బెంగళూరులో పుట్టి చెన్నైలో పెరిగిన వరలక్ష్మి మైక్రోబయాలజీ, బిజినెస్‌మేనేజ్‌మెంట్ చదువుకుంది. తమిళంలో తన తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి హీరో శరత్‌కుమార్ ముద్దుల తనయ. విశాల్ ‘పందెంకోడి–2’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి కొన్ని ముచ్చట్లు...
లాటిన్ అమెరికా డ్యాన్సర్
నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ముంబైలోని ‘అనుపమ్‌ఖేర్స్ యాక్టింగ్ స్కూల్’లో నటనలో మెళకువలు నేర్చుకున్న వరలక్ష్మికి డ్యాన్స్‌లో మాంచి టాలెంట్ ఉంది. తొలి సినిమా ‘పోడా, పొడి’లో శింబుతో పోటీ పడి డ్యాన్స్ చేసింది. శింబు హిప్ హప్‌లో టాప్ అయితే, వరూ లాటిన్ అమెరికన్ డ్యాన్స్‌లో టాప్.
సామాజికంగా...
సెంటిమెంట్లు, విధిరాత మీద వరలక్ష్మికి పెద్దగా నమ్మకం లేదు. సామాజిక విషయాలపై స్పందించడంలో ముందుండటానికి ఇష్టపడుతుంది. తానేదో తన ప్రపంచమేదో అన్నట్లు కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడంతో పాటు ఉద్యమాలతో మమేకమవుతుంటుంది. ‘మీ టూ’ ఉద్యమానికి ఆమె పూర్తి మద్దతుగా నిలిచింది. పురుషాధిక్యభావజాలాన్ని వ్యతిరేకిస్తుంది.
కాస్త భిన్నంగా...
కొత్త భాషలను నేర్చుకోవడంలో వరూ మంచి నేర్పరి. తెలుగు, తమిళ, మలయాళి, ఫ్రెంచ్ భాషలలో ప్రవేశం ఉంది. గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలనుకోవడం లేదు. నెగటివ్ రోల్ అయినా సరే, మూసపోసిన పాత్రల్లో కాకుండా భిన్నమైన, సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలనుకుంటుంది వరలక్ష్మి.
తెగ నచ్చేసింది
కొందరు నటిస్తే వాళ్లు మాత్రమే కనిపిస్తారు. కొందరు నటిస్తే పాత్ర మాత్రమే కనిపించి ‘శబ్భాష్’ అనిపించుకుంటారు. వరలక్ష్మికి కూడా ఇలాంటి ప్రశంస దక్కింది. ‘పందెంకోడి–2’లో ఆమె నటన డైరెక్టర్ లింగుస్వామికి తెగనచ్చేసిందట. ‘నేను అనుకున్నదానికంటే చాలా గొప్పగా నటించావు’ అని ప్రశంసించి నూటికి నూరు మార్కులు వేశాడు.
అవును... ఏదో ఒకరోజు
ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనేది వరలక్ష్మి కల. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ చేస్తాను అంటుంది. హార్డ్‌కోర్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేయడం అంటే ఇష్టమట. ఇప్పటికే ఆమె దగ్గర కొన్ని ఐడియాలు రెడీగా ఉన్నాయి. వరూ మెగాఫోన్ పట్టడమే ఆలస్యం అవి వెండితెర మీదికి వస్తాయన్నమాట.
అమ్మ అంటే ఉక్కుమహిళ
జయలలిత బయోపిక్‌లో శశికళ పాత్రను తిరస్కరించడం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు... ‘ఒకవేళ సినిమా చేయాల్సివస్తే అమ్మ పాత్రే చేస్తాను. మహిళాలోకానికి ఆమె స్ఫూర్తి. జ్ఞానం, ధైర్యం, తెలివితేటలు ఆమెను ఉక్కుమహిళగా నిలిపాయి’ అంటుంది వరూ. ఏదో సినిమా కార్యక్రమంలో వరూ చేసిన డ్యాన్స్ అమ్మ జయకు నచ్చేసి మెచ్చుకుందట. ఇదొక మధురజ్ఞాపకం అంటుంది వరూ.
కవర్ ఫొటో: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment