ఈ రోజు మరో రెండు సినిమాలకు తోరణాలు రెడీ అయ్యాయి. అభిమానులకు ఇంతకు మించి పండగ ఏముంటుంది? మూడు సినిమాలు!  ఒకటి హిట్టు, రెండు మంచి టాపిక్‌. ఎంజాయ్‌ ది సినిమా దసరా. 

కుటుంబ సమేతంగా...
‘కడప కోటిరెడ్డి సర్కిల్‌ నుండి పులివెందుల పూల అంగళ్ల దాక .. కర్నూల్‌ కొండారెడ్డి బురుజు నుండి అనంతపూర్‌ క్లాక్‌ టవర్‌ దాకా.. బళ్లారి గనుల నుండి బెలగావ్‌ గుహల దాకా తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’... పవర్‌ఫుల్‌ డైలాగ్‌.‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు లేదు’.. అర్థవంతమైన డైలాగ్‌.. ‘పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా’ ఆలోచింపజేసే డైలాగ్‌... ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈ డైలాగ్స్‌ చాలు.. ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్పేయడానికి. హీరో అంటే విలన్‌తో హోరాహోరీగా తలపడాలి. ఫర్‌ ఎ చేంజ్‌ ‘శాంతి’ మార్గం అంటే.. పైగా ఎన్టీఆర్‌ లాంటి మాస్‌ హీరో ఆ మాట అంటే? సినిమా చప్పగా ఉంటుంది. కానీ హీరోతో ఆ మాట అనిపించి, అభిమానులకు కావాల్సిన యాక్షన్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్‌. అందుకే ‘అరవింద సమేత వీర రాఘవ’ భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. దసరా పండగకి వారం ముందే ఈ సినిమా విడుదలై, ఎన్టీఆర్‌ అభిమానులకు పండగని ముందే తెచ్చింది. దాదాపు 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్లను ‘సేఫ్‌ జోన్‌’లో ఉంచుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్‌ నటన, త్రివిక్రమ్‌ డైలాగ్స్, టేకింగ్‌.. అన్నీ కుదిరిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాబట్టి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తున్నారని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం విడుదలైన ఈ సినిమా ఈ మంగళవారం సెకండ్‌ షో కలెక్షన్లు వరకూ ట్రేడ్‌ వర్గాలు చెప్పిన ప్రకారం ఈ విధంగా... – ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ కలెక్షన్స్‌ – 115 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన షేర్‌ 55 కోట్లు కాగా వరల్డ్‌ వైడ్‌ షేర్‌ 74 కోట్లు. ఓవర్సీస్‌ 12 కోట్లకు అమ్మితే మంగళవారం వరకు 11కోట్ల 30 లక్షలు రాబట్టింది. నైజాం హక్కులను ‘దిల్‌’ రాజు 18 కోట్లకు కొన్నారు. ఆయన ఫుల్‌ సేఫ్‌లో ఉన్నారట. ఇప్పటికే గుంటూరు, సీడెడ్, వెస్ట్‌ గోదావరి డిస్ట్రిబ్యూటర్లంతా సేఫ్‌ అని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా వైజాగ్, కృష్ణా, ఈస్ట్‌ గోదావరి, నెల్లూరు, కర్ణాటక బయ్యర్లు ఈ శుక్రవారం నుండి లాభాల బాటలో ఉంటారని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఇవే కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను, శాటిలైట్‌ రైట్స్‌ను దాదాపు 45 కోట్లకు అమ్మారట చిత్రనిర్మాతలు. మొత్తం మీద ‘అరవింద సమేత...’ చిత్రబృందానికి దసరా పండగే పండగ.

‘బాహుబలి’ తర్వాత!
‘అరవింద సమేత...’ ఓపెనింగ్‌ వీకెండ్‌ సేల్స్‌లో నాన్‌–బాహుబలి రికార్డును సాధించినట్లు బుక్‌ మై షో నిర్వాహకులు అధికారికంగా పేర్కొన్నారు. ‘‘బుక్‌ మై షోలో ‘అరవిందసమేత’.. చిత్రానికి 12 లక్షల టిక్కెట్స్‌ సేల్‌ అయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఓపెనింగ్‌ వీకెండ్‌ సేల్స్‌ విషయంలో ‘బాహుబలి–2’  తర్వాత ఈ ప్లేస్‌ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానిదే. తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి’’ అని బుక్‌ మై షో ప్రతినిధి పేర్కొన్నారు.

ఇద్దరు మగువల మధ్య...
స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా.. జాయినైన ఫస్ట్‌ డే అందరూ చేసే ఫస్ట్‌ పనేంటో తెలుసా... అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా? అని అమ్మాయిలు. అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా? అని అబ్బాయిలు ఏరుకోవడం. రామ్‌ లాంటి హుషారైన ఓ కుర్రాడు ఇలాంటి డైలాగ్‌ చెప్పాడంటే.. ఇంకా అతను ఎవర్నీ ఏరుకోనట్టే. అదేనండీ.. ప్రేమలో పడనట్టే. కానీ అతను అనుపమా పరమేశ్వరన్‌ని చూసి మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది ఫాలోయింగ్‌ స్టార్ట్‌ చేశాడు రామ్‌. కానీ ఈజీగా పడితే వాళ్లు అమ్మాయిలు ఎందుకు అవుతారు? పైగా అది వాళ్ల హక్కాయే. ఈ లవ్‌ట్రాక్‌ అలా ఉండగానే... రామ్‌ లైఫ్‌లోకి మరో అమ్మాయి ప్రణీత  వస్తుంది. ఈ ఇద్దరి అమ్మాయిల మధ్యలో రామ్‌కి ఓ మిడిల్‌ ఏజ్‌ వ్యక్తి ప్రకాశ్‌రాజ్‌ ఫ్రెండ్‌ అయ్యాడు. కట్‌ చేస్తే.. ఆ ఫ్రెండ్‌ రామ్‌కి మావయ్య అవుతాడట. ఆ మావయ్య కూతురే అనుపమ  అట. అంటే.. విడిపోయిన కుటుంబాలను కలపడం కోసమే అనుపమాను రామ్‌ ప్రేమించాడా? ఏమో.. ఈ రోజు థియేటర్స్‌కి వెళ్లి ‘హలో గురు ప్రేమ కోసమే’ చూస్తే తెలుస్తుంది. ‘నేను లోకల్‌’ ఫేమ్‌ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ఈ చిత్రాన్ని దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ బిజినెస్‌ 28 కోట్లు అయిందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.  ‘హలో..’ కొన్ని డైలాగ్స్‌

‘‘పెళ్లయిన తర్వాత అమ్మాయి లైఫ్‌ అమ్మ అవ్వడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్‌ నాన్న ఉండటం వల్ల బాగుటుంది’’   – అనుపమ‘‘ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’’ – రామ్‌ ‘‘అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా?’’ – ప్రకాశ్‌రాజ్‌‘‘అబద్ధం చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు’’ – రామ్‌ ‘‘గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అనే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి.. మర్చిపోవాలి అని అనుకునే అమ్మాయిని మాత్రం...చచ్చేదాకా మర్చిపోలేం’’  – రామ్‌   
 

పొట్టేల్ని కాదురా... పులివెందుల బిడ్డని
‘‘నీకు దమ్ముంటే పగ తీర్చుకోవడానికి మళ్లీ మా ఊరికి రా.. చూసుకుందాం’’... విలన్‌కి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు హీరో. విలన్‌ కూడా తక్కువోడేం కాదు. పవర్‌ఫుల్లే. మరి.. హీరో ఊరికి విలన్‌ వెళతాడా? పగ తీర్చుకుంటాడా? పందెంలో గెలిచేది ఎవరు? దసరా పండగకి తెలిసిపోతుంది. దసరా బాక్సాఫీస్‌ బరిలోకి పందెం కోడిలా దూసుకొచ్చారు విశాల్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో విశాల్‌ చేసిన మంచి మాస్‌ మాసాలా మూవీ ‘పందెం కోడి’. ఈ సినిమాకి సీక్వెల్‌ ‘పందెం కోడి–2’. పార్ట్‌ 2 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్‌ పార్ట్‌ కథని గుర్తు చేసుకుందాం.హీరో విశాల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, వేరే ఊళ్లో ఉన్న తన ఫ్రెండ్‌ ఇంటికి వెళతాడు. ఆ ఫ్రెండ్‌ చెల్లెలు మీరా జాస్మిన్‌ అందచందాలకు, అల్లరికి పడిపోతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. చుట్టపు చూపుగా వచ్చిన హీరో మళ్లీ తన ఊరికి ప్రయాణం అవుతాడు. కట్‌ చేస్తే.. సరిగ్గా బస్‌ ఎక్కుతున్న సమయంలో ఓ గూండా ఓ వ్యక్తిని చంపడానికి వెంటాడతాడు. అతన్నుంచి ఆ వ్యక్తిని కాపాడి, గూండాని రప్ఫాడిస్తాడు విశాల్‌. అతనెవరో కాదు.. పేరు మోసిన గూండా. ఊరుకుంటాడా? విశాల్‌ వివరాలన్నీ అతని స్నేహితుడి కుటుంబం ద్వారా తెలుసుకుని, అతని ఊరెళతాడు. అక్కడికెళ్లాక తెలుస్తుంది.. విశాల్‌ తండ్రి చాలా పవర్‌ఫుల్‌ అని. అయినా విశాల్‌ కుటుంబాన్ని అంతం చేయడానికి మంచి టైమ్‌ కోసం ఎదురు చూస్తాడు. గుడి ఉత్సవాల్లో ఆ పని పూర్తి చేయాలనుకుంటాడు. ఒకవైపు విలన్‌ ప్లాన్‌లో అతనుంటే మరోవైపు రెండు కుటుంబాలూ మాట్లాడుకుని విశాల్‌కి, మీరా జాస్మిన్‌కి పెళ్లి చేయాలనుకుంటారు. గుడి ఉత్సవాలు రానే వచ్చాయి. విలన్‌ ప్లాన్‌ ఫెయిలవుతుంది. అప్పుడు హీరో.. దమ్ముంటే మళ్లీ మా ఊరు రా అని విలన్‌తో పందెం కాస్తాడు. 13ఏళ్ల క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘పందెం కోడి’ కథ ఇది. ఇప్పుడర్థమైంది కదా.. పార్ట్‌ 2 ఎలా ఉంటుందో? రెండు భాగాలకు లింగుస్వామియే దర్శకుడు. దసరా సందర్భంగా ఇవాళ సినిమా రిలీజవుతోంది. శాంపిల్‌గా రిలీజ్‌ చేసిన ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ ఎలా ఉందంటే..

‘కత్తిని చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డన‘ఏసేస్తా ఏసేస్తా అని చెప్పడం కాదు.. ఏసెయ్యాలి’.‘రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండ్రా’, ‘మగాడు నరికితేనే కత్తి నరుకుద్దనుకుంటున్నావా? ఆడది నరికినా నరుకుద్ది రా’‘మా వంశంలోని చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకూ మేము ఉంటాం’.ఇదండీ ట్రైలర్‌. టీజర్‌లోనూ ఆకట్టుకునే డెలాగ్స్‌ ఉన్నాయి.‘‘పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో, పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో, కుటుంబం మొత్తం చూసే మంచి సెంటిమెంట్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫెస్టివల్‌ ఫీస్ట్‌లా ఉంటుంది’’ అని చిత్రసమర్పకుడు ‘ఠాగూర్‌’ మధు తెలిపారు. విశాల్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 60 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్‌.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 థియేటర్లలో విడుదలవుతోందని ‘పందెం కోడి–2’ యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అప్పట్లో మీరా జాస్మిన్‌ చేసిన అల్లరి అమ్మాయి పాత్రను ‘మహానటి’ ఫేమ్‌ కీర్తీ సురేష్‌ చేయడం విశేషం. అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement